మే 31 పౌర్ణమి.. లక్ష్మీకటాక్షం కలిగించే కుబేర దీపం ఇలా పెట్టండి!
మే 31 పౌర్ణమి.. లక్ష్మీకటాక్షం కలిగించే కుబేర దీపం ఇలా పెట్టండి!
కుబేరుడు సంపదకు అధిపతి. కుబేరుడి అనుగ్రహం ఉన్న ఇంట్లో ఐశ్వరం, సంపద వృద్ధి చెందుతాయి. ధనానికి లోటు ఉండదు. కానీ నేటికాలంలో చాలా మంది ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి, లక్ష్మీకటాక్షం కలగడానికి జ్యైష్య మాస పౌర్ణమి రోజు కుబేరుడికి దీపం పెట్టడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. జ్యేష్టమాస పౌర్ణమి రోజు కుబేరుడిని తృప్తి పరచడానికి దీపం ఎలా పెట్టాలో తెలుసుకుంటే..
నవధాన్యాల దీపం...
కుబేరుడికి దీపం పెట్టడం కోసం నవదాన్యాలు అవసరం. నవదాన్యాలలో వడ్ల గింజలకు బదులు బియ్యం తీసుకుంటే మంచిది. ఈ నవదాన్యాలను ఉడికించాలి. ఆ తరువాత ఉడికిన మిశ్రమాన్ని ఉండగా చేసుకోవాలి. ఈ ఉండను ప్రమిద ఆకారంలో చేసుకోవాలి. నవదాన్యాలతో వండిన మిశ్రమంతో దీపం కోసం ప్రమిద తయారైనట్టే.
మోదుగ ఆకు..
మోదుగ చెట్లు చాలామందికి తెలిసే ఉంటాయి. ఈ మోదుగ చెట్టు ఆకును సేకరించాలి. మోదుగ ఆకు దొరకకపోతే తమలపాకు అయినా ఉపయోగించవచ్చు. ఒకవేళ మోదుగ ఆకు, తమలపాకు రెండూ ఉంటే.. రెండింటిని ఉపయోగించవచ్చు.
దీపం ఎలా వెలిగించాలి?
ఒక పళ్లెం తీసుకుని అందులో పసుపు, కుంకుమ వేసి మోదుగ ఆకు లేదా తమలపాకు.. రెండూ ఉంటే రెండింటిని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆకుల కింద పసుపు, కుంకుమ ఉంటుంది. ఆకులపైన తయారు చేసుకున్న నవధాన్యాల మిశ్రమ ప్రమిద పెట్టుకోవాలి.
ప్రమిదలో ఐదు వత్తులు విడివిడిగా ఐదు దిక్కులకు వేయాలి. అందులో ఆవు నెయ్యి వేయాలి. దీపాన్ని వెలిగించాలి. దీపానికి పసుపు, కుంకుమ పెట్టాలి.
ఎక్కడ పెట్టాలి..
కుబేరుడిని తృప్తి పరచడం కోసం వెలిగించే ఈ దీపాన్ని కుబేర స్థానమైన ఉత్తర దిక్కులో వెలిగించడం మంచిది. లేదంటే ఇంట్లో దేవుడి గదిలో వెలిగించవచ్చు.
ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత లక్ష్మీ కటాక్షం కోసం లక్ష్మీదేవికి సంబంధించిన శ్లోకాలు, స్తోత్రాలు పఠించడం మంచిది. మరీ ముఖ్యంగా లలిత సహస్రనామాలు పారాయణ చేయడం కూడా ఎంతో మంచిది.
*రూపశ్రీ.