శనిదేవుడు న్యాయప్రదాతగా ఎలా మారాడు.. దీని వెనుక కథ ఏమిటంటే!
శనిదేవుడు న్యాయప్రదాతగా ఎలా మారాడు.. దీని వెనుక కథ ఏమిటంటే!
హిందూ మతంలోని దేవతలు అందరిలోకి శనిదేవుడికి చాలా ప్రత్యేకత ఉంది. శనిదేవుడిని కర్మ ప్రదాత అని అంటారు. మనిషి తన జీవితంలో చేసే చెడు కర్మలకు సరైన ఫలితాన్ని ఇచ్చేది శని దేవుడే అని చెబుతారు. మనిషి తన జీవితంలో అనారోగ్యం, కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు, బంధాల మధ్య సమస్యలు మొదలైనవి ఎక్కువగా ఎదుర్కుంటూ ఉంటే.. అది ఖచ్చితంగా శనిదేవుడి ప్రభావమే అని చెబుతుంటారు. అయితే ఇంతమంది దేవుళ్లు ఉండగా శనిదేవుడు న్యాయ ప్రదాతగా ఎలా మారాడు? దీని వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసుకుంటే..
పురాణ కథ..
పురాణాల ప్రకారం శనిదేవుడు సూర్యదేవుడికి, ఛాయా దేవికి పుట్టిన కుమారుడు. సూర్యుడి భార్య సంజ్ఞాదేవి. సూర్యుడి నుండి వెలువడే వేడిని భరించలేక ఆమె తన నుండి ఛాయను సృష్టించి.. తనలాగా అక్కడ ఉండమని చెప్పి తను పుట్టింటికి వెళ్లిపోతుంది. అలా ఛాయ దేవికి, సూర్యుడికి జన్మించిన కుమారుడే శనిదేవుడు. అయితే శనిదేవుడి రంగు నలుపుగా ఉండేది. దీంతో సూర్యుడు తన కుమారుడి రంగు చూసి ఇతను నా కుమారుడు కాదు అని చెప్పాడు. ఈ మాట ఛాయా దేవికి మాత్రమే కాకుండా శనిదేవుడిని కూడా భాదించింది. ముఖ్యంగా.. తనను కుమారుడిగా అంగీకరించకపోవడం అంటే తన తల్లిని అవమానించినట్టే అని శనిదేవుడు బాధపడ్డాడు.
తన తల్లి అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి, సూర్యదేవుని కంటే ఎక్కువ శక్తిని పొందడానికి, శనిదేవుడు పరమేశ్వరుడి శరణు కోరాడు, శివుని కోసం తపస్సు చేశాడు. అన్నపానీయాలు విడిచిపెట్టాడు. శనిదేవుని భక్తికి పరమేశ్వరుడు సంతోషించి శనిదేవుడు ముందు ప్రత్యక్షమయ్యాడు. పరమేశ్వరుడు శనిదేవుడిని వరం కోరుకోమని అడిగాడు.
శనిదేవుడు తన తండ్రి శక్తిని మించిన, మూడు లోకాలలోనూ పూజించబడే శక్తిని ప్రసాదించమని పరమేశ్వరుడిని కోరాడు. అందుకు శివుడు శనిదేవునికి నవలోకాలలో అత్యున్నత స్థానాన్ని ప్రసాదించాడు. అలాగే శనిదేవుడిని మూడు లోకాలకు న్యాయాధికారిగా నియమించాడు. మానవులు, దేవతలు, రాక్షసులు, సర్పాలు, గంధర్వులకు అతడే న్యాయాధిపతి అవుతాడని శివుడు శనిదేవునికి వరం ఇచ్చాడు. ఇలా శనిదేవుడు న్యాయప్రదాత అయ్యాడు. మనిషి తను చేసే పాపాలు, తప్పులను తన చుట్టూ ఉన్న వారి నుండి తప్పించుకోగలుగుతాడు ఏమో కానీ.. న్యాయ దేవుడు, కర్మ ప్రదాత అయిన శనిదేవుడి నుండి మాత్రం తప్పించుకోలేడు.
శనిదేవుడి అనుగ్రహం కోసం..
శని దేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే, శనివారం సాయంత్రం రావి చెట్టు దగ్గర ఆవాల నూనె దీపం వెలిగించాలి. ఆ తర్వాత చెట్టు చుట్టూ ఐదు లేదా ఏడు సార్లు ప్రదక్షిణ చేయాలి. మత విశ్వాసం ప్రకారం ఇలా చేయడం వల్ల శని దేవుడి ఆశీస్సులను ప్రసాదిస్తుంది, చెడు కష్టాలను తొలగిస్తుంది, ప్రతికూల ప్రభావాల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
*రూపశ్రీ.