వసంత పంచమి.. సరస్వతి దేవికి ఇష్టమైన నైవేద్యాలు ఇవే..!

 

వసంత పంచమి.. సరస్వతి దేవికి ఇష్టమైన నైవేద్యాలు ఇవే..!


మాఘ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే పంచమి తిథిని వసంత పంచమి అని,  శ్రీ పంచమి అని అంటారు.  ఈ రోజు సరస్వతి దేవి సాగర మధనం నుండి ఆవిర్భవించిన రోజని పురాణాలు చెబుతున్నాయి.  అందుకే ఈ రోజు సరస్వతి దేవిని పూజించడం చాలా శ్రేష్టం అని చెబుతారు.  వసంత పంచమి రోజు సరస్వతి దేవిని ఎంత భక్తిగా ఆరాధిస్తే.. ఆ అమ్మ అనుగ్రహం అంత ఉంటుంది.  ముఖ్యంగా సరస్వతి దేవికి ఇష్టమైన నైవేద్యాలు,  ఇష్టమైన పుష్పాలు, సరస్వతి దేవి స్తోత్రాలు వంటివి చేయడం వల్ల సరస్వతి అనుగ్రహం లభిస్తుంది.  సరస్వతి దేవి అనుగ్రహం కోసం ఏ నైవేద్యం పెట్టాలి? సరస్వతి దేవికి ఏ నైవేద్యాలు అంటే ప్రీతి? తెలుసుకుంటే..

వసంత పంచమి కేవలం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాదు. మాఘ శుధ్ద పంచమి రోజున దేశ వ్యాప్తంగా జరుపుకుంటారు. ఇళ్ళలో, దేవాలయాలలో,  విద్యాసంస్థలలో,  పాఠశాలలో, కళాశాలలో సరస్వతి పూజ చేస్తారు. సరస్వతి దేవికి ఇష్టమైన నైవేద్యాలు పెడితే.. సరస్వతి దేవి తృప్తి పడుతుంది.  అనుగ్రహం ఇస్తుంది. ముఖ్యంగా చదువు, వృత్తి, ఉద్యోగం సంబంధించిన అడ్డంకులు తొలగిస్తుంది.

నైవేద్యాలు..

సరస్వతి దేవిని ఆచార బద్దంగా పూజించిన తర్వాత కుంకుమ పువ్వు జోడించి వండిన క్షీరాన్నం నైవేద్యంగా  పెట్టాలి.  సరస్వతి దేవికి తెలుపు రంగు అంటే చాలా ఇష్టం.  అందుకే కుంకుమ పువ్వు జోడించిన క్షీరాన్నం నైవేద్యంగా పెట్టాలి.

తీపి అన్నం..

అన్నం వండేటప్పుడు కాస్త బెల్లం లేదా పంచదార వేసి పరమాన్నం వండి కూడా నైవేద్యంగా పెట్టవచ్చు.

దద్దోజనం..

సరస్వతి దేవికి తెలుపు రంగు ఇష్టం కాబట్టి దద్దోజనం కూడా నైవేద్యం పెట్టవచ్చు.

అటుకులు, బెల్లం..

సరస్వతి పూజలో సింపుల్ గా నైవేద్యం పెట్టాలని అనుకున్నా, ఆరోగ్యం లేదా పరిస్థితులు సహకరించని వారు అటుకులు, బెల్లం నైవేద్యం పెట్టవచ్చు.

ఆవుపాలు..

అటుకులు బెల్లం కంటే కూడా ఆవుపాలు పెట్టడం కూడా చాలా సులభం మాత్రమే కాకుండా  సరస్వతి కృపను పొందే మార్గం.  సరస్వతి పూజ రోజు ఆవుపాలను బాగా కాచి అందులో కలకండ లేదా పంచదార వేసి నైవేద్యం పెట్టవచ్చు.

అభిషేకం..

పాంచామృతాలలో  ఉపయోగించే పాలు,  పెరుగు, పంచదార,  అరటిపండు, తేనెలతో సరస్వతి దేవి విగ్రహానికి అభిషేకం చేస్తే చాలా మంచిది. సరస్వతి దేవి విగ్రహం లేకపోతే.. లక్ష్మీదేవి విగ్రహాన్నే పూజలో ఉంచి సరస్వతి దేవిని ఆవాహన చేసి అభిషేకం చేయవచ్చు.

                                   *రూపశ్రీ.