రుద్రాక్షధరిస్తున్నారా.. ఎవరు ధరించాలి.. ఎవరు ధరించకూడదు!

 

రుద్రాక్షధరిస్తున్నారా.. ఎవరు ధరించాలి.. ఎవరు ధరించకూడదు!


హిందూ పురాణాలు, నమ్మకాల ప్రకారం రుద్రాక్షను శివుడి చిహ్నంగా భావిస్తారు. శివుడి కన్నీటి బిందుల నుండి రుద్రాక్షలు ఆవిర్భవించాయని చెబుతారు.  రుద్రాక్షను ధరించినా,  పూజించినా సాక్షాత్తు పరమేశ్వరుడి అనుగ్రహం ఉన్నట్టే అని అంటారు. అయితే రుద్రాక్షను ధరించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి.  ఈ నియమాలను పాటించకపోవడం వల్ల జీవితంలో మంచి జరగడానికి బదులుగా చాలా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. రుద్రాక్ష మాల లేదా రుద్రాక్షను ధరించడానికి ఉన్న నియమాలు ఏంటి? ఎవరు ధరించాలి? ఎవరు ధరించకూడదు? తెలుసుకుంటే..

ఇలాంటి వారు రుద్రాక్షలు ధరించకూడదు..

స్మశాన వాటికకు వెళ్లే వారు, అంత్యక్రియలకు హాజరయ్యేవారు రుద్రాక్షలను తీసివేయాలి. వెళ్ళేముందు రుద్రాక్షలను ఏదైనా ఆలయంలో పెట్టేయాలని. మరణం జరిగిన చోట లేదా అంత్యక్రియలు,  పిండ ప్రదానాలు వంటివి జరుగుతున్న చోట రుద్రాక్షలు ధరించకూడదు.

మరణం సంభవించినప్పుడే కాదు.. ఇంట్లో ఒక ప్రాణి అంటే.. బిడ్డలు పుట్టడం లాంటివి జరిగినప్పుడు కూడా రుద్రాక్షలు ధరించి ఉండకూడదు.  ముందే వాటిని తీసివేయాలి.

రుద్రాక్షలు ధరించి నిద్రపోకూడదు.  అందుకే నిద్రపోయే ముందు రుద్రాక్షలు తీసివేసి దేవుడి గదిలో లేదా శుభ్రమైన ప్రదేశంలో ఉంచాలి.

మాంసం, మద్యం,  తామసిక  ఆహారాలు తీసుకునేవారు రుద్రాక్షలు ధరించకూడదు. రుద్రాక్ష ధరిస్తే  చాలా సాత్వికమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి.

రుద్రాక్ష ధరించడానికి నియమాలు..

రుద్రాక్ష ధరించే ముందు రుద్రాక్ష మాల లేదా రుద్రాక్షలను పచ్చిపాలలో ఒకసారి,  గంగాజలంలో ఒక సారి శుద్ది చేయాలి.

రుద్రాక్షను దరించే సమయంలో ఓం నమఃశివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ ధరించాలి.

ఎరుపు లేదా పసుపు రంగు పట్టు దారంలో రుద్రాక్షలను ధరించడం చాలా మంచిది.

ఒకరు ధరించిన రుద్రాక్షను మరొకరు ధరించకూడదు.  అలాగే రుద్రాక్ష మాల నుండి జారిపోయిన రుద్రాక్షలను కూడా ఇతరులు తీసుకుని ధరించడం నిషిద్దం.

రుద్రాక్షను సోమవారం లేదా శివరాత్రి, మాస శివరాత్రి వంటి మంచిరోజుల్లో.. శివుడికి ప్రత్యేకమైన రోజులలో ధరించడం మంచిది.

రుద్రాక్ష ధరిస్తే..

రుద్రాక్షను సాక్షాత్తు పరమేశ్వరుడి స్వరూపంగా భావిస్తారు.  రుద్రాక్ష ధరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.

పరమేశ్వరుడి ఆశీస్సులు లభిస్తాయి.  ఆత్మవిశ్వాసం కూడా మెరుగుపడుతుంది.

జీవితంలో ఎదురయ్యే కష్టాలు తొలగిపోతాయి.  అలాగే ప్రతికూల శక్తులు దూరమవుతాయి.  

                                          *రూపశ్రీ.