రామాయణ, మహాభారతాలలో.. రెండింటిలో ఉన్న మహారథులు వీళ్లు!

 

రామాయణ, మహాభారతాలలో.. రెండింటిలో ఉన్న మహారథులు వీళ్లు!

రామాయణ, మహాభారతాలు ఎన్నో పౌరాణిక కథలను కలిగి ఉన్నాయి, అవి కేవలం రామాయణ, మహాభారతాల గురించి తెలియజేయడమే  కాకుండా వాటి ద్వారా వ్యక్తులను ఆలోచింపజేస్తాయి. రామాయణం త్రేతా యుగంలో జరగ్గా, మహాభారతం ద్వాపర యుగంలో జరిగింది. మహాభారతం , రామాయణం రెండింటిలోనూ కొందరు గొప్ప యోధులు ఉన్నారు.  ఇలా రెండింటిలోనూ ఉన్న ఐదుగురు గొప్ప యోధుల గురించి తెలుసుకుంటే..

యుగాల మధ్య కాలం..

భారతీయ పౌరాణిక చరిత్రలో.. త్రేతా యుగం , ద్వాపర యుగం వేల సంవత్సరాల కాలవ్యవధితో వేరు చేయబడ్డాయని భావిస్తారు. రామాయణ ఘట్టాలు త్రేతా యుగంలో జరగ్గా, మహాభారత యుద్ధం ద్వాపర యుగం చివరలో జరిగింది. అయితే ఈ సుదీర్ఘ కాలవ్యవధిని అధిగమించి, ఈ రెండు ఇతిహాసాలలోనూ ముఖ్యమైన పాత్రలు పోషించిన కొందరు మహనీయులు ఉన్నారని చాలా మందికి తెలియదు.

పరశురాముడు..

విష్ణుమూర్తి  ఆరవ అవతారమైన పరశురాముడు రెండు యుగాలలోనూ ప్రముఖంగా కనిపిస్తాడు. రామాయణ కాలంలో, జనకపురంలో శ్రీరాముడు శివుని ధనుస్సును విరిచినప్పుడు, పరశురాముడు కోపంతో అక్కడికి వస్తాడు. తరువాత, రాముని నిజ స్వరూపాన్ని గుర్తించి, ఆయనకు నమస్కరిస్తాడు. మహాభారతంలో, ఆయన భీష్మ పితామహుడు, ద్రోణాచార్యుడు , ఉదార స్వభావుడైన కర్ణుడు వంటి గొప్ప యోధులకు గురువు అయ్యాడు. పురాణాల ప్రకారం, శ్రీకృష్ణుని అభేద్యమైన ఆయుధమైన సుదర్శన చక్రాన్ని ప్రసాదించింది పరశురాముడే.

హనుమంతుడు..

హనుమంతుడు అమరత్వం పొందినవాడు, చిరంజీవిగా పిలువబడతాడు.  ప్రతి యుగంలోనూ ఉన్నాడని నమ్ముతారు. రామాయణంలో శ్రీరాముని పరమ భక్తుడు,  కష్టకాలంలో రక్షకుడు. సీతాన్వేషణ నుండి రావణ సంహారం వరకు, హనుమంతుడి  బలం , జ్ఞానం సాటిలేనివి. మహాభారతంలో, ద్వాపర యుగంలో భీముడిని పరీక్షించడానికి హనుమంతుడు ఒక ముసలి వానర రూపంలో కనిపిస్తాడు. అంతేకాకుండా, కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడి రథంపై పతాకంపై కూర్చుని యుద్ధమంలో పాండవులను రక్షించాడని చెబుతారు.

జాంబవంతుడు..

పురాణ కథల ప్రకారం జాంబవంతుడు సత్యయుగం నుండి ద్వాపరయుగం వరకు గల కాలాన్ని చూశాడట. రామాయణంలో, అతను శ్రీరాముని వానర సైన్యానికి  ఎంతో గొప్ప తెలివి తేటలు కలిగిన సేనాపతి జాంబవంతుడు. హనుమంతునికి తన శక్తులను గుర్తు చేసినది ఆయనే. మహాభారతంలో, శమంతక మణి  కోసం జాంబవంతుడు, శ్రీకృష్ణుడు 28 రోజుల పాటు భీకర యుద్ధం చేశారు. శ్రీకృష్ణుడు తన ఆరాధ్యదైవమైన రాముని అవతారం అని జాంబవంతుడు గుర్తించినప్పుడు, అతను తన కుమార్తె జాంబవతిని శ్రీకృష్ణుడికి  ఇచ్చి వివాహం చేశాడు.

దుర్వాసుడు..

 దుర్వాస మహర్షి  తీవ్రమైన కోపానికైనా, శాపాలు ఇవ్వడంలో అయినా,  తిరుగులేని వరాలు ఇవ్వడంలో అయినా మూడు లోకాలలో ప్రసిద్ది చెందాడు. రామాయణంలో ఆయన రాకతో లక్ష్మణుడు శ్రీరామునికి ఇచ్చిన మాటను తప్పాడు, దాని ఫలితంగా లక్ష్మణుడు నీటిలో మునిగి మరణించాడు. మహాభారతంలో ఆయన కుంతి సేవకు సంతోషించి, దేవతలను ఆవాహన చేసి సంతానాన్ని కనగలిగే ఒక మంత్రాన్ని ఆమెకు ఇచ్చాడు. ఈ మంత్రం వలనే పాండవులు జన్మించారు.

విభీషణుడు..

రావణుడి తమ్ముడైన విభీషణుడు అధర్మమార్గం కంటే ధర్మమార్గాన్నే ఎంచుకున్నాడు. రామాయణంలో, రావణుడి మరణానంతరం శ్రీరాముడు విభీషణుడికి పట్టాభిషేకం చేసి, అతనికి చిరంజీవిగా ఉండే వరాన్ని ప్రసాదించాడు. అయితే మహాభారతంలో రాజసూయ యజ్ఞం సమయంలో సహదేవుడు విభీషణుడిని ఆహ్వానించాడు. మరో సంఘటనలో భీముడి కుమారుడైన ఘటోత్కచుడు కూడా పాండవుల సహాయం కోరుతూ, విభీషణుడిని కలవడానికి లంకకు వెళ్ళడం జరుగుతుంది.

                                    *రూపశ్రీ.