84 లక్షల జీవజాతుల వెనుక ఉన్న అద్బుతం.. ఈ లెక్క తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

 

 84 లక్షల జీవజాతుల వెనుక ఉన్న అద్బుతం.. ఈ లెక్క తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

మనిషిగా జన్మించడానికి 84 లక్షల జన్మలు ఎత్తాలని అందరూ ఏదో ఒక సమయంలో వింటూనే ఉంటారు. 18 పురాణాలలో ఒకటైన పద్మ పురాణంలో 84 లక్షల జన్మల గురించి ప్రస్తావన ఉంది. 84 లక్షల జన్మలలో   మానవ జన్మ ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. ఇది పద్మ పురాణంలోనే కాకుండా గరుడ పురాణం వంటి  గ్రంథాలలో కూడా వర్ణించబడింది. అయితే ఈ 84 లక్షల జన్మలు ఏమిటి?  కేవలం 84 లక్షలు అనే పేరు వినడమే కానీ.. ఈ జన్మలు ఏవి?  దీన్ని  84 లక్షల యోనుల రహస్యం అని చెబుతారు.  దీని గురించి వివరంగా తెలుసుకుంటే..

84 లక్షల యోనుల రహస్యం..

84 లక్షల యోనులను రెండు భాగాలుగా వర్గీకరించారు.
వివిధ పురాణాలు 84 లక్షల యోనుల గురించి విభిన్న వర్ణనలను ఇచ్చాయి. హిందూమత గురువులు 84 లక్షల యోనులను రెండు భాగాలుగా వర్గీకరించారు. మొదటి దానిని యోనిజ అని, రెండవ దానిని అయోనిజ అని అంటారు. రెండు జీవుల కలయిక వల్ల పుట్టిన జీవిని యోనిజ అని,  స్వయంగా పరిణామం చెందిన దానిని అయోనిజ అని అంటారు. ఇది కాకుండా, జీవులను మరో మూడు భాగాలుగా విభజించారు.

జలచరాలు..

నీటిలో నివసించే జీవులు

భూచరాలు..

నేలపై పాకే జీవులు, నేలపై నివసించే జీవులు

అంతరిక్షచరాలు..

ఆకాశంలో ఎగిరే అన్ని జీవులు

పద్మపురాణంలో 84 లక్షల యోనుల రహస్యం..

పద్మ పురాణంలోని 78వ అధ్యాయంలో 84 లక్షల యోనుల గురించి ఒక శ్లోకంలో స్పష్టంగా ఉంది.  

"జలజ నవ లక్షణీ, స్థావర లక్ష-వింశతి |
కృమయో రుద్ర-సంఖ్యకాః పక్షిణాం దశ-లక్షణమ్ || త్రిxశల్లక్షాణి పశవః, చతుర్లక్షాణీ మానవాః ॥"

అర్థం..

జలచరాలు 9 లక్షలు,

స్థిర జీవులు అనగా చెట్లు మరియు మొక్కలు 20 లక్షలు,

పాములు మరియు కీటకాలు 11 లక్షలు,

పక్షులు 10 లక్షలు,

భూచరాలు 30 లక్షలు ,

 మిగిలిన 4 లక్షల మానవులు, మొత్తం 84 లక్షలు.

ఈ విశ్వంలో మానవులు, జంతువులు, దేవదేవతలు కాకుండా, కంటికి కనిపించని జీవులు లేదా శక్తులు కూడా ఉన్నాయి. అవి మన సాధారణ ప్రపంచానికి భిన్నమైన, మనం కంటితో చూడలేని ఒక లోకంలో నివసిస్తాయి.  ప్రాచీన గ్రంథాలైన పద్మ పురాణం , భాగవత పురాణం వాటిని వివరంగా వర్ణిస్తాయి.

84 లక్షల యోనులలో మానవ జన్మ ఎప్పుడు?

గరుడ పురాణం ప్రకారం, ఒక ఆత్మ తన కర్మ ఫలితంగా 30 లక్షల సార్లు చెట్టుగా జన్మిస్తుంద'. ఆ తర్వాత, అది 9 లక్షల సార్లు జంతువుగా, లక్ష సార్లు కీటకంగా, ఆపై 10 లక్షల సార్లు పక్షిగా జన్మిస్తుందట.

ఆ తర్వాత వ్యక్తి తన కర్మ ఆధారంగా రెండు లక్షల సార్లు జంతువుగా జన్మించి, చివరకు ఆవుగా పుడతాడట.   అనంతరం, నాలుగు లక్షల సార్లు మానవుడిగా జన్మించిన తర్వాత,పరమాత్మ స్వరూపాన్ని పొందుతాడట. ఇదంతా ఒకరి కర్మ ప్రకారమే జరుగుతుందని చెబుతారు.

గతజన్మ కర్మల ద్వారా..

హిందూ గ్రంథాల ప్రకారం,  ఆత్మ  గమ్యం దాని పూర్వజన్మలోని కర్మల ద్వారా నిర్ణయించబడుతుంది.  వ్యక్తి తన జీవితకాలంలో అనేక పుణ్యకార్యాలు చేసి ఉంటే, వారు ఉన్నత జీవ రూపాలలో పునర్జన్మ పొందుతారు. అయితే, వారు అనేక పాపాలు చేసి ఉంటే, జంతువులు, కీటకాలు లేదా నరకం వంటి నిమ్న జీవులుగా పునర్జన్మ పొందుతారట.


హిందూమతంలో మానవ జన్మను మోక్షానికి ముఖద్వారంగా భావిస్తారు. 'మనుష తను దుర్లభం' అంటే మోక్షాన్ని పొందడానికి ఈ శరీరమే ఏకైక మార్గం అని అర్థం. మానవ జన్మను దైవభక్తి, సేవ, సత్యం , ధర్మం కోసం ఉపయోగించకపోతే, ఆత్మ 84 లక్షల  జన్మల ప్రయాణం చేయవలసి వస్తుంది. అందువల్ల, మానవ జన్మను వృధా చేసుకోకుండా ఉత్తమంగా మార్చుకోవడం  చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది అరుదైనది మాత్రమే కాదు, ఇతర జన్మలలో ఆత్మ కేవలం సుఖాన్ని మాత్రమే అనుభవిస్తుంది, కానీ విచక్షణ , మోక్షం పొందే సామర్థ్యం కేవలం మానవ జన్మలో మాత్రమే ఉంటుంది.

 

                                          *రూపశ్రీ.