అంత్యక్రియల గురించి చాలా మందికి తెలియని విషయాలు ఇవి..!

 

అంత్యక్రియల గురించి చాలా మందికి తెలియని విషయాలు ఇవి..!


హిందూ మతంలోని 18 గొప్ప పురాణాలలో గరుడ పురాణం చాలా ప్రత్యేకమైనది. ఈ పురాణం జననం, మరణం,  మరణం తర్వాత ఆత్మ  ప్రయాణం వంటి విషయాల గురించి చాలా వివరంగా పొందుపరిచింది. గరుడ పురాణం ప్రకారం మరణం తరువాత, ఆత్మ ఒక నిర్దిష్ట సమయంలోపు కొత్త శరీరం లేదా రాజ్యాన్ని పొందాలి. అయితే అంత్యక్రియల ఆచారాలు తప్పుగా జరిగితే ఆ ఆత్మ స్వర్గానికి వెళ్లలేదు. లేదా పితృలోకానికి కూడా చేరుకోలేదు. అటు ఇటు కాకుండా ఉండిపోతే ఆ ఆత్మ మనుషుల చుట్టూనే దెయ్యంలా మారి తిరుగుతూ ఉంటాయని అంటారు. మరణించిన వ్యక్తి ఆత్మ శాంతిని,  మోక్షాన్ని పొందాలంటే అది  కుటుంబ సభ్యులు చేయవలసిన కార్యాలు సరైన విధంగా చేయడంలోనే ఉంటుంది. అంత్యక్రియల విషయంలో చేయకూడని తప్పులేంటో.. ఏ తప్పులు చేయడం వల్ల ఆత్మకు పితృలోకం, స్వర్గం ప్రాప్తించకుండా భూలోకంలోనే ఉండిపోతాయో తెలుసుకుంటే..

కుంభ భంగం..

వ్యక్తి మరణించిన తర్వాత వారి మృత దేహాన్ని చితిపై ఉంచిన తర్వాత దహనం చేయడానికి ముందు కొడుకు భుజం మీద ఒక నీటితో నిండిన మట్టి కుండను ఉంచుకుని ప్రతి చుట్టుకు ఒక రంధ్రం చేస్తూ.. మొత్తం మూడు రంధ్రాలు చేసి,  మూడు ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆ నీటి కుండను నిలబడిన చోటు నుండే వెనక్కు పడేస్తారు.  దీన్ని కుంభ భంగం అని అంటారు.  మట్టి కుండ మనిషి శరీరంతో సమానమని,  కుండలో నీరు ప్రాణంతో సమానమని,  ఈ ప్రక్రియ చేయడం వల్ల దేహం నుండి ప్రాణం వేరయిపోయిందని తెలియజేయడం. మరణించిన తర్వాత ఆత్మ తన దేహం చుట్టూ తిరుగుతూ ఉంటుందని చెబుతారు.  ఈ క్రియ చేయడం వల్ల తనకు ఇక ఆ దేహంతో అనుబంధం తీరిపోయిందని అర్థం చేసుకుంటారని అంటారు..  అందుకే  అంత్యక్రియల సమయంలో ఈ ప్రక్రియను తప్పకుండా చేయాలని చెబుతారు.

స్నానం, కొత్తబట్టలు..

మరణం తరువాత అంత్యక్రియలు జరిపించడానికి ముందు మృతదేహానికి  స్నానం చేయించడం ఆచారం. దీని తరువాత శరీరానికి గంధం, నెయ్యి లేదా సువాసనగల నూనెతో అద్ది శుభ్రమైన లేదా కొత్త బట్టలు ధరింపజేస్తారు.   పాత దుస్తులను వదిలివేసి కొత్త వాటిని ధరించినట్లే, ఆత్మ కూడా శుద్ధి చేయబడి పాత శరీరాన్ని వదిలి తన తదుపరి ప్రయాణాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉంటుందని నమ్ముతారు.

దహనం తర్వాత..

మృతదేహానికి చితి వెలిగించగానే వెనక్కి తిరిగి చూడకూడదని చెబుతారు. కుటుంబ సభ్యులు దహన సంస్కారాల తర్వాత ఇంటికి తిరిగి వెళ్ళేముందు చితి వైపు తిరిగి చూడకూడదట. గరుడ పురాణం ప్రకారం, వెనక్కి తిరిగి చూడటం అనుబంధాన్ని సూచిస్తుంది. తన కుంటుంబ సభ్యుల దగ్గరకు వెళ్లాలని తహతహలాడుతుంది. కుటుంబ సభ్యులు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోతే, ఆత్మ తన వారు తనకు  స్వేచ్ఛను ఇచ్చారని,  తనకు బంధాల నుండి విముక్తి లభించిందని అనుకుంటుందని చెబుతారు.  తద్వారా అది తన తదుపరి ప్రయాణానికి.. యమలోకం లేదా పితృలోకం వైపుగా వెళ్లగలుగుతుందని చెబుతారు.


సూర్యాస్తమయం తర్వాత దహన సంస్కారాలు..

సూర్యాస్తమయం తర్వాత దహన సంస్కారాలు చేయకూడదు. సూర్యాస్తమయం తర్వాత ఎవరైనా మరణిస్తే, వారి అంత్యక్రియలను మరుసటి రోజు సూర్యోదయం వరకు వాయిదా వేయాలి. గరుడ పురాణం ప్రకారం రాత్రిపూట దహన సంస్కారాలు నిషేధించబడ్డాయి.  ఎందుకంటే ఈ సమయంలో దహన సంస్కారాలు చేయడం వల్ల ఆత్మకు శాంతి ఉండదట. ఆత్మ ప్రేత లోకంలోకి ప్రవేశించడానికి దారితీస్తుందట. శరీరం రాత్రంతా కుటుంబ సభ్యుల మధ్య భద్రంగా ఉంటుంది.  మరుసటి రోజు సూర్యోదయం తర్వాత అంత్యక్రియల ద్వారా పంచభూతాలలో కలిసిపోతుందని చెబుతారు.

                                      *రూపశ్రీ.