Facebook Twitter
నన్ను తెలుసుకుంటావా

నన్ను తెలుసుకుంటావా !

 




అవును...
నేను స్త్రీని
సృష్టి నా తల్లి
సూర్యుడు నా వెలుగు
కోటి మల్లెల గంధం.. నా మనస్సు
ప్రపంచం ఉయ్యాల ఊగి ఊగి
నా దగ్గరే ఆగిపోతుంది
నా కళ్ళలోకి సూటిగా చూడు అనేక జన్మ రహస్యాలు
బెంగగా గుర్తొస్తాయి
నేనెంత బలవంతురాల్నో
అంత నిర్బాలను కూడా!
ప్రేమకోసం
ఓడిపోయి గెలవటం నాకిష్టం

నా కళ్ళల్లో మెరపు
నా మొహంలో కాంతులున్నా
పెదవుల చిరునవ్వుల చాటున
హృదయాకాశం నిండా
పరుచుకున్న వేదన తెలుసా!!

నన్ను అందంతో కొలువగలవా ?
ఆనందంతో పోల్చగలవా
షరతులు లేని నా ప్రేమను
పసిదాని అరచేతుల స్పర్శతో
తమ్ముడి నెత్తుకునేఅక్క గారాబంతో
రక్తంలో కలిపిన అమ్మపాలతో
సరిపోల్చుకుని చూడు
నీకంటే బరువులెత్తుకుని
శక్తికి మించి పరిగెత్తే
నీ సహచరి పాదాల్లో
నా మూలలున్నాయి చూడు

కనిపించని ప్రేమ గురించి ఎందుకు గానీ
సకల విశ్వ సత్యానికి ప్రతీకగా
నీ ఇంట్లోనే ఉన్నాను కదా!!
నన్ను తెలుసుకుంటున్నావా?
నిన్ను వదులుకోగలవా మరి !!


- భవానీదేవి