ఏ తప్పులు చేసేవారికి శని దేవుడు ఎలాంటి శిక్ష విధిస్తాడు!
ఏ తప్పులు చేసేవారికి శని దేవుడు ఎలాంటి శిక్ష విధిస్తాడు!
శని కర్మకు అధిపతి. ఆయన తీర్పు ఒక మనిషికి అనుకూలంగానో, ప్రతికూలంగానో ఉండదు, మనిషి కర్మల మీద ఆధారపడి ఉంటుంది. నేటి ప్రపంచంలో, ఇతరులను మించిపోవాలనే తపనలో ప్రజలు తరచుగా తమ సంతోషమంతటినీ నాశనం చేయగల చిన్న పొరపాట్లు చేస్తుంటారు. కష్టపడి పనిచేసినప్పటికీ డబ్బు ఆదా చేయలేకపోవడం, ప్రతిరోజూ ఏదో ఒక అనారోగ్యంతో బాధపడటం, మానసిక సమస్యలు నిరంతరం పెరుగుతున్నట్టు అనిపించడం వంటివి జరుగుతుంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శని దేవుడు ఆగ్రహంగా ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది. అయితే శని దేవుడు ఎలాంటి వ్యక్తుల పట్ల కోపంగా ఉంటాడు? శని దేవుడి ఆగ్రహం తగ్గాలంటే ఏం చేయాలి? తెలుసుకుంటే..
శనిదేవుడు ఎవరిపై కోపంగా ఉంటాడంటే..
అన్యాయం, మోసం చేసే వ్యక్తులు..
ఇతరులను మోసం చేసే, వంచించే లేదా వారి పట్ల నిజాయితీగా లేని వారికి శని దేవుడు గుణపాఠం నేర్పుతాడు.
శిక్ష..
మోసం చేసినందుకు, శని ఆర్థిక నష్టం, చట్టపరమైన ఇబ్బందులు లేదా పరువు నష్టం రూపంలో శిక్షను ఇస్తాడు.
పేదలను బలహీనులను వేధించేవారు..
శని దేవుడిని పేదలు, బలహీనుల పాలకుడు అని పిలుస్తారు. పేదలను, వృద్ధులను లేదా బలహీనంగా ఉండే వర్గాన్ని అగౌరవపరిచే వారి పట్ల ఆయన చాలా కఠినంగా ఉంటాడని భావిస్తారు.
శిక్ష..
సంతోషకరమైన జీవితంలో ఆకస్మిక ఇబ్బందులు, అనారోగ్యం, ఉద్యోగంలో సమస్య లేదా సామాజిక అవమానం వంటి శిక్షలు విధిస్తాడు.
అహంకారం, గర్వంతో ఉన్న వ్యక్తులు..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తమ విజయం గురించి గొప్పలు చెప్పుకుంటూ ఇతరులను కించపరిచే వారి పట్ల శని అసంతృప్తిగా ఉంటాడు. తరచుగా, డబ్బు , హోదా మదంతో విర్రవీగే వ్యక్తులు ఇతరులకు శారీరక లేదా మానసిక బాధలను కలిగిస్తారు.
శిక్ష..
శని దేవుడు గుణపాఠం నేర్పుతాడు. ఎవరైనా అసహ్యకరమైన పనులకు పాల్పడితే, శని వారిని ఉన్నత శిఖరాల నుండి కిందికి దించగలడు. అందువల్ల, కొన్నిసార్లు ఆకస్మిక విజయం తరువాత వచ్చే పతనాన్ని కూడా శని లీలగా పరిగణిస్తారు.
పెద్దలు, ఉపాధ్యాయుల పట్ల అగౌరవం..
పెద్దలను, తల్లిదండ్రులను లేదా గురువును అవమానించడం శని దృష్టిలో తీవ్రమైన తప్పుగా పరిగణించబడుతుంది.
శిక్ష..
నిరుద్యోగం, మానసిక వేదన, కుటుంబ సమస్యలు, ఇది విడాకులకు కూడా దారితీస్తుంది.
సోమరిపోతులు, కష్టపడనివారు..
శని దేవుడు కర్మ , కఠోర శ్రమకు ప్రతీక, కాబట్టి తమ పనులను నిర్లక్ష్యం చేసేవారు కష్టాలను ఎదుర్కోవచ్చు. కఠోర శ్రమ లేకుండా శాశ్వత విజయం అసాధ్యమని శని దేవుడు నేర్పిస్తాడు.
శిక్ష..
పనికి అంతరాయం, పదోన్నతిలో జాప్యం, పదేపదే విఫలమవడం
చెడు అలవాట్లు, చెడు పనులు..
వ్యసనం, చెడు స్నేహం , అనైతిక ప్రవర్తన అన్నీ శని యొక్క ప్రతికూల ప్రభావాన్ని తీవ్రతరం చేస్తాయి. ఈ రోజుల్లో ప్రజలు ఏదో ఒక రకమైన వ్యసనంలో కూరుకుపోయారు. వారి అసంతృప్తికి, ఒత్తిడికి ఇదే కారణమని జ్యోతిష్య శాస్త్రం భావిస్తుంది.
శిక్ష..
ఆర్థిక నష్టం, ఆరోగ్య సమస్యలు, మానసిక అస్థిరత.
నిజమైన న్యాయాధిపతి శనిదేవుడే..
శని దేవుని న్యాయం భయపెట్టడానికి కాదు, జీవితాన్ని సమతుల్యం చేసి సరైన మార్గంలో నడిపించడానికి ఉద్దేశించబడింది. శని దేవుడు ధనిక, పేద, పెద్ద, చిన్న అనే భేదం చూపడు. ఆయన అందరినీ సమానంగా, న్యాయంగా చూస్తాడు, అందుకే ఆయనను నిజమైన న్యాయమూర్తి అని పిలుస్తారు. మన చర్యలే ఫలితాలను ప్రతిబింబిస్తాయని ఆయన మనకు బోధిస్తాడు. పైన చెప్పుకున్న ప్రవర్తనలను సరిచేసుకోవడం ద్వారా శనిదేవుడు తన శిక్ష ను మెల్లిగా తగ్గించి, మనిషిని సరైన మార్గంలో నడిచేలా చేస్తాడు.
*రూపశ్రీ.