LATEST NEWS
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల సమీకరణాలు  మరోసారి చర్చనీయాంశంగా మారాయి. సార్వత్రిక ఎన్నికల అనంతర పరిణామాలను గమనిస్తే.. వైసీపీ కుల రాజకీయాలపై ఫోకస్ పెట్టిందని స్పష్టమౌతోంది.  ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో మాజీ మంత్రి తోట త్రిమూర్తులు నేతృత్వంలో జరిగిన వైసీపీ కాపు సామాజిక వర్గాల నాయకుల సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పుట్టించింది. ఈ సమావేశంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో పాల్గొని భవిష్యత్తు కార్యాచరణపై  చర్చించారు. ఈ కాపు శంఖారావం వెనుక బలమైన రాజకీయ వ్యూహం దాగి  ఉందని ప్రముఖ విశ్లేషకుడు భరద్వాజ అన్నారు. తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన కాపు సామాజికవర్గ పాకెట్ ను వేదికగా చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆ సామాజిక వర్గ ఓట్లను ఏకీకృతం చేయాలన్న వ్యూహంతో వైసీపీ ముందుకు సాగుతున్నట్లు విశ్లేషించారు. ఉమ్మడి కోస్తా జిల్లాల్లో, ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గానికి అత్యంత బలమైన పట్టు ఉంది. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కమ్మ సామాజిక వర్గానికి ఎంతటి రాజకీయ, ఆర్థిక ప్రాబల్యం ఉందో, తూర్పుగోదావరిలో కాపులకు అంతటి శక్తి ఉంది. ఈ స్ట్రాంగ్ పాకెట్‌ను వేదికగా చేసుకుని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాపు ఓటు బ్యాంకును వైసీపీ వైపు ఏకీకృతం (Consolidate) చేయడమే కాపు శంఖారావం భేటీ ప్రధాన ఉద్దేశమని భరద్వాజ వివరించారు. గతంలో కాపు సామాజిక వర్గం కోసం పోరాడిన ముద్రగడ పద్మనాభం, హరిరామజోగయ్య వంటి సీనియర్ నేతలు వయోభారం, అనారోగ్య కారణాల వల్ల క్రియాశీల రాజకీయాలకు కొంత దూరంగా జరుగుతున్న తరుణంలో, తోట త్రిమూర్తులు వైసీపీ తరఫున ఈ కొత్త బాధ్యతలను భుజానకెత్తుకున్నట్లు కనిపిస్తోందన్నారు. అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి నేతలతో పోలిస్తే తోట త్రిమూర్తులకు ఉన్న ఆర్థిక బలం,  ఇమేజ్   సమన్వయ శక్తి ఈ వ్యూహానికి ప్రధాన బలంగా మారాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యూహంలో భాగంగా వైసీపీ నేతలు ప్రధానంగా ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తున్నారనీ,  ఇటీవల సాయికృష్ణ మిస్పింగ్ ఉదంతంలో పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరును వైసీపీ కాపు నేతలు తీవ్రంగా తప్పుపట్టడం వెనుక కారణమిదేనని ఆయన అన్నారు. సాయికృష్ణను కేవలం ఒక  రౌడీ షీటర్ గా అభివర్ణిస్తూ పవన్ చేసిన వ్యాఖ్యలను, పోలీసుల వైఫల్యాలను ప్రశ్నించకపోవడాన్ని కాపు సమాజం జీర్ణించుకోలేకపోతోందని వారు ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తానే స్వయంగా  నన్ను కేవలం కాపు నాయకుడిగా చూడొద్దు  అని అంటున్నప్పుడు..  మనం కూడా ఆయన్ను మన నాయకుడిగా గుర్తించాల్సిన అవసరం లేదనే భావనను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లడమే వైసీపీ వ్యూహంగా కనిపిస్తోందనీ,  చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కాపులకు శత్రువేనని, ఇప్పుడు చంద్రబాబుతో అంటకాగుతున్న పవన్ కూడా కాపు వ్యతిరేకిగా మారిపోయాడన్న నేరేషన్ ను బలంగా ముందుకు తీసుకురావడమే వైసీపీ వ్యూహంగా కనిపిస్తోందని భరద్వాజ చెప్పారు.  పూర్వం కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నుండి నలుగుతున్న  కాపులను బీసీల్లో చేర్చే పాత డిమాండ్‌ను చంద్రబాబు గతంలో హామీ ఇచ్చి నెరవేర్చలేదని, ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఆ హామీలపై నిలదీయాలని వైసీపీ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇచ్చాపురం నుండి అనంతపురం వరకు కాపులకు ఏ చిన్న సమస్య వచ్చినా బాధ్యత తీసుకుంటామని వైసీపీ ప్రకటించడం కూడా ఇందులో భాగంగానే చూడాలన్నారు.  అయితే వైసీపీ వ్యూహం కేవలం కాపులకే పరిమితం కాలేదు. సమాంతరంగా దళిత ఓటు బ్యాంకును, మరీ ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు మరో వ్యూహాన్ని అమలు చేస్తోందన్నారు. ఇటీవల విజయవాడలో జరిగిన ఎంఆర్పీఎస్   నాయకుడు పేరుపోగు వెంకటేశ్వరరావు కుమారుడు క్రాంతి కుమార్ ఆత్మహత్య ఉదంతాన్ని వైసీపీ  పోలీసుల వేధింపులకు ముడిపెట్టడం కలకలం రేపిన సంగతి తెలిసిందే.   అప్పటివరకు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటూ, లోకేష్‌తో సైతం మంచి సంబంధాలు ఉన్న వెంకటేశ్వరరావు ఇంటికి వైసీపీ ముఖ్య నేతలు వెళ్లి పరామర్శించడాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. గాజ సాయికృష్ణ ఎపిసోడ్ ద్వారా కాపులను, క్రాంతి కుమార్ ఉదంతం ద్వారా మాదిగ ఓటు బ్యాంకును కూటమి ప్రభుత్వానికి దూరం చేయాలనేది వైసీపీ వ్యూహంగా ఆయన వివరించారు. చంద్రబాబు దళిత వ్యతిరేకి అనే పాత ముద్రను మళ్లీ తెరపైకి తెస్తూ, గత 15 రోజుల్లో విజయవాడ కేంద్రంగా జరిగిన పోలీసు శాఖ వైఫల్యాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాస్త్రాలుగా మార్చుకుంటున్నారు. ఈ విధంగా ఏపీలో మళ్లీ కులాల వారీగా ఓటు బ్యాంకులను ఏకీకృతం చేసేందుకు జగన్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారని భరద్వాజ అన్నారు. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాకినాడ వేదికగా ఇటీవల  జరిగిన 'మా ఊరు - మాటామంతి' కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.  వైసీపీ నేతలను ఉద్దేశించి ఆయన అత్యంత అగ్రెసివ్ టోన్‌లో హెచ్చరికలు జారీ చేశారు. వైసీపీ నాయకులు పరిధులు దాటి మాట్లాడుతున్నారని, భవిష్యత్తులో ఏం జరిగినా వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరికలు జారీ చేశారు.  గత కొన్ని రోజులుగా   సాయికృష్ణ మిస్సింగ్ ఉదంతం నేపథ్యంలో కాపు సామాజిక వర్గ  ఓట్ బ్యాంక్‌ను టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు పేర్ని నాని, అంబటి రాంబాబు చేస్తున్న విమర్శలపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆక్రోశం వెళ్లగక్కారు. తాను కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ, ఒకవేళ భవిష్యత్తులో (రెండేళ్లల్లోనో, మూడేళ్లల్లోనో) వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చినా సరే.. ఒక్కొక్కరిని తొక్కి నారతీస్తానంటూ ఘాటుగా హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. పవన్ కల్యాణ్ వ్యాఖ్యల వేనుక రాజకీయ వ్యూహం ఏమిటన్న దానిపై తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో..ప్రముఖ అనలిస్ట్ భరధ్వాజ లోతైన విశ్లేషణ చేశారు.   పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఒక బలమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోందన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇటీవల జరిగిన సుదీర్ఘ భేటీ తర్వాత పవన్ టోన్ పూర్తిగా మారినట్లు స్పష్టమవుతోంది. తాను కేవలం 21 సీట్లు గెలిచిన ఒక ప్రాంతీయ పార్టీ నేతగా మాత్రమే కాకుండా..  కేంద్రంలోని పెద్దల అండదండలు ఉన్న సుపీరియర్ పొజిషన్‌లో ఉన్నాననే సంకేతాన్ని పవన్   పంపించారన్నారు.  తాను ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన ధోరణి సూచిస్తోందని భరద్వాజ అన్నారు. మరోవైపు, పవన్ కళ్యాణ్ తనను పదేపదే కాపు సామాజిక వర్గానికి మాత్రమే పరిమితం చేయవద్దని వైసీపీ నేతలకు గట్టిగా చెప్పారు. తాను కులాలకు అతీతుడిననీ, ప్రాంతీయవాదానికి అతీతంగా జాతీయ సమగ్రత కోసం పనిచేస్తానని పునరుద్ఘాటించారు. జనసేన పార్టీని ఐదు రాష్ట్రాల్లో విస్తరిస్తున్నామని, రాబోయే రోజుల్లో ఢిల్లీలో జెండా ఎగరేయబోతున్నామని చెప్పడం ద్వారా పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టే యోచనలో ఉన్నట్లు కనిపిస్తోందని భరద్వాజ అన్నారు. అదే జరిగితే.. రాష్ట్రంలో ఆయన సోదరుడు నాగబాబుకు కీలక బాధ్యతలు దక్కే అవకాశం ఉందన్నారు.  ఈ పరిణామాలు కూటమి ప్రభుత్వంలోనూ చర్చకు దారితీస్తున్నాయి. గతంలో హోంమంత్రి అనిత పనితీరుపై పవన్ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నిన్నటి సభలోనూ ఆయన  నేను హోం శాఖ తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉండేవి కానీ నేను తీసుకోను' అని వ్యాఖ్యానించడం విశేషం. ఈ దూకుడు వ్యవహార శైలి    కల్ట్  పవన్ కళ్యాణ్‌ను తలపిస్తోందని, నిస్తేజంగా ఉన్న జనసైనికుల్లో మళ్లీ కొత్త ఉత్సాహాన్ని నింపేందుకే ఆయన ఈ తరహా అగ్రెసివ్ పంథాను ఎంచుకున్నారనీ భరద్వాజ విశ్లేషించారు. 
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో ప్రముఖ సర్వే సంస్థ  యూనికార్న్ పొలిటికల్ స్ట్రాటజీ సంచలన నివేదికను బయటపెట్టింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో బాగానే సాగుతున్నప్పటికీ, ప్రజల్లో ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి గ్రాఫ్ ఆందోళనకరంగా పడిపోయిందని ఈ సర్వే పేర్కొంది. 100 శాతం సంతృప్తి ఆశించిన చోట ప్రభుత్వ ప్రస్తుత రేటింగ్ కేవలం 60 శాతం (5.9 మార్కులు) లోపు మాత్రమే నమోదవ్వడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన యూనికార్న్ పొలిటికల్ స్ట్రాటజీ అధినేత రవి..  కూటమి ప్రభుత్వంలో పరిపాలనా లోపాలు, రాజకీయ సమన్వయ లేమి స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. గతంలో ఆర్టీజీఎస్  వంటి డిజిటల్ వ్యవస్థల ద్వారా లభించిన 80 శాతం ప్రజా సంతృప్తి కేవలం కాగితాలకే పరిమితమైందనీ..  డిజిటల్ కనెక్టివిటీ పెరిగి భౌతిక సంబంధాలు  దెబ్బతినడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తమ సర్వేలో తేలిందని చెప్పారు. కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ సెల్స్‌కు గత ఏడెనిమిదేళ్లుగా ఒకే రకమైన ఫిర్యాదులు రావడం అధికారుల వైఫల్యానికి అద్దం పడుతోందన్నారు.  తమ సర్వేలో ముఖ్యంగా క్యాబినెట్‌లో సీనియర్లు, జూనియర్ల మధ్య ఉన్న సమన్వయ లోపాలు ప్రస్ఫుటంగా బయటపడ్డాయన్నారు. 2024 అధికార మార్పిడి తర్వాత యువ రక్తాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో జూనియర్లకు మంత్రి పదవులు ఇచ్చినప్పటికీ..  వారు జిల్లాల్లో పట్టు సాధించలేకపోతున్నాని తేలిందని చెప్పారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో తలెత్తిన డయేరియా వంటి తీవ్ర ప్రజా సమస్యలను పరిష్కరించే క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లాంటి అగ్రనేతలు వెళ్లినప్పుడు, స్థానిక సీనియర్ నేత కళా వెంకట్రావు వంటి వారి అనుభవాన్ని వాడుకోలేకపోయారని విశ్లేషించారు. సీనియర్ల అనుభవంతో జూనియర్ల ఉత్సాహాన్ని మిక్స్ చేయడంలో ప్రభుత్వం విఫలమైందనే అభిప్రాయం ప్రజలలో వ్యక్తమైందన్నారు.  అటు కడప జిల్లాలో జూనియర్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి లాంటి వారు జిల్లా రాజకీయాలను ప్రభావితం చేయలేకపోతున్నారని, రాయలసీమలో సామాజిక సమతుల్యత లోపించిందని తమ సర్వేలో వెల్లడైందని చెప్పారు.   అలాగే, నెల్లూరు జిల్లాలో తమిళనాడు బోట్ల వివాదం, మత్స్యకారుల ఆందోళనలు, కార్పొరేట్ పాలిటిక్స్ కారణంగా ఇంటర్నల్ డ్యామేజ్ తీవ్రంగా జరుగుతోందనీ.. ఆనం రామనారాయణ రెడ్డి వంటి సీనియర్లను ఇలాంటి సమస్యల పరిష్కారానికి టాస్క్‌గా ఉపయోగించుకోవడంలో ప్రభుత్వం వెనుకబడిందని రవి విశ్లేషించారు. మరోవైపు.. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, లోకేష్‌లపై నమోదైన సీఐడీ కేసుల దర్యాప్తుకు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ వైఫల్యాలను కూడా రవి వివరించారు.  ప్రస్తుతం సీఐడీ విభాగానికి డీజీ ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో సిబ్బంది లేకపోవడం, 13 జిల్లాల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు లేకపోవడం, గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన ఐఓలు (ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్) ఇప్పుడు  కేసులను క్లోజ్ చేసేలా నివేదికలు ఇవ్వడం వంటివి కూటమి శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తిని రగిలిస్తున్నాయనిరవి విశ్లేషించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి రవిశంకర్ అయ్యన్నార్ లాంటి సమర్థులను సరైన స్థానాల్లో ఉపయోగించుకోకపోవడం, రిటైర్డ్ అధికారులకు ఎక్స్టెన్షన్స్ ఇవ్వడం వల్ల క్రింది స్థాయి అధికారుల ప్రమోషన్లు ఆగిపోయి డిపార్ట్‌మెంట్‌లో నైరాశ్యం అలుముకుందని సర్వే స్పష్టం చేసింది. ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం కేవలం సంక్షేమ పథకాల ఆధారంగానే బండి లాగిస్తోందనీ, రాజకీయంగా ఎదురవుతున్న అంతర్గత సవాళ్లను చల్లార్చడంలో విఫలమవుతోందని తన సర్వే నివేదిక తేటతెల్లం చేసిందని రవి చెప్పారు.  రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ఆపై 2029 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయి కార్యకర్తలను బలోపేతం చేసుకోకపోతే, ఈ రేటింగ్స్ మరింత దిగజారి ప్రభుత్వానికి ప్రమాద ఘంటికలు మోగడం ఖాయమనీ,  సీఎం చంద్రబాబు నాయుడు ఆశిస్తున్న 100 శాతం టాప్ ర్యాంక్ సాధించాలంటే కేవలం "పాస్ మార్కులు" సరిపోవని, తక్షణమే పరిపాలన, రాజకీయ సమన్వయంలో సమూల మార్పులు చేయాలని తమ సర్వే నివేదికలో తేలిందని   యూనికార్న్ పొలిటికల్ స్ట్రాటజీ అధినేత రవి స్పష్టం చేశారు. 
ALSO ON TELUGUONE N E W S
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘సలార్: శౌర్యాంగ పర్వం’ (సలార్ 2) గురించి ఫిలిం నగర్ వర్గాల్లో ఒక మైండ్ బ్లోయింగ్ న్యూస్ హల్‌చల్ చేస్తోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాలో డార్లింగ్ ప్రభాస్ సరికొత్త రికార్డులు సృష్టించేందుకు రెడీ అవుతున్నారు. ఈ భారీ సీక్వెల్‌లో ప్రభాస్ ద్విపాత్రాభినయం (డబుల్ రోల్) చేయబోతున్నారనే ప్రచారం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ‘బాహుబలి’ చిత్రంలో అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలిగా తండ్రీకొడుకుల పాత్రల్లో ప్రభాస్ కనబరిచిన నటన, పండించిన ఎమోషన్స్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయాయి. ఇప్పుడు దాదాపు అదే తరహా మ్యాజిక్‌ను సలార్ సీక్వెల్‌లో కూడా రిపీట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మొదటి భాగం ‘సలార్: సీజ్‌ఫైర్’ లో కేవలం కొడుకైన దేవా పాత్రలోనే కనిపించి థియేటర్లలో మాస్ పూనకాలు తెప్పించిన ప్రభాస్, రెండో భాగంలో మరో పవర్‌ఫుల్ రోల్‌తో సర్ప్రైజ్ చేయబోతున్నారట. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. సలార్ 2 లో దేవా క్యారెక్టర్‌తో పాటు అతని తండ్రి అయిన ‘ధారా’ అనే సరికొత్త పాత్రను ప్రశాంత్ నీల్ కథలోకి తీసుకురానున్నారు. ఖాన్సార్ సామ్రాజ్యంలో శౌర్యాంగ వంశానికి జరిగిన అన్యాయం, దానికి మూలపురుషుడైన ధారా ఎలాంటి ప్రతిఘటన ఇచ్చాడనే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ సినిమాలో హైలైట్‌గా నిలవనున్నాయట. ఈ తండ్రి పాత్రలో ప్రభాస్ అత్యంత రగ్గడ్, రూత్‌లెస్ గ్యాంగ్‌స్టర్ లుక్‌లో కనిపించబోతున్నారని, వింటేజ్ మాస్ ఎలిమెంట్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయని ఇండస్ట్రీ టాక్. ఇక ఈ సినిమా బ్యాక్‌గ్రౌండ్ విషయానికి వస్తే, మొదటి భాగం ముగింపులో దేవా అసలైన శౌర్యాంగ వారసుడనే భారీ ట్విస్ట్‌తో దర్శకుడు కథపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లారు. కేజీఎఫ్ సిరీస్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్, సలార్ పార్ట్ 1 తో కూడా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించారు. ఈ క్రమంలోనే సీక్వెల్ స్క్రిప్ట్‌ను మరింత పకడ్బందీగా, తండ్రీకొడుకుల మధ్య ఉండే ఎమోషనల్ సెంటిమెంట్ మరియు రివెంజ్ డ్రామా చుట్టూ అద్భుతంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ గాసిప్ బయటకు రావడంతో సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా మొదలైంది. బాహుబలి లాంటి సెంటిమెంట్ అండ్ యాక్షన్ వర్కవుట్ అయితే సలార్ 2 బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. శౌర్యాంగ వంశ గౌరవాన్ని కొడుకు ఎలా తిరిగి తెచ్చాడనే పాయింట్ థియేటర్లలో ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించడం గ్యారెంటీ అని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ సలార్ 2 తో పాటు మరికొన్ని క్రేజీ సినిమాలను లైన్‌లో పెట్టారు. త్వరలోనే ఈ సీక్వెల్ కి సంబంధించిన మరిన్ని అఫీషియల్ అప్‌డేట్స్, షూటింగ్ షెడ్యూల్స్ మరియు రిలీజ్ డేట్ వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
టాలీవుడ్ దివంగత నటుడు, రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్‌ శ్రీహరి సరికొత్త యాక్షన్ ప్యాక్డ్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త చిత్రం ‘స్టూడెంట్’. విలక్షణమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. సోషల్ మీడియాలో ఈ సరికొత్త లుక్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఈ ఇంటెన్స్ పోస్టర్‌లో మేఘాంశ్‌ శ్రీహరి ఊరమాస్ అవతారంలో మెరిశారు. ఒక సాధారణ విద్యార్థి జీవితంలో ఉండే విభిన్న కోణాలను ప్రతిబింబించేలా ఈ పోస్టర్‌ను చాలా క్రియేటివ్‌గా డిజైన్ చేశారు. పవర్ స్టార్ సినిమా బ్యానర్లు కట్టడం, కాలేజీ క్లాస్ రూమ్‌లోని జామెట్రీ బాక్స్ డివైడర్‌ను చదువుకు కాకుండా గొడవల్లో ఆయుధంగా వాడటం, కాలిపోయిన సిగరెట్ ముక్కలు, ప్రేమలేఖలు వంటి ఎలిమెంట్స్‌ను ఈ పోస్టర్‌లో చూపించి సినిమాపై అంచనాలను పెంచేశారు. పోస్టర్‌పై ఉన్న డైలాగ్స్ కూడా సినిమాలోని యాక్షన్, లవ్ ఎలిమెంట్స్‌ను హింట్ ఇస్తున్నాయి. “ధైర్యం ఉన్నవాడే తన వెంట అందరూ నడిచేలా చేసుకుంటాడు” అనే కొటేషన్ హీరో క్యారెక్టరైజేషన్‌లోని సాహసాన్ని చూపిస్తుండగా.. “ఈ భాను గాడు అంతా చూసుకుంటాడు, నువ్వు లవ్ చేయి; తన్మయి లవ్స్ భాను” అనే లైన్స్ కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే బలమైన ప్రేమకథను సూచిస్తున్నాయి. చిత్రంలో మేఘాంశ్‌ సరసన విజేత పరీక్ హీరోయిన్‌గా నటిస్తోంది. గతంలో 'రాజ్‌దూత్', 'కోతి కొమ్మచ్చి' వంటి చిత్రాలతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మేఘాంశ్‌.. ఈసారి పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్‌తో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. బాలు తత్వమసి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను జోవికా సినిమాస్, చెరిష్ మీడియా వర్క్స్ పతాకాలపై బెల్లం సిద్ధారెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. బెల్లం సంతోష్, బెల్లం బయ్యారెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సరికొత్త లుక్ చూసిన నందమూరి, మెగా, ఇంకా రియల్ స్టార్ శ్రీహరి అభిమానులు సోషల్ మీడియాలో పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. తండ్రికి తగ్గ వారసుడిగా మేఘాంశ్‌ ఈ సినిమాతో గట్టి కంబ్యాక్ ఇవ్వడం ఖాయమని, ఈ 'మెంటల్ మాస్ తుఫాన్' బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుందని కామెంట్స్ పెడుతున్నారు. టాలీవుడ్ సర్కిల్స్‌లో కూడా ఈ ఫస్ట్ లుక్ మంచి బజ్‌ క్రియేట్ చేసింది. ఈ ‘స్టూడెంట్’ చిత్రం మేఘాంశ్‌ శ్రీహరి కెరీర్‌లోనే ఒక ల్యాండ్‌మార్క్ మూవీగా నిలుస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్ పరంగా కూడా ఎక్కడా రాజీ పడకుండా దీపక్ భూపతి ఆధ్వర్యంలో వీఎఫ్ఎక్స్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టీజర్, ట్రైలర్ మరియు రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్స్ త్వరలోనే మేకర్స్ అధికారికంగా వెల్లడించనున్నారు.
తమిళ చిత్ర పరిశ్రమతో పాటు సౌత్ ఇండియాలోనే మోస్ట్ క్రేజీ కపుల్‌గా ముద్రపడ్డ దళపతి విజయ్, గ్లామర్ క్వీన్ త్రిషల లవ్ రూమర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఈ జోడీ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లకు ఒక పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చింది. తమిళనాడు ముఖ్యమంత్రిగా, రాజకీయ నాయకుడిగా బిజీగా ఉన్న విజయ్ జన్మదినాన్ని పురస్కరించుకుని త్రిష పెట్టిన ఒక స్పెషల్ పోస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నిజానికి విజయ్ పుట్టినరోజు జూన్ 22వ తేదీన జరగగా, అందాల భామ త్రిష ఒక రోజు ఆలస్యంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడం గమనార్హం. "ప్రతి విషయాన్ని ఎంతో విలువైనదిగా మార్చే ప్రత్యేకమైన వ్యక్తికి జన్మదిన శుభాకాంక్షలు" అంటూ త్రిష తన సామాజిక మాధ్యమ ఖాతాలో ఒక అద్భుతమైన క్యాప్షన్‌తో పోస్ట్ పెట్టింది. అయితే ఈ పోస్ట్‌కు కొద్ది గంటల ముందే ఆమె విజయ్‌ను సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేయడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఒకే రోజులో అటు అన్‌ఫాలో చేయడం, ఇటు వెంటనే అత్యంత ఆత్మీయంగా బర్త్‌డే విషెస్ చెప్పడంతో అభిమానులు తీవ్ర గందరగోళంలో పడ్డారు. వీరిద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా లేక ఇదంతా కేవలం ప్రచారంలో భాగంగానే చేస్తున్నారా అనే చర్చలు కోలీవుడ్‌లో ఊపందుకున్నాయి. గతంలో కూడా విజయ్ పుట్టినరోజున వీరిద్దరూ కలిసి ఉన్న ప్రైవేట్ ఫొటోలను షేర్ చేసి త్రిష పెద్ద దుమారమే రేపింది. ప్రస్తుతం విజయ్ సినిమాలకు స్వస్తి చెప్పి పూర్తిస్థాయి రాజకీయాల్లో నిమగ్నమవగా, త్రిష మాత్రం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన సోషియో ఫాంటసీ చిత్రం 'విశ్వంభర'లో నటిస్తోంది. ఈ క్రేజీ అప్‌డేట్స్ మధ్యే త్రిష చేసిన ఈ తాజా బర్త్‌డే పోస్ట్ ఇరు వర్గాల అభిమానులను అలరిస్తూ సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌గా నిలిచింది.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో, టాలెంటెడ్ డైరెక్టర్ ఆర్‌జే బాలాజీ కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్ డ్రామా 'కరుప్పు' (తెలుగులో 'వీరభద్రుడు'). థియేటర్లలో భారీ వసూళ్లు సాధించిన ఈ బ్లాక్‌బస్టర్ చిత్రం ఇటీవల ఓటీటీ వేదికగా డిజిటల్ ప్రీమియర్ జరుపుకుంది. అయితే, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ ప్రారంభమైనప్పటి నుండి కొన్ని కీలక సీన్లలో కనిపించిన వీఎఫ్‌ఎక్స్ (విజువల్ ఎఫెక్ట్స్) లోపాలపై నెట్టింట విపరీతమైన చర్చ జరుగుతోంది. ఈ ట్రోల్స్ అండ్ నెగెటివిటీపై దర్శకుడు ఆర్‌జే బాలాజీ తాజాగా స్పందించారు. సినిమాలో గ్రాఫిక్స్ పరంగా కొన్ని లోపాలు ఉన్న మాట వాస్తవమేనని ఆయన బహిరంగంగా అంగీకరించారు. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయినందుకు, ముఖ్యంగా ఓటీటీ వీక్షకులకు ఆశించిన అనుభూతిని ఇవ్వనందుకు ఆయన సూర్య అభిమానులకు, సినీ ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పారు. ఈ సాంకేతిక లోపాలకు గల కారణాలను వివరిస్తూ.. హెడ్ రీప్లేస్‌మెంట్ వంటి క్లిష్టమైన గ్రాఫిక్స్ షాట్స్ పర్‌ఫెక్ట్‌గా రావడానికి కనీసం ఎనిమిది నెలల సమయం పడుతుందని బాలాజీ తెలిపారు. దీనికోసం విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలకు ముందే భారీగా అడ్వాన్స్ పేమెంట్స్ చేయాల్సి ఉంటుందని, అయితే కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు, ప్రొడక్షన్ డెడ్‌లైన్స్ కారణంగా అనుకున్న సమయానికి బడ్జెట్ సర్దుబాటు చేయలేకపోయామని ఆయన వెల్లడించారు. ఈ క్రమంలోనే 'సింగం' ఫైట్ సీక్వెన్స్ వంటి కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో కొన్ని రాజీలు పడాల్సి వచ్చిందని, అందుకే అవుట్‌పుట్ ఆశించిన స్థాయిలో రాలేదని ఆయన నిజాయితీగా ఒప్పుకున్నారు. థియేటర్లలో ఉన్న మాస్ ఎలిమెంట్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, క్రౌడ్ రెస్పాన్స్ వల్ల ప్రేక్షకులు ఈ చిన్న చిన్న లోపాలను పెద్దగా గమనించలేదని, కానీ ఓటీటీలో చిన్న స్క్రీన్లపై చూసేటప్పుడు ఈ వీఎఫ్‌ఎక్స్ తప్పులు స్పష్టంగా బయటపడ్డాయని పేర్కొన్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంలో సూర్య సరసన త్రిష కథానాయికగా నటించగా, సాయి అభ్యంకర్ సంగీతం అందించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సూర్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అయినప్పటికీ సాంకేతిక లోపాలను వెనకేసుకురాకుండా దర్శకుడు సారీ చెప్పడం విశేషం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆర్‌జే బాలాజీ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. తప్పులను సాకులు చెప్పకుండా ధైర్యంగా ఒప్పుకున్నందుకు నెటిజన్లు, ఇండస్ట్రీ వర్గాలు ఆయన నిజాయితీని అభినందిస్తున్నారు. భవిష్యత్తు ప్రాజెక్ట్‌లలో ఇలాంటి పొరపాట్లు జరగకుండా పక్కా ప్లానింగ్‌తో వస్తానని బాలాజీ ప్రామిస్ చేశారు. ఈ 'కరుప్పు' అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్న బాలాజీ, తన తదుపరి భారీ చిత్రానికి వీఎఫ్‌ఎక్స్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పీరియాడిక్ లేదా హై-బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ కొత్త ప్రాజెక్ట్ గురించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా వెలువడే అవకాశం ఉంది.
వెండితెరపై మెరిసే స్టార్ల పర్సనల్ లైఫ్స్ గురించి, ముఖ్యంగా వారి పిల్లల పెంపకం మరియు జీవనశైలి గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఎప్పుడూ తెగ ఆరాటపడుతుంటారు. ఈ క్రమంలో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ వారసులు అకీరా నందన్, ఆద్యలకు సంబంధించిన ఏ చిన్న అప్‌డేట్ అయినా క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. తాజాగా రేణు దేశాయ్ తన పిల్లల ఆహారపు అలవాట్లు, వారి ఎదుగుదల వెనుక ఉన్న ఆసక్తికరమైన నిజాలను పంచుకున్నారు. సాధారణంగా నాన్‌వెజ్ తింటేనే పిల్లలు బలంగా, పొడవుగా పెరుగుతారనే ఒక బలమైన నమ్మకం చాలామందిలో ఉంటుంది. అయితే ఈ ఆలోచన ముమ్మాటికీ తప్పు అని రేణు దేశాయ్ ఉదాహరణలతో సహా స్పష్టం చేశారు. చిన్నప్పుడు తన పిల్లలకు మాంసాహారం పెట్టకపోవడం చూసి చాలామంది ప్రశ్నించేవారని ఆమె గుర్తుచేసుకున్నారు. కానీ తామంతా పక్కా వెజిటేరియన్స్ అయినా.. తన ఎత్తు 5.8 అడుగులు, కూతురు ఆద్య 5.11 అడుగులు, అలాగే అకీరా ఏకంగా 6.4 అడుగుల ఎత్తుతో ఉన్నారని పేర్కొంటూ, ఎదుగుదలకు సమతుల్యమైన పౌష్టికాహారమే ప్రధాన కారణమని తేల్చిచెప్పారు. పిల్లలను క్రమశిక్షణతో కూడిన వాతావరణంలో పెంచినట్లు తెలిపిన రేణు.. తమ ఇంట్లో జంక్ ఫుడ్‌కు అస్సలు చోటుండదని వివరించారు. నెలకు కేవలం ఒక్కసారి మాత్రమే మ్యాగీ నూడుల్స్ వండిపెట్టేదాన్ని అని, అది కూడా పిల్లలకు ఒక పెద్ద పండగలా అనిపించేదని అన్నారు. మిగతా రోజుల్లో కేవలం ఇంట్లో వండే సాంప్రదాయ పప్పు, అన్నం, కూరలు, పచ్చడి వంటి సాధారణ భోజనమే వారి మెనూలో తప్పనిసరిగా ఉండేదని చెప్పుకొచ్చారు. సెలబ్రిటీలు అనగానే ఇంట్లో వంట చేయరని చాలామంది అనుకుంటారని, కానీ తాను స్వయంగా వండిన వంటలను అకీరా, ఆద్య అమితంగా ఇష్టపడతారని రేణు తెలిపారు. ముఖ్యంగా తను చేసే 'సోయా బిర్యానీ' అంటే అకీరాకు ఎంతో ఇష్టమని వెల్లడించారు. తాము పూర్తిగా వెజిటేరియన్ లైఫ్‌స్టైల్‌ను ఫాలో అవుతున్నామని, పిల్లలు కూడా ఎలాంటి ఒత్తిడి లేకుండా వారి సొంత ఇష్టంతోనే ఈ శాకాహార జీవనశైలిని ఎంచుకోవడం విశేషమని ఆమె గర్వంగా పంచుకున్నారు. ప్రస్తుత రోజుల్లో స్టార్ కిడ్స్ అనగానే పిజ్జాలు, బర్గర్లు, ఫాస్ట్ ఫుడ్స్ సంస్కృతికి అలవాటు పడతారనే భావన ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ పిల్లలు ఇంత సింపుల్ ఫుడ్ తింటూ, పక్కా లోకల్ డైట్‌తో అంత ఎత్తు పెరగడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రేణు దేశాయ్ పెంపకాన్ని, ఆమె చెప్పిన హెల్తీ డైట్ టిప్స్‌ను మెగా అభిమానులు ప్రశంసిస్తూ సోషల్ మీడియా వేదికగా విపరీతంగా షేర్ చేస్తున్నారు.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
ఈ రోజుల్లో ప్రేమలు, వివాహ బంధాలు ఎందుకు ఎక్కువగా విఫలమవుతున్నాయి? ప్రేమలో నమ్మకం, పరస్పర అవగాహన, స్వేచ్ఛ ఎంత ముఖ్యమో ఈ వీడియోలో సి. కళ్యాణ్ వివరంగా చర్చించారు. బ్రేకప్‌ల వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి? బంధాలను బలంగా నిలబెట్టుకోవడానికి ఏం చేయాలి? వంటి అంశాలపై ఆసక్తికరమైన విశ్లేషణను తెలుసుకోండి.
ఆలోచన ఒక అవసరానికి ముడివడకుండా ఉన్నంతవరకూ దానికి అర్ధవంతమైన గెలుపు ఉండదు. చాలా మందిలో ఆలోచన అనే ఒక బెరడు, జీవిత సాగరంలో దానికదే తేలిపోతూ ఉంటుంది. లక్ష్యం లేని ఆలోచన ఒక దుర్గుణం. ఆలోచనలను ఆలా తేలిపోనివ్వకూడదు. లక్ష్యం లేని ఆలోచనల వలన చివరకు జరిగేది విధ్వంసమే. ఒక లక్ష్యం లేకుండా జీవించే వారు తేలికగా ఆందోళన, భయం, కష్టాలు నిర్వేదాల ఉచ్చులో పడతారు. ఈ బలహీనతలన్నీ ఖచ్చితంగా జరిగే ఒక పాపపు ప్రణాళికలా  ఓటమికీ, దుఃఖానికీ మరియూ నష్టానికీ దారి తీస్తాయి. ఎందుకంటే శక్తి ఆధారంగా పరిణతి చెందే ఈ విశ్వంలో బలహీనతకి చోటు లేదు. ఒక మనిషి తన హృదయంలో ఒక ఆశయాన్ని కలిగి ఉండి, దానిని చేరుకునేవరకూ పరితపించాలి. ఆ ఆశయాన్ని లేదా లక్ష్యాన్ని తన ఆలోచనల కేంద్రబిందువుగా చేసుకోవాలి. సమయ సందర్భాలను బట్టి, ఆ లక్ష్యం ఆధ్యాత్మిక ఆశయం కావచ్చు, లేదా ప్రాపంచిక విషయం కావచ్చు. అది ఏదైనప్పటికీ తన ఆలోచనాశక్తినంతా దాని మీదే పూర్తిగా లగ్నం చేయాలి. దానినే అతని పరమ విధిగా భావించి వేరే ఇతర వ్యాపకాల పట్ల కోరికల పట్ల, ఊహల పట్ల మనస్సుని పోనివ్వకుండా తదేక దీక్షతో సాధించే వరకూ శ్రమించాలి. ఇదే ఆత్మ నిగ్రహానికి మరియూ నిజమైన ఏకాగ్రతకు రాజమార్గం. ఒక వేళ లక్ష్య సాధనలో మరలా మరలా ఓడిపోయినా (బలహీనతలను అధిగమించేవరకూ ఓటమి ఎలాగూ తప్పదు), వ్యక్తి శీలంలో అభివృద్ధి కనిపిస్తే అది విజమైన విజయానికి ఒక నిదర్శనం, భవిష్యత్తులో సాధించబోయే విజయానికి ఈ ఓటమి ఒక మెట్టులా, ఒక శక్తిలా పనిచేస్తుంది. ఉన్నత లక్ష్యం గురించి ఆదుర్దా వద్దనుకునే వ్యక్తులు చేసేది ఎంత చిన్న పనైనా సరే, దానికి ఏమాత్రం విలువలేదనిపించినా సరే, ఎటువంటి అవకతవకలు లేకుండా తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలనే దాని మీదనే తమ ధ్యాసంతా ఉంచాలి. కేవలం ఈ విధంగానే ఆలోచనలను వృద్ధి చేసుకున్నప్పుడు అవి మరింత శక్తివంతంగా మారి లక్ష్యసాధనలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చేస్తాయి. శక్తిని వృద్ధి చేసుకునే ఏకైక మార్గం ఎడతెగని కృషి మరియూ సాధన మాత్రమే అని తెలుసుకుని, దానిని నమ్మిన మరుక్షణం, అతి బలహీనమైన వ్యక్తి అయినా సరే కష్టించి పనిచేయడం ప్రారంభిస్తాడు. కృషికి కృషినీ, ఓర్పుకి ఓర్పునీ, శక్తికి శక్తినీ జోడిస్తూ ఉంటే, వ్యక్తి అభివృద్ధి ఇక ఆగదు. అలా ఎదుగుతూ చివరకు ఎంతో దివ్యమైన శక్తిగా మారుతుంది. శారీరకంగా బలహీనంగా ఉన్న వ్యక్తి సహనంతో జాగ్రత్తగా సాధన చేస్తే ఎలా శక్తివంతంగా తయారవుతాడో అలాగే బలహీనమైన ఆలోచనలు కలిగిన వ్యక్తి సరైన ఆలోచనల వలన మానసికంగా శక్తివంతంగా తయారుకాగలడు. నిర్లక్ష్యాన్ని, బలహీనతనూ దూరంగా ఉంచి, ఒక లక్ష్యం వైపు ఆలోచించడం మొదలుపెట్టడమంటే, ఓటమిని కూడా లక్ష్య సాధనలో ఒక భాగంగా పరిగణించే శక్తివంతులుగా మారడమే. అటువంటి వ్యక్తులు శక్తివంతంగా ఆలోచించి, భయంలేకుండా అడుగు ముందుకేసి, ఎటువంటి పరిస్థితినైనా తమకు అనువుగా మార్చుకుని విజయాన్ని సొంతం చేసుకుంటారు. వ్యక్తి తన లక్ష్యాన్ని నిర్ణయించుకున్న తర్వాత దాన్ని చేరుకునే మార్గాన్ని మానసికంగా ఎంచుకుని దిక్కులు చూడకుండా ఋజుమార్గంలో పయనించాలి. అనుమానాలను, భయాలనూ పూర్తిగా తుడిచిపెట్టెయ్యాలి.  ఎందుకంటే అవి నాశనానికి కారకాలు, కృషి అనే దారిని మళ్ళించి వ్యక్తిని ప్రభావరహితంగా పనికిమాలినవిధంగా తయారుచేయగలవు. అనుమానం, భయం ఎప్పుడూ ఏదీ సాధించింది లేదు, ఎప్పుడూ సాధించలేవు కూడా. అవి ఎప్పుడూ ఓటమికే దారి తీస్తాయి. అవి చేరిన వెంటనే లక్ష్యం, బలం, శక్తి, సంకల్ప శక్తి అన్నీ పనిచేయడం ఆగిపోతాయి. ఏదైనా పని చేయగలమనే జ్ఞానం నుంచే చేయాలనే సంకల్పం పుట్టుకొస్తుంది. అనుమానం, భయం జ్ఞానానికి బద్ధ శత్రువులు. వాటిని చంపేయకుండా ఇంకా ఉత్సాహపరిచే వారు ప్రతి అడుగులోనూ ఇబ్బందికి గురవుతారు. అనుమానాన్నీ, భయాన్నీ జయించినవాడు ఓటమిని కూడా జయిస్తాడు. అతని ప్రతి ఆలోచన, శక్తితో కూడుకుని ఉంటుంది, అతడు ప్రతి కష్టాన్నీ వివేకంతో మరియూ ధైర్యంతో ఎదుర్కొని జయించగలడు. నిర్భయమైన ఆలోచనకు ఒక నిర్దిష్టమైన లక్ష్యం తోడైతే అది సృజనాత్మక శక్తిగా మారుతుంది. ఈ విషయం తెలిసిన వ్యక్తి ఊగిసలాడే ఆలోచనలతో మరియూ కొట్టుమిట్టాడే వాతావరణంతో ఉండే ఒక బుడగలా కాకుండా, పరిస్థితికి ఉన్నతంగా శక్తివంతంగా మారేదానికి సంసిద్ధమవుతాడు. ఈ విషయం తెలుసుకున్న వ్యక్తి తన మానసిక శక్తులను స్పృహతో మరియూ తెలివితేటలతో సమర్ధవంతంగా వాడుకోగలుగుతాడు.                                  ◆నిశ్శబ్ద.
ప్రేమ,  సహజీవనం, పెళ్లి.. ఏదైనా కావచ్చు.. అమ్మాయిలు అబ్బాయిలతో రిలేషన్ లో ఉండటం నేటి కాలంలో జరుగుతోంది.  రిలేషన్ లో ఉన్నప్పుడు అమ్మాయిలు తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు.  వీటి కారణంగానే ఆ తరువాత చాలా బాధపడతారు కూడా. ఈ తప్పుల వల్ల బంధాలు చెడిపోవడం, విచ్చిన్నం కావడం, ఆఖరుకు ఆ బంధం ముగిసిపోవడం వంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. రిలేషన్ లో ఉన్న ఎంతో మంది అమ్మాయిలు చేసే తప్పులు ఏంటో తెలుసుకుంటే.. అది కొంతమందికి అయినా ఆలోచించే అవకాశాన్ని,  తప్పు జరగకుండా జాగ్రత్త పడే అవకాశాన్ని ఇచ్చినట్టు అవుతుంది.  రిలేషన్ లో ఉండే అమ్మాయిలు చేసే తప్పులు ఏమిటో తెలుసుకుంటే.. తొందరపాటు.. ప్రేమ, సహజీవనం,  పెళ్లి.. ఇలా ఏ బంధంలో అయినా  మహిళలు ఒక కొత్త బంధానికి త్వరగా కట్టుబడిపోతారు. ఏ సంబంధమైనా బలంగా అభివృద్ధి చెందడానికి సమయం పడుతుంది. కానీ మహిళలు మాత్రం చాలా తొందరగా ఆ బంధానికి స్టిక్ అయిపోతారు.  అవగాహన లేకుండా జరిగే ఈ తొందరపాటు వల్ల  భవిష్యత్తులో  చాలా సమస్యలు వస్తాయి.  మొదట్లో తాము అనుకున్నట్టు, తరువాత లేదని అనుకోవడం,  పరిస్థితులు విభిన్నంగా మారడం.. ఇలా చాలా విషయాలు ఆ తరువాత బంధాన్ని విచ్చిన్నం చేసే దిశగా సాగుతాయి.  ప్రాధాన్యత.. మహిళలు ఏ సంబంధంలోనైనా చాలా భావోద్వేగంగా ఉంటారు.  తరచుగా తమ అవసరాల కంటే తమ భాగస్వామి అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ అలవాటు కారణంగా, సంబంధంలో తమకు తాము ప్రియారిటీ ఇచ్చుకోవడం కూడా మరిచిపోతారు.  ఇధి ఇలాగే కొనసాగితే.. బంధంలో భాగస్వామి తప్ప వారు ఎప్పటికీ కనిపించరు.  సింపుల్ గా చెప్పాలంటే తమను తాము కోల్పోతారు. ఇదే తర్వాత వారి బాధకు కారణం అవుతుంది. ఎమోషనల్ డిపెండింగ్.. చాలా మంది మహిళలు ఎప్పుడూ భావోద్వేగపరంగా తమ  భాగస్వామి మీద ఆధారపడతారు, తమ సంతోషాన్ని, తమకు కావలసిన ఓదార్పును,  తన ఇష్టాలను అన్నింటిని తమ భాగస్వామి ద్వారానే పొందుతారు.  ఇందులో తప్పు లేదు. భాగస్వామి కూడా భావోద్వేగపరంగా అంతే అనుభూతి చెందించే పర్లేదు.. కానీ  భావోద్వేగ మద్దతు కోసం పూర్తిగా  భాగస్వామిపై ఆధారపడటం  తప్పు. ఈ అలవాటు  భాగస్వామిపై ఒత్తిడిని కలిగించి సంబంధం విచ్ఛిన్నం కావడానికి దారితీయవచ్చు. ఎంపిక.. చాలా వరకు మహిళలు సంబంధాలలో తమ సొంత ఇష్టాలను పక్కన పెడతారు. తమ భాగస్వామికి అవి నచ్చవనే కారణంతో వారు తమ అభిరుచులను, అవసరాలను నిర్లక్ష్యం చేస్తారు. అలా చేయడం  సంబంధానికి మంచిది కాదు. అది సంబంధం విచ్ఛిన్నం కావడానికి దారితీయవచ్చు.  ఎవరి కోసమూ  అభిరుచులను, ఇష్టాలను వదులుకోకూడదు. లేకపోతే రేపటి రోజు చెప్పుకోవడానికి ఇష్టం,  చేయడానికి అభిరుచి వంటివి ఏమీ లేకుండా చుట్టూ శూన్యం ఉన్నట్టు అనిపిస్తుంది.                                              *రూపశ్రీ.
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల సమీకరణాలు  మరోసారి చర్చనీయాంశంగా మారాయి. సార్వత్రిక ఎన్నికల అనంతర పరిణామాలను గమనిస్తే.. వైసీపీ కుల రాజకీయాలపై ఫోకస్ పెట్టిందని స్పష్టమౌతోంది.  ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో మాజీ మంత్రి తోట త్రిమూర్తులు నేతృత్వంలో జరిగిన వైసీపీ కాపు సామాజిక వర్గాల నాయకుల సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పుట్టించింది. ఈ సమావేశంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో పాల్గొని భవిష్యత్తు కార్యాచరణపై  చర్చించారు. ఈ కాపు శంఖారావం వెనుక బలమైన రాజకీయ వ్యూహం దాగి  ఉందని ప్రముఖ విశ్లేషకుడు భరద్వాజ అన్నారు. తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన కాపు సామాజికవర్గ పాకెట్ ను వేదికగా చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆ సామాజిక వర్గ ఓట్లను ఏకీకృతం చేయాలన్న వ్యూహంతో వైసీపీ ముందుకు సాగుతున్నట్లు విశ్లేషించారు. ఉమ్మడి కోస్తా జిల్లాల్లో, ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గానికి అత్యంత బలమైన పట్టు ఉంది. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కమ్మ సామాజిక వర్గానికి ఎంతటి రాజకీయ, ఆర్థిక ప్రాబల్యం ఉందో, తూర్పుగోదావరిలో కాపులకు అంతటి శక్తి ఉంది. ఈ స్ట్రాంగ్ పాకెట్‌ను వేదికగా చేసుకుని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాపు ఓటు బ్యాంకును వైసీపీ వైపు ఏకీకృతం (Consolidate) చేయడమే కాపు శంఖారావం భేటీ ప్రధాన ఉద్దేశమని భరద్వాజ వివరించారు. గతంలో కాపు సామాజిక వర్గం కోసం పోరాడిన ముద్రగడ పద్మనాభం, హరిరామజోగయ్య వంటి సీనియర్ నేతలు వయోభారం, అనారోగ్య కారణాల వల్ల క్రియాశీల రాజకీయాలకు కొంత దూరంగా జరుగుతున్న తరుణంలో, తోట త్రిమూర్తులు వైసీపీ తరఫున ఈ కొత్త బాధ్యతలను భుజానకెత్తుకున్నట్లు కనిపిస్తోందన్నారు. అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి నేతలతో పోలిస్తే తోట త్రిమూర్తులకు ఉన్న ఆర్థిక బలం,  ఇమేజ్   సమన్వయ శక్తి ఈ వ్యూహానికి ప్రధాన బలంగా మారాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యూహంలో భాగంగా వైసీపీ నేతలు ప్రధానంగా ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తున్నారనీ,  ఇటీవల సాయికృష్ణ మిస్పింగ్ ఉదంతంలో పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరును వైసీపీ కాపు నేతలు తీవ్రంగా తప్పుపట్టడం వెనుక కారణమిదేనని ఆయన అన్నారు. సాయికృష్ణను కేవలం ఒక  రౌడీ షీటర్ గా అభివర్ణిస్తూ పవన్ చేసిన వ్యాఖ్యలను, పోలీసుల వైఫల్యాలను ప్రశ్నించకపోవడాన్ని కాపు సమాజం జీర్ణించుకోలేకపోతోందని వారు ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తానే స్వయంగా  నన్ను కేవలం కాపు నాయకుడిగా చూడొద్దు  అని అంటున్నప్పుడు..  మనం కూడా ఆయన్ను మన నాయకుడిగా గుర్తించాల్సిన అవసరం లేదనే భావనను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లడమే వైసీపీ వ్యూహంగా కనిపిస్తోందనీ,  చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కాపులకు శత్రువేనని, ఇప్పుడు చంద్రబాబుతో అంటకాగుతున్న పవన్ కూడా కాపు వ్యతిరేకిగా మారిపోయాడన్న నేరేషన్ ను బలంగా ముందుకు తీసుకురావడమే వైసీపీ వ్యూహంగా కనిపిస్తోందని భరద్వాజ చెప్పారు.  పూర్వం కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నుండి నలుగుతున్న  కాపులను బీసీల్లో చేర్చే పాత డిమాండ్‌ను చంద్రబాబు గతంలో హామీ ఇచ్చి నెరవేర్చలేదని, ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఆ హామీలపై నిలదీయాలని వైసీపీ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇచ్చాపురం నుండి అనంతపురం వరకు కాపులకు ఏ చిన్న సమస్య వచ్చినా బాధ్యత తీసుకుంటామని వైసీపీ ప్రకటించడం కూడా ఇందులో భాగంగానే చూడాలన్నారు.  అయితే వైసీపీ వ్యూహం కేవలం కాపులకే పరిమితం కాలేదు. సమాంతరంగా దళిత ఓటు బ్యాంకును, మరీ ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు మరో వ్యూహాన్ని అమలు చేస్తోందన్నారు. ఇటీవల విజయవాడలో జరిగిన ఎంఆర్పీఎస్   నాయకుడు పేరుపోగు వెంకటేశ్వరరావు కుమారుడు క్రాంతి కుమార్ ఆత్మహత్య ఉదంతాన్ని వైసీపీ  పోలీసుల వేధింపులకు ముడిపెట్టడం కలకలం రేపిన సంగతి తెలిసిందే.   అప్పటివరకు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటూ, లోకేష్‌తో సైతం మంచి సంబంధాలు ఉన్న వెంకటేశ్వరరావు ఇంటికి వైసీపీ ముఖ్య నేతలు వెళ్లి పరామర్శించడాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. గాజ సాయికృష్ణ ఎపిసోడ్ ద్వారా కాపులను, క్రాంతి కుమార్ ఉదంతం ద్వారా మాదిగ ఓటు బ్యాంకును కూటమి ప్రభుత్వానికి దూరం చేయాలనేది వైసీపీ వ్యూహంగా ఆయన వివరించారు. చంద్రబాబు దళిత వ్యతిరేకి అనే పాత ముద్రను మళ్లీ తెరపైకి తెస్తూ, గత 15 రోజుల్లో విజయవాడ కేంద్రంగా జరిగిన పోలీసు శాఖ వైఫల్యాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాస్త్రాలుగా మార్చుకుంటున్నారు. ఈ విధంగా ఏపీలో మళ్లీ కులాల వారీగా ఓటు బ్యాంకులను ఏకీకృతం చేసేందుకు జగన్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారని భరద్వాజ అన్నారు. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాకినాడ వేదికగా ఇటీవల  జరిగిన 'మా ఊరు - మాటామంతి' కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.  వైసీపీ నేతలను ఉద్దేశించి ఆయన అత్యంత అగ్రెసివ్ టోన్‌లో హెచ్చరికలు జారీ చేశారు. వైసీపీ నాయకులు పరిధులు దాటి మాట్లాడుతున్నారని, భవిష్యత్తులో ఏం జరిగినా వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరికలు జారీ చేశారు.  గత కొన్ని రోజులుగా   సాయికృష్ణ మిస్సింగ్ ఉదంతం నేపథ్యంలో కాపు సామాజిక వర్గ  ఓట్ బ్యాంక్‌ను టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు పేర్ని నాని, అంబటి రాంబాబు చేస్తున్న విమర్శలపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆక్రోశం వెళ్లగక్కారు. తాను కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ, ఒకవేళ భవిష్యత్తులో (రెండేళ్లల్లోనో, మూడేళ్లల్లోనో) వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చినా సరే.. ఒక్కొక్కరిని తొక్కి నారతీస్తానంటూ ఘాటుగా హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. పవన్ కల్యాణ్ వ్యాఖ్యల వేనుక రాజకీయ వ్యూహం ఏమిటన్న దానిపై తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో..ప్రముఖ అనలిస్ట్ భరధ్వాజ లోతైన విశ్లేషణ చేశారు.   పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఒక బలమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోందన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇటీవల జరిగిన సుదీర్ఘ భేటీ తర్వాత పవన్ టోన్ పూర్తిగా మారినట్లు స్పష్టమవుతోంది. తాను కేవలం 21 సీట్లు గెలిచిన ఒక ప్రాంతీయ పార్టీ నేతగా మాత్రమే కాకుండా..  కేంద్రంలోని పెద్దల అండదండలు ఉన్న సుపీరియర్ పొజిషన్‌లో ఉన్నాననే సంకేతాన్ని పవన్   పంపించారన్నారు.  తాను ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన ధోరణి సూచిస్తోందని భరద్వాజ అన్నారు. మరోవైపు, పవన్ కళ్యాణ్ తనను పదేపదే కాపు సామాజిక వర్గానికి మాత్రమే పరిమితం చేయవద్దని వైసీపీ నేతలకు గట్టిగా చెప్పారు. తాను కులాలకు అతీతుడిననీ, ప్రాంతీయవాదానికి అతీతంగా జాతీయ సమగ్రత కోసం పనిచేస్తానని పునరుద్ఘాటించారు. జనసేన పార్టీని ఐదు రాష్ట్రాల్లో విస్తరిస్తున్నామని, రాబోయే రోజుల్లో ఢిల్లీలో జెండా ఎగరేయబోతున్నామని చెప్పడం ద్వారా పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టే యోచనలో ఉన్నట్లు కనిపిస్తోందని భరద్వాజ అన్నారు. అదే జరిగితే.. రాష్ట్రంలో ఆయన సోదరుడు నాగబాబుకు కీలక బాధ్యతలు దక్కే అవకాశం ఉందన్నారు.  ఈ పరిణామాలు కూటమి ప్రభుత్వంలోనూ చర్చకు దారితీస్తున్నాయి. గతంలో హోంమంత్రి అనిత పనితీరుపై పవన్ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నిన్నటి సభలోనూ ఆయన  నేను హోం శాఖ తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉండేవి కానీ నేను తీసుకోను' అని వ్యాఖ్యానించడం విశేషం. ఈ దూకుడు వ్యవహార శైలి    కల్ట్  పవన్ కళ్యాణ్‌ను తలపిస్తోందని, నిస్తేజంగా ఉన్న జనసైనికుల్లో మళ్లీ కొత్త ఉత్సాహాన్ని నింపేందుకే ఆయన ఈ తరహా అగ్రెసివ్ పంథాను ఎంచుకున్నారనీ భరద్వాజ విశ్లేషించారు. 
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో ప్రముఖ సర్వే సంస్థ  యూనికార్న్ పొలిటికల్ స్ట్రాటజీ సంచలన నివేదికను బయటపెట్టింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో బాగానే సాగుతున్నప్పటికీ, ప్రజల్లో ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి గ్రాఫ్ ఆందోళనకరంగా పడిపోయిందని ఈ సర్వే పేర్కొంది. 100 శాతం సంతృప్తి ఆశించిన చోట ప్రభుత్వ ప్రస్తుత రేటింగ్ కేవలం 60 శాతం (5.9 మార్కులు) లోపు మాత్రమే నమోదవ్వడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన యూనికార్న్ పొలిటికల్ స్ట్రాటజీ అధినేత రవి..  కూటమి ప్రభుత్వంలో పరిపాలనా లోపాలు, రాజకీయ సమన్వయ లేమి స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. గతంలో ఆర్టీజీఎస్  వంటి డిజిటల్ వ్యవస్థల ద్వారా లభించిన 80 శాతం ప్రజా సంతృప్తి కేవలం కాగితాలకే పరిమితమైందనీ..  డిజిటల్ కనెక్టివిటీ పెరిగి భౌతిక సంబంధాలు  దెబ్బతినడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తమ సర్వేలో తేలిందని చెప్పారు. కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ సెల్స్‌కు గత ఏడెనిమిదేళ్లుగా ఒకే రకమైన ఫిర్యాదులు రావడం అధికారుల వైఫల్యానికి అద్దం పడుతోందన్నారు.  తమ సర్వేలో ముఖ్యంగా క్యాబినెట్‌లో సీనియర్లు, జూనియర్ల మధ్య ఉన్న సమన్వయ లోపాలు ప్రస్ఫుటంగా బయటపడ్డాయన్నారు. 2024 అధికార మార్పిడి తర్వాత యువ రక్తాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో జూనియర్లకు మంత్రి పదవులు ఇచ్చినప్పటికీ..  వారు జిల్లాల్లో పట్టు సాధించలేకపోతున్నాని తేలిందని చెప్పారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో తలెత్తిన డయేరియా వంటి తీవ్ర ప్రజా సమస్యలను పరిష్కరించే క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లాంటి అగ్రనేతలు వెళ్లినప్పుడు, స్థానిక సీనియర్ నేత కళా వెంకట్రావు వంటి వారి అనుభవాన్ని వాడుకోలేకపోయారని విశ్లేషించారు. సీనియర్ల అనుభవంతో జూనియర్ల ఉత్సాహాన్ని మిక్స్ చేయడంలో ప్రభుత్వం విఫలమైందనే అభిప్రాయం ప్రజలలో వ్యక్తమైందన్నారు.  అటు కడప జిల్లాలో జూనియర్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి లాంటి వారు జిల్లా రాజకీయాలను ప్రభావితం చేయలేకపోతున్నారని, రాయలసీమలో సామాజిక సమతుల్యత లోపించిందని తమ సర్వేలో వెల్లడైందని చెప్పారు.   అలాగే, నెల్లూరు జిల్లాలో తమిళనాడు బోట్ల వివాదం, మత్స్యకారుల ఆందోళనలు, కార్పొరేట్ పాలిటిక్స్ కారణంగా ఇంటర్నల్ డ్యామేజ్ తీవ్రంగా జరుగుతోందనీ.. ఆనం రామనారాయణ రెడ్డి వంటి సీనియర్లను ఇలాంటి సమస్యల పరిష్కారానికి టాస్క్‌గా ఉపయోగించుకోవడంలో ప్రభుత్వం వెనుకబడిందని రవి విశ్లేషించారు. మరోవైపు.. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, లోకేష్‌లపై నమోదైన సీఐడీ కేసుల దర్యాప్తుకు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ వైఫల్యాలను కూడా రవి వివరించారు.  ప్రస్తుతం సీఐడీ విభాగానికి డీజీ ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో సిబ్బంది లేకపోవడం, 13 జిల్లాల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు లేకపోవడం, గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన ఐఓలు (ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్) ఇప్పుడు  కేసులను క్లోజ్ చేసేలా నివేదికలు ఇవ్వడం వంటివి కూటమి శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తిని రగిలిస్తున్నాయనిరవి విశ్లేషించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి రవిశంకర్ అయ్యన్నార్ లాంటి సమర్థులను సరైన స్థానాల్లో ఉపయోగించుకోకపోవడం, రిటైర్డ్ అధికారులకు ఎక్స్టెన్షన్స్ ఇవ్వడం వల్ల క్రింది స్థాయి అధికారుల ప్రమోషన్లు ఆగిపోయి డిపార్ట్‌మెంట్‌లో నైరాశ్యం అలుముకుందని సర్వే స్పష్టం చేసింది. ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం కేవలం సంక్షేమ పథకాల ఆధారంగానే బండి లాగిస్తోందనీ, రాజకీయంగా ఎదురవుతున్న అంతర్గత సవాళ్లను చల్లార్చడంలో విఫలమవుతోందని తన సర్వే నివేదిక తేటతెల్లం చేసిందని రవి చెప్పారు.  రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ఆపై 2029 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయి కార్యకర్తలను బలోపేతం చేసుకోకపోతే, ఈ రేటింగ్స్ మరింత దిగజారి ప్రభుత్వానికి ప్రమాద ఘంటికలు మోగడం ఖాయమనీ,  సీఎం చంద్రబాబు నాయుడు ఆశిస్తున్న 100 శాతం టాప్ ర్యాంక్ సాధించాలంటే కేవలం "పాస్ మార్కులు" సరిపోవని, తక్షణమే పరిపాలన, రాజకీయ సమన్వయంలో సమూల మార్పులు చేయాలని తమ సర్వే నివేదికలో తేలిందని   యూనికార్న్ పొలిటికల్ స్ట్రాటజీ అధినేత రవి స్పష్టం చేశారు. 
పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా స్కూల్‌కి వెళ్లే పిల్లలకు సరైన పోషకాహారం అందించడం చాలా అవసరం. ఈ వయస్సులో శారీరక ఎదుగుదలతో పాటు మెదడు అభివృద్ధి కూడా వేగంగా జరుగుతుంది. అందుకే పిల్లలు తీసుకునే ఆహారం సమతుల్యంగా, పోషకాలతో నిండి ఉండాలి. ఈ "రైట్ డైట్" కార్యక్రమంలో ప్రముఖ సీనియర్ న్యూట్రిషన్ కన్సల్టెంట్ డా. పి. జానకి శ్రీనాథ్ స్కూల్ పిల్లల కోసం అనుసరించాల్సిన సరైన ఆహారపు అలవాట్లు, ఆరోగ్యకరమైన డైట్ గురించి విలువైన సూచనలు అందిస్తున్నారు. ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యాంశాలు: ✔️ స్కూల్ పిల్లలకు అవసరమైన పోషకాహారం ✔️ ఉదయం అల్పాహారం ఎందుకు తప్పనిసరి? ✔️ టిఫిన్ బాక్స్‌లో ఎలాంటి ఆహారం పెట్టాలి? ✔️ పాలు, పండ్లు, కూరగాయల ప్రాముఖ్యత ✔️ ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాల అవసరం ✔️ చాక్లెట్లు, చిప్స్, జంక్ ఫుడ్ వల్ల కలిగే నష్టాలు ✔️ పిల్లలలో మంచి ఆహారపు అలవాట్లు ఎలా పెంపొందించాలి? ✔️ రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు ✔️ చదువులో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెంచే ఆహార సూచనలు తల్లిదండ్రులు తమ పిల్లల రోజువారీ ఆహారంలో సరైన మార్పులు చేస్తే వారు ఆరోగ్యంగా, చురుకుగా, చదువులో మెరుగైన ఫలితాలు సాధించగలరు. పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టే ప్రతి తల్లిదండ్రి తప్పక చూడాల్సిన ఉపయోగకరమైన వీడియో ఇది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)  
  కాలక్రమేణా అంటువ్యాధులు సర్వసాధారణం అవుతున్నాయి. ఒకవైపు  రోగనిరోధక శక్తి బలహీనం కావడం, మరొకవైపు వైరస్‌లు , బ్యాక్టీరియాల కొత్త రకాలు కూడా తీవ్ర ముప్పును కలిగిస్తున్నాయి. గత నెలరోజులుగా కేరళలో షిగెల్లా , నిపా వంటి అంటువ్యాధులు తాండవం చేస్తుంటే.. మరోవైపు, కర్ణాటక ప్రజలకు H1N1 (స్వైన్ ఫ్లూ) గురించి అప్రమత్తం చేస్తున్నారు. ఈ వ్యాధి కారణంగా ఒక వ్యక్తి మరణించినట్లు తెలిసింది. ఈ క్రమంలో సాధారణ జలుబుకు,  స్వైన్ ఫ్లూ కు మద్య తేడాలు ఏంటో తెలుసుకుంటే.. స్వైన్ ఫ్లూ లక్షణాలు తరచుగా సాధారణ ఇన్ఫ్లుఎంజా లక్షణాలను పోలి ఉంటాయి, అందుకే  ఈ రెండు వ్యాధుల మధ్య తేడాను గుర్తించలేరు. ఇన్ఫెక్షన్ వేగంగా ముదిరి, రోగికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, అధిక జ్వరం , తీవ్రమైన సమస్యలు తలెత్తినప్పుడు  ఈ వ్యాధిని నిర్ధారిస్తారు. H1N1 కూడా ఒక రకమైన ఇన్ఫ్లుయెంజా వైరస్, కానీ దీని వ్యాప్తి, ప్రమాదం , కొన్ని సందర్భాల్లో వ్యాధి తీవ్రత సాధారణ సీజనల్ ఫ్లూ కంటే ఎక్కువగా ఉంటాయి. వైద్య నివేదికల ప్రకారం, చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు , ముందు నుంచే అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఎక్కువగా ప్రభావితం కావచ్చు. వాతావరణ మార్పులను బట్టే.. వాతావరణం మారేకొద్దీ శ్వాసకోశ వైరల్ వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.  ఈ ఇన్ఫెక్షన్లు రద్దీ ప్రదేశాలు, పాఠశాలలు, కార్యాలయాలు , ప్రజా రవాణాలో వేగంగా వ్యాపిస్తాయి. దీర్ఘకాలం పాటు అధిక జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది,  దగ్గు తగ్గకపోవడం లేదా తీవ్రమైన నీరసం వంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. సాధారణ జలుబు సమస్య.. స్వైన్ ఫ్లూ , సాధారణ ఫ్లూ రెండూ ఇన్ఫ్లుయెంజా వైరస్ వల్ల కలిగే శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లే, కానీ ఇన్ఫెక్షన్‌కు కారణమయ్యే వైరస్ రకాలు భిన్నంగా ఉండవచ్చు. H1N1 కేవలం ఇన్ఫ్లుయెంజా A వైరస్ ద్వారా మాత్రమే వ్యాపిస్తుంది. సాధారణ కాలానుగుణ ఫ్లూ ఇన్ఫ్లుయెంజా A లేదా B తో సహా వివిధ రకాల వైరస్‌ల వల్ల సంభవించవచ్చు.  సాధారణ ఫ్లూలో కూడా జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ముక్కు కారడం వంటి లక్షణాలు ఉంటాయి. ఎలా గుర్తించాలి..  కేవలం లక్షణాల ఆధారంగా H1N1 , సాధారణ ఫ్లూ మధ్య తేడాను గుర్తించడం కష్టం. రెండింటిలోనూ జ్వరం, దగ్గు, గొంతు నొప్పి  ఒళ్ళు నొప్పులు ఉండవచ్చు. ఒక ప్రాంతంలో H1N1 కేసులు పెరుగుతూ ఉండి, రోగి తీవ్ర అనారోగ్యంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటే, వైద్యుడు కొన్ని పరీక్షలను సిఫార్సు చేయవచ్చు. H1N1 , సాధారణ ఫ్లూ మధ్య అత్యంత స్పష్టంగా కనిపించే తేడాలలో ఒకటి ఏమిటంటే, H1N1 యొక్క సాధారణ లక్షణాలతో పాటు, కొంతమందికి కడుపు నొప్పి , విరేచనాలు వంటి జీర్ణ సంబంధిత సమస్యలు కూడా కలగవచ్చు.                                 *రూపశ్రీ.
మైగ్రేన్ తగ్గాలంటే మందులు కాదు.. ముందుగా నీళ్లు ఇలా తాగండి! తలనొప్పి, మైగ్రేన్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు తరచుగా వస్తున్నాయా? చాలామంది ఈ సమస్యలకు తాత్కాలిక పరిష్కారాలు మాత్రమే వెతుకుతుంటారు. కానీ వీటి వెనుక గట్ హెల్త్ (జీర్ణవ్యవస్థ ఆరోగ్యం) కూడా ఒక ముఖ్యమైన కారణంగా ఉండొచ్చు. శరీరంలో నీటి కొరత, తప్పుడు ఆహారపు అలవాట్లు, జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయకపోవడం వంటి అంశాలు తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలను మరింత పెంచవచ్చు. ఈ వీడియోలో నీటిని సరైన సమయంలో, సరైన విధంగా తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు, గట్ హెల్త్‌ను మెరుగుపరచే సులభమైన మార్గాలు, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచే అలవాట్లు గురించి వివరంగా తెలుసుకోవచ్చు. అలాగే గట్ హెల్త్ మరియు మెదడు ఆరోగ్యం మధ్య ఉన్న సంబంధం, రోజువారీ జీవితంలో చిన్నచిన్న మార్పులతో ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చో కూడా తెలియజేశారు. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)    
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.