Facebook Twitter
ఏయ్! నన్ను మన్నించవూ...

ఏయ్! నన్ను మన్నించవూ...


పద్మా శ్రీరాం



మది చివుక్కుమన్న ప్రతిసారీ నువ్ గుర్తొస్తావ్
మెల్లగా తలనిమిరే నీ చల్లని స్పర్శ గుర్తొస్తుంది
నువ్వేమైనా సాధించగలవురా ...
అనే నీ తోడ్పాటు గుర్తొస్తుంది
పోన్లే వదిలేయ్ చిన్నారీ
ఎక్కువ ఆలోచించకురా నీలాంటి
మంచినేస్తాన్ని వదులుకోవడం
వాళ్ళ ఖర్మ బంగారూ.
నువ్ వజ్రానివిరా
అన్న నీ నమ్మకం గుర్తొస్తుంది...
కానీ నేను నిన్ను గాయపరిచిన
క్షణాలు మాత్రం ఎప్పుడూ గుర్తురావ్
అదేం ఖర్మమో  అన్నిసార్లూ నవ్వుకుని
మరలా నన్ను చేరదీసిన నువ్వు
 ఇప్పుడు మాత్రం నన్నిలా ఒంటరిని
చేసి అలిగి దూరం పోయావేమిరా?

నా కంటి చినుకై అన్ని వేళలా తోడున్న
నువ్వు దూరమైతే నేనేమవాలి?
అదేంటో మరి నా కంటికునుకూ నీకు తోడయ్యింది.
కనులకమలాలు పత్తికాయలయినా
మనసు నాకు అత్తిపత్తయింది....
నువు రావా....నీ చెలిమిలో ఉన్న లోకం
నాక్కావాలి కానీ నీ బంగారానికింకేం వద్దు.

ఏయ్ ! నా చిన్నారి నేస్తమా! రావా మరోమారు….