గురువారం సాయిబాబాను పూజించడం ఎందుకు పవిత్రమైన రోజుగా భావిస్తారు!
గురువారం సాయిబాబాను పూజించడం ఎందుకు పవిత్రమైన రోజుగా భావిస్తారు!
షిర్డీ సాయిబాబా గౌరవించదగ్గ ఆధ్యాత్మిక గురువులలో ఒకరు. ఆయన ప్రేమ, కరుణ, ఐక్యతను బోధించారు. అన్ని మతాలకు ఒకే మూలం ఉందని చాటిచెప్పాడు. ఈ ఆలోచనలు , భావాలు దేశవ్యాప్తంగా , ప్రపంచవ్యాప్తంగా అనేక సాయిబాబా ఆలయాల స్థాపనకు దారితీశాయి, ఇవి అన్ని మతాల భక్తులను ఆకర్షిస్తున్నాయి. సాయి అందరికీ ఆరాధ్య దైవం. షిర్డీ సాయిబాబా అత్యంత ప్రసిద్ధ వాక్యం.. "సబ్కా మాలిక్ ఏక్" .. దేవుడు ఒక్కడే.. అందరికీ నాయకుడు ఒక్కడే అనేది దీని అర్థం. , అన్ని మతాల మధ్య ఐక్యత, సద్భావన , ప్రేమ అనే సందేశాన్ని ఇది తెలియజేస్తుంది. సాయిబాబా ఎలా పిలిచినా పలుకుతాడు. ఇదే ఆయన విశిష్టత. అయితే.. సాయిబాబాను పూజించడానికి గురువారాన్నే ఎందుకు కేటాయించారు? సాయిబాబాకు, గురువారం కు మధ్య ఉన్న సంబంధం ఏంటి? తెలుసుకుంటే..
సాయిబాబా పూజ.. గురువారం..
సాయిబాబాను ప్రతిరోజూ పూజించగలిగినప్పటికీ, ఆయనను పూజించడానికి గురువారం అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. దీని వెనుక ఉన్న మతపరమైన నమ్మకం ఏమిటంటే, గురువారం దేవతల గురువైన బృహస్పతితో ముడిపడి ఉంది. గురువారం జ్ఞానం, శ్రేయస్సు , సానుకూల శక్తితో ముడిపడి ఉంటుంది. సాయిబాబా ప్రజలకు ప్రేమ, కరుణ , సేవ సందేశాన్ని వ్యాప్తి చేసినందున, ఆయనను ఆధ్యాత్మిక గురువుగా కూడా పరిగణిస్తారు. అందువల్ల, గురువారం ఆయనను పూజించడం ఉత్తమమైన రోజుగా భావిస్తారు.
సాయిబాబా పల్లకి.. గురువారమే బయటకు తీస్తారు..
షిర్డీలో ప్రతి గురువారం సాయిబాబా కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. వేలాది మంది భక్తులు పాల్గొనే పల్లకీ యాత్రను ఏర్పాటు చేస్తారు. ఈ పల్లకీ యాత్ర ద్వారకామాయి వద్ద ప్రారంభమై సాయి సమాధి ఆలయం వద్ద ముగుస్తుంది. భజనలు, భక్తి గీతాలు ఆలపిస్తుండగా, పూలతో అలంకరించిన పల్లకీలో సాయిబాబా విగ్రహాన్ని మోసుకెళ్లే ఈ మహత్తర ఊరేగింపుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈ పల్లకీ యాత్ర సాయిబాబా పట్ల ఉన్న భక్తికి, ప్రేమకు ప్రతీకగా నిలుస్తుంది.
సాయిబాబాను ఎలా పూజించాలి?
గురువారం నాడు సాయిబాబాను పూజించడానికి, ఉదయం స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. ఈ రోజు పసుపు లేదా లేత రంగు దుస్తులు ధరించడం మంచిది. ఇంట్లోనే పూజ చేయగలిగితే, సాయిబాబా విగ్రహం లేదా చిత్రం ముందు దీపం వెలిగించాలి. సాయిబాబాకు పసుపు పువ్వులను సమర్పించాలి. ఆయనకు భక్తిశ్రద్ధలతో సాత్వికంగా ఉండే నైవేద్యాన్ని లేదా పండ్లు మొదలైనవి సమర్పించవచ్చు. తర్వాత సాయిబాబా మంత్రాన్ని లేదా "ఓం సాయి రామ్" అని జపించి , సాయి చాలీసా పఠించాలి.
షిర్డీ సాయిబాబా..
మహారాష్ట్రలోని పర్భణి జిల్లాలో ఉన్న పత్రి గ్రామం షిర్డీ సాయిబాబా జన్మస్థలమని చెబుతారు. దీనికి సరైన ఆధారాలు లేకపోవడం వల్ల ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, సాయిబాబా 1838లో ఇక్కడే జన్మించారని స్థానికులు నమ్ముతారు. సాయిబాబా అసలు పేరు హరిభౌ భూసరి. నేడు దేశవ్యాప్తంగా అనేక సాయిబాబా ఆలయాలు ఉన్నాయి , భక్తులకు ఆయనపై ప్రగాఢ విశ్వాసం ఉంది.
*రూపశ్రీ.