శుక్రవారం రోజు చేయాల్సిన, చేయకూడని పనులు.. చాలా మందికి తెలియవు ఇవి..!

 

శుక్రవారం రోజు చేయాల్సిన, చేయకూడని పనులు.. చాలా మందికి తెలియవు ఇవి!


వారంలో ప్రతి రోజూ ఒక దేవతను లేదా దేవుడిని ఆరాధించడానికి ముఖ్యమైన రోజుగా చెబుతారు.  ముఖ్యంగా శుక్రవారం అంటే లక్ష్మీదేవిని కొలిచే రోజు.  కేవలం లక్ష్మీ దేవి అని మాత్రమే కాదు.. అమ్మవారి స్వరూపం ఏదైనా సరే.. ఆ స్వరూపాన్ని కొలిచే రోజు శుక్రవారం. ఐశ్వర్యాన్ని,  కీర్తిని,  సంపదను చేకూర్చే లక్ష్మీదేవికి శుక్రవారం అంటే ఎంతో ప్రీతి.  చాలామంది శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తారు.   జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వ్యక్తి జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే, వారికి ప్రేమ, సంపద , శ్రేయస్సుకు ఎప్పటికీ కొరత ఉండదు. కానీ శుక్రవారం రోజున చేసే  చిన్న పొరపాటు కూడా లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తుంది. అందుకే శుక్రవారం రోజు ఏం చేయాలి?  ఏం చేయకూడదు అనే విషయాలు తెలుసుకుని వాటిని ఆచరించాలి.  అవేంటో తెలుసుకుంటే..

శుక్రవారం ఏం చెయ్యాలి?

తెల్లని దుస్తులు..

 శుక్రుడు , లక్ష్మీదేవి ఇద్దరూ తెలుపు రంగును ఇష్టపడతారు. శుక్రవారం  రోజున తెలుపు లేదా లేత గులాబీ రంగు దుస్తులు ధరించడం శుభప్రదంగా భావిస్తారు. ఇది ఆకర్షణను పెంచి, శుక్ర గ్రహానికి అనుకూలంగా ఉంటుంది.

లక్ష్మీదేవి పూజ, నైవేద్యాలు..

ఉదయం స్నానం చేసిన తర్వాత, కర్పూరంతో లక్ష్మీదేవికి హారతి ఇచ్చి,  తెల్లని తీపి పదార్థాలు లేదా పాలు లేదా బియ్యంతో చేసిన పాయసం నైవేద్యంగా సమర్పించాలి.

దానధర్మాలు..

శుక్రవారం  రోజున పేదలకు లేదా అవసరమైన వారికి చక్కెర, బియ్యం, పాలు, పెరుగు లేదా తెల్లని దుస్తులు వంటి తెల్లని వస్తువులను దానం చేయడం జాతకంలో శుక్రుని స్థానాన్ని బలపరుస్తుంది.

ఇంటి శుభ్రత..

పరిశుభ్రత ఉన్నచోట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. శుక్రవారాల్లో  ఇంటి ప్రధాన ద్వారాన్ని శుభ్రంగా ఉంచి, సాయంత్రం అక్కడ నెయ్యి దీపాన్ని వెలిగించాలి.

శుక్రవారం చేయకూడని పనులు..

డబ్బు లావాదేవీలు..

శుక్రవారాల్లో డబ్బు అప్పుగా ఇవ్వడం మానుకోవాలి.  దానం చేయడం, సహాయం చేయడం వేరు.. కానీ అప్పు ఇవ్వకూడదు. ఈ రోజున అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి రాబట్టుకోవడం కష్టమని, అది ఇంట్లో సంపద తగ్గడానికి దారితీస్తుందని నమ్ముతారు.

పులుపు పదార్థాలు..

శుక్రవారం రోజు అమ్మవారిని ఆరాధిస్తూ ఉపవాసం ఉండే స్త్రీలు పులుపు పదార్థాలు తినకూడదట.

స్త్రీలను అవమానించడం..

శుక్ర గ్రహం స్త్రీ శక్తితో ప్రత్యక్షంగా సంబంధం కలిగి ఉంటుంది, ఇంటిలోని స్త్రీలను లేదా  ఇతర స్త్రీలను అవమానించే వ్యక్తి ఇంట్లో సుఖశాంతులు దూరమై పేదరికం రాజ్యమేలుతుందట.

సాయంత్రం నిద్రపోవడం..

సంధ్యా సమయంలో లేదా సూర్యాస్తమయం వేళ నిద్రపోవడం అశుభంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో నిద్రిస్తే లక్ష్మీదేవి  ఇంటి నుండి ముఖం తిప్పుకుంటుంది.

                           *రూపశ్రీ.