Read more!

వినాయకుని 8 అవతారాలు -1

 

వినాయకుని 8 అవతారాలు -1 

 


వినాయకుడంటే భౌతికంగా మనకి కనిపించే ఆకారం మాత్రమే కాదు... ఆయన రూపు, స్వభావం వెనుక లోతైన అర్థం ఉందని వేదాంతులు చెబుతుంటారు. గణేశుని ఆరాధనతో ఈ సంసారం నుంచి సులభంగా విముక్తి పొందవచ్చని సూచిస్తుంటారు. అందుకే గణేశుడే ప్రముఖంగా ఆరాధించబడే గాణపత్యం అనే శాఖ కూడా ఉంది. వినాయకుని ఆరాధనలో ఆధ్యాత్మిక రహస్యాలు ఎన్నో ఉన్నాయని చెప్పేందుకు ఓ గొప్ప ఉదాహరణ ఆయన అవతారాలు. ముద్గల పురాణం ప్రకారం వినాయకుడు ఎనిమిది అవతారాలను ధరించాడు. వాటి వివరాలు…

 

వక్రతుండుడు :-   పూర్వం ఇంద్రుడు చేసిన ఒక పొరపాటు వల్ల ‘మాత్సర్యాసురుడు’ అనే రాక్షసుడు ఉద్భవించాడు. అతని ధాటికి ముల్లోకాలూ అల్లాడిపోసాగాయి. అతన్ని ఎదుర్కోవడానికి ఎలాంటి ఉపాయమూ తోచక దేవతలంతా దత్తాత్రేయుని శరణు వేడారు. అంతట దత్తాత్రేయుడు, గణపతిని ప్రార్థించమని సూచించాడు. ‘గం’ అనే బీజాక్షరంతో దేవతలంతా ఆ గణపతిని గురించి తపస్సు చేయగానే ‘వక్రతుండుని’గా అవతరించాడు. ఆయన సింహవాహనుడై ఆ మాత్సర్యాసురుని జయించాడు. వక్రతుండం అనేది ఓంకారానికి ప్రతీకగా, మాత్సర్యాసురుడు మనలోని మత్సరానికి (ఈర్ష్య) ప్రతీకగా చెప్పుకోవచ్చు. ఈ లోకం నాది, ఈ లోకంలో అందరికంటే నాదే పైచేయి కావాలి అనుకున్న రోజున ఈర్ష్యాసూయలు జనిస్తాయి. కానీ సృష్టి లీలావిలాసంలో ఈ జగత్తు ఒక నాటకం మాత్రమే అని గ్రహించిన రోజున మనసులో ఎలాంటి ఈర్ష్యా ఉండదు. ఇదే మాత్సర్యం మీద ఓంకారపు విజయం.

 

ఏకదంతుడు :–  చ్యవనుడనే రుషి మదాసురుడనే రాక్షసుని సృష్టించాడు. రాక్షసుల గురువైన శుక్రాచార్యుడేమో అతనికి ‘హ్రీం’ అనే మంత్రాన్ని ఉపదేశించి, దాన్ని నిరంతరం జపిస్తే ఫలితం దక్కుతుందన్న ఉపాయాన్ని అందించాడు. లోకాధిపత్యమే అభీష్టంగా కల మదాసురుడు ఆ హ్రీంకారాన్ని యుగాల తరబడి జపించాడు. దాంతో అతనికి కోరుకున్న శక్తులన్నీ లభించాయి. అసలే రాక్షసుడు, ఆపై అతీత శక్తులు... ఇక మదాసురునికి తిరుగు లేకుండా పోయింది. అతని చేష్టలకు దేవతలంతా భీతిల్లిపోయి సనత్కుమారుని చెంతకు ఉపాయం కోసం పరుగులుతీశారు. సనత్కుమారుని సూచన మేరకు వారంతా గణేశుని కోసం ప్రార్థించగా, ఆయన ‘ఏకదంతు’నిగా అవతరించి మదాసురిని జయించాడు. ఇక్కడ మదాసురుడు అంటే మదానికి (గర్వం) చిహ్నం, ఏకదంతుడు ఈ సృష్టి యవత్తూ ఒకటే అన్న అద్వైతానికి చిహ్నం. ఆ అద్వైత రహస్యం తెలిసిన రోజున మదం అణిగిపోక తప్పదుగా!

మహోదరుడు :–   శివుడు ఓసారి తీవ్రమైన తపస్సులో మునిగిపోయాడు. ఎంతకాలమైనా ఆయన ఆ తపస్సుని వీడనే లేదయ్యే! దాంతో పార్వతి కంగారుపడిపోయింది. ఎలాగైనా ఆ పరమేశ్వరుని తపస్సు నుంచి బయటకు తీసుకురావాలని అనుకుంది. ఒక గిరిజన యువతిగా మారి ఆయన తపోభంగం కలిగించే ప్రయత్నం చేసింది. పార్వతి చేష్టలకు పరమేశ్వరునికి దిగ్గున మెలకువ వచ్చింది. ఆ మెలకువతో పాటుగా ఏం జరిగింది అన్న అయోమయం కూడా ఏర్పడింది. ఆ అయోమయం నుంచి ఓ రాక్షసుడు జనించాడు. అతనే మోహాసురుడు. ఆ మోహాసురుడు సూర్యుని ఆరాధించి ముల్లోకాధిపత్యాన్ని సాధించాడు. దేవతల ప్రార్థనను మన్నించి గణేశుడు లంబోదరునిగా అవతరించాడు. మోహం ఎప్పుడూ అయోమయానికి దారితీస్తుంది. దృక్పథం సంకుచితంగా మారిపోతుంది. అందరూ నావారే అన్న విశాలమైన దృష్టి కలిగిన రోజున ఆ మోహం దూరమైపోతుంది. మనంలో మోహానికి సూచనగా మోహాసురుడు, విశాలమైన దృక్పథానికి సూచనగా లంబోదరుడు నిలుస్తారు.

 

గజాననుడు :–   కుబేరుని ఆశ నుంచి లోభాసురుడు అనే రాక్షసుడు జనించాడు. శివపంచాక్షరిని జపించిన ఆ లోభాసురుడు, శివుని అనుగ్రహంతో ముల్లోకాలనూ జయించే వరాన్ని పొందాడు. కానీ అతని లోభానికి అంతులేకుండా పోయింది. చివరికి శివుని కైలాసాన్ని కూడా తన స్వాధీనంలోకి తెచ్చుకోవాలనుకున్నాడు. ఆ విషయాన్ని తెలుసుకున్న దేవతలు రైభ్యుడనే రుషిని శరణువేడారు. గణపతిని కనుక ఆవాహన చేస్తే, లోభాసురుని పరాజయం ఖాయమని సూచించాడు రైభ్యుడు. అలా సకల దేవతల ప్రార్థనలను మన్నించి గణేశుడు ‘గజాననుడి’గా అవతరించి లోభాసురుని జయించాడు. గజాననుడు అంటే ఏనుగు ముఖం కలిగినవాడు అని అర్థం. ఏనుగు తల బుద్ధిని సూచిస్తుంది. ఆ బుద్ధిని కనుక ఉపయోగిస్తే మనలోని లోభం (అత్యాశ, పిసినారితనం) దూరం కాక తప్పవు. ఇతే లోభాసురుని పరాజయంలో ఉన్న సందేశం.

(స్వామివారి మరో నాలుగు అవతారాల గురించి రేపటి వ్యాసంలో)

- నిర్జర.