కామద ఏకాదశి.. ఉపవాసం ఉండి ఈ కథ వింటే ఎంత పుణ్యమంటే!
కామద ఏకాదశి.. ఉపవాసం ఉండి ఈ కథ వింటే ఎంత పుణ్యమంటే!
హిందూ ధర్మంలో ఏడాదిలో 24 ఏకాదశులు ఉంటాయి. ప్రతి మాసంలో శుక్లపక్ష, కృష్ణ పక్షాలలో రెండు ఏకాదశులు వస్తాయి. వీటిలో చైత్రమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి తిథిని కామద ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం, విష్ణు ఆరాధన చేయడం ఎంతో పుణ్యప్రదం. శ్రీకృష్ణుడు యుధిష్ఠిరునికి చెప్పిన కథనం ప్రకారం.. ఎండు కట్టెలను కార్చిచ్చు ఎలాగైతే దహిస్తుందో, అలాగే కామదా ఏకాదశికి సమస్త పాపాలను, రాక్షస శక్తులను నాశనం చేసే శక్తి ఉందని ఆయన వివరిస్తారు. శాపాలతో సహా పాపాలు, రాక్షస శక్తులపై ఈ ఏకాదశికి అత్యంత శుద్ధి చేసే గుణం ఉందని స్వయానా శ్రీకృష్ణుడే చెప్పడం ఈ ఏకాదశి ఎంతో గొప్పదో తెలుపుతుంది.
ఏకాదశి ఉపవాసం..
ఏకాదశి ఉపవాసం సాధారణంగా మూడు రోజులు జరుగుతుంది. ఇలా మూడు రోజులు ఆచరిస్తేనే ఏకాదశి వ్రతం సరిగ్గా పాటించినట్టు. ద్వాదశి రోజు సాత్వికాహారం తీసుకోవాలి, ద్వాదశి రోజు రాత్రి కుదిరితే ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండవచ్చు, లేదంటే పండ్లు, పాలు అయినా తీసుకోవచ్చు.
ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి. తులసి దగ్గర దీపం, విష్ణుసహస్రనామ పారాయణ, తులసితో విష్ణు ఆరాధన, తప్పని సరిగా చెయ్యాలి. అలాగే కామదా ఏకాదశి వ్రత కథ కూడా వినడం లేదా పారాయణ చేయడం చేయాలి.
ద్వాదశి రోజు ఉదయాన్నే స్నానం చేసి, ద్వాదశి రోజు పారణ చేయాలి. పారణ అంటే ఉపవాసం విరమించడం. పారణ రోజు వండిన పదార్థాలు అన్నీ విష్ణుమూర్తికి నివేదించాలి. అలాగే ద్వాదశి రోజు ఒక బ్రాహ్మణుడికి స్వయంపాకం ఇవ్వాలి. ఇలా చేస్తే ఏకాదశి ఉపవాసం పూర్తైనట్టు.
కామద ఏకాదశి కథ..
రత్నపుర అనే రాజ్యంలో పుండరీక అనే రాజు ఉండేవాడు. ఆ రాజ్యం చాలా సంపన్నమైనది. ఆ రాజ్యంలో రత్నాలు, బంగారం వంటివి సమృద్దిగా ఉండేవి. ఎంతో అందమైన అప్సరసలు, గంధర్వులు , కిన్నెరులు, సాధారణ పౌరులు కూడా ఆ రాజ్యంలో ఉండేవారట. గంధర్వులలో లలిత అనే వ్యక్తి చాలా చక్కగా పాడేవారు, అతని భార్య లలితా.. ఆమె మంచి నర్తకి. ఒకరోజు అతను పాడుతుండగా.. అతని దృష్టి లలితా మీద పడి సంగీతంలో తప్పులు చేశాడు. పాతాళానికి అధిపతి అయిన కర్కోటకుడు ఈ విషయాన్ని గ్రహించి రాజుకు ఫిర్యాదు చేశాడు. దీంతో రాజు ఆగ్రహించి, అరవై నాలుగు మైళ్ల ఎత్తు గల నరమాంస భక్షకుడివై మారమని శపించాడు. అతనికి అలా శాపం రావడంతో అతనితో పాటు అతని భార్య లలితా కూడా అతనితో కలిసి అడవులలో తిరిగేది.
వింధ్యాచల పర్వత ప్రాంతంలో సంచరిస్తున్నప్పుడు లలితా కు శృంగి మహ్రర్షి తారసపడ్డాడట. మహర్షికి నమస్కిరంచి తమ సమస్యను మహర్షికి విన్నవించగా.. భర్త పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి కామద ఏకాదశి వ్రతం ఆచరించమని మహర్షి సూచించాడు. లలితా భక్తి శ్రద్దలతో కామద ఏకాదశి వ్రతం ఆచరించి ఆ వ్రతం పుణ్యఫలాన్ని భర్తకు దారపోసింది. దీంతో శ్రీకృష్ణుడు శాపాన్ని పోగొట్టి వారి అసలైన గంధర్వ రూపాన్ని ప్రాసాదించారు.
ఇది కామద ఏకాదశి వ్రత కథ.. ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నా, వ్రత కథ విన్నా, భక్తిపూర్వకంగా మహా విష్ణువును ఆరాధించినా బ్రహ్మపాతకాలు కూడా నశిస్తాయని చెబుతారు. ఈ విషయాలన్నీ స్వయానా శ్రీకృష్ణుడే యుధిష్ఠురినికి తెలియజేశాడు.
*రూపశ్రీ.