గ్రహ సమస్యలు, అనారోగ్య సమస్యలు.. అన్నింటికీ శివ ఆరాధన ఇలా చేయండి చాలు..!

 

గ్రహ సమస్యలు, అనారోగ్య సమస్యలు.. అన్నింటికీ శివ ఆరాధన ఇలా చేయండి చాలు..!

భారతదేశంలో శైవ ఆరాదనకు చాలా ప్రాముఖ్యత ఉంది.  భారతదేశం మొత్తం మీద ఎన్నో ప్రాంతాలలో వేల సంవత్సరాల కిందటి శివాలయాలు ఎన్నో ఉన్నాయి. పరమేశ్వరుడిని ఆరాధిస్తే గ్రహ సమస్యలు,  చంద్ర దోషాలు, అనారోగ్య సమస్యలు వంటివి తగ్గిపోతాయని  భారతీయ పురాణాలు, జ్యోతిష్య శాస్త్రం, పురా పెద్దలు చెబుతున్నారు.  శివలింగం శక్తి సమతుల్యతను, శాంతిని సూచిస్తుంది. మానసిక శాంతితో ముడిపడి ఉంటుంది. శివుడిని చాలామంది భోళాశంకరుడు అని అని అంటారు.  ఆయన్ను ప్రసన్నం చేసుకోవడానికి కఠినమైన ఆరాదనలు, పద్దతులు అవసరం లేదు.. కానీ గ్రహసమస్యలు,  చంద్ర దోషాలు, అనారోగ్య సమస్యలు తొలగిపోవాలంటే శివుడికి కొన్ని పరిహారాలు చేయాలి.  అవేంటో.. వాటి ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుంటే..

అభిషేకం..

శివుడు అబిషేక ప్రియుడు.  ఆయనకు అభిషేకాలు అంటే ఎనలేని ప్రీతి. కనీసం నీటితో అభిషేకం చేసినా ఆయన చాలా తృప్తి పడిపోతాడు.  ఇక పంచామృత అభిషేకం చాలా శ్రేష్టం.  వీటిలో కూడా పెరుగుతో అభిషేకం చేయడం వల్ల చాలా సమస్యలు పరిహారం అవుతాయి.  పెరుగు సహజంగా చల్లబరుస్తుంది,  ఉపశమనం కలిగిస్తుంది, అందుకే ఇది మానసిక శాంతితో ముడిపడి ఉంటుంది.

శివుడి రుద్ర రూపం  చాలా ఉగ్రంగా  ఉంటుంది. పెరుగు వంటి చల్లని పదార్థంతో అభిషేకం చేస్తే ఆయన    ఉగ్ర స్వభావాన్ని శాంతపరచవచ్చని అంటారు. చాలా మంది జీవితాల్లో  ఒత్తిడి, కోపం, అశాంతి లేదా  సంఘర్షణకు పరిహారంగా పెరుగుతో శివుడికి అభిషేకం  చేయడం లేదా నైవేద్యంగా సమర్పించడం మంచిదట.

శివుడికి పెరుగు సమర్పిస్తే..

మనఃశాంతి..

పెరుగు చల్లబరుస్తుంది, కాబట్టి దీనిని నైవేద్యం పెట్టడం వల్ల మనస్సులోని అశాంతి, కోపం,  ఉద్రిక్తతను శాంతపరుస్తుందట. చిన్న విషయాలకు  భయపడేవారు లేదా ఇంటి వాతావరణం ఉద్రిక్తంగా ఉండేవారు, ముఖ్యంగా సోమవారం నాడు పెరుగుతో  శివుడికి  అభిషేకం చేస్తారు. ఇది మనస్సును తేలిక పరుస్తుంది.  ఆలోచనలో స్థిరత్వాన్ని తెస్తుందని నమ్ముతారు.

చంద్రదోషానికి..

జ్యోతిషశాస్త్రంలో పెరుగు చంద్ర గ్రహంతో ముడిపడి ఉంటుంది. చంద్రుడిని మనస్సు,  భావోద్వేగాలకు కారకంగా పరిగణిస్తారు. జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నవాళ్లు శివలింగానికి పెరుగుతో అభిషేకం చేయడం  ద్వారా మానసిక గందరగోళం, భయం,  అస్థిరత నుండి విముక్తి పొందుతారట.

ఆరోగ్యం..

పెరుగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ కారణంగా, శివలింగానికి పెరుగు నైవేద్యం పెట్టడం వల్ల శారీరక రుగ్మతల నుండి ఉపశమనం లభిస్తుంది. తరచుగా అనారోగ్యానికి గురయ్యే లేదా బలహీనంగా ఉన్న వ్యక్తులు  భక్తితో పెరుగుతో శివలింగానికి అభిషేకం చేస్తే   అంతర్గత బలాన్ని పొందుతారని నమ్ముతారు. ఇది మానసిక శక్తిని,  ప్రశాంతతను ఇస్తుంది.

ఇంట్లో ప్రశాంతత..

చాలా ఇళ్లలో చిన్న విషయాలకే గొడవలు, అపార్ఠాలు,  ఒకరిని ఒకరు శత్రువులుగా చూడటం వంటివి జరుగుతూ ఉంటాయి.  పెరుగును శాంతికి,  స్థిరత్వానికి చిహ్నంగా భావిస్తారు. అందువల్ల ఇంట్లో శాంతి,  సంతోషం కావాలంటే శివుడికి పెరుగుతో అభిషేకం చేయడం మంచిది. ఇది సంబంధాలను ఆరోగ్యంగా  చేస్తుందని,  పరస్పర అవగాహనను మెరుగుపరుస్తుందని  నమ్ముతారు.

కోపం..

శివుడిని భోళా శంరుడు అని పిలుస్తారు, కానీ ఆయనలో  ఉగ్ర రూపం కూడా ఉంది. పెరుగుతో అభిషేకం చేస్తే వ్యక్తులలో ఉండే  అంతర్గత కోపం,  చిరాకును శాంతపరుస్తుందట. కోపాన్ని అణుచుకోవాలని అనుకునేవారు శివుడికి పెరుగుతో అభిషేకం చేయడాన్ని ఒక సంకల్పంగా తీసుకుని చేస్తే చాలా మంచి మార్పు కనిపిస్తుందని  చెబుతారు.

                                    *రూపశ్రీ.