వ్యాధుల నుండి బయటపడటానికి అద్బుతమైన మార్గం చెప్పిన భగవద్గీత శ్లోకం..!
వ్యాధుల నుండి బయటపడటానికి అద్బుతమైన మార్గం చెప్పిన భగవద్గీత శ్లోకం..!
నేటి కాలంలో ఆరోగ్యం కరువైపోయింది. అనారోగ్యం పెరిగిపోయింది. ఈ వేగవంతమైన ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఏదో ఒక రూపంలో ఒత్తిడి, ఆందోళన, కోపం వంటి సమస్యలు ఎదుర్కొంటు ఉంటారు. ఈ సమస్యల వల్ల నిద్రలేమి, మానసిక అశాంతి, కోపం కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు, జీవితంలో సంబంధాల మధ్య ఇబ్బందులు వంటివి చాలా ఏర్పడుతూనే ఉన్నాయి. వీటిని తగ్గించుకోవడానికి వైద్యుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. వేలకు వేలు డబ్బు పోస్తూ ఉంటారు. కానీ వేల సంవత్సరాల నాటి భగవద్గీత అన్నిటికి సమాధానం చెబుతుంది. కేవలం జీవిత పరమైన విషయాలకే కాదు.. ఆరోగ్య సంబంధ విషయాలకు కూడా భగవద్గీత మంచి పరిష్కారం చూపిస్తుంది. మానసిక సంఘర్షణలను పరిష్కరించడానికి, మానసిక ఆరోగ్యానికి భగవద్గీత ఒక గొప్ప ఔషదంగా పని చేస్తుంది. అంతేకాదు.. మనిషి శారీరక ఆరోగ్యం గురించి కూడా భగవద్గీతలో ఒక శ్లోకం ఈ కింది విధంగా స్పష్టం చేస్తుంది.
శ్లోకం..
యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు|
యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహ||
ఆహారం తినడం, విహారం చేయడం అంటే నడక విశ్రాంతి వంటి కార్యకలాపాలు, నిద్రపోవడం, మేల్కోవడం మొదలైనవన్నీ మితంగా, సమతులంగా చేసే వ్యక్తికి మనశ్శాంతి, ఆరగ్యం, స్థిరత్వం అనేవి సిద్దిస్తాయి. ఇలా ఉనప్పుడు దుఃఖం కూడా తగ్గుతుందని శ్లోకం భావం.
ఆహార రకాలు..
గీతలో శ్రీకృష్ణుడు మూడు రకాల ఆహారాన్ని వర్ణించాడు. తామసికం, రాజసికం, సాత్వికం. స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన మనస్సు, శరీరాన్ని కాపాడుకోవడానికి, సాత్విక ఆహారాలు తీసుకోవాలి. సాత్విక ఆహారాలలో ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పాలు ముఖ్యమైనవి.
అనారోగ్యానికి మూలకారణం..
గీత ప్రకారం శారీరక అనారోగ్యానికి కారణం వ్యక్తి గత జన్మలో చేసిన దుష్కర్మలు, పాపాలే అని చెప్పవచ్చు. ఈ పాపాల నుండి మోక్షం పొందడానికి దైవ ఆరాధనే మంచి మార్గం. దేవతల నుండి క్షమాపణ కోరడం, తను చేసిన పాప కర్మల గురించి పశ్చాత్తాపం కలిగి ఉండటం. ప్రస్తుత జన్మలో ఎలాంటి పాపపు పనులు చేయకుండా ఉండటం వంటివి చేయడం వల్ల భగవంతుని అనుగ్రహం పొందడానికి వీలవుతుంది.
*రూపశ్రీ.