అమ్మో అమ్మాయిలు 28

 

బిందురేఖ అబ్బులి అరచేతిలో ఓ రేఖ మీద వేలుంచి "ఈ గీత మీ శరీరం మీద చెమట పడుతుందే ఆ చెమటలో ఓ చుక్క కలిపితే నా పేరొస్తుంది. ఆడపిల్లలని ఢీకొనటం ఓ తెలివి కాదు, చుక్కా గీతా కలిపితే ఈ పజిల్ సాల్వ్ చేయండి. నా పేరు కనుక్కోండి. అదీ తెలివి" అని గిర్రున వెనుతిరిగి వెళ్ళిపోయింది బిందురేఖ.

“చుక్కా గీత, గీతా చుక్క" అని మననం చేసుకుంటూ బాత్ రూమ్ వైపు బయలు దేరాడు అబ్బులు. అబ్బులు ఎంత ఆలోచించినా చుక్క గీతకి సరి అయిన అర్థం తీయలేకపోయాడు. స్నానం కానిచ్చి గడికొచ్చి గదిలో అడుగు పెడుతూనే అడిగాడు. “ ఓరోరి కుంతీపుత్రా? నీకు తెలివుందా?” అని.

వ్యాకర్ణ తెల్లబోయి తెప్పరిల్లి" ఇప్పుడు తెలివితో పనే మొచ్చిందిరా అబ్బాయ్" అన్నాడు.

“చెప్పెదను. ఓ అందమైన అమ్మాయికి మహా అందమైన పేరుంది. ఆ పేరు మనకి తెలియదు. యా అల్లా! చుక్క అంటే చెమట చుక్క. గీత అంటే అర చేతిలో గీత, కలిపితే ఆ అమ్మాయి పేరొస్తుంది. ఇదో ఫజిలనుకో. ఇంతకీ ఆ అమ్మాయి పేరేంటంటావు?”

“బాత్ రూమ్ లో దెయ్యాలేమయినా వున్నాయిరా అబ్బూ!”

“లేవే, దేనికీ?”

“బాత్ రూమ్ కెళ్ళేటప్పటి ముఖము, మాటలు మారి కొత్త మాటలు, కొత్త ముఖము వస్తేను!”

“అదా........? అది.... అది... అదే ఆ పిల్ల.... చుక్క..... అహమో గీత.... వుహూ..... పిల్లే...”

“ఒరేయ్! ఒరేయ్ సరిగా చెప్పి తగలడతావా! నాలుక తెగ్గోయనా నన్నన్నా నిన్నిన్నీ ఏంటా నత్తివాగుడు. ఆడదెయ్యం పట్టిన వాడిలా కులుకుతున్నావ్! ఏమొచ్చింది? ఏం జరిగింది? ఏమయింది?” అని వ్యాకర్ణ గట్టిగా కోప్పడ్డాడు.

“అసలేం జరిగిందంటే?” అంటూ అబ్బులు మొదలు పెట్టి జరిగిన కథంతా చెప్పేశాడు. చెప్పి..... “గీత చుక్క ఫజిల్ సాల్వ్ చేసి ఆ పిల్ల పేరు వేలికిలాగి ఇదిగో అమ్మడూ! ఇది నీ పేరు" అని చెప్పకపోతే తనకి తెలివి లేనట్లేనని... ఆ పిల్ల ముందు తను ఫూల్ కావాలని.. అదనీ... ఇదనీ..... ఈ బ్రతుకే వ్యర్థమని....” వాపోయాడు. అంతటితో ఆగక... “ఈ అవమానం నాకొక్కడికే కాదురా. ఆపదలో వున్న ప్రాణమిత్రుడివి ఆదుకొని, నీకు కూడా వర్తిస్తుంది" అని బెదిరించాడు.

“నిజమే"నని ఒప్పుకున్నాడు వ్యాకర్ణ. ఆ తర్వాత యిద్దరూ తీరుబడిగా కూర్చుని 'గీత చుక్కల" గురించి తర్జనభర్జనలో పడ్డారు. “ఆ. ఆ పిల్ల పేరు చుక్కమ్మ అన్నాడు వ్యాకర్ణ.

“నీ ముఖంలా వుంది. మరి గీత సంగతేమిటి?” అన్నాడు అబ్బులు.

“గీత యింటిపేరు. అంటే, గీతల చుక్కమ్మ ఆ పిల్ల పూర్తి పేరు.”

“గీత చుక్కమ్మ కాదు, చుక్కల గీతమ్మ.”

“అలాగూ అయి వుండవచ్చు.”

“ఏడ్చినట్లే వుంది. అంత అందమైన పిల్ల పేరు చుక్కమ్మా కాదు గీతమ్మా కాదు.

“అమ్మడూ, నీ పేరు యిది" అని చెప్పానంటే ముఖాన నవ్వేస్తుంది.”

“దిక్కుమాలిన పేరు, దిక్కుమాలిన ఫజిల్ అసలా పిల్ల నెందుకు ఢీకొన్నావ్! బుద్ధి లేక పోతే సరి. ఢీకొన్నావ్ సరే, పేరెందుకడిగావ్ బుద్ధి లేకపోతే సరి, పేరడిగావ్ సరే. ఆ పిల్ల ఫజిలెందుకివ్వాలి?”

“బుద్ధిలేక" అన్నాడు అబ్బులు, భూతద్ధాలు తీసి కళ్లు తుడుచుకుని ముక్కు చీది.

“ఏడ్వ కేడ్వకురా అబ్బూ! మా నాయన కదూ? మా తండ్రి కదూ, ఇద్దరం కలిసి ఎలాగో చుక్కల్లోంచి గీతల్లోంచి ఆ పిల్లని.. కాదు కాదు. ఆ పిల్ల దాని పేరుని లాగేద్దాం" అంటూ వ్యాకర్ణ ఓదార్చాడు.

బొంగురు స్వరంతో నీరసంగా "అలాగే" అన్నాడు అబ్బులు.