శనిజయంతి.. ఈ ఒక్క దీపం వెలిగిస్తే చాలు.. ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరకుతుంది!
శనిజయంతి.. ఈ ఒక్క దీపం వెలిగిస్తే చాలు.. ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరకుతుంది!
భారతీయులు జ్యోతిష్యాన్ని, గ్రహాలను చాలా బలంగా నమ్ముతారు. గ్రహాలను నవగ్రహాలుగా, దేవతల స్థానంగా పూజిస్తారు. ఈ నవగ్రహాలలో శనిగ్రహం చాలా విభిన్నమైనది. శని దేవుడిగా శనిగ్రహాన్ని పూజిస్తారు. శనిదేవుడు న్యాయాధిపతి అని కర్మ ప్రదాత అని పిలుస్తారు. మనిషి తన జీవితంలో చేసిన తప్పొప్పులు, మంచి చెడులకు ఫలితాన్ని కచ్చితంగా అమలుపరిచేది శని దేవుడే. హనుమాన్ జయంతిలాగా శని జయంతి కూడా ఉంది. శని జయంతి రోజు శని దేవుడిని పూజించడం, కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. వైశాఖ మాస బహుళ అమావాస్య రోజు శనిజయంతి జరుపుకుంటారు. ఈ రోజున కేవలం ఒక దీపం వెలిగించడం ద్వారా చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఆ దీపం ఏమిటో తెలుసుకుంటే..
శని జయంతి..
వైశాఖ మాస అమావాస్య రోజు శనిదేవుడు జన్మించాడట. చీకటిలో జన్మించడం మాత్రమే కాకుండా చాలా నలుపు రంగులో జన్మించడం వల్ల శని దేవుడిని ఆయన తండ్రి సూర్యుడు దూరం పెట్టాడని పురాణ కథలు చెబుతాయి. అయితే శని జయంతి చాలా శ్రేష్టమైన రోజు.
శని జయంతి దీపం..
శని జయంతి రోజు దీపం పరిహారం చాలా చక్కని ఫలితాన్ని ఇస్తుంది. శని జయంతి రోజు కాసింత వరిపిండి తీసుకోవాలి. ఈ వరిపిండిలో సరిపడినంత ఆవుపాలు వేసి ముద్దగా చేసుకోవాలి. పిండిలో పాలు కలిపేటప్పుడు అందులో కాస్త నల్ల నువ్వులు కూడా వేసి కలపాలి. ఈ పిండి ముద్దను దీపంలాగా తయారు చేసుకోవాలి.
రెండు సాధారణ వత్తులు తీసుకుని, వాటిని ఎర్రని కుంకుమలో తడిపి ఎరుపు రంగు వత్తులు తయారు చేసుకోవాలి. ఈ వత్తులను వరిపిండి ప్రమిదలో వేసి నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఈ దీపాన్ని ఉమ్మెత్త ఆకు పైన వెలిగించాలి. దీపం వెలిగించాక దీపం మీద కొన్ని నల్ల నువ్వులు చిలకరించాలి.
ఇలా వెలిగించిన దీపం కాళి దేవితో సమానం. కాళి దేవి ఉన్న చోటికి శనిదేవుడు రాడని, అలాగే కాళి దేవి ఉన్న చోటికి కాలయముడు కూడా రాలేడని చెబుతారు. కాళికా దేవి అమ్మవారు ఉన్నచోట కాలం శూన్యమవుతుందట. అందుకే వెలిగించిన దీపంలో కాళికాదేవి స్వరూపం ఉన్నట్టు భావించి భక్తితో కాళికాదేవిని ధ్యానించాలి. సమస్యలు అన్నీ పరిష్కరించమని ప్రార్థించాలి. ఇలా చేయడం వల్ల ముఖ్యంగా అప్పుల సమస్యలు తొలగిపోతాయి. అదేవిధంగా ఎన్నో సమస్యలకు పరిష్కారాలు కూడా లభిస్తాయి.
*రూపశ్రీ.