Read more!

శీలం అంటూ ఉంటారు.. నిజమైన శీలం ఏంటి!

 

శీలం అంటూ ఉంటారు.. నిజమైన శీలం ఏంటి!

వ్యక్తి స్వభావం మారేవరకూ దుఃఖాలు ఎప్పుడూ కలుగుతూనే ఉంటాయి. ఎలాంటి భౌతిక సహాయమైనా దానిని పూర్తిగా తొలగించలేదు. మానవుణ్ణి పవిత్రుణ్ణి చేయడం ఒక్కటే ఈ సమస్యాపరిష్కారానికి మార్గం. లోకంలో కనిపించే చెడు అంతా అజ్ఞాన ప్రభావమే. మానవుడు జ్ఞానిగా, విశుద్ధునిగా, బలాఢ్యునిగా, విద్యావంతునిగా అయిన తరువాతే లోకంలోని దుఃఖం ఆగుతుంది. ప్రతి ఇంటినీ మనం ధర్మసత్రంగా మార్చినా, దేశాన్నంతా చికిత్సాలయాలతో నింపినా, మానవుడి శీలం మార్పు చెందే వరకూ అతడి దుఃఖం అలాగే ఉంటుంది.

ప్రతి పనిలోనూ మంచీ చెడుల కలయిక ఉండక తప్పదు. సత్కర్మ వలన సత్ఫలం, దుష్కర్మవలన దుష్ఫలం కలుగుతాయి. కానీ మంచి చెడులు రెండూ ఆత్మకు బంధాలే. కర్మచేస్తూ కర్మ ఫలాలలో మనం ఆసక్తులం కానప్పుడు కర్మలు మనల్ని బంధింపలేవనేదే భగవద్గీతలో తెలుపబడిన తరణోపాయం. నిష్కామకర్మాచరణ అంటే ఏమిటో తెలుసుకుంటే..

“తస్మాదసక్తస్సతతం కార్యం కర్మ సమాచర". నిరంతరం కర్మలు ఆచరించు. కానీ వాటిలో ఆసక్తుడవు కావద్దు అనేదే భగవద్గీతలోని ముఖ్యాంశం. సంస్కారం అంటే అంతరప్రవృత్తి అని చెప్పవచ్చు. చిత్తాన్ని సరోవరంతో పోలిస్తే అందులో ఉదయించిన ప్రవృత్తి వీచిక ఒక రకమైన  జాడను కలుగజేస్తుంది. అలాంటి జాడే 'సంస్కారం' అంటాం. మనం రోజువారీ జీవితంలో చేసే ప్రతి పనీ.. మన శరీరంలో కలిగే ప్రతి కదలిక.. మన మెదడులో కలిగే ప్రతి ఆలోచనా.. ఇలా ప్రతిదీ ఇలాంగి సంస్కారాన్నే కలిగిస్తాయి. ఈ సంస్కారాలు మనకు పైకి కనబడకపోయినా అంతర్గతంగా ఉంటాయి. ఇప్పుడీ  క్షణంలో నా స్థితి, ఇంతకు క్రితం నా జీవితంలో ఏర్పడివున్న సంస్కారాలు సాముదాయక ఫలితం.

నిజంగా శీలమంటే ఇదే. ప్రతి మానవుడి శీలాన్నీ ఈ సంస్కారాలు నిర్ణయిస్తాయి. మంచి సంస్కారాలు ప్రబలంగా ఉంటే శీలం మంచి దవుతుంది. చెడు సంస్కారాలు ప్రబలంగా ఉంటే స్వభావం చెడ్డదవుతుంది. ఒక వ్యక్తి సదా చెడు మాటలు వింటూ, చెడు ఆలోచనలు చేస్తూ, చెడు పనులను చేస్తూ ఉంటే దుష్ట సంస్కారాల చేతుల్లో అతడొక యంత్రంగా మారి పాపం చేయడానికి అవి అతడిని పురిగొల్పుతాయి. అలాగే మంచి పనులు చేస్తున్నప్పుడు వాటివలన కలిగే సంస్కారం మొత్తం  మంచిదవడంతో అతడు సంకల్పించకున్నా సత్కా ర్యాలను చేసి తీరుతాడు. ఒక వేళ చెడు చేయాలని అతడు కోరినా, మంచి సంస్కారాల ఫలితంగా అతడి మనస్సు అలా చేయనివ్వదు. మంచి సంస్కారాలు అతడి బుద్ధిని మరలుస్తాయి. అలాంటి వ్యక్తిలో సచ్ఛీలం సుప్రతిష్ఠితమై ఉన్నదని చెప్పవచ్చు.

                                   ◆నిశ్శబ్ద.