మాస శివరాత్రి, మహా శివరాత్రి మధ్య తేడా ఏమిటి!

 

మాస శివరాత్రి,  మహా  శివరాత్రి మధ్య తేడా ఏమిటి!

మహా శివరాత్రి అంటే పరమేశ్వరుడి అనుగ్రహానికి చేరువయ్యే దినం.  ఈ రోజున శివాలయాలు భక్తులతో కిటకిటలాడతాయి.  పరమేశ్వరుడికి రుద్రాభిషేకాలు,  పంచామృత అభిషేకాలు, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం ఎంతో వైభవంగా జరుగుతాయి.  అయితే మహా శివరాత్రి ఏడాదికి ఒక సారి వచ్చే పర్వదినం కాగా.. మాస శివరాత్రి నెలకు ఒకసారి వస్తుంది.  అసలు మహాశివరాత్రికి, మాస శివరాత్రికి తేడా ఏమిటి? సంవత్సరంలో 12 మాస శివరాత్రులు ఉన్నాయని చాలా మందికి తెలియదు.  దీని విశిష్టత ఏమిటి? తెలుసుకుంటే..

మాస శివరాత్రి..

ప్రతి నెలలో వచ్చే కృష్ణ పక్ష చతుర్దశి  అంటే అమావాస్యకు ముందు రోజుని మాస శివరాత్రి అంటారు. సంవత్సరంలో మొత్తం 12 మాస శివరాత్రులు ఉంటాయి. మాస శివరాత్రి రోజున భక్తులు ఉపవాసం చేసి, రాత్రి జాగారం చేసి, శివలింగానికి అభిషేకం చేస్తారు. ప్రతీ నెల శివుడిని ఇలా  ఆరాధించడం  ద్వారా పాపక్షయము, మనశ్శాంతి కలుగుతాయని నమ్మకం. అలాగే కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, ఐశ్వర్యంల చేకూరతాయట.

మహా శివరాత్రి..

మాఘ మాసం కృష్ణ పక్ష చతుర్దశి రోజున వచ్చేది మహా శివరాత్రి. ఇది సంవత్సరంలో ఒకసారి మాత్రమే వస్తుంది. ఇది శివరాత్రులలో అత్యంత పవిత్రమైనది. ఈ రోజునే శివుడు లింగరూపంలో అవతరించిన రోజు అని పురాణాలు చెబుతున్నాయి.  శివపార్వతుల కల్యాణం కూడా ఈ రోజునే జరిగినట్లు చెబుతారు.  ఈ రోజు రాత్రి నాలుగు యామాలలో శివారాధన చేయడం ప్రత్యేకం. అలాగే ఉపవాసం, జాగారం, శివ పంచాక్షరీ  జపం, రుద్రాభిషేకం చేయడం వల్ల మహా పుణ్యం లభిస్తుందని నమ్మకం.

మాఘ కృష్ణ చతుర్దశినే మహా శివరాత్రిగా భావిస్తారెందుకంటే..

శివ పురాణం ప్రకారం మాఘ కృష్ణ చతుర్దశి అర్ధరాత్రి సమయంలో శివుడు అనంత జ్యోతిర్లింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడు.  అప్పుడు బ్రహ్మ, విష్ణువులకు తన పరమ తత్త్వాన్ని తెలియజేశాడని కథనం. ఈ సంఘటన జ్ఞానాన్ని,  ఆత్మసాక్షాత్కారాన్ని సూచిస్తుంది. అందుకే ఆ రాత్రిని “మహా” శివరాత్రిగా భావిస్తారు.

శివపార్వతుల కళ్యాణం..

కొన్ని పురాణాలు, ఆగమాల ప్రకారం
ఈ రోజునే పార్వతి దేవి శివుడిని వరించిన రోజు,  శివపార్వతుల వివాహం జరిగిన రోజుగా చెబుతారు.  మహా శివరాత్రి రోజు శివపార్వతుల కళ్యాణం చూసినా,  స్వయంగా కళ్యాణం జరిపించినా,  కళ్యాణంలో పాల్గొన్నా వెలకట్టలేనంత పుణ్యం,  వైవాహిక జీవితంలో ఇబ్బందులు, సమస్యలు తొలగిపోవడం జరుగుతాయి.  ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల ఆశీర్వాదం లభిస్తుంది.

మహా శివరాత్రి రోజు గ్రహ దోషాలు,  గ్రహ స్థితుల వల్ల ఇబ్బందులు పడేవారు పరమేశ్వర పంచాక్షరీ జపం,  ధ్యానం, భక్తి సంబంధ కార్యకలాపాలలో పాలు పంచుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుందని చెబుతారు.

*రూపశ్రీ.