'గౌతమీపుత్ర శాతకర్ణి'.. లక్షకు టికెట్ కొన్న అభిమాని
on Jan 12, 2017
నందమూరి బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూశారు. బాలయ్యది వందో సినిమా కావడం.. అందునా అది కూడా ఓ హిస్టారికల్ స్టోరీ కావడంతో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూశారు. ఆ రోజు రానే వచ్చింది. నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక అభిమాన హీరో సినిమా అంటే అభిమానులు ఎంత హడావుడి చేస్తారో చెప్పనక్కర్లేదు. టికెట్ ఎంత అని కూడా చూడకుండా వెళ్లిపోతుంటారు. అయితే పెద్ద హీరో కాబట్టి టికెట్ ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయినా లెక్క చేయకుండా వెళుతుంటారు. అలా ఓ అభిమాని ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ టిక్కెట్ ను ఎంతకు కొన్నాడో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఏ వెయ్యి రూపాయలో.. లేక రెండు వేల రూపాయలో అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఏకంగా రూ.1,00,100 కు టికెట్ కొన్నాడు. కూకట్పల్లిలోని భ్రమరాంబ థియేటర్లో బెనిఫిట్ షోకి వచ్చిన ఓ అభిమాని లక్షా వంద రూపాయల పెట్టి టికెట్ కొని అందరికి షాకిచ్చాడు. దీనిని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి విరాళంగా ఇచ్చారు.
కాగా ఈరోజు విడుదలైన 'గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అభిమానులతో పాటు.. సినిమా చూసిన ప్రముఖులు కూడా బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.