శ్రీదేవి సవతి తల్లి పాత్రలో ' మామ్ '
on Mar 3, 2016
ఒకప్పుడు యావత్ భారతదేశాన్ని ఒక ఊపు ఊపేసింది అందాల తార శ్రీదేవి. తెలుగుతో పాటు, దక్షిణ భారత భాషల్లోనూ, అటు బాలీవుడ్ లోనూ మహారాణిగా రాజ్యమేలింది. పెళ్లైన తర్వాత, సినిమాలకు చాలాకాలం పాటు పూర్తిగా దూరమైపోయింది. ఇంగ్లీష్ వింగ్లీష్ తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టిన శ్రీదేవి, ఆ సినిమా ఫలితం కాస్త అటూ ఇటూ ఉన్నా, తను మాత్రం మంచి మార్కులు తెచ్చుకోగలిగింది. ఆ సినిమాలో అమ్మగా అద్భుతంగా నటించిందని కితాబు అందుకుంది.
ఆ తర్వాత బాహుబలిని మిస్ చేసుకున్న శ్రీదేవి, పులికి ఒకే చెప్పింది. కానీ పులి ఆమెకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఆ షాక్ నుంచి తేరుకున్న శ్రీదేవి, తన భర్త నిర్మాణంలోనే మరో సినిమాకు ఇప్పుడు సైన్ చేసింది. సినిమాలో తల్లిగా ఆమె పాత్ర అద్భుతంగా ఉండబోతోందట. సినిమాకు ' మామ్ ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. సినిమాలో శ్రీదేవిది సవతి తల్లి పాత్ర అని సమాచారం. బాలీవుడ్ లో ఫైన్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న నవాజుద్దీన్ సిద్దిఖీ ఆమెకు జోడీగా నటిస్తున్నాడు. ' మామ్ ' మనసుల్ని కదిలించే ఫ్యామిలీ డ్రామా అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్లో బిజీగా ఉన్న యూనిట్ వచ్చే నెలలోనే సెట్స్ పైకి వెళ్లబోతోంది. మరి ఈ లేడీ ఓరియంటెడ్ సినిమాతో శ్రీదేవి సరైన హిట్ కొడుతుందేమో చూడాలి.