దేశంలో చమురు ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్నాయి. రాజస్థాన్ లోని శ్రీ గంగాపురంలో పది రోజుల క్రితమే సెంచరీ మార్క్ దాటేసింది లీటర్ పెట్రోల్ రేట్. మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లోనూ ప్రీమియం లీటర్ పెట్రోల్ రేటు వంద రూపాయలు క్రాస్ చేసింది. ఢిల్లీలోనూ హండ్రెడ్ కు దగ్గరలో ఉంది లీటర్ పెట్రోల్ ధర. తెలుగు రాష్ట్రాల్లోనూ లీటర్ పెట్రోల్ రేటు వంద రూపాయలకు దగ్గరలో ఉంది. పెట్రోల్ తో పోటీ పడుతూ డీజిల్ ధరలు కూడా సెంచరీ కొట్టేందుకు దూసుకువస్తున్నాయి.  చమురు ధరల ప్రభావం అన్ని రంగాలపై పడింద. రోజు రోజుకు పెరుగుతున్నధరలతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. చిరు వ్యాపారులు చితికిపోతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా అన్ని వర్గాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. నిరసనలు కూడా జరుగుతున్నాయి. తమిళనాడులో ఓ వాహనదారుడు తనకు పెట్రోల్ కోసం లోన్ ఇప్పించాలని బ్యాంకును ఆశ్రయించాడు.  పెట్రోల్‌, డీజల్‌ ధరలు తగ్గించాలని కోరుతూ యువజన సంఘం వినూత్న నిరసన చేపట్టింది. అఖిల భారత ఫ్వార్వర్డ్‌ బ్లాక్‌ అనుబంధ యువజన విభాగం ఆధ్యర్యంలో నిరసనకారులు  తేనిలో  ర్యాలీగా కెనరా బ్యాంక్‌ వద్దకు చేరుకున్నారు. పెట్రోల్‌, డీజల్‌ కొనుగోలుకు రుణం ఇప్పించాలని బ్యాంకుమేనేజర్‌కు వినతిపత్రం సమర్పించారు. వ్యాపారాలు, చిన్న పరిశ్రమలు సహా వ్యక్తిగత రుణాలను బ్యాంకులు అందిస్తున్నాయని, ప్రస్తుతం మనిషి దైనందిన జీవనంలో పెట్రోల్‌, డీజల్‌, వంటగ్యాస్‌ సిలిండర్‌ వినియోగం సాధారణమైందన్నారు. ప్రస్తుతం వాటిపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు విధిస్తున్న పన్నులతో ధరలు పెరుగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వాల తీరును నిరసిస్తూ ఈ వినూత్న నిరసన చేపట్టినట్టు తెలిపారు.   
దేశవ్యాప్తంగా టోల్ గేట్ దగ్గర ఫాస్టాగ్ తప్పనిసరి. ఫాస్టాగ్ లేకపోతే రెట్టింపు రుసుము వసూలు. చాలా స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు ఈ రూల్. అందుకే, వాహనదారులంతా ఎగబడి మరీ ఫాస్ట్ ట్యాగ్ వాడుతున్నారు. గతంలో మాదిరి టోల్ గేట్ల దగ్గర భారీ క్యూ లైన్లు లేవు. గంటల తరబడి ఎదురు చూపులు లేవు. ట్రాఫిక్ సాఫీగా సాగిపోతోంది. అంతా ఫాస్టాగ్ ఎఫెక్ట్.  ఫాస్టాగ్ తో వాహనదారులకు సౌకర్యంతో పాటు కేంద్రానికి రాబడీ భారీగా పెరిగింది. టోల్ దగ్గర ఫాస్టాగ్ తప్పనిసరి చేసిన తరువాత రోజుకు సరాసరి 20 కోట్లు వసూళ్లు పెరిగాయి. ఇది పెరిగిన అమౌంట్ మాత్రమే. అసలు మొత్తం ఇంకా ఎక్కువే. ఈ లెక్క ప్రకారం, ఫాస్టాగ్ లేకముందు ఈ 20 కోట్లు ఎవరికి వెళ్లాయనేది ఆసక్తికరం.  గతంలో ఉన్న టోల్ గేట్ సిస్టమ్ పైసా వసూల్ కి కేంద్రం. అదో పెద్ద స్కాం. ఇన్నేళ్లూ టోల్ గేట్లతో వాహనదారుల తోలు తీశారు కాంట్రాక్టర్లు. పీపీపీ పద్దతిలో కాంట్రాక్ట్ సంస్థ సొంత నిధులను ఖర్చు చేసి రోడ్డు వేస్తుంది. ఆ తర్వాత ఆ మొత్తం వసూలు అయ్యే వరకూ టోల్ రూపంలో వాహనాదారుల నుంచి నిర్ణీత రుసుము వసూలు చేస్తుంది. రోడ్డు వేసేందుకు ఖర్చు చేసిన అమౌంట్ వసూలు అయ్యాక ఇక టోల్ బూతులు తీసేయాలి. ఇదీ పద్దతి. అయితే.. ఇక్కడే ఉంది తిరకాసంతా. అక్షయ పాత్రలా కాసులు రాల్చే టోల్ బిజినెస్ ను కాంట్రాక్ట్ కంపెనీలు అంత ఈజీగా వదులుకోవడం లేదు. నిబంధనల్లో లొసుగులను తమకు అనుకూలంగా మార్చుకొని కోట్లకు కోట్లు దండుకునేవి. ఎన్ని ఏళ్లు అయినా పెట్టిన సొమ్ము తిరిగి రానట్టు రికార్డులు చూపిస్తూ.. దశాబ్దాల తరబడి టోల్ వసూలు చేస్తూనే ఉండేవి. ఆ మేరకు బ్యాంకులను, కేంద్రాన్ని దగా చేసేవి కాంట్రాక్టు సంస్థలు.  ప్రభుత్వం దగ్గర చాలినంత డబ్బులు లేక రోడ్లు వేసేందుకు ప్రైవేట్ కంపెనీలకు అనుమతి ఇస్తుంటుంది. ఎస్టిమేషన్ టైమ్ నుంచే చీటింగ్ మొదలై పోతుంది. వంద వాహనాలు నడిచే రోడ్డు మీద పది వెహికిల్సే నడుస్తుయాని ప్రతిపాదనలు పంపిస్తారు. ఆ లెక్కన ఐదేళ్లలో వసూలయ్యే సొమ్ముకు 10-15 ఏళ్ల వరకూ టోల్ వసూలు చేసుకునేందుకు అనుమతి సాధిస్తారు. అందుకే, తరాలు మారినా కొన్ని టోల్ బూత్ ల్లో వసూళ్లు మాత్రం కొనసాగేవి. అక్కడితో ఆగదు కాంట్రాక్ట్ సంస్థల అరాచకం. వచ్చిన వాహనాల లెక్కను.. మొదట్లో ఎస్టిమేట్ చేసిన సంఖ్య కంటే కూడా తక్కువగా చూపిస్తారు. తమ ఖర్చు ఇంకా వసూలు కాలేదని బుకాయించి మరో టోల్ గడువు మరో ఐదేళ్లు పెంచుకుంటాడు కాంట్రాక్టర్. టోల్ గేట్ లో వసూలైన డబ్బులనూ లెక్కల్లో చూపించరు. పది వాహనాల నుంచి వంద రూపాయలు వసూలైతే.. ఐదు వాహనాలు వెళ్లాయని 50 రూపాయలే వసూలయ్యాయని గోల్ మాల్ చేసేవారు. ఇలా డబ్బూ నొక్కేసేవారు. దాని మీద కట్టాల్సిన ట్యాక్సూ ఎగ్గొట్టేవారు. కేంద్రాన్ని నిలువునా ముంచేసేవారు. కొన్ని ఇన్ఫ్రా సంస్థలు మరింత దారుణంగా ప్రవర్తించేవి. తమ మార్గంలో టోల్ వసూళ్లు సరిగ్గా లేవని.. రోడ్డు వేయడం వల్ల కంపెనీ భారీగా నష్టపోయిందంటూ దివాళా ప్రకటించేవి. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు కట్టకుండా ఎగ్గొట్టేవి. అవన్నీ నిరర్ధక ఆస్తులుగా మారి అటు బ్యాంకులూ రుణం ఇచ్చినందుకు ఆర్థికంగా దెబ్బతినేవి. ఇటు కేంద్రం, అటు బ్యాంకులను నిండా ముంచి.. అనధికారికంగా టోల్ వసూలు చేసి కాంట్రాక్ట్ సంస్థలు కోట్లు కొల్లగొట్టేవి.  టోల్ వసూళ్లతో ఇన్ఫ్రా కంపెనీలు చేస్తున్న ఆగడాలకు ఫాస్టాగ్ తో చెక్ పడింది. ఆన్ లైన్ విధానంలో డబ్బులు ఆటోమెటిక్ గా కట్ అవుతుండటంతో.. లెక్క పక్కాగా మారింది. ఇప్పుడు వాహనాల సంఖ్యను తగ్గించి చూపించడానికి లేదు. వసూలైన సొమ్మును దాచేయడానికి లేదు. అంతా ఆటోమెటిక్ కంప్యూటరైజ్డ్ సిస్టమ్. ఫాస్ట్ ట్యాగ్ తో ఇన్నేళ్లూ దేశవ్యాప్తంగా సాగిన వేల కోట్ల టోల్ దోపిడీకి ముగింపు పలికింది కేంద్రం. ఫాస్ట్ ట్యాగ్ తో ప్రతీ పైసా లెక్కే. కాంట్రాక్టర్లకు చిక్కే. ఫాస్ట్ ట్యాగా మజాకా.
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల దూకుడుగా వెళుతున్నారు. వరుస సమావేశాలు నిర్వహిస్తూ పార్టీకి మద్దతు కూడగడుతున్నారు. అయితే షర్మిల సమావేశాలు వివాాదాస్పదం కూడా అవుతున్నాయి. ఎంపిక చేసిన కొందరు నేతలను పిలిపించి.. ఏదో జరుగుతున్నట్లు మీడియాలో ప్రచారం చేస్తూ హంగామా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల లోటస్ పాండ్ లో విద్యార్థులతో జరిగిన సమావేశంలో ఓ విద్యార్థి ఉద్వేగంగా ప్రసగించాడు. ఆ విద్యార్థిని వేదికపైకి పిలిచి ఓదార్చారు షర్మిల. అతనికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.      షర్మిల సమావేశానికి సంబంధించి సంచలన విషయాలు బయటపెట్టారు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి. షర్మిలతో మాట్లాడిన యువకుడి పేరు సునంద్ జోసెఫ్ అని చెప్పారు. ఆ యువకుడు విద్యార్థి కాదు, నిరుద్యోగి కాదని అన్నారు. కల్వరి టెంపుల్ లో అర్కెస్ట్రా వాయిద్యాన్ని వాయిస్తుంటాడని చెప్పారు రేవంత్ రెడ్డి. జోసెఫ్ తండ్రి  వైయస్ చనిపోవడానికి ముందే చాలా ఏళ్ల క్రితమే మరణించాడని తెలిపారు.కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ డ్రామా ఆడారని విమర్శించారు. స్టేజి మీద డ్రామాను రక్తికట్టించారని... ఈ డ్రామాకు ఆస్కార్ అవార్డు కూడా తక్కువేనని రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ ప్రజలను మభ్య పెట్టేందుకే ఈ డ్రామాకు తెర లేపారని చెప్పారు. షర్మిలతో కనిపించిన యువకుడి ఫేస్ బుక్ ప్రొఫైల్ లో హరీశ్ రావుతో దిగిన ఫొటోలను చూడొచ్చని అన్నారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో వైఎస్ షర్మిల అసలు బండారం బయటపడిందనే చర్చ జరుగుతోంది. కొత్త పార్టీ పేరుతో జరుగుతున్న డ్రామాలను ఇప్పటికైనా ఆపాలని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. షర్మిల పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్నాయి. 
ప్రపంచ దేశాలలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న ఏకైక అగ్ర రాజ్యం అమెరికా. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ అమెరికా పెద్దనకు కూడా అప్పులు .విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇదే సమయంలో అమెరికా భారత్‌కు ఏకంగా 216బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారుగా రూ. 15లక్షల కోట్లు రుణపడి ఉందని సమాచారం. ఇదేదో గాలి వార్త కానే కాదు. ఆ దేశ చట్టసభల సభ్యుడు స్వయంగా ఈ విషయాన్ని తెలిపారు. దాదాపు సంవత్సరం క్రితం అమెరికాపై కరోనా వైరస్ పంజా విసరడంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆ దేశ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ 1.9 ట్రిలియన్ డాలర్ల భారీ ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు. తాజాగా అక్కడి చట్టసభల సభ్యులు ఈ ఉద్దీపన ప్యాకేజీపై చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ దేశ దిగువసభ సభ్యుడు అలెక్స్ మూనీ ఈ వివరాలు వెల్లడించారు. అమెరికా అప్పుల ఊబిలో కూరుకుపోతోందంటూ ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 2020 నాటికె అమెరికా అప్పులు 23.4 ట్రిలియన్ డాలర్లు ఉన్నాయని.. అవి ప్రస్తుతం 29 ట్రిలియన్ డాలర్లకు చేరాయని అయన తెలిపారు. మరోపక్క చైనా, జపాన్ దేశాలకు కూడా అమెరికా ట్రిలియన్ డాలర్లపైన బాకీ పడిందని అయన ఆందోళన వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో 1.9ట్రిలియన్ డాలర్ల కొత్త ఉద్దీపన ప్యాకేజీని ఆమోదించే ముందు.. దేశ అప్పులను దృష్టిలో పెట్టుకోవాలని ఆయన జో బైడెన్ కు సూచించారు.    
వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు, పోలీసుల తీరుపై తీవ్రంగా స్పందించారు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. టీడీపీ నాయకులపై వైసీపీ నేతలు జరుపుతున్న దాడులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు ఆయన లేఖ రాశారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత  టీడీపీ సానుభూతిపరులపై ఓ వర్గం వారు, పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. బిక్కవోలు మండలం ఇల్లాపల్లి పంచాయతీలో సర్పంచ్‌గా గెలిచిన వైసీపీ అభ్యర్థి విజయోత్సవ ర్యాలీ నిర్వహించి టీడీపీ మద్దతుదారులను ఇబ్బందులకు గురిచేయటంతో పాటు వారిపై తప్పుడు కేసులు పెట్టించారని చంద్రబాబు ఆరోపించారు.  పాలు తాగే బిడ్డ భయపడుతున్నందున ఇంటి ముందు టపాసులు కాల్చవద్దని టీడీపీ కార్యకర్త రాఘవ కోరినందుకు వైసీపీ నేతలు రాఘవ పైనా, అతని కుటుంబ సభ్యులపైనా దాడికి పాల్పడ్డారని లేఖలో చంద్రబాబు చెప్పారు. దాడి చేసిన వారిపై కేసు పెట్టకుండా గాయపడిన బాధితులపై పోలీసులు అక్రమ కేసులు బనాయించారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డి విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి బాధ్యులపై కేసు నమోదయ్యేలా చూశారని తెలిపారు చంద్రబాబు. తమ‌పై కేసు ఉపసంహరించుకోవాలంటూ బాధితులను పోలీసులు, వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని  ఆరోపించారు. పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహరించేలా చూడాల్సిన బాధ్యత డీజీపీగా మీపై ఉందని చంద్రబాబు లేఖలో గుర్తు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా డీజీపీ చూస్తారని ఆశిస్తున్నానని ఆ లేఖలో చంద్రబాబు రాశారు.   
పవన్ స్టేట్ రౌడీ. జన సైనికులు ఆకు రౌడీలు. ఇది మీ పేటెంట్ హక్కు అంటూ భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మరోసారి జనసేనానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పశ్చిమలో వైసీపీ, జనసేన మధ్య వివాదం రోజురోజుకీ ముదురుతోంది. మత్స్యపురి దళితుల వివాదం కాక రేపుతుండటంతో స్వయంగా పవన్ కల్యాణే రంగంలోకి దిగారు. వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ను ఉద్దేశించి.. ఆకు రౌడీ, బ్యాంకులను దోచేసిన వ్యక్తి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వీధిలో కొన్ని కుక్కలు అరుస్తాయి.. కొన్ని పిచ్చికుక్కలు కరుస్తాయి. కరిచినంత మాత్రాన ఆ కుక్కను మనం కరవం కదా. మున్సిపాలిటీ వాళ్లకు ఫోన్ చేస్తాం. వచ్చే వరకు ఆగుతాం. మీకు మాటిస్తున్నాను. మున్సిపాలిటి వ్యాన్ వస్తుంది.. అప్పటి వరకు సంయమనం పాటించండి’ అంటూ పీకే తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు పవన్ కల్యాణ్. జనసేనాని కామెంట్లకు భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘పవన్ స్టేట్‌రౌడీ. జనసైనికులు ఆకురౌడీలు. ఇది మీ పేటెంట్ హక్కు అన్నారు. రాష్టంలో పార్టీ పెట్టి అవగాహనా లోపంతో, అజ్ఙానంతో మాట్లాడుతున్న పవన్‌ను చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. మీకు మానసిక జాఢ్యం ఉంది. మానసిక రోగి. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. నన్ను పిచ్చి కుక్కల వ్యాన్‌లో వేసి పంపుతానన్నారు. రెండు చోట్ల అదే వ్యాన్‌లో మిమ్మల్ని వేసి పంపించారు’అంటూ ఘాటైన విమర్శలు చేశారు గ్రంధి శ్రీనివాస్. పవన్ కల్యాణ్, గ్రంధి శ్రీనివాస్ ల డైలాగ్ వార్ తో పశ్చిమలో రాజకీయ రచ్చ రగులుతోంది.
అప్పు తీసుకున్నాడు. అప్పు ఇచ్చిన వ్యక్తి భార్యకు గాలం వేశాడు. మెళ్లగా ముగ్గులోకి దింపాడు. ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆమె సైతం భర్తను కాదని ప్రియుడికి బాగా దగ్గరైంది. వన్ ఫైన్ డే.. ఆ విషయం భర్తకి తెలిసింది. ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చాడు. ఇక తమ అక్రమ యవ్వారం సాగదనుకుంది ఆ భార్య. ఇక అంతే. తన భర్తను చంపేయమంటూ లవర్ ను రెచ్చగొట్టింది. ప్రేయసి డైరెక్షన్ లో.. ఆమె భర్తకు ఫుల్ గా తాగించి.. గొంతు పిసికి చంపేసి.. కాలువలో పడేశాడు. కట్ చేస్తే, పోలీసుల ఎంట్రీతో విషయం మొత్తం బయటకు వచ్చింది. వారి అక్రమ సంబంధం గుట్టు రట్టైంది. భర్తను చంపించిన భార్య, చంపిన లవర్.. ఇద్దరూ కటకటాల పాలయ్యారు.  కరీంనగర్ జిల్లాలో జరిగిందీ మర్డర్. కొత్తపల్లి మండలం రేకుర్తికి చెందిన మానుపాటి రాజయ్య నగరపాలక సంస్థలో కాంట్రాక్ట్ వర్కర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం మడద గ్రామానికి చెందిన ఎనగందుల బాబు మేస్త్రీ పని చేస్తుంటాడు. ఏడాది క్రితం మధ్యవర్తి సాయంతో రాజయ్య దగ్గర బాబు అప్పు తీసుకున్నాడు. ఆ తర్వాత వారిద్దరి పరిచయం మరింత పెరిగింది. అప్పు చెల్లించే విషయమై తరుచూ రాజయ్య ఇంటికి వచ్చేవాడు బాబు. ఆ సమయంలో రాజయ్య భార్య బాబుకు చాలా క్లోజ్ అయింది. తన భార్య బాబుతో సన్నిహితంగా ఉండటం గమనించిన రాజయ్య వారిద్దరినీ మందలించాడు. అప్పటి నుంచీ భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరిగేవి. తమ అక్రమ సంబంధానికి భర్త అడ్డంకి అని భావించిన భార్య.. రాజయ్యను అడ్డు తొలగించాలని బాబును పురికొల్పింది. ఇద్దరూ కలిసి పక్కాగా ప్లాన్ చేశారు. ప్లాన్ ప్రకారం.. పార్టీ ఇస్తానంటూ రాజయ్యను ఆటోలో మడద తీసుకెళ్లాడు బాబు. అక్కడ మద్యం తాగించి స్పృహలో లేకుండా చేశాడు. అటు నుంచి, మానకొండూర్‌ మండలం ముంజంపల్లి కాకతీయ కెనాల్‌ దగ్గర ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లాడు. ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక.. రాజయ్య మెడ నులిమి చంపేశాడు. డెడ్ బాడీని కెనాల్‌లో పడేశాడు. ఏమీ తెలీనట్టు ఇంటికి తిరిగెళ్లిపోయాడు బాబు.  భర్త ఇంటికి రాలేదని పోలీస్ స్టేషన్లో రాజయ్య భార్య ఫిర్యాదు చేసింది. రెండు వారాల తర్వాత మహబూబాబాద్‌ జిల్లా కొరివి పీఎస్ పరిధిలోని కాకతీయ కెనాల్‌లో రాజయ్య మృతదేహం లభించింది. విచారణలో భాగంగా పోలీసులకు రాజయ్య భార్యపై అనుమానం వచ్చింది. గట్టిగా ప్రశ్నిస్తే నిజం ఒప్పుకుంది. పోలీసుల దర్యాప్తులో భార్యే హత్య చేయించిందని తేలింది. హత్య చేసిన బాబును, భర్త హత్యకు ఉసిగొల్పిన భార్యను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు పోలీసులు. ఇలా.. వారి అక్రమ సంబంధం విషాదాంతమైంది.
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గుడికో గోమాత కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా వస్తున్న స్పందన వల్ల గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని తీర్మానించారు. ముందస్తు రిజర్వేషన్ తో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఏప్రిల్ 14వ తేదీ ఉగాది నుంచి భక్తులను శ్రీవారి ఆర్జిత సేవలకు అనుమతించాలని నిర్ణయించారు. టీటీడీ ఉద్యోగులందరికీ కోవిడ్ వ్యాక్సిన్ వేయించాలని పాలక మండలి తీర్మానించింది.  తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన  టీటీడీ పాలకమండలి సమావేశంలో 2021 - 22 బడ్జెట్ ను రూ. 2937.82 కోట్లతో ఆమోదించారు. శ్రీవారి ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు కోవిడ్ 19 నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, సేవకు వచ్చే మూడు రోజుల ముందు కోవిడ్ పరీక్ష చేయించుకుని సర్టిఫికెట్ సమర్పించాలని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తులాభారం ప్రవేశ పెడతామన్నారు. టీటీడీ పరిధిలోకి ఇతర ఆలయాలను తీసుకోవడానికి విధి విధానాలను నిర్ణయించామని తెలిపారు వైవీ సుబ్బారెడ్డి. టీటీడీ కళ్యాణ మండపాల నిర్మాణం,  లీజుకు ఇవ్వడం, నిర్వహణకు సంబంధించి ఏకరూప మార్గదర్శకాలు రూపొందించాలని నిర్ణయించినట్లు టీటీడీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఇప్పటికే ఉన్న కళ్యాణమండపాలు సక్రమంగా నిర్వహించి నష్టాలు తగ్గించుకుంటామన్నారు. టీటీడీ ఆధ్వర్యంలోని ఆరు వేద పాఠశాలల పేరును ఇకపై శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంగా మార్చేందుకు పాలకమండలి ఆమోదం తెలిపిందని చెప్పారు. బర్డ్ ఆసుపత్రిలోని పాత ఓపిడి భవనం, మొదటి అంతస్తులో శ్రీ వేంకటేశ్వర పీడియాట్రిక్ ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి సివిల్, ఎలక్రిటికల్, ఏసీ తదితర అభివృద్ధి పనులకు రూ 9 కోట్లు మంజూరు చేశారు. టీటీడీ ప్రసాదాలు, అన్న ప్రసాదాల తయారీకి ఉపయోగించే నెయ్యి ట్యాంకుల సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న 82.4 మెట్రిక్ టన్నుల నుండి 180. 4 మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి పెంచేందుకు ఆమోదం తెలిపింది టీటీడీ. దీంతో  నెయ్యి నిల్వలను ఆరు రోజుల నుంచి 14 రోజులకు పెంచుకోవచ్చు. తిరుమలలోని అన్ని వసతి, విశ్రాంతి గృహాలు, సత్రాల వద్ద విద్యుత్ వినియోగానికి సంబంధించి జవాబుదారీ తనం పెంచేందుకు AP SPDCL ద్వారా విద్యుత్ మీటర్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. తిరుమలలో క్రమంగా  50 మెగావాట్ల  గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి నిర్ణయించింది.  త్వరలో ముంబై, జమ్మూలో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి భూమి పూజ నిర్వహిస్తామని టీటీడీ చైర్మెన్ తెలిపారు. అయోధ్యలో రామమందిర నిర్మాణ ట్రస్ట్  టీటీడీకి భూమి కేటాయిస్తే శ్రీవారి ఆలయం లేదా భజన మందిరం లేదా యాత్రికుల వసతి సముదాయంలో వారు ఏది కోరితే అది నిర్మించాలని నిర్ణయించామన్నారు వైవీ సుబ్బారెడ్డి.  
తెలంగాణాలో జరిగే మేడారం జాతరను మినీ కుంభమేళాతో పోలుస్తారు పెద్దలు. ఇక్కడ జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా.. పక్కనున్న ఛత్తీస్ గడ్, మహారాష్ట్ర నుండి భారీగా భక్తులు తరలి వస్తుంటారు. అటువంటి మేడారంలో చిన్న జాతర జరుగుతున్న సమయంలో కరోనా కలకలం రేగింది. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ముగ్గురు దేవాదాయ శాఖ సిబ్బందికి కరోనా సోకినట్లు‌గా తేలింది. అంతేకాకుండా ఆ సిబ్బందితో సన్నిహితంగా మెలిగిన వారిలో కూడా పలువురికి కరోనా లక్షణాలు కనిపించడంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.   దీంతో కరోనా లక్షణాలు ఉన్నవారిని అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. అయితే కరోనా నేపథ్యంలో అధికారులు ఎటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా చిన్న జాతరలో భాగంగా భక్తులు రెండో రోజు సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుంటున్నారు. మరోపక్క మహా జాతరకు వచ్చినట్లే ప్రస్తుతం జరుగుతున్న చిన్న జాతరకు కూడా వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి, గద్దెలపై ఉన్న సమ్మక్క సారలమ్మను భక్తులు దర్శించుకుంటున్నారు.ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ పనిచేస్తున్న దేవాదాయ శాఖ సిబ్బందికి కరోనా పాజిటివ్ తేలడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భక్తుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని వారు అదిత్క్రులను కోరుతూన్నారు          
నాగలక్ష్మి. గవర్నమెంట్ టీచర్. ఎప్పటిలానే క్లాస్ రూమ్ లో పిల్లలకు పాఠాలు చెబుతోంది. అంతలోనే రామదుర్గాప్రసాద్ కత్తితో క్లాస్ రూమ్ లోకి వచ్చాడు. వస్తూ వస్తూనే టీచర్ పై చాకుతో దాడి చేశాడు. విచక్షణా రహితంగా పొడిచాడు. అకస్మాత్తుగా జరిగిన ఈ దాడితో పిల్లలు హడలిపోయారు. భయంతో పెద్దగా అరిచారు. ఆ అరుపులు విన్న స్థానికులు పరుగెత్తుకుంటూ వచ్చారు. కత్తితో దాడి చేస్తున్న రామదుర్గాప్రసాద్ ను అడ్డుకున్నారు. తీవ్ర గాయాలతో ఉన్న నాగలక్ష్మిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఎంట్రీతో అసలు విషయం వెలుగు చూసింది. టీచర్ నాగలక్ష్మిపై కత్తితో దాడి చేసిన రామదుర్గాప్రసాద్ మరెవరో కాదు ఆమె భర్తే.  అవును, భర్తే ఈ ఘాతుకానికి తెగబడ్డాడు. పిల్లలకు పాఠాలు చెబుతున్న భార్యను తరగతి గదిలో కత్తితో పొడిచాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం కాకిలేరు మండల ప్రజాపరిషత్‌ ప్రత్యేక పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ఇరగవరం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన గుత్తుల నాగలక్ష్మికి.. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామానికి చెందిన కడలి రామదుర్గాప్రసాద్‌తో 2016లో పెళ్లైంది. వీరికి మూడేళ్ల కుమార్తె ఉంది. రామదుర్గాప్రసాద్‌ కిరాణా వ్యాపారం చేస్తుంటాడు. నాగలక్ష్మి కాకిలేరు ప్రాథమిక పాఠశాలలో టీచర్. భార్య, భర్తల మధ్య గొడవలతో నాలుగు నెలల నుంచి దూరంగా ఉంటున్నారు. భర్త వేధింపులపై గతంలో నాగలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేయగా అతనిపై కేసు కూడా నమోదైంది. నాగలక్ష్మి నుంచి ఏటీఎం కార్డు తీసుకుని జీతమంతా భర్తే వాడుకునేవాడు. పైగా ఆమెతో తరుచూ గొడవ పడుతూ చంపేస్తానని బెదిరించేవాడు. దీంతో భయపడి ఇటీవలే బదిలీపై కాకిలేరు స్కూల్ కు వచ్చింది నాగలక్ష్మి. అయినా.. ఆమెను వదలకుండా.. నాగలక్ష్మి పని చేసే పాఠశాలకు వచ్చి కత్తితో దాడి చేశాడు. ఆమెను చంపడానికి ప్రయత్నించాడు. తీవ్ర గాయాలైన నాగలక్ష్మిని మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. ఉన్మాదిగా మారిన భర్త రామదుర్గాప్రసాద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిని కఠినంగా శిక్షించాలని నాగలక్ష్మి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
అరాచక పరిస్థితులు నెలకొన్న ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతి, ప్రధాన మంత్రులకు ఫిర్యాదులు వెళ్లాయి. తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్.. రాష్ట్రపతి, ప్రధానమంత్రి కార్యాలయాలకు వెళ్లి ఈ ఫిర్యాదులను అందజేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను అందులో ఆయన వివరించారు. రాష్ట్రపతి పాలన పెట్టాలని ఏపీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారని  బీవీ రామ్ చెప్పారు. ఒకవేళ కేంద్రం  తగిన విధంగా స్పందించకపోతే  జై ఆంధ్ర ఉద్యమం మళ్లీ పురుడు పోసుకుంటుందని హెచ్చరించారు. రాష్ట్రంలో పరిస్థితులను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి న్యాయం చేయాలని తెలుగు శక్తి డిమాండ్ చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో తక్షణమే.. ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాలని రామ్ డిమాండ్ చేశారు.   విశాఖ జిల్లా  గండిగుండం గ్రామంలో ఓటర్లను సజీవ సమాధి చేస్తామని, వైసీపీకి చెందిన నేతలు బెదిరిస్తున్నారని రామ్ ఆరోపించారు. ఎంపీ  విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాసరావు, గండిగుండంలో స్థానిక నాయకుడు శ్రీనివాసరావు ఓటర్లను బెదిరించిన వారిలో ఉన్నారని చెప్పారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుని సైతం చంపుతామని వైసీపీ నాయకులు నేరుగా బెదిరిస్తున్నారని తెలిపారు. తనకు కూడా చంపుతామని బెదిరింపులు వస్తున్నాయని రామ్ ఆందోళన వ్యక్తం చేశారు.  టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అందరి ఆమోదంతో అమరావతి రాజధానిగా ఆవిర్భవించిందన్నారు రామ్.  ముఖ్యమంత్రి జగన్ నిర్ణయంతో అమరావతి ప్రాంత ప్రజలు, ముఖ్యంగా రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతినే కొనసాగించాలంటూ 438 రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తున్నారని తన ఫిర్యాదులో  రామ్ వివరించారు. ఇప్పటివరకు 120 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 
1209 సర్పంచ్‌లు. 1776 ఉప సర్పంచ్‌లు. 4456 మంది వార్డు సభ్యులు. ఇదీ ఏపీ పంచాయతీ ఎన్నికల్లో జనసేన లెక్క. ఇందులో ఎలాంటి తిరకాసూ లేదన్నారు జనసేనాని. ఏపీ వ్యాప్తంగా 65 శాతం పంచాయతీల్లో జనసేన మద్దతు దారులు సెకెండ ప్లేస్ లో నిలవడం మార్పునకు సంకేతమన్నారు పవన్‌ కల్యాణ్. పార్టీ బలపరిచిన అభ్యర్థులకు 27 శాతం ఓటింగ్ రావడం వ్యవస్థలో వస్తున్న మార్పునకు నిదర్శనమన్నారు.  జనసేన మద్దతు దారులు గెలుపొందిన చోట కేరళ తరహాలో పంచాయతీలు అభివృద్ధి చేయనున్నట్టు పవన్‌ తెలిపారు.  కేంద్రం నుంచి పంచాయతీలకు నిధులొస్తున్నాయని చెబుతున్నారే కానీ ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వాలను దాటి ప్రజలకు చేరినట్టు, సత్ఫలితాలు వచ్చినట్టు ఎక్కడా కనిపించలేదని విమర్శించారు. పల్లెలపై పెత్తనం ఒకటి రెండు వర్గాల గుప్పెట్లో ఉండటం, కొద్ది పాటి కుటుంబాల ఆధిపత్యంలో గ్రామాలు నలిగిపోవడమే కారణమని పవన్‌ కల్యాణ్  ఆరోపించారు. తిత్లీ తుపాను సమయంలో శ్రీకాకుళం జిల్లాలో మారుమూల పల్లెల్లో పర్యటించి పంచాయతీల పరిస్థితులను స్వయంగా పరిశీలించామన్నారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధికి భయపడి ప్రజలు వలస వెళ్లిపోవడం, విజయనగరం జిల్లా పెదపెంకి గ్రామంలో బోదకాలుతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, పంచాయతీ వ్యవస్థ కానీ ఏం చేస్తుందని ప్రశ్నించారు. జనసేనతో పల్లెల్లో, పంచాయతీల్లో మార్పు వస్తుందన్నారు పవన్ కల్యాణ్.
వెలగపూడిలోని ఏపీ సచివాలయం ముందు ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. నెల్లూరు జిల్లాకు చెందిన రైతు దంపతులు పిల్లలతో సహా సూసైడ్ అటెంప్ట్ చేశారు. పెట్రోల్ పోసుకొని నిప్పు పెట్టుకోబోగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు జిల్లా దుత్తలూరు తహసీల్దారు చంద్రశేఖర్ తమను మోసం చేశారని బాధితులు ఆరోపించారు. చిట్టమూరు మండలం చిలమూరులో ఉన్న తమ పొలం ఆన్‌లైన్‌లో ఎక్కించేందుకు ఎమ్మార్వో డబ్బులు డిమాండ్ చేశారని అన్నారు. ఇప్పటి వరకూ కోటి రూపాయలు ఇచ్చామని చెప్పారు. డబ్బులు ఇచ్చి ఏడాది గడుస్తున్నా తమ భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేయలేదని వాపోయారు. ఎమ్మార్వో తీరుతో విసుగు వేశారిని ఆ రైతు.. ఇక భూమిపై ఆశలు వదులుకున్నాడు. కుటుంబంతో కలిసి వెలగపూడిలోని సచివాలయానికి చేరుకున్నారు. అక్కడ ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థం కాక, ఎవరూ వారిని పట్టించుకోక.. జీవితంపై విరక్తి చెందాడు. పెట్రోలు పోసుకొని ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ పెరిగిపోయింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా ఎక్కువ మంది నిరుద్యోగులే ఉండటంతో.. వారి చుట్టే రాజకీయం తిరుగుతోంది. ఉద్యోగాల భర్తీపై అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఉద్యోగాలు భర్తీ చేయలేదంటూ తమ ప్రభుత్వంపై విపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు కేటీఆర్. గత ఆరేండ్లలో భర్తీ చేసిన ఉద్యోగ వివరాలతో గురువారం కేటీఆర్ బహిరంగ లేఖ విడుదల చేశారు. కేటీఆర్ లేఖపై స్పందించిన కాంగ్రెస్ నేతలు.. ఉద్యోగ భర్తీలపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. టీకాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ గన్ పార్క్ వద్ద బైఠాయించి.. కేటీఆర్ ను చర్చకు రావాలని సవాల్ చేశారు. ఉద్యోగాల లెక్కల్లో తప్పులున్నాయి కాబట్టే.. చర్చకు రావడం లేదని కేటీఆర్ పై మండిపడ్డారు.  కాంగ్రెస్ నేత శ్రవణ్ ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఎవడు పడితే వాడు గన్ పార్క్ వద్ద చర్చకు రమ్మంటే కేటీఆర్ వస్తాడా? అని వ్యాఖ్యానించారు. చర్చకు రమ్మని అడగడానికి ఓ స్థాయి ఉండాలని అన్నారు. కేటీఆర్ పై వ్యాఖ్యలు చేసేవాళ్లు తమ స్థాయి తెలుసుకుని మాట్లాడాలని మంత్రి తలసాని హితవు పలికారు. గత ప్రభుత్వాలు ఉద్యోగాల కల్పనలో విఫలమైతే, టీఆర్ఎస్ ప్రభుత్వమే పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేసిందని చెప్పారు.  హైదరాబాదులోని సనత్ నగర్ లో టీఆర్ఎస్ పార్టీ నేతలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు తలసాని.  
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,ద ఇండియా టాయ్ ఫెయిర్ 2021’ బొమ్మల కొలువును శనివారం (ఫిబ్రవరి 26) ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రధానమంత్రి భారతీయ బొమ్మల విశిష్టతను వివరించారు. భారతీయ బొమ్మలు సహజసిద్ధ ప్రకృతి వర్ణాలలో  పర్యావరణహితంగా కొలువు తీరతాయని వివరించారు. అలాగే, భార‌తీయుల సైకాల‌జీ, జీవావ‌ర‌ణానికి త‌గ్గిన‌ట్లు బొమ్మ‌ల‌ను త‌యారు చేయాల‌ని ప్ర‌ధాని బొమ్మ‌ల ఉత్ప‌త్తిదారుల‌ను కోరారు. సాధ్య‌మైనంత వ‌ర‌కు బొమ్మ‌ల త‌యారీలో ప్లాస్టిక్‌ను త‌గ్గించాల‌ని, రీసైక్లింగ్‌కు అనువైన ప‌దార్ధాల‌ను వాడాల‌ని ఆయ‌న సూచించారు. బొమ్మ‌ల ప‌ర్యాట‌కాన్ని అభివృద్ధి చేయాల‌ని త‌మ ప్ర‌భుత్వం భావిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.విశ్వ‌వ్యాప్తంగా భార‌తీయ బొమ్మ‌ల‌కు డిమాండ్ ఉంద‌ని, మేడిన్ ఇండియాకు గుర్తింపు ఉన్న‌ట్లు.. హ్యాండ్ మేడ్ ఇన్ ఇండియా బొమ్మ‌ల‌కు కూడా మార్కెట్ ఉంద‌ని మోదీ అన్నారు. జాతీయ బొమ్మ‌ల కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను రూపొందించామ‌ని,  15 మంత్రిత్వ‌శాఖ‌ల‌తో ఆ కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను అనుసంధానం చేశామ‌ని ప్ర‌ధాని తెలిపారు. ప్రధానమంత్రి చెప్పిన మాటలను అలా ఉంచితే, బొమ్మలు అనగానే, మను ముందుగ గుర్తుకు వచ్చేది బొమ్మల్ కొలువు. అలాగే,  తెలుగు సాహిత్యంలో, సినిమా సాహిత్యంలో బొమ్మల కొలువు పాటలు ఎన్నో ఎన్నెన్నో, దేవత చిత్రం కోసం మహాకవి శ్రీ శ్రీ రాసిన,  ‘బొమ్మను చేసి ప్రాణం పోసీ ఆడేవు నీకిదో వేడుక’ వంటి విషాద గీతం మొదలు, చిట్టి పొట్టి బొమ్మలు చిన్నారీ బొమ్మలు, బుల్లి బుల్లి రాధకు, ముద్దు ముద్దు రాజుకు పెళ్లండీ పెళ్లి’ అంటూ బొమ్మల పెళ్లిని వర్ణిస్తూ సాగే యుగాల గీతాల వరకు ఎన్నో సినీ జానపద గీతాలు తెలుగు లోగిళ్ళలో వినిపిస్తూనే ఉంటాయి. అదలా ఉంటే, దసరా ఉత్సవాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే బొమ్మల కొలువు గురించి ఎంత చెప్పుకున్నా,తక్కువే. బొమ్మల కొలువు అందాన్ని,ఆనందాన్ని పంచడమే కాదు,బొమ్మలను తయరు చేసే కళాకారుల సృజనాత్మకతను పట్టి చూపుతుంది. బొమ్మల కొలువు భారత దేశంఅంతటా జరుపుకునే వేడుకే అయినా, ఒక్కొక ప్రాంతంలో ఒక్కొక్క రూపంలో ఒక్కొక పేరుతో జరుపుకుంటారు. బొమ్మల కొలువు ముఖ్యంగా మహిళలు, పిల్లలు జరుపుకునే వేడుకే అయినా ఆబాల గోపాలం ఈ వేడుకల ఆనంద అనుభూతిని ఎప్పటికీ మరిచి పోలేరు. ఇక ఆధునిక బొమ్మలకొలువువిషయానికి వస్తే, ఇప్పడు ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్   బొమ్మలు ఎక్కువగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ నేపధ్యంలో జరుగతున్న ఇండియా టాయ్ ఫెయిర్ 2021’ లో ప్రపంచ దేశాలు ఎన్నో పాల్గొంటున్నాయి. ఇది.. మన సంస్కృతీ సంప్రదయాలను విదేశాలకు పరిచయం చేయడమే కాకుండా, మన బొమ్మలకు అంతర్జతీయ మార్కెట్ కలిపిస్తుంది
రెండేంళ్ళు ఫ్రీ నెట్.. ఫ్రీ కాల్స్..వినియోగదారులకు జియో పండగ. మార్చ్ 1 నుండే మార్కెట్లోకి జియో కొత్త ఫోన్లు. అందరికి అందుబాటు ధర 1499 కొత్త జియో ఫోన్లు.ఇక నినియోగ దారులకు పండగే పండగ.. రిలియన్స్‌ జియో.. ఫీచర్‌ ఫోన్‌ వినియోగదారుల కోసం సరికొత్త బండిల్డ్‌ ఆఫర్‌ను ప్రకటించింది. 2జీ సేవల నుంచి భారత్‌ను విముక్తం చేయాలన్న ఆలోచనకు అనుగుణంగా అందుబాటు ధరల్లో కొత్త ఆఫర్‌ను తీసుకువచ్చింది. న్యూ జియోఫోన్‌ 2021 ఆఫర్‌ పేరుతో రెండేళ్ల పాటు అన్‌లిమిటెడ్‌ వాయుస్‌ కాల్స్‌, ప్రతి నెల 2 జీబీ డేటాతో కొత్త ఫోన్‌ను జియో విడుదల చేసింది. మార్చి 1 నుంచి ఈ కొత్త ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని తెలిపింది. భారత్‌ 5జీ లోకి అడుగుపెడుతున్న సమయంలో కూడా 30 కోట్ల మంది సబ్‌స్ర్కైబర్లు ఇంకా బేసిక్‌ ఫీచర్లతో 2జీ ఫోన్లతోనే కాలం వెళ్లబుచ్చుతున్నారని, వీరందరికీ అత్యుత్తమ సేవలందించాలన్న లక్ష్యంతో ఈ ఆఫర్‌ను ప్రకటించినట్లు రిలయన్స్‌ జియో డైరెక్టర్‌ ఆకాశ్‌ అంబానీ వెల్లడించారు. కొత్త యూజర్లకు రూ.1,999 ధరకే జియో ఫోన్‌నుతో పాటు రెండేళ్లకు సరిపడా పరిమిత కాల్స్‌, ప్రతి నెల 2జీబీ హైస్పీడ్‌ డేటాను ఈ ఆఫర్‌ ద్వారా వినియోగదారులకు అందించనున్నట్లు వెల్లడించింది. అలాగే 1,499 ధరతో ఏడాది పాటు ఇదే తరహా సేవలతో ఫోన్‌ను ఆఫర్‌ చేస్తున్నట్లు వివరించారు. ఆసియా నెంబర్ వన్ మళ్ళీ అంబానే.. ఆసియా కుబేరుల జాబితాలో ముకేశ్‌ అంబానీ మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నారు. రెండు నెలల క్రితం ముకేశ్‌ను వెనక్కి నెట్టి నం.1గా ఎదిగిన చైనా పారిశ్రామికవేత్త జాంగ్‌ షాన్షాన్‌ ఆస్తి ఈ వారంలో 22 క్షీణించి 7,660 కోట్ల డాలర్లకు పడిపోయింది. అంబానీ సంపద 8,000 కోట్ల డాలర్ల కంటే తగ్గడంతో ఆయన రెండో స్థానానికి చేరాడు. ఈ వారం మన మార్కెట్లు భారీ నష్టాలు వచ్చినప్పటికీ రిలయన్స్‌ షేర్లపై అంతగా నష్టాల ప్రభావం చూపకపోవడం అంబానీకి కలిసివచ్చింది. రెండేళ్ల క్రితం అలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌ మా ను వెనక్కి నెట్టి అంబానీ తొలిసారిగా ఆసియా కుబేర కిరీటాన్ని చేజిక్కించుకున్నారు.  
పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఎన్నిక ఏదైనా, ప్రతి రాజకీయ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాయి. అయితే  ఇక్కడ ఒక్కొక్క పార్టీది ఒక్కొక్క పద్ధతి. అందులో భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా మోడీ, అమిత్ షా జోడీ  అనుసరిస్తున్న వ్యూహం కొంచెం భిన్నంగా, ఉంటుంది. బూత్ ఆ క్రింది స్థాయి నించి ప్రతి ఒక్క ఓటుకు ఎవరో ఒకరిని బాధ్యులను చేస్తూ, వివిధ స్థాయిల్లో వ్యూహాత్మకంగా బాధ్యతలను అప్పగించడంతో పాటుగా ప్రచారంలో పార్టీ  అగ్రనేతలను, కేంద్రమంత్ర్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రుల రంగంలోకి దించడం ఆనవాయితీగా వస్తోంది.  తెలంగాణలో ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఉప ఎన్నికల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మొదలు సుమారు ఓ పది మందికి పైగానే కేంద్ర మంత్రులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా మొదలు అనేక మంది పార్టీ సీనియర్ నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు.   ఇలా స్థానిక ఎన్నికల్లో కేంద్ర మంత్రులు ప్రచారం చేయడం ఏమిటని, ముఖ్యంత్రి కేసీఆర్, మంత్రి కేటీ రామారావు, తెరాస నాయకులు,మంత్రులు ఎవరెన్ని అభ్యంతరాలు చెప్పినా, ఆక్షేపణలు చేసినా, అవహేళనే చేసినా, కమలనాధులు పట్టించుకోలేదు.   అదేదో సినిమాలో ఎప్పుడు వచ్చామన్నది కాదు .. బులెట్ దిగిందా లేదా అన్నదే ముఖ్యం అన్నట్లుగా, ఎవరొచ్చారు,ఎవరు ప్రచారం చేశారు, ఏ స్థాయి ఎన్నికలు అన్నది కాదు ..గెలిచామా లేదా అన్నదే ముఖ్యం అన్నట్లుగా కేంద్ర మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు ఎక్కడ ఎన్నికలుంటే అక్కడ వాలి పోతున్నారు.తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరుగతున్న ఎన్నికలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. హైదరాబాద్,రంగారెడ్డి,మహబూబ్’నగర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కేంద్ర మంత్రుల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. వచ్చే నెల 14 న పోలింగ్ జరిగే వరకు ఈ రాకపోకలు ఇలా సాగుతూనే ఉండేలా బీజేపీ ప్లాన్ చేసింది. 
విశాఖ స్టీల్ ప్టాంట్ ప్రైవేటీకరణ అంశం ఆంధ్రప్రదేశ్ లో కాక రేపుతోంది. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అంటూ పోరాడి సాధించుకున్న కర్మాగారాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా ఏకమవుతున్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉద్యమానికి రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రంతో పోస్కో చేసుకున్న ఒప్పందం వెనుక ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారనే ఆరోపణలు కొంత కాలంగా వస్తున్నాయి. అందుకు బలమైన ఆధారాలు కూడా చూపిస్తున్నారు ప్రతిపక్ష నేతలు.  స్టీల్ ప్లాంట్‌ను పోస్కోకు కట్టబెట్టిన వారిలో మొదటి ముద్దాయి జగన్ అని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ విమర్శించారు. స్టీల్ ప్లాంట్ విషయంలో రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి  మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. జూన్ 2019లో పోస్కోతో సమావేశమై, జులై 2019లో  సంస్థ ప్రతినిధులు స్టీల్ అధికారులకు ప్రపోజల్ అందజేశారని తెలిపారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో విజయసాయిరెడ్డి సమావేశం అయ్యారని...అక్టోబర్‌లో ఎంఓయూ చేసుకున్నారని అన్నారు. సంవత్సరం క్రిందట ముఖ్యమంత్రికి సమాచారం తెలిస్తే ప్రజలకు  ఎందుకు  చెప్పలేదని పట్టాభి ప్రశ్నించారు.  స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమిస్తామంటున్న వైసీపీ ఎంపీలు పార్లమెంట్‌లో ఎందుకు మాట్లాడలేదని పట్టాభి నిలదీశారు. స్టీల్ ప్లాంట్‌కు సంబంధించి ప్రతి ప్రధాన ఘట్టానికి ముందు వెనుక ముఖ్యమంత్రి జగన్‌తో, విజయసాయిరెడ్డితో పోస్కో ప్రతినిధులు సమావేశం అయ్యారని చెప్పారు. ఈ విషయాలపై ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్ఐఎన్‌ఎల్ కోసం చంద్రబాబు కష్టబడ్డారని గుర్తు చేశారు. నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు ప్రస్తావించలేదని అన్నారు. చంద్రబాబు అభివృద్ధి చేసిన అన్ని ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం నాశనం చెయ్యాలి అని చూస్తుందని పట్టాభిరామ్ విరుచుకుపడ్డారు.
నిజం. మీరు చదివింది నిజమే. ఓ మహిళను తండ్రి, కొడుకు కలిపి అత్యాచారం చేశారు. కోరిక తీర్చుకున్నాకైనా వదిలి పెట్టలేదు ఆ దుర్మార్గులు. మహిళను రేప్ చేసి అనంతరం ఆమెకు నిప్పు పెట్టారు. 30శాతం కాలిన గాయాలతో ఆ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అరాచకాలకు కేరాఫ్ అయిన ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ దారుణం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.  యూపీ, సీతాపూర్ జిల్లాలో జరిగిందీ అఘాయిత్యం. పుట్టింటికి వెళ్లేందుకు ఓ మహిళ జట్కా బండి ఎక్కింది. ఆ బండిలోనే ప్రయాణిస్తున్నారు ఆ శాడిస్ట్ తండ్రీకొడుకులు. కొంతదూరం వెళ్లాక వారిలో కామం బుసలు కొట్టింది. తండ్రి ఉన్నాడని కొడుకు భయపడలేదు, కొడుకు ఉన్నాడని తండ్రి కంట్రోల్ చేసుకోలేదు. ఇద్దరూ కలిసి.. ఒళ్లు మరిచి, బరితెగించి.. ఆ మహిళపై అత్యాచారం చేశారు. అంతటితో ఆగక ఆమెకు నిప్పుపెట్టారు. కాలిన గాయాలతో ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతోంది ఆ మహిళ. కామాంధులైన ఆ తండ్రీకొడుకులను అరెస్ట్ చేశారు పోలీసులు.

బెంగాల్లో బీజేపీ గెలిస్తే  తెలంగాణలో ప్రకంపనలే!

కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..

 అధ్యక్ష తరహా పాలన! మోడీ మనసులో మాట..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్ష తరహ పాలనా వ్యవస్థ వైపుగా పాప్వులు కదుపు తున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రానున్న రెండు మూడు నెలల్లో జరగనునన్న  నాలుగు రాష్ట్రాల,పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల శాసన సభలకు జరిగే ఎన్నికల్లో  బీజేపీ కి ఆశించిన ఫలితాలు  వస్తే ... ఇక ఆ తర్వాత అధ్యక్ష తరహ పాలనా వ్యవస్థ వైపుగా పావులు మరింత వేగంగా కడులుతాయని అంటున్నారు.నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం. ఈ ఎన్నికలలో విజయం సాధించడం కోసం, అన్నిరాజకీయ పార్టీలు ఎప్పటినుంచో  సన్నాహాలు చేసుకుంటున్నాయి.అయితే,కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, అందరికంటే మిన్నగా, ఎట్టి పరిస్థితులలోనూ ఒక్క కేరళ తప్పించి మిగిలిన మూడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో సొంత ప్రభుత్వం కాదంటే  తమ చెప్పు చేతల్లో ఉండే ప్రభుత్వాలు ఏర్పడాలని, అందుకోసం ఎందాకా అయినా వెళ్లేందుకు సిద్దం అన్న సంకేతాలను ఇస్తోంది.  పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్నతృణమూల్ కాంగ్రెస్’ను పూర్తిగా తుడచి పెట్టేస్తోంది, తెర వెంక ఏమి చేస్తోందో ఏమో గానీ, తెరమీద చూస్తే, తృణమూల్ ఎంపీలు, ఎమ్మెల్ల్యేలు, మంత్రులు చివరకు తృణమూల్ అధినాయకురాలు, ముఖ్యమంత్రి మమత బెనెర్జీ సొంత మనుషులు, ఇంటి మనుషులు, కుటుంబ సభ్యులు బారులుతీరి మరీ కమలదళంలో చేరిపోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నడ్డా, మరో పది మందివరకు కేంద్ర మంత్రులు, విధ రాష్టాల ముఖ్యమంత్రులు ఇలా ఒకరి వెంట ఒకరు, పస్చిమ బెంగాల్ పై దండయాత్ర చేస్తున్నారు. మమతా బెనర్జీ అంతటి గడుసు పిండాన్ని ఒక్కరి బిక్కిరి చేస్తున్నారు. అంతిమ ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది ఎలా ఉన్నా, ప్రస్తుతానికి అయితే పశ్చిమబెంగాల్ కమల దళం ఖాతాలో చేరినట్లే  అన్న అభిప్రాయమే వ్యక్తమౌతోంది.  అలాగే ఇటీవల పుదుచ్చేరిలో ఏమి జరిగిందో చూశాం, మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న సమయంలో, అధికార కాంగ్రెస్ పార్టీ  ఎమ్మెల్యేలు వరస పెట్టి రాజీనామా చేయడం,ఆవెంటనే ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రభుత్వం కుప్ప కూలిపోవడం, అదే సమయంలో అంతే వేగంగా లెఫ్ట్’నెంట్ గవర్నర్’ కిరణ బేడీ ఉద్వాసన, ఆమె స్థానంలో తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్’కు అదనపు బాధ్యతలు అప్పగించడం, ఆమె సిఫార్సు మేరకు, రాష్ట్రపతి పాలన విధించడం అన్నీ  చక చకా జరిగి పోయాయి. గతంలో కర్ణాటక, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలలో బీజేపీ రాజీనామాల రూటులో కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చి అధికారాన్ని ఎగరేసుకు పోయినా, రాజస్థాన్’లో అలాంటి విఫల ప్రయత్నం చేసిందన్నా కొంతవరకు అర్థం చేసుకోవచ్చునుకానీ, నిండా నాలుగు పుంజీల సభ్యులు లేని పుదుచ్చేరిలో అది కూడా మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో ఇంతటి తెలివి తక్కువ పరువు తక్కవ పని బీజేపీ ఎందుకు చేసింది,అనేది అనేక మందిలో ఉన్న సందేహం. అయితే అందరూ అనుకుంటున్నట్లుగా బీజేపీ నాయకత్వం తెలివి తక్కువగా, పరువు తక్కువ పనులు చేయడం లేదు. పార్టీ లోగుట్లు, అంతర్గత వ్యవహారాలు తెలిసిన అంతరంగికుల సమాచారం ప్రకారం, సంఘ్ పరివార్ సిద్దాంతానికి కార్యరూపం ఇచ్చే వ్యూహంలో భాగంగానే బీజేపీ నాయకత్వం అడుగులు చేస్తోంది. అంతిమ లక్ష్యం, అంతిమ గమ్యం చేరుకోవడంలో ఐడియాలజీ విషయంలో కొంచెం కాంప్రమైజ్’ అయినా ఫర్వాలేదని, ఇటీవల పార్టీ అంతర్గత సమావేశాల్లో సర్దుబాటు ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని కూడా లోపలి సమాచారం.  అయితే ఇక్కడ బీజేపీ ముందున్న అంతిమ లక్ష్యం ఏమిటి,అంటే, ఆర్టికల్ 370 రద్దు నుంచి, పాక్ ఆక్రమిత కాశ్మీర్’ తిరిగి భారత దేశంలో కలుపుకోవడం వరకు, ట్రిపుల్ తలాక్ నుంచి ఉమ్మడి పౌర స్మృతి వరకు ... రామ మందిరం నిర్మాణం మొదలు, అధ్యక్ష తరహ పాలన వరకు పార్టీ మూల సిద్ధాంతానికి సంబందించిన అన్ని అంశాలకు సంబందించిన లక్ష్యాలు ఇందులో ఉన్నాయి. గడచిన ఆరేడు సంవత్సరాలలో ఇందులో కొన్ని సాఫల్య మయ్యాయి.  ఇక ఇప్పుడు, కమల నాధులు,జమిల ఎన్నికల మీదుగా అధ్యక్ష తరహ పాలన లక్ష్యంగా పావులు కదుపుతోందని విశ్వసనీయ సమాచారం. నిజానికి అధ్యక్ష తరహ పాలనకు, ఆదాయ తరహ పాలనా వ్యవస్థకు,బీజేపీ, సంఘ్ పరివార్ సిద్దాంత కర్తలు మొదలు సామాన్య కార్యకర్తలు మొదలు అందరూ అనుకూలమే. అందుకే ఎప్పటి నుంచో పార్టీ వేదికల మీద, బయట కూడా ఇలాంటి చర్చ జరుగుతూనే  ఉంది.  నిజానికి ఒక్క బీజేపీలోనే కాదు,ఇతర పార్టీలలోనూ చాలా కాలంగా అధ్యక్ష తరహ పాలనపై  చర్చ జరుగుతోంది. రాజకీయ పార్టీలలో ఇప్పడు చర్చ జరగడంకాదు,రాజ్యాంగ సభలోనూ ఆ దిశగా చర్చ జరిగింది. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్, కూడా “అధ్యక్ష తరహా పాలనలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుంది. కాకపోతే జవాబుదారీతనమే కొరవడుతుంది” అంటూ ఎప్పుడోనే తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.అలాగే రాజ్యాంగసభ చర్చల్లో పాల్గొన్న వల్లభాయ్‌ పటేల్‌ కూడా దేశాధ్యక్షుడు, గవర్నర్‌ పోస్టులకు ప్రత్యక్ష ఎన్నికలు జరగాలని సూచించారు. ఇక బీజేపీ విషయం అయితే చెప్పనే అక్కర లేదు. బీజేపీ, ఆ పార్టీ సిద్ధాంతకర్తలు మొదటి నుంచీ అధ్యక్ష వ్యవస్థకే మొగ్గు చూపుతున్నారు. బీజేపీ సిద్ధాంత కర్త దీనదయాళ్‌.. అధ్యక్ష వ్యవస్థను సమర్థించారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి 1998లో చేసిన ప్రసంగంలో.. అధ్యక్ష వ్యవస్థ గురించి ఆలోచించాలని చెప్పారు. రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ సీనియర్‌ నేత లాల్‌ కృష్ణ ఆడ్వాణీ కూడా దేశంలో అధ్యక్ష తరహ పాలనకు మద్దతుగా ఉపన్యాసాలు చేశారు.వ్యాసాలు రాశారు.    అలాగే  కాంగ్రెస్ పార్టీ ఏక చత్రాధిపత్యానికి గండిపడిన తర్వాత సుమారు మూడు దశాబ్దాల పాటు సాగిన సంకీర్ణ యుగంలో,అస్థిర ప్రభుత్వాలు సక్రమంగా పాలన సాగించలేని పరిస్థితులు ఏర్పడిన సమయంలోనూ, అధ్యక్ష తరహ పాలన గురించి చర్చ జరిగింది. ఆ నేపధ్యంలో 2014 లో మోడీ నాయకత్వంలో తొలిసారిగా బీజేపీ సారధ్యంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. ఆ ఎన్నికలలో మోడీ అధ్యక్ష తరహ ఎన్నికల పచారామ్ సాగించారు. ఆ 2019 ఎన్నికల ప్రచారంతో పాటుగా పరిపాలన కూడా అదే తరహాలో పీఎంఓ, ప్రధాన మంత్రి కార్యాలయం సెంట్రిక్’గా పరిపాలన సాగుతోందని ,ఇది కూడా అందుకు మరో సంకేతమని అంటున్నారు.  ఇక ప్రస్తుతానికి వస్తే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సంఘ పరివార్, ప్రస్తుత పార్లమెంటరీ ప్రజాసామ్య వ్యవస్థ స్థానంలో  అధ్యక్ష తరహ వ్యవస్థను తెచ్చేందుకు ఇంతకంటే మంచి సమయం మరొకటి ఉందని భావిస్తున్నారు. పరిపాలన వ్యవస్థలో మార్పులు తీసుకు రావాలంటే అందుకు రాజ్యాంగ సవరణ అవసరం అవుతుంది. రాజ్యంగ సవరణకు రాజ్యాంగంలోని 368 అధికరణం ప్రకారం, ప్రభుత్వం లేదా సభ్యులు ప్రవేశ పెట్టె తీర్మానానికి పార్లమెంట్ ఉభయ సభలు మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోదించడంతో పాటుగా మొత్తం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల శాసన సభలలో సగం శాసన సభలు ఆమోదించ వలసి ఉంటుంది. అందుకే, బీజేపీ సాధ్యమైన మేరకు రాష్రాలను గెలుచుకుని, తద్వారా రాజ్యాంగ సవరణ, అందుకు కొనసాగింపుగా అధ్యక్ష తరహ పాలనకు శ్రీకారం చుట్టాలని చూస్తోంది.  ఇప్పటికే బీజేపీ 12  రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మరో ఆరు రాష్ట్రాలలో మిత్ర పక్షాలతో కలిసి ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వలున్నాయి... ఇక ..పార్లమెంట్ ఉభయ సభలో సొంత బలం కొంత తగ్గినా, మేనేజ్ చేయగల సమర్ధులున్నారు .. సో .. ఇదే అందుకు మంచి సమయమని కమలనాధులు భావిస్తున్నారు. రాజ్యాంగ సవరణ అనుకున్నది అనుకున్నట్లు సాగితే, 2022 చివరిలో అధ్యక్ష పదవికీ, ఎంచుకున్న అధ్యక్ష తరహ పాలనకు అనుగుణంగా పార్లమెంట్ ,శాసన సభలకు  జమిలి ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత నరేంద్ర మోడీ అధ్యక్షుడిగా, అమిత్ షా ప్రధానిగా ... కొత్త పాలన వస్తుంది. అయితే, ఇదులో చాలా అయితే గియితే లున్నాయి. రాజ్యాంగ సవరణ సహా, ఇంకా చాలా చిక్కుముళ్ళు ఉన్నాయని అవన్నీ విడతేస్తేనే గానీ, మోడీ ఆలోచనలు కార్యరూపం దాల్చవని న్యాయ కోవిదులు అంటున్నారు. నిజానికి గతంలోనే సుప్రీం కోర్టు రాజ్యంగ ధర్మాసనం రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని మార్చే వీలు లేదని పేర్కొందని, కాబట్టి  మోడీ అలోచన కార్యరూపం  దాల్చడం అంతసులభం కాదన్నమాట కూడా వినవస్తోంది.

విశాఖలో కేపిటల్ లేనట్టేనా? అమరావతి ఊపిరి పీల్చుకో..

అమరావతిని అడ్రస్ లేకుండా చేసేందుకు సీఎం జగన్ రెడ్డి చేయని ప్రయత్నం లేదు. . ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి జై కొట్టిన మడమ తిప్పని నేత.. పవర్ లోకి వచ్చాకా  రాజధాని విషయంలో కంప్లీట్ యూ టర్న్ తీసుకున్నారు. రాజధానిని మూడు ముక్కలు చేశారు. ఆంధ్రుల కలల సౌధాన్ని కుప్పకూలుస్తూ.. అమరావతిని కేవలం శాసన రాజధానికే పరిమితం చేశారు. అక్కడి ఆకాశ హర్మాలు, విశాల రోడ్లను ఎక్కడికక్కడే వదిలేశారు. రాజధాని కోసం రైతులు ఉవ్వెత్తున ఉద్యమం చేస్తున్నా.. ఏమాత్రం కనికరం చూపించలేదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అలాంటిది సడెన్ గా జగన్ మనసు మారినట్టుంది. ఏపీ కేబినెట్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 50 శాతం నిర్మాణం పూర్తయి.. పెండింగ్‌లో ఉన్న భవనాలను పూర్తి చేయాలని సర్కారు నిర్ణయించింది. అందుకు  3వేల కోట్ల బ్యాంక్ గ్యారంటీ ఇచ్చేందకు ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పటికీ ప్రారంభం కానీ, కొద్దిగా ప్రారంభమైన భవనాల నిర్మాణాలపై ఇంజనీరింగ్ నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకోవాలని కేబినెట్‌ అభిప్రాయ పడింది.  జగన్ తీసుకున్న తాజా నిర్ణయం ఏపీలో సంచలనంగా మారింది. చంద్రబాబుకు క్రెడిట్ వస్తుందని అమరావతి లాంటి అద్భుత రాజధానిని కాలరాసే ప్రయత్నం చేసిన జగన్ రెడ్డిలో సడెన్ గా ఇంతటి ఛేంజ్ చూసి అంతా అవాక్కవుతున్నారు. అసంపూర్తి భవనాల నిర్మాణం పూర్తైతే.. అమరావతికి కొత్త అందం వస్తుంది. డిమాండ్ పెరుగుతుంది. ఇక విశాఖతో పనేముంది? అమరావతిలో భవనాలను పూర్తి చేస్తున్నారంటే.. ఇక విశాఖలో రాజధాని అంశాన్ని పక్కకు పెట్టేసినట్టేనా? లేక తాత్కాలికంగా ఆపుతారా? ఆలస్యం చేస్తారా? అనే చర్చ జరుగుతోంది. అందుకే జగన్ నిర్ణయంపై అమరావతి రైతులు సైతం ఈ నిర్ణయాన్ని నమ్మలేకపోతున్నారు.  అయితే హైకోర్టులో రాజధాని నిర్మాణం వ్యవహారాలపై విచారణ షెడ్యూల్ వచ్చింది. త్వరలోనే కోర్టుకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది. అమరావతి భవనాల నిర్మాణంపై సర్కారు తీరుపై గతంలో హైకోర్టు పలుమార్లు అక్షింతలు వేసింది. కోర్టు ఎంత చెప్పినా సర్కారులో కదలిక రాలేదు. భవనాలు పూర్తి చేయడంపై ఉలుకూ పలుకూ లేదు. ఈ సారి విచారణ సందర్భంగా హైకోర్టుకు అమరావతి భవనాలపై ప్రభుత్వ నిర్ణయమేంటో చెప్పక తప్పని పరిస్థితి. అందుకే, కేబినెట్ లో అంపూర్తి భవనాలు పూర్తయ్యేలా పాజిటివ్ నిర్ణయం తీసుకొని.. ఆ విషయాన్ని కోర్టు ద్రుష్టికి తీసుకెళ్లనుంది సర్కారు. అమరావతి రోడ్ల విషయంలోనూ ఇప్పటికే రివ్యూ కూడా నిర్వహించారు సీఎం జగన్.  ప్రభుత్వ పాజిటివ్ దృక్పదంతో.. భవన నిర్మాణాలు పూర్తైతే.. ఇక అమరావతికి డిమాండ్ అమాంతం పెరగడం ఖాయం. అదే జరిగితే.. ఇక విశాఖపట్నంతో పెద్దగా అవసరం ఉండకపోవచ్చు. ఆకర్షణీయమైన రోడ్లు, భవనాలతో అమరావతి అసలైన రాజధానిగా నిలిచే అవకాశాలున్నాయి. అటు, కేంద్రం సైతం మూడు రాజధానుల విషయంలో జగన్ కు ఇప్పటికే హితబోధ చేసినట్టు సమాచారం. ఇటు హైకోర్టు సైతం కేపిటల్స్ ను తిరష్కరించే అవకాశాలే ఎక్కువ అనేది న్యాయ నిపుణుల మాట. ఇలా ఎలా చూసినా.. భవిష్యత్ లో అమరావతికి మళ్లీ మంచి రోజులు వస్తాయనే ఆశ అక్కడి ప్రజల్లో.  సీఎం జగన్ తాజా నిర్ణయంతో వారి ఆశలు మరింత చిగురిస్తున్నాయి. తమ కలల రాజధాని కోసం మరింతగా పరితపిస్తున్నారు అమరావతి ప్రజలు. 

బాల‌కృష్ణ చిత్రంలో ర‌మ్య‌కృష్ణ‌?

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌కి అచ్చొచ్చిన క‌థానాయిక‌ల్లో ర‌మ్య‌కృష్ణ ఒక‌రు. వీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన తొలి, మ‌లి చిత్రాలు `బంగారు బుల్లోడు`, `వంశానికొక్క‌డు` బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించాయి. ఆ త‌రువాత వ‌చ్చిన `దేవుడు` నిరాశ‌ప‌ర‌చ‌గా.. `వంశోద్ధార‌కుడు` ఫ‌ర్లేద‌నిపించింది. క‌ట్ చేస్తే.. మ‌రోమారు బాల‌య్య‌తో క‌లిసి న‌టించ‌బోతున్నార‌ట ర‌మ్య‌. అయితే, ఈ సారి హీరోయిన్ గా కాదు.. నెగ‌టివ్ ట‌చ్ ఉన్న రోల్ లో. ఆ వివ‌రాల్లోకి వెళితే..  గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించ‌నున్న ఈ భారీ బ‌డ్జెట్ మాస్ ఎంట‌ర్ టైన‌ర్ మే నుంచి సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. కాగా, ఈ సినిమాలో కీల‌క పాత్ర కోసం ర‌మ్య‌కృష్ణతో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌ట‌. గోపీచంద్ గ‌త చిత్రం `క్రాక్`లో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ పోషించిన జ‌య‌మ్మ పాత్ర త‌ర‌హాలో ఈ క్యారెక్ట‌ర్ ఉంటుంద‌ని టాక్. త్వ‌ర‌లోనే బాల‌య్య - గోపీచంద్ కాంబో మూవీలో ర‌మ్య‌కృష్ణ ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.

సౌంద‌ర్య‌తో పెళ్లి వ‌ద్ద‌నుకున్న జేడీ!

  వ‌ర్మ స్కూల్ నుంచి వ‌చ్చిన జేడీ చ‌క్ర‌వ‌ర్తి ముక్కు సూటిగా మాట్లాడుతుంటారు. 'శివ' వంటి ట్రెండ్ సెట్ట‌ర్‌తో జేడీ ప‌రిచ‌య‌మైన ఈ హీరో గ‌త కొంత కాలంగా త‌న‌కు న‌చ్చిన‌, త‌న దాకా వ‌చ్చిన చిత్రాల్లో మాత్ర‌మే న‌టిస్తున్నారు. తాజాగా ఆయ‌న న‌టించిన థ్రిల్ల‌ర్ '70 ఎంఎం'. అంతా కొత్త వాళ్లు నిర్మించిన ఈ చిత్రం ఇటీవ‌లే థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో దివంగ‌త న‌టి సౌంద‌ర్య‌తో త‌న‌కున్న అనుబంధాన్ని, ఆమెతో జ‌ర‌గాల్సిన త‌న పెళ్లి గురించి వెల్ల‌డించి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రితో పంచుకోని ఈ విష‌యాన్ని తాజాగా వెల్ల‌డించి షాకిచ్చారు. మాట‌ల మ‌ధ్య‌లో సౌంద‌ర్య టాపిక్ రావ‌డంలో త‌న‌కు ఆమెకు పెళ్లి జ‌ర‌గాల్సింద‌ని అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టారు. సౌంద‌ర్య‌, జేడీ చ‌క్ర‌వ‌ర్తి క‌లిసి ఎస్వీ కృష్ణారెడ్డి రూపొందించిన 'ప్రేమ‌కు వేళాయెరా' చిత్రంలో న‌టించారు. ఈ మూవీ చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలోనే ఎస్వీ కృష్ణారెడ్డి, చంద్ర‌బోస్‌, సుచిత్ర అంతా క‌లిసి జేడీకి పెళ్లి చేయాల‌నుకున్నార‌ట‌. అదీ సౌంద‌ర్య‌తో చేయాల‌ని ప్లాన్ చేశార‌ట‌. అయితే ఆ ప్ర‌పోజ‌ల్‌కి తాను అంగీక‌రించ‌లేద‌ని, దాని వ‌ల్ల త‌మ ప్రొఫెష‌న్ దెబ్బ‌తింటుంద‌ని జేడీ స‌ర్తిచెప్పి పెళ్లికి ఫుల్ స్టాప్ పెట్టార‌ట‌.  ఆ త‌రువాత సౌంద‌ర్య‌కు త‌న‌కు మ‌ధ్య విభేధాలు త‌లెత్తాయ‌ని, ఆ త‌రువాత కొంత కాలం తాను సౌంద‌ర్య మాట్లాడుకోలేద‌ని చెప్పాడు. అయితే ఆ త‌రువాతే ఇద్ద‌రం మంచి క్లోజ్ ఫ్రెండ్స్‌మి అయ్యామ‌ని జేడీ చ‌క్ర‌వ‌ర్తి తెలిపాడు.

డిసెంబ‌ర్ లో `నితిన్ 31`

యువ క‌థానాయ‌కుడు నితిన్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఎంత‌లా అంటే.. ఎన్న‌డూ లేని విధంగా ఒకే క్యాలెండ‌ర్ ఇయ‌ర్ లో ఏకంగా నాలుగు చిత్రాల‌ను రిలీజ్ చేసే దిశ‌గా స్కెచ్ వేశారాయ‌న‌. తాజాగా `చెక్`తో ప‌ల‌క‌రించిన ఈ యంగ్ హీరో.. మార్చి 26న రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ `రంగ్ దే`తో ఎంట‌ర్ టైన్ చేయ‌బోతున్నారు. ఇక జూన్ 11న `అంధాధున్` రీమేక్ తో వినోదాలు పంచ‌నున్నారు. అలా.. ఫ‌స్టాఫ్ లో మూడు చిత్రాల‌ను ప‌క్కాగా సెట్ చేసుకున్నారు. అంతేకాదు.. వీలైతే ఇదే ఏడాది మ‌రో సినిమాని రిలీజ్ చేసే ప్లాన్ లో కూడా ఉన్నార‌ట నితిన్. ఆ వివ‌రాల్లోకి వెళితే.. `ఛ‌ల్ మోహ‌న్ రంగ‌` త‌రువాత కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో `ప‌వ‌ర్ పేట‌` పేరుతో నితిన్ ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. మే నెల‌లో ప‌ట్టాలెక్క‌నున్న ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ లో విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నారట‌. మ‌రి.. `నితిన్ 31`గా తెర‌కెక్క‌నున్న `ప‌వ‌ర్ పేట‌` స‌కాలంలో థియేట‌ర్లలోకి వ‌స్తుందో లేదో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.

నాని ల‌క్కీ  మంత్ లో `శ్యామ్ సింగ రాయ్`?

నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న పిరియ‌డ్ డ్రామా `శ్యామ్ సింగ రాయ్`. `టాక్సీవాలా` ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సాయిపల్ల‌వి, కృతి శెట్టి, మ‌డోన్నా సెబాస్టెయిన్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. పున‌ర్జ‌న్మ‌ల నేప‌థ్యంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెర‌కెక్కుతోంద‌ని టాక్. ఇదిలా ఉంటే.. శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని నాని ల‌క్కీ మంత్  సెప్టెంబ‌ర్ లో విడుద‌ల చేయ‌డానికి   స‌న్నాహాలు చేస్తున్నారట‌.  నాని తొలి చిత్రం `అష్టా చ‌మ్మా` (2008), నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒక‌టిగా నిలిచిన `భ‌లే భ‌లే మ‌గాడివోయ్`(2015), స‌క్సెస్ ఫుల్ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ `మ‌జ్ను` (2016).. ఇదే నెల‌లో రిలీజ‌య్యాయి. త్వ‌ర‌లోనే `శ్యామ్ సింగ రాయ్` రిలీజ్ డేట్ పై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది. `శ్యామ్ సింగ రాయ్`లో నాని బెంగాలీ బాబుగా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. నాని పుట్టిన రోజున విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ కి మంచి స్పంద‌న వ‌చ్చిన నేప‌థ్యంలో.. చిత్రంపై భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి. కాగా, నాని తాజా చిత్రం `ట‌క్ జ‌గ‌దీష్` ఏప్రిల్ 23న థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌నుంది.

'చెక్' ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్లు.. 'భీష్మ‌'లో 54 శాత‌మే!

  నితిన్ హీరోగా చంద్ర‌శేఖ‌ర్ యేలేటి రూపొందించిన 'చెక్' మూవీ తొలిరోజు అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది. ఫిబ్ర‌వ‌రి 26 శుక్ర‌వారం విడుద‌లైన ఈ మూవీ ఫ‌స్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.38 కోట్ల షేర్ సాధించింది. నితిన్ మునుప‌టి సినిమా 'భీష్మ' తొలి రోజు సాధించిన వ‌సూళ్ల‌తో పోలిస్తే ఇది చాలా త‌క్కువ కావ‌డం గ‌మ‌నార్హం. 'భీష్మ‌'కు ఫ‌స్ట్ డే రూ. 6.28 కోట్ల షేర్ వ‌చ్చింది! అంటే 'భీష్మ‌'తో పోలిస్తే 'చెక్‌'కు వ‌చ్చిన ఓపెనింగ్ డే క‌లెక్ష‌న్స్ 54 శాత‌మే. ర‌కుల్ ప్రీత్ సింగ్‌, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ హీరోయిన్లుగా న‌టించిన 'చెక్' మూవీకి తొలిరోజు నైజాంలో రూ. 1.46 కోట్లు, ఆంధ్రాలో రూ. 1.45 కోట్లు, రాయ‌ల‌సీమ‌లో రూ. 0.47 కోట్లు షేర్ వ‌చ్చాయి. అదే 'భీష్మ‌'కు చూసుకుంటే, నైజాంలో రూ. 2.2 కోట్లు, ఆంధ్రాలో రూ. 3.28 కోట్లు, రాయ‌ల‌సీమ‌లో రూ. 0.8 కోట్ల షేర్ వ‌చ్చింది. దీన్ని బ‌ట్టి అన్ని ఏరియాల్లోనూ 'భీష్మ' కంటే 'చెక్' ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోవ‌డంలో వెన‌క‌బ‌డింద‌ని అర్థ‌మ‌వుతోంది. ఓవ‌రాల్‌గా ప్రి బిజినెస్‌తో పోలిస్తే 'చెక్' మొద‌టి రోజు 23 శాత‌మే రిక‌వ‌ర్ అయ్యింద‌ని ట్రేట్ వ‌ర్గాలు తెలిపాయి. రాసిన క‌థ‌కు క్లైమాక్స్‌లో జ‌స్టిఫికేష‌న్ ఇవ్వ‌క‌పోవ‌డం ప్రేక్ష‌కుల‌కు న‌చ్చ‌లేద‌నీ, నితిన్ నిర్దోషిగా నిరూప‌ణ కాకుండా, జైలు నుంచి త‌ప్పించుకోవ‌డం ఆడియెన్స్‌ను ఎట్రాక్ట్ చెయ్య‌లేద‌నీ చెప్పాలి. ఓవ‌రాల్‌గా ఈ మూవీ బ్రేకీవెన్ కావ‌డం క‌ష్ట‌సాధ్య‌మంటున్నారు. ఏదేమైనా సోమ‌వారం వ‌చ్చే క‌లెక్ష‌న్లు ఈ సినిమా ఫేట్‌ను డిసైడ్‌ చేయ‌నున్నాయి.

రాజకీయాలకు బలౌతున్న ఐఏఎస్ అధికారులు

ఇద్దరు అధికారులు దివంగత వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కీలకమైన శాఖలు నిర్వహించిన వారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ చేతిలో వీరిద్దరూ తీరని అవమానాలకు గురౌతున్నారు. తండ్రి చేతిలో ఎత్తులు చుసిన వారు తనయుడి చేతిలో లోతులు చూస్తున్నారు. వారిద్దరూ సీనియర్ ఐఏఎస్ అధికారులు. ఒకరినైతే మెడపట్టుకుని బయటకు గెంటేశారు. మరొకరిని కులం పేరుతో కుళ్లపొడుస్తున్నారు. విచిత్రం ఏమిటంటే ఈ ఇద్దరు అధికారులూ కూడా చంద్రబాబు అంటే గిట్టనివారే. ఇద్దరు అధికారులు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిన్న చూపుకు గురి అయిన వారే. ఒకరు బలయ్యారు.. మరొకరు అవుతున్నారు. ఆ ఇద్దరూ ఎవరంటే ఒకరు ఎల్‌వి సుబ్రహ్మణ్యం. రెండో వారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీనియర్ అయినా ఎల్‌వి సుబ్రహ్మణ్యంకు జగన్ కేసుల్లో సహా ముద్దాయిగా ఉన్నారని ప్రాధాన్య పోస్టులు ఇవ్వలేదు. ఒక సందర్భంలో కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి పోస్టు ఇచ్చినా మళ్ళీ ఆయనను అక్కడ నుంచి తీసి అత్యంత చిన్నదైన యువజన శాఖకు మార్చారు. ఇక రమేష్ కుమార్ పరిష్తితి కూడా దాదాపుగా అంతే. చంద్రబాబు హయాంలో ఆయనకు ఏ కీలక శాఖ లభించలేదు. ఈ ఇద్దరూ వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రతిభకు తగిన గుర్తింపు పొందారు. ఎల్‌వి సుబ్రహ్మణ్యం, రమేష్ కుమార్ ఇద్దరూ ఆర్ధిక శాఖను నిర్వహించిన వారే. ఆర్ధిక శాఖలో ఈ ఇద్దరిదీ ప్రత్యేకమైన శైలి అని వారితో సాన్నిహిత్యం ఉన్న అధికారులు అంటారు. రాష్ట్రంలో ఆర్ధిక క్రమశిక్షణ తీసుకురావడంలో బిల్లుల చెల్లింపు తదితర విషయాలలో ఎలాంటి వివాదాలు రాకుండా చూసిన వారన్న విషయాన్ని మర్చిపోలేం అని చెప్తున్నారు. ఆర్ధిక క్రమశిక్షణ తీసుకురావడం, జవాబుదారీతనం, దుబారా తగ్గించడం వంటి విషయాల్లో ఈ ఇద్దరూ అనేక చర్యలు తీసుకున్నారు.వీరికి ఇంకో పోలిక కూడా ఉంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఎల్‌వి సుబ్రహ్మణ్యం ఇద్దరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారులుగా పని చేశారు. ఈ ఇద్దరి హయాంలో తిరుమల పవిత్రత రెండింతలు పెరగడమే కాకుండా క్రమ శిక్షణ ఉండేదన్న విషయం మర్చిపోరాదు. భక్తుల సౌకర్యార్ధం ఈ ఇద్దరి హయాంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎంతో సీనియర్ రాజకీయ నాయకులు ట్రస్టు బోర్డు చైర్మన్లుగా ఉన్నా కూడా ఎల్‌వి సుబ్రహ్మణ్యం, రమేష్ కుమార్ ఈవోలుగా ఉన్నప్పుడు వీరు చెప్పినట్లే నడచుకునేవారన్న పేరుండేది. వృత్తి పట్ల అంతటి నిబద్ధతతో ఈ ఇద్దరు అధికారులు పని చేశారు. అత్యంత సీనియర్ అయిన ఎల్‌వి సుబ్రహ్మణ్యం ను పక్కన పెట్టి ఆయన కన్నా జూనియర్లకు చంద్రబాబునాయుడు చీఫ్ సెక్రటరీ పదవిని అప్పగించారు. అయినా ఎల్‌వి సుబ్రహ్మణ్యం ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యని విషయం మనం చూసాం. సార్వత్రిక ఎన్నికల సమయంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునేటాను పక్కన పెట్టి కేంద్ర ఎన్నికల సంఘం ఎల్‌వి సుబ్రహ్మణ్యంను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఎన్నికల కమీషన్ ప్రధాన కార్యదర్శిగా నియమించాక సహ ముద్దాయిని సిఎస్ గా ఎలా నియమిస్తారని విమర్శించారు కూడా.   ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన జగన్ ఎల్‌వీ ని కొనసాగించగా జగన్ ను అందరూ మెచ్చుకున్నారు కూడా. అయితే ఏమైందో ఏమూ కానీ కొద్ది కాలంలోనే ఎల్‌వి ని అత్యంత అవమానకరంగా పదవి నుంచి జగన్ తొలగించిన విధానం కూడా తెలిసిందే. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు కూడా దాదాపుగా అలానే జరిగింది. ఆయనను రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమించడం చంద్రబాబుకు అస్సలు ఇష్టం లేదు. చంద్రబాబు దగ్గర పని చేయడం రమేష్ కుమార్ కూ ఇష్టం లేదని అంటారు. అయితే తన కార్యదర్శిగా పని చేసిన రమేష్ కుమార్ కు రాష్ట్ర ఎన్నికల సంఘానికి నియమించాలని అప్పటి గవర్నర్ ఇ ఎస్ ఎల్ నర్సింహన్ చంద్రబాబుపై వత్తిడి తెచ్చారనీ. గత్యంతరం లేని పరిస్థితుల్లో చంద్రబాబు రమేష్ కుమార్ కు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని అప్పగించారనీ అంటున్నారు. రమేష్ కుమార్ పేరు బదులు వేరే అధికారి పేరు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేశామని చంద్రబాబు కూడా చెప్పారు. అటువంటి రమేష్ కుమార్ ఇప్పుడు చంద్రబాబు ఏజెంటుగా జగన్ చేతిలో ముద్ర వేయించుకోవడం దురదృష్టం. ఈ ఇద్దరూ ముక్కుసూటిగా మాట్లాడే అధికారులు. ఎలాంటి మొహమాటం లేకుండా విధులు నిర్వర్తించే వారన్న పేరుంది. అలాంటి ఈ ఇద్దరూ కూడా అత్యంత ఘోరమైన అవమానాన్ని పొందారు. ఈ అవమానాలకు వీరు అర్హులు కాదని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చని అధికార వర్గాలు అనుకుంటున్నారు. నాయకులు తమ స్వంత ప్రయోజనాల కోసం అఖిల భారత సర్వీసు అధికారులకు కులాలు, ప్రాంతాలు అంటగట్టడం ఏంటని కొందరు ఆవేదన చెందుతున్నారు.

ఆంధ్ర లో బీజేపీ 'పంచ్' తంత్రం...

  * దిగుమతి నాయకులు, బిజినెస్ లీడర్లు, లాబీయిస్టులు కలిసి బీ జె పి ని ఎటు నడిపిస్తారో....  * ఇంతకీ స్థానిక సమరం లో సత్తా చూపించే ట్యాలెంట్ ఆ పార్టీకి ఉన్నట్టా, లేనట్టా....  * జి వి ఎల్ ఋతుపవనాల్లాంటి వారు... ఇలావచ్చి అలా పలకరించి, అటు నుంచి ఆటే మాయమైపోతారు  * సి ఎం రమేష్ లాబీ మాస్టర్ గా ఢిల్లీ లో ప్రసిద్ధులు.. నోకియా మాదిరి ఈయన కూడా కనెక్టింగ్ పీపుల్ నినాదాన్ని బలంగా నమ్మిన వారు  * సుజనా చౌదరి... గత్యంతరం లేని పరిస్థితుల్లో అమరావతి నినాదాన్ని భుజాన వేసుకుని చందమామ కథలో విక్రమార్కుడి మాదిరి ... వై ఎస్ ఆర్ సి పి లోని బేతాళుడి తో జగడమాడుతుంటారు  * టీ జీ వెంకటేష్.. అవసరార్ధ రాజకీయాల కు కేరాఫ్ అడ్రెస్ .... రాయలసీమ అనేది ఈయనకు ట్యాగ్ లైన్ ...దురదపుట్టినప్పుడు గోక్కోవటానికి ఉపయోగపడే ఆరో వేలుగా ఆయన ఆ నినాదాన్ని బాగా వాడేస్తారు..  * అంగ వంగ కళింగ రాజ్యాలను అవలీలగా గెలిచిన చక్రవర్తి, చివరకు ఆముదాలవలస లో ఓడిపోయినట్టు, రాష్ట్ర బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ , చివరకు పవన్ కళ్యాణ్ తో కలిసి స్థానిక సమరం లో బీజేపీకి కాస్తో కూస్తో ఉన్న ఇమేజ్ ని పణం గాపెట్టే సాహసానికి ఒడిగట్టారు  ఆ ఐదుగురూ ఇంతకీ ఏమి చేస్తున్నట్టు..భారతీయ జనతా పార్టీ దిగుమతుల విభాగం నుంచి డంప్ అయిన జి వి ఎల్ నరసింహారావు , అలాగే తెలుగు దేశం నుంచి బీ జె పి లోకి దిగుమతి అయిన సుజనా చౌదరి, సి ఎం రమేష్, టీ జీ వెంకటేష్ , కాంగ్రెస్ లో నుంచి బీ జె పి లోకి షిఫ్ట్ అయిన  బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ  నారాయణ కలిసి ఈ స్థానిక సమరం లో రాష్ట్రం మొత్తం మీద కనీసం ఒక్కొక్కరికి 50 చొప్పున 250 మంది ఎం పి టి సి లు, జెడ్ పీ టి సి లను  గెలిపించుకురాగలరా అనేది చాలా పెద్ద సందేహం గా కనిపిస్తోంది. ఎందుకంటే, నిన్ననే విజన్ డాక్యుమెంట్ ని కలిసి ఆవిష్కరించిన బీ జె పి , జన సేన కంబైన్ నేతలు , చాలా పెద్ద  దృశ్యాన్నే జనం ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. వై ఎస్ ఆర్ సి పి, తెలుగుదేశం పార్టీ లకు తామే ప్రత్యామ్నాయమన్నట్టు గా ప్రకటించుకున్న ఈ ఐదుగురిదీ  వాస్తవానికి తలో దారీ.. ఎవరు , ఎప్పుడు, ఎందుకు, ఎలా మాట్లాడతారో తెలీని గందర గోళం ....  జి వి ఎల్ నరసింహ రావు ది అయితే సొంత రాజ్యాంగం, పూర్తిగా పార్టీ రాష్ట్ర శాఖ తో  గానీ, లేదా బీ జె పి లో ఉన్నతెలుగుదేశం మాజీ లతో  కానీ ఈయనకు ఎలాంటి సంబంధాలు ఉండవు.  రాష్ట్రాన్ని ఎప్పుడైనా పలకరించడానికి రుతు పవనాల మాదిరి అలా చుట్టపు చూపు గా వచ్చేసి ,  ఇలా మాయమైపోయే  జి వి ఎల్ వ్యవస్థ ల గురించి రాష్ట్ర బీ జె పి లో ఎవరికీ ఎలాంటి క్లూలు ఉండవు. ఈయన దారి రహదారి. ఈయన వ్యవస్థ ఇలాఉంటే, బీ జె పి లో ఉంటూ కూడా ఇంకాతెలుగు దేశం ఎజెండా , జెండా రెండూ మోస్తున్నట్టు కనిపించే సుజనా చౌదరి ఒక్క అమరావతి అంశం మీద తప్పించి, ఇతరత్రా ఏదీ మాట్లాడటానికి ఎక్కువగాఇష్టపడరు. జీ వీ ఎల్ కు, సుజనా కూ క్షణం పడదు. ఆయన ఎడ్డెం అంటే ఈయన తెడ్డెం అనే రకం.. ఏ మాత్రం పొసగని,పొంతన లేని పరస్పర భిన్నమైన అభిప్రాయాలు గల వీరిద్దరూ ఉత్తర ధృవం, దక్షిణ ధృవం మాదిరి ఒకే పార్టీ లో ఉంటూ కూడా కామన్  ఎజెండా తో పని చేసిన దాఖలాలు ఇప్పటివరకూ అయితే లేవు.   ఇహ, సి ఎం రమేష్ గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఆయన తన బిజినెస్ వ్యవహారాలను బీ జె పి తో ముడి కట్టేసి, ఏ పార్టీ లో ప్రయాణిస్తున్నాడో కూడా మర్చే పోయి, మొన్నటికి మొన్న పరిమళ్ నత్వాని ని జగన్ మోహన్ రెడ్డి దగ్గర ప్రవేశ పెట్టడం లో కీలక పాత్ర పోషించిన  ఘనుడు. గుర్తు చేస్తే కానీ తానూ బీ జె పి లో ఉన్నాననే విషయం గుర్తుండని ఈయన కు  బీ జె పి, జన సేన కలిసి పోటీ  చేస్తున్న విషయం తెలుసో లేదో అని కూడాపార్టీ శ్రేణులు గుసగుస లాడుకుంటున్నాయి.  ఇహ వీరందరినీ సమన్వయము చేసుకుని  ముందుకెళ్తున్నట్టు భావిస్తూ , బాహ్య ప్రపంచం ముందు ఆవిష్కృతమయ్యే  వ్యక్తి మరెవరో కాదు... సాక్షాత్తూ  రాష్ట్ర బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ. ఈయన, పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రయాణించటానికి అంతగాసుముఖం గా లేదు...కారణమేమిటంటే, చంద్రబాబు నాయుడు లాంటి యోధులతో పోరాడిన తన రాజకీయం , చివరకు ఇలా ఏ పూట ఎక్కడ ఉంటారో కూడా తెలీని పవన్ కళ్యాణ్ పార్టీతో కలిసి పని చేయాల్సిన దుస్థితికి దిగజారటమేమిటని  తరచూ తనలో తానె కుమిలి పోతున్నట్టు సమాచారం.  ఇహ, టీ జీ వెంకటేష్ అయితే మరీను..... రాయలసీమ నినాదాన్ని తన ట్యాగ్ లైన్ గాచేసుకుని కాలక్షేపం చేసేస్తూ... ప్రస్తుతానికి బీ జె పి లో నివసిస్తూ ....ఈ స్థానిక ఎన్నికల సమరం లో తన పాత్ర ఏమిటో కూడాతెలీకుండా జీవనం వెళ్లదీస్తున్నారు. మొత్తానికి ఈ పంచ పాండవులు స్థానిక సమరం లో తమ 'పంచ్ ' పవర్ ఏమిటో ఈ నెలాఖరు లోగా చుపిస్తారేమోననే బోలెడు , ఇంకా గంపెడాశతో బీ జె పి అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.

ఏపీలో వంద కోట్ల దందా.. రియల్ క్రైమ్ స్టోరీ

సినిమాలలో ఎన్నో క్రైమ్ స్టోరీలు, ఎన్నో కిడ్నాప్ సీన్లు చూసుంటారు. అయితే.. కాకినాడలో జరిగిన ఈ రియల్ స్టోరీ ముందు ఆ రీల్ స్టోరీలన్నీ చిన్నబోతాయి. పేరున్న రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్న అధికారులు.. ఇలా భారీ తారాగణం నటించిన.. ఆ రియల్ స్టోరీ టైటిల్ వచ్చేసి.. "ఓ కిడ్నాప్, వంద కోట్ల స్కాం". 'నేనే రాజు నేనే మంత్రి' మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది. మీరు ఏ పార్టీకి ఓటేసినా మేమే అధికారంలో ఉంటామని. అవును.. కొందరు రాజకీయ నాయకులు.. ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీని గెలిపిస్తే.. ఆ పార్టీలోకి జంప్ చేస్తారు. అలాగే అధికారులు కూడా.. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నేతలని కాకాపడుతూ వారి ఆటలు సాగిస్తుంటారు. ఈ రియల్ స్టోరీ వింటే అది నిజమని మీకే అర్ధమవుతుంది. కాకినాడలోని సర్పవరంకి చెందిన ఆకుల గోవిందరాజు అనే వ్యక్తికి భోగాపురంలో వంద కోట్ల విలువైన 18 ఎకరాల ల్యాండ్ ఉంది. ఈ ఒక్క విషయం చాలదా.. మాఫియా కన్ను ఆయన మీద పడటానికి. ఎక్కడో ఆకాశంలో ఎగురుతున్న గద్దకి కింద ఉన్న కోడిపిల్ల కనిపించినట్టు.. మాఫియా వాళ్ళకి ఎక్కడున్నా విలువైన ల్యాండ్స్ కనిపిస్తాయి కదా. అలాగే, బలగ ప్రకాష్ అనే మాఫియా లీడర్ కి.. ఆకుల గోవిందరాజుకి చెందిన ల్యాండ్ పై కన్నుపడింది. ఇంకేముంది ఏకంగా పోలీసులనే రంగంలోకి దింపాడు. ఇక పోలీసులైతే ఓ అడుగు ముందుకేసి ఏకంగా కిడ్నాప్ కే తెరలేపారు. 2017.. సెప్టెంబర్ 19 .... శూన్యమాసం.. అమావాస్య.. మంగళవారం.. మధ్యాహ్నానికి- సాయంత్రానికి నడుమ సూర్యుడు మండిపోతున్న సమయం... అబ్బా ఏమన్నా ముహూర్తమా... శూన్యమాసం.. అమావాస్య.. మంగళవారం.. ఇదే కిడ్నాప్ కి సరైన ముహూర్తం అనుకున్నారేమో పోలీసులు... AP 30 AB 6655 నెంబర్ గల ఇన్నోవా కార్ లో.. పోలీసులు ఆకుల గోవిందరాజు ఇంటికి వచ్చారు. కారు నెంబర్ ఫ్యాన్సీగా ఉన్నా, ఆ ఖాకీలు చేసే పని మాత్రం ఏ మాత్రం పద్దతిగా లేదు. వాళ్ళు చేసే పనేంటో ఆ చుట్టుపక్కల ఉన్నవారికి తెలియదు. కొత్త మొహాలు కావడంతో.. చుట్టుపక్కల వారు కొందరు ఆశ్చర్యంతో, కొందరు అనుమానంతో చూస్తున్నారు. వాళ్ళు అలా చూస్తుండగానే.. దొంగల రూపంలో వచ్చిన పోలీసులు.. గోవిందరాజుని ఇన్నోవాలో పడేసి.. జెట్ స్పీడ్ లో హైవే ఎక్కారు. పోలీసుల భాషలో చెప్పాలంటే దీనినే కిడ్నాప్ అంటారు. కారు హైవే మీద దూసుకెళ్తుంది. ఆ స్పీడ్ చూస్తే.. అంబులెన్స్ డ్రైవర్ కావాల్సిన వ్యక్తి ఇన్నోవా డ్రైవ్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. డ్రైవర్ స్టీరింగ్ పట్టుకుంటే.. మనం ఖాళీగా ఉండి ఏం చేస్తాం అనుకున్నారేమో.. మిగతా పోలీసులు గోవిందరాజు పనిపెట్టారు. కారు.. కాకినాడ నుంచి భోగాపురం చేరేవరకు.. అంటే దాదాపు నాలుగు గంటల పాటు... గోవిందరాజుని భయపెట్టారు.. బెదిరించారు.. చిత్రహింసలు పెట్టారు. ఒక్కమాటలో చెప్పాలంటే నరకం చూపించారు. కారు సాయంత్రం 6 గంటలకు భోగాపురం సబ్ రిజిస్టార్ ఆఫీస్ కి చేరుకుంది. ఖాకీలకు భయపడ్డాడో, కాసులకు కక్కుర్తి పడ్డాడో తెలియదు కానీ.. సబ్ రిజిస్టార్ పందిళ్లపల్లి రామకృష్ణ.. సాయంత్రం 4:30 కే రిజిస్ట్రేషన్ కాగితాలు సిద్ధం చేసి.. పదేళ్ల తర్వాత ఫారెన్ నుంచి రిటర్న్ వస్తున్న ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తున్నట్టు.. గుమ్మం వైపు చూస్తూ పోలీసుల కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో పోలీసులు గోవిందరాజుని తీసుకొని గుమ్మంలోకి అడుగు పెట్టనే పెట్టారు. గుమ్మంలో వాళ్ళ అడుగు పడిందో లేదో.. సబ్ రిజిస్టార్ మోహంలో వెలుగు వచ్చింది. గోవిందరాజు మోహంలో భయం పెరిగింది. భయంతో చూస్తుండగా ఎదురుగా కుర్చీలో కూర్చొని ఉన్న మాఫియా లీడర్ బలగ ప్రకాష్ కనిపించాడు. జర్నీలో పోలీసుల చిత్రహింసలతో భయపడిపోయిన గోవిందరాజు.. బలగ ప్రకాష్ ని చూసి మరింత భయపడ్డాడు. బలగ ప్రకాష్.. పోలీసుల మాదిరి సాగదియ్యలేదు.. కమర్షియల్ సినిమాల్లో విలన్ లాగా ఒక్కటే డైలాగ్ కొట్టాడు.. "సంతకం పెడతావా? సమాధిలో పడుకుంటావా?".... ఆ ఒక్క డైలాగ్ తో గోవిందరాజు భయం చావుభయంగా మారిపోయింది. ఎదురుగా మాఫియా లీడర్.. చుట్టూ భోగాపురం సీఐ నర్సింహారావు, ఎస్సైలు తారక్, మహేష్.. హెడ్ కానిస్టేబుల్ గోవిందరావు.. ఉన్నారు. ఎస్సైల పేర్లు తారక్, మహేష్ అని హీరోల పేర్లు ఉన్నాయి కానీ.. వాళ్ళ బిహేవియర్ మాత్రం పెద్ద విలన్ల పక్కన ఉండే చెంచా విలన్లు లాగా ఉంది. అన్యాయాన్ని అడ్డుకోవాల్సిన పోలీసులే.. మాఫియా లీడర్ తో కలిసిపోయి.. చిత్రహింసలు చేసి బెదిరిస్తుంటే.. తప్పనిసరి పరిస్థితుల్లో, వంద కోట్లు కంటే విలువైన ప్రాణం కోసం, అన్యాయం ముందు తలవంచి గోవిందరాజు సంతకం పెట్టాడు. ఆ ఒక్క సంతకంతో.. గోవిందరాజు మొహంలో తప్ప.. అక్కడున్న అందరి మొహాల్లో లక్ష్మీకళ ఉట్టిపడింది. అన్నట్టు ఇంత జరుగుతున్నా అక్కడ ఇతరులు ఎవరూ లేరా? అని మీకు అనుమానం రావొచ్చు. అక్కడ నిజంగానే ఎవరూ లేరు.. ఎందుకంటే వాళ్ళు పెట్టిన ముహూర్తం అలాంటిది మరి. శూన్యమాసం-అమావాస్య.. బుద్ధి ఉన్నోడు ఎవడైనా రిజిస్ట్రేషన్ పెట్టుకుంటాడా? వీళ్లంటే.. వంద కోట్ల కబ్జా ల్యాండ్ కాబట్టి.. బుద్ధిని పక్కనపెట్టి.. బెదిరించి.. రిజిస్ట్రేషన్ చేపించుకున్నారు. ఇప్పుడు అర్థమైందా వాళ్ళ శూన్యమాసం-అమావాస్య కాన్సెప్ట్ ఏంటో?!!.. ఈ కిడ్నాప్- కబ్జా వ్యవహారంపై.. సర్పవరం పోలీస్ స్టేషన్ లో 330/217 నెంబర్ తో కేస్ రిజిస్టర్ అయింది. అదేంటో.. FIR కూడా అయిన తరువాత.. చార్జిషీట్ దాఖలు చేయడానికి.. రాజమౌళి RRR చేయడానికి తీసుకునే టైం కన్నా ఎక్కువ తీసుకుంటున్నారు సర్పవరం పోలీసులు. రెండున్నరేళ్లుగా నాన్చుతూనే ఉన్నారు. ఈ విషయం గురించి.. ఏపీ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కాకినాడ పోలీసులు రిపోర్ట్ కూడా పంపారు. కానీ చార్జిషీట్ దాఖలు చేసే విషయంలో సర్పవరం సీఐ డిలే చేస్తూనే ఉన్నాడు. ఏంటి ఆ సీఐ ధైర్యం?.. భయపడితే భయపడటానికి ఆయన పోస్ట్ మ్యాన్ కాదు.. పోలీసోడు.. దానికితోడు పొలిటిషీయన్స్ సపోర్ట్ ఉన్నోడు. అవును.. ఈ వ్యవహారంలో.. బడా పొలిటిషీయన్స్ సపోర్ట్ కూడా ఉంది. అదే పోలీసుల ధైర్యం... శ్రీకాకుళం జిల్లాకి చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ నేత.. అలాగే గత ప్రభుత్వ హయాంలో విప్ గా పనిచేసిన నేత.. వీరిద్దరి సాయంతో సర్పవరం పోలీస్ స్టేషన్ ని ఫుల్ గా influence చేసే ప్రయత్నం బలంగా నడుస్తుంది. అందుకే చార్జిషీట్ కి మోక్షం కలగట్లేదు. ఇంత పెద్ద కిడ్నాప్- కబ్జా జరిగితే అస్సలు చర్యలే తీసుకోకుండా ఎలా ఉన్నారని అనుకుంటున్నారేమో... అబ్బో చాలా పెద్ద చర్య తీసుకున్నారు. భోగాపురం ఇన్స్పెక్టర్ ని బదిలీ చేసారు. అదేంటి!!.. అంత జరిగితే కేవలం బదిలీనా అనుకోవద్దు.. రాజకీయ ఒత్తిళ్లు అలాంటివి మరి.. అర్థంచేసుకోవాలి... ఇంకో విషయం ఏంటంటే.. ఈ వ్యవహారం డీజీపీ ఆఫీస్ కి కూడా చేరింది. మరి ఇంకేంటి.. వెంటనే అందరి మీద చర్యలు తీసుకొని ఉంటారుగా అంటారా? అబ్బో.. మీరు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ సినిమాలు చూసి బాగా మోసపోయారు... అలాంటి పప్పులు ఇక్కడ ఉడకవు. వాస్తవానికైతే... CRPC 41A కింద డీజీపీ నియమించే ఓ సీనియర్ అధికారి.. విచారణ జరిపి.. తదుపరి చర్యల వరకు.. ఆ సీఐని సస్పెండ్ చేసే అవకాశముంది. కానీ ఇక్కడ అలాంటిదేం జరగలేదు. ఏదో ఫార్మాలిటీకి బదిలీతో సరిపెట్టారు. గోవిందరాజు ని బెదిరించి వంద కోట్ల విలువైన ల్యాండ్ అన్యాయంగా లాక్కున్నారు. అయినా తప్పు చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు. పైగా గోవిందరాజునే ఇంకా టార్చర్ చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లలో భాగంగా.. ప్రస్తుత సర్పవరం సీఐ మరియు అర్బన్ డీఎస్పీ.. గోవిందరాజుని పదేపదే తిప్పించుకుంటున్నారు. ఇక కాకినాడలో ఉద్యోగం వెలగపెడుతున్న.. ఇప్పటి ఓ మంత్రిగారి బావమరిది.. రంగంలోకి దిగడంతో ఈ కేసు మరింత డైల్యూట్ అయింది. అసలే భోగాపురంలో ఎయిర్ పోర్ట్ అంటున్నారు. రెక్కలున్న విమానాలు వస్తున్నాయి అంటే.. ఆటోమేటిక్ గా భూముల ధరలకు రెక్కలొస్తాయి కదా.. అందుకే పోలీసులు- పొలిటీషియన్స్ అండతో మాఫియా ఇంతలా రెచ్చిపోతుంది. అంతేకాదు.. ఈ వ్యవహారం వెనుక.. 2017 ప్రాంతంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పనిచేసిన ఓ కలెక్టర్ మరియు ఎస్పీ పాత్ర ఉన్నట్టు.. సెక్రటేరియట్ వర్గాల వద్ద స్పష్టమైన సమాచారం ఉంది. టీడీపీ పెద్దతలకాయలకు సన్నిహితులైన ఈ ఐఏఎస్, ఐపీఎస్ లు.. వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా తమ హవా కొనసాగించడం... అందరినీ ముక్కు, మూతి ఇలా అన్నింటి మీదా వేలేసుకునేలా చేస్తుంది. ఇంతకీ ఆ ఐఏఎస్ & ఐపీఎస్ ఎవరు? * ఒకరు.. పరుల అవినీతి మీద కాంతివంతంగా దండెత్తే ఐఏఎస్... * ఇంకొకరు.. పొద్దునలేస్తే సుభాషితాలు చెప్పే పాలమీగడ లాంటి ఐపీఎస్.. ఈయనకి టెక్నాలజీ మీద గ్రిప్ బాగా ఎక్కువ. ఈ వ్యవహారంలో వీరిద్దరి పాత్ర కూడా ప్రముఖంగా ఉంది. 'వంద గొడ్లను తిన్న రాబందు కూడా ఒక్క గాలివానకు కూలిపోతుంది' అన్నట్టు.. ఈ అవినీతి రాబందులను భయపెట్టే గాలివాన ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. మాఫియా లీడర్ బలగ ప్రకాష్ కనుసన్నల్లో.. ఐఏఎస్, ఐపీఎస్లు, పోలీసులు, పొలిటీషియన్స్ అండతో జరిగిన ఈ అన్యాయంపై.. గోవిందరాజు కొద్ది నెలలుగా పోరాడుతూనే ఉన్నాడు. న్యాయం కోసం ఆయన ఎక్కని గుమ్మం దిగని గుమ్మం లేదు. సన్నిహితుల సాయంతో న్యాయం కోసం పోరాడుతున్నాడు. ఆ పోరాడంతో కొన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. వాస్తవానికి అప్పుడు జరిగింది తప్పుడు రిజిస్ట్రేషన్ అని పేర్కొంటూ... భోగాపురం రిజిస్టార్ డాక్యుమెంట్ రైటర్.. 2019 అక్టోబర్ 19 తేదీన.. 164 CRPC స్టేట్మెంట్ ని.. కాకినాడ ఫస్ట్ అడిషనల్ జ్యూడిషల్ సివిల్ జడ్జ్.. ముందట ఇచ్చాడు. అంతేకాదు.. సీసీ కెమెరాలతో దొంగలని పట్టుకునే పోలీసులు.. ఆ సీసీ కెమెరాల పుణ్యమా అని అడ్డంగా బుక్ అయ్యారు. సర్పవరం లో కిడ్నాప్ చేసి.. భోగాపురం తీసుకెళ్లిన.. నాలుగు గంటల తతంగమంతా.. పలు చోట్ల సీసీ కెమెరాలలో రికార్డు అయింది. క్షవరం అయితే కానీ ఇవరం రాదని.. సీసీ కెమెరాలు చూసి దోషులని పట్టుకునే పోలీసులు.. ఆ సీసీ కెమెరాల సంగతి మర్చిపోయి ఇలా దొరికిపోవడం కామెడీగా ఉంది. మొత్తానికి కొద్దికొద్దిగా కదులుతున్న తీగతో.. దందా చేసి ఇన్నాళ్లు డొంకలో దాక్కున్నవారు.. ఇప్పుడిప్పుడే భయంతో వణుకుతున్నారు. ముఖ్యంగా డీజీపీకి కంప్లైంట్ వెళ్లడంతో ఐఏఎస్, ఐపీఎస్ ఒణికిపోతున్నారట. మరి ముఖ్యంగా ఆ ఐపీఎస్ అయితే.. డైపర్ వేసుకొని తిరుగుతున్నాడని టాక్... ఇప్పటికే ఆ ఐపీఎస్ గడిచిన రెండు నెలల్లో.. బలగ ప్రకాష్ టీం తో.. ఒకే హోటల్ లో 17 సార్లు సిట్టింగ్ వేశాడు. దీన్నిబట్టే అర్థంచేసుకోవచ్చు ఆ ఐపీఎస్ ఎంతలా వణికిపోతున్నాడో!! తప్పుని సరిదిద్దాల్సిన పోలీసులే.. ఇంత పెద్ద తప్పు చేశారు. ఈ విషయం డీజీపీ దృష్టికి కూడా వెళ్ళింది. మరి ఆయన ఈ కిడ్నాప్-కబ్జా వ్యవహారంలో ఇన్వాల్వ్ అయినవారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు?.. బాధితుడికి ఎప్పుడు న్యాయం చేస్తారు? ఆయన ఇలాగే మౌనంగా ఉంటే ప్రజలకు పోలీసు వ్యవస్థ మీదే నమ్మకం పోతుంది. ఇక ఈ విషయంలో సర్కార్ కూడా అడుగు ముందుకేసి బాధితుడికి న్యాయం చేయాల్సిన అవసరముంది. అవినీతి రహిత పాలనే అందించడమే తమ లక్ష్యమని చెప్పుకునే అధికారపార్టీ.. అవినీతి-అన్యాయం చేసిన వారికి.. పరోక్షంగా అండగా ఉండటం ఎంత వరకు కరెక్ట్? గత ప్రభుత్వం మీద, అప్పుడు వారికి సన్నిహితంగా ఉన్న కొందరు అధికారులపైనా.. ఇప్పటి అధికారపార్టీ నేతలు పదేపదే అవినీతి ఆరోపణలు చేస్తుంటారు. మరి ఈ వ్యవహారం మీద ఎందుకు నోరు మెదపడం లేదు? ఇందులో తమ పార్టీ నేతలు కూడా ఉన్నారా? లేక పార్టీ సీనియర్ నేతైన మంత్రి గారి బావమరిది ఇన్వాల్వ్ అయ్యాడని వెనకడుగు వేస్తున్నారా? ప్రభుత్వం దీనిపై స్పందించాలి. ఈ భోగాపురం భాగోతం వెనుకున్న వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి.. బాధితుడికి న్యాయం చేయాలి. లేదంటే ప్రభుత్వం మీద కూడా నమ్మకం పోతుంది.  

క‌విత‌, ష‌ర్మిలా రాజ్య‌స‌భ‌కు వెళ్తారా?

తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ సీట్ల కోసం అధికార టీఆర్ఎస్‌లో పోటాపోటీ నెలకొంది. షెడ్యూల్‌ ప్రకారం రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్‌ మార్చి 6న జారీ కానుంది. 13వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది.  సామాజిక కోణంలో తమకు అవకాశం దక్కుతుందని పలువురు సీనియర్లు భావిస్తుండగా, ఇప్పటివరకు పార్టీ తరఫున రాజ్యసభ పదవులు దక్కని వర్గాల వారూ ఆశగా ఎదురుచూస్తున్నారు. పార్టీ అధినేత కేసీఆర్‌ నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.  నిజామాబాద్‌ మాజీ ఎంపీ కవితను ఈసారి పార్టీ తరఫున రాజ్యసభకు పంపిస్తార‌నే ప్ర‌చారం విస్తృతంగా జరుగుతోంది. అయితే సి.ఎం. కేసీఆర్ ఆలోచ‌నే ఎలా వుందో ఎవ‌రూ అంచ‌నా వేయ‌లేక‌పోతున్నారు. కెటిఆర్ సి.ఎం. అవుతారా? క‌వితా రాజ్య‌స‌భ‌కు వెళ్తారా?  అయితే హ‌రిష్‌రావు ఈ ప‌రిణామాల‌పై ఎలా స్పందిస్తారు? అనే అంశంపై టిఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌ల్లో విస్తృతంగా చ‌ర్చ జ‌రుగుతోంది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్న సీఎం కేసీఆర్‌ తన తరఫున ఢిల్లీ, ఇతర రాష్ట్రాల్లో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు ప్రయత్నాలకు నమ్మకమైన వారి కోసం అన్వేషిస్తున్నారు.  రాజ్యసభ సీటు భర్తీ సామాజిక కోణంలోనే ఉంటుందని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు భావిస్తున్నారు. ఏపీ కోటాలో పదవీ విరమణ చేస్తున్న టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావుకు వయసు రీత్యా ఈసారి అవకాశం ఉండకపోవచ్చన్న అంచనాలున్నాయి. రెడ్లకు అవకాశం లభిస్తే, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, మాజీీ స్పీకర్‌ కె.ఆర్‌.సురే్‌షరెడ్డి, ఎమ్మెల్సీ నాయిని నర్సింహారెడ్డి మధ్య పోటీ ఉంటుందని చెబుతున్నారు. కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే మండవ వెంకటేశ్వరావు, తుమ్మల నాగేశ్వరరావు పేర్లు పరిశీలించవచ్చని అంటున్నారు. బీసీలకు అవకాశం ఇస్తే సిరికొండ మధుసూదనాచారి, బస్వరాజు సారయ్య పేర్లు పరిశీలిస్తారని చెబుతున్నారు. ఎస్సీ కోటాలో భర్తీ చేయాలని భావిస్తే కడియం శ్రీహరి, మాజీ ఎంపీ మంద జగన్నాథం పేర్లు పరిశీలిస్తారని అంటున్నారు. ఎస్సీల్లోనే మాలలకు అవకాశం ఇవ్వాలని అనుకుంటే, టీఎ్‌సఐఐసీ చైర్మన్‌ గాదరి బాలమల్లు, ఎస్టీ అయితే సీతారాంనాయక్‌ పేరు ఉండొచ్చని అంటున్నారు. అనూహ్యంగా ఒక పారిశ్రామికవేత్తను టీఆర్‌ఎస్‌ తరఫున రాజ్యసభకు పంపాలని అనుకుంటే హెటిరో అధినేత పార్థసారథిరెడ్డి పేరు పరిశీలించవచ్చని చెబుతున్నారు.  ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజ్యసభ స్థానాలు ఎవరికీ కేటాయించాలని ఇన్నాళ్లు చర్చించిన అధికార పార్టీ ఓ నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది. ఈ మేరకు ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే వారి జాబితా సిద్ధమైనట్టు సమాచారం.  కీలకమైన పదవులు కావడంతో పార్టీ నమ్ముకున్నోళ్లు.. తమకు అండగా నిలబడిన వ్యక్తులను ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాల్లో వార్త వినిపిస్తోంది.  మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి - సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మాజీమంత్రి - ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రఘువీరారెడ్డి కాకుంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ జాబితా ఫైనలైనట్టు తెలుస్తోంది.  షర్మిల ఆపద సమయంలో జ‌గ‌న్‌కు తోడుగా నిలిచారు. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ పాదయాత్ర చేశారు. కష్టకాలంలో పార్టీకి షర్మిల పెద్ద దిక్కుగా నిలిచారు. తన సొంత మీడియా సాక్షి ప్రారంభించినప్పటి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ తో ఉన్నారు. సాక్షి పత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ గా కొనసాగుతూనే జగన్ కు రాజకీయాలపై సలహాలు సూచనలు ఇచ్చారు. ఆ తర్వాత సజ్జలను పార్టీలోకి ఆహ్వానించి పెద్ద పదవే ఇచ్చారు. విజయ సాయిరెడ్డి తర్వాత జగన్ కు అత్యంత నమ్మకస్తుడు సజ్జలనే. ఆయన పార్టీలో జగన్ రాజకీయ సలహాదారుడిగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో పని చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడిగా కొనసాగుతున్నారు. కడప జిల్లాకు చెందిన వ్యక్తి. ఎప్పుడూ తన తోడు ఉండడంతో ఆయనను రాజ్యసభకు జగన్ పంపించనున్నట్టు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాకు చెందిన వైవీ సుబ్బారెడ్డి జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నారు. గతంలో ప్రకాశం ఎంపీగా సుబ్బారెడ్డి పని చేశారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో సుబ్బారెడ్డి పోటీ చేయలేదు. అప్పుడు ఆయన పదవులు ఆశించకపోవడంతో ఇప్పుడు రాజ్యసభకు పంపించాలని నిర్ణయానికి వచ్చారు. పార్టీలో కీలక నాయకుడిగా గుర్తింపు పొందిన సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపితే న్యాయం జరుగుతుందనే భావనలో జగన్ ఉన్నారంట. అనూహ్యంగా రాజ్యసభకు పంపే జాబితాలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రఘువీరారెడ్డి ఉండడం గమనార్హం. అనంతపురము జిల్లాకు చెందిన రఘువీరారెడ్డికి పిలిచి మరి రాజ్యసభ సీటు ఇస్తామంటున్నారు. యాదవ సామాజికి వర్గానికి చెందిన రఘువీరారెడ్డి జగన్ తండ్రి వైఎస్సార్ తో మంచి అనుబంధం ఉంది. అయితే రఘువీరారెడ్డి కాకుంటే మరొకరిని కూడా దృష్టిలో పెట్టుకున్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జిగా పని చేసిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ను రాజ్యసభకు పంపించాలని భావిస్తున్నారంట.  కృష్ణాజిల్లా యాదవ సామాజిక వర్గానికి చెందిన చలమేశ్వర్ సేవలను వినియోగించుకునేలా పార్టీ ఒక నిర్ణయానికి వచ్చిందంట. ఎందుకంటే తరచూ జగన్ న్యాయస్థానాల్లో చిక్కులు ఎదుర్కొంటున్నారు. చలమేశ్వర్ సేవలు వినియోగించుకుంటే జగన్ సేఫ్ గా ఉండడంతో పాటు న్యాయ కోవిదుడికి గౌరవంగా రాజ్యసభను ఇద్దామనే ఆలోచనలో ఉన్నారంట.

అధికారంలో ఉంటే ఒకలా... ప్రతిపక్షంలో ఉంటే మరోలా... వైజాగ్ ఎపిసోడ్ నీతి ఏంటి?

రాజకీయాల్లో ఓడలు బళ్లు అవుతాయి. బళ్లు ఓడలవుతాయి. ప్రజాస్వామ్యంలో ఇది సాధారణమే. ప్రస్తుతం దేశంలోనూ, అనేక రాష్ట్రాల్లోనూ ఇదే జరుగుతోంది. నిన్నమొన్నటివరకు దేశంలోనూ, ఆయా రాష్ట్రాల్లో చక్రం తిప్పినవారంతా, అనామకులుగా మారిపోయారు. దశాబ్దాల తరబడి రాజ్యాన్ని ఏలినవారు, ఇప్పుడు సైడైపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో పలువురు ఉద్దండుల పరిస్థితి ఇప్పుడలాగే కనిపిస్తోంది. ఎంతోమంది ముఖ్యనేతలు తీవ్ర గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మళ్లీ వాళ్లకు మంచి రోజులు వస్తాయని మాత్రం కచ్చితంగా చెప్పలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండింటిలోనూ ఊహించని రాజకీయ మార్పులు జరగడంతో ఓడలు బళ్లు... బళ్లు ఓడలయ్యాయి.  అయితే, అధికారంలో ఉండగా ఒకలా, ప్రతిపక్షంలా ఉంటే మరోలా వ్యవహరించడం సర్వసాధారణంగా కనిపిస్తుంది. విపక్ష నేతగా ఉన్న సందర్భాల్లో నేతలు వ్యవహరించే తీరు ఒక్కోసారి సాధారణ ప్రజాస్వామిక సూత్రాలకు విరుద్ధంగా ఉంటుంది. నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడేళ్ళ క్రితం విపక్ష నేతగా ఉన్నారు. అప్పట్లో ఆయన ప్రత్యేక హోదా కోసం పట్టుదలతో ఉన్నారు. క్యాండిల్ ర్యాలీ నిర్వహించేందుకు వైజాగ్ పర్యటనకు వెళ్లారు. అప్పటికే అక్కడ సీఐఐ పార్ట్ నర్ షిప్ సమ్మిట్ జరుగుతోంది. ఆ నేపథ్యంలో క్యాండిల్ ర్యాలీకి అనుమతిని ప్రభుత్వం నిరాకరించింది. అయినా కూడా జగన్ వైజాగ్ చేరుకున్నారు. అక్కడి నుంచి నగరంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పట్లో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. తనను అడ్డుకోవడంపై అప్పట్లో విపక్ష నేతగా ఉన్న జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇక, ఇప్పడు ఏపీలో రాజధాని రగడ కొనసాగుతోంది. అందులో భాగంగా చంద్రబాబు చేపట్టిన వైజాగ్ యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇందులో పోలీసులను తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. అయితే, ఇలాంటి సమయంలో విపక్ష నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఎలాగైనా పోలీసు వలయాన్ని ఛేదించుకోవాలని తాము అనుకున్నది చేయాలని చూస్తుంటారు. పొలిటికల్ మైలేజ్ పొందాలని ప్రయత్నిస్తుంటారు. చంద్రబాబు వైజాగ్ టూర్లోనూ అదే జరిగిందనే మాట వినిపిస్తోంది. నాయకులు విపక్షంలో ఉన్నప్పుడు పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నించడంలో తప్పు లేదు. కాకపోతే...ఆ ప్రయత్నాలు సమాజంలో ఉద్రిక్తతలు పెంచేవిగా మాత్రం ఉండకూడదంటున్నారు. అదే సమయంలో అధికారంలో ఉన్న నాయకులు ప్రజాస్వామ్యంలో విపక్షాలకు ఉండే ప్రాధాన్యాన్ని గుర్తించాలని సూచిస్తున్నారు. అధికారపక్షం, విపక్షం....రెండూ ప్రజాస్వామ్యానికి రెండు చక్రాల్లాంటివని, ఏ ఒక్కటి సరిగా లేకున్నా ప్రజాస్వామ్యం కుంటుపడుతుందని గుర్తుచేస్తున్నారు.

రాజీవ్ గాంధీ మరణించాక ఆ సీక్రెట్ బయటపెట్టిన వాజపేయి!!

అమావాస్య రోజు చందమామని చూడాలనుకోవడం, రాజకీయాలలో విలువలు గురించి మాట్లాడాలనుకోవడం ఒకటే అంటుంటారు. అవును ఈ తరం రాజకీయాలను చూస్తే నిజమే అనిపిస్తుంది. ఒకరిపై ఒకరు హద్దు మీరి విమర్శలు చేసుకోవడమే తప్ప.. విలువైన రాజకీయాలు చేసేవారు ఎంతమంది ఉన్నారు ఈరోజుల్లో. ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రతిపక్ష నేతల మీద కక్ష తీచుకోవాలన్న ధోరణే తప్ప.. ప్రజల కోసం ఒకరి సూచనలను ఒకరు గౌరవించుకుంటూ విలువైన రాజకీయాలు చేసేవారు ఎక్కడున్నారు?. ఈతరం రాజకీయ నాయకులు ముందుతరం వారిని చూసి ఎంతో నేర్చుకోవాలి. మాజీ ప్రధానులు రాజీవ్ గాంధీ- వాజపేయి మధ్య జరిగిన ఓ సంఘటన తెలిస్తే.. ఈ తరం రాజకీయ నాయకులు సిగ్గుతో తలదించుకుంటారు. అది రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయం. అప్పుడు వాజపేయి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. వారి మధ్య జరిగిన ఓ అపురూప సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం.  " సార్..ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు లైన్ లో వున్నారు..మీతో మాట్లాడుతారుట ".. ఫోన్ పట్టుకుని వాజపేయి దగ్గరికి వచ్చి చెప్పాడు ఆయన వ్యక్తిగత కార్యదర్శి.." ఫోన్ అందుకున్న వాజపేయి ప్రధానమంత్రి తో రెండు నిమిషాలు మాట్లాడారు. ఫోన్ పెట్టేసి వాజపేయి కార్యదర్శి వంక చూసి "మనం ప్రధానమంత్రి తో పాటు ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొనటానికి అమెరికా వెళ్తున్నాం.. ఏర్పాట్లు చూడండి" అనడంతో తను విన్నది నిజమేనా అని ఆశర్యంతో మరోమారు అటల్జీ ని అడిగి కన్ఫర్మ్ చేసుకున్నాడు కార్యదర్శి. " సార్..పత్రికలకు ప్రెస్ నోట్ పంపమంటారా?" నసిగాడు కార్యదర్శి వాజపేయి ఒక్క క్షణం అతనివంక చూసి నవ్వుతూ "నిక్షేపంగా" అన్నారు. ఈ వార్త అప్పట్లో ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ, అటు బీజేపీ లోనూ పెద్ద దుమారం సృష్టించింది. రాజీవ్ గాంధీ నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు సైతం ముక్కున వేలేసుకున్నారు. "సాక్షాత్తు ప్రధానమంత్రి హోదాలో ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి అటెండ్ అవుతూ ప్రతిపక్షపార్టీ నేతను వెంటపెట్టుకెళ్లటం ఏంటి?" అంటూ పార్టీలో సన్నాయి నొక్కులు నొక్కారు. కానీ రాజీవ్ గాంధీ మాత్రం వాజపేయి ని తీసుకెళ్లడం వెనుక అసలు కారణాన్ని ఎవరికీ చెప్పలేదు. కానీ ఆయన మరణానంతరం వాజపేయే అసలు విషయాన్ని ప్రపంచానికి చెప్పారు.. ఆన్ టోల్డ్ వాజపేయి అనే పుస్తకం ద్వారా.. అదీ ఆయన మాటల్లోనే.. "1985 లోనే నాకు ఒక కిడ్నీ దెబ్బ తిని వైద్యం తీసుకుంటున్నా.1988 నాటికి రెండో కిడ్నీ కూడా దెబ్బతింది. డాక్టర్లు తక్షణం వైద్య చికిత్స అవసరం అన్నారు. ఇక్కడ కన్నా అమెరికాలో మెరుగైన వైద్యం అందుబాటులో ఉన్నందున అక్కడికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ఈ విషయం తెలుసుకున్న రాజీవ్ గాంధీ ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి నన్ను కూడా రమ్మని ఫోన్ లో కోరారు. కానీ చివరగా ఆయన ఒక మాట చెపుతూ.. 'అటల్ జీ.. ఈ పర్యటనను పూర్తిగా మీ వైద్యానికి ఉపయోగించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇండియా కి రండి' అని చెప్పారు. ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే అది రాజీవ్ గాంధీ నాకు చేసిన ఉపకారం వల్లనే. నా కన్నా ఇరవై ఏళ్ళ చిన్నవాడు అయిన రాజీవ్ నాకు తమ్ముడిలాంటి వాడే" అని వాజపేయి అన్నారు. అది విలువలతో కూడిన రాజకీయమంటే. రాజీవ్ గాంధీ, వాజపేయి రాజకీయంగా ప్రత్యర్థులు కావచ్చు కానీ ఒకరినొకరు గౌరవించుకుంటూ విలువైన రాజకీయాలు చేశారు. వారిని చూసి ఈ తరం రాజకీయ నాయకులు ఎంతో నేర్చుకోవాలి. పొద్దున్న లేస్తే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునే అధికార-ప్రతిపక్ష పార్టీల నాయకులు.. రాజకీయాలు పక్కన పెట్టి అప్పుడప్పుడన్నా నైతిక విలువలు పాటించాలన్న సూత్రం.. ఇలాంటి విషయాలు తెలుసుకుని అయినా పాటిస్తే బాగుండు..!

ప్రపంచంలో ఖరీదైన నివాసభవనాలు

తల దాచుకోవడానికి చిన్న గూడైన ఉండాలనుకుంటారు సగటు మనుషులు. అయితే ప్రపంచంలోనే కుబేరుల జాబితాలో చేరిన కొందరి ఇళ్లు చూస్తే ఇంద్ర భవనమా.. దేవంద్ర భవనమా.. మయుడి వాస్తు కళా నైపుణ్యామా అన్న ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి కొన్ని ఇళ్ల విశేషాలు చూద్దాం... అంటిలియా - ముఖేశ్ అంబానీ ప్రపంచంలోనే లక్షలాది ఇండ్ల మాదిరిగా  అంటిలియా ను చూడలేం. వాటిలో ఒకటిగా లెక్కించలేం. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అతి ఖరీదైన గృహాల్లో రెండవది. దక్షిణ ముంబయిలో ఉండే ఈ ఇంటికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది భారతీయ బిలీయనీర్ ముఖేష్ అంబానీ, అతని కుటుంబ సభ్యుల రెడిడెన్సీ.  ఆంటీలియాను  డిజైన్ చేసింది చికాగో ఆర్కిటెక్ట్ పార్కిన్సన్ విల్. ఈ భవనాన్ని ఆస్ట్రేలియన్ కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ హోల్డింగ్స్  నిర్మించారు. ఈ భవనంలో 27 అంతస్తులు ఉంటాయి.  అనేక ఆధునిక హంగులతో దీన్ని రూపొందించారు. ఇందులో సెలూన్, న్యూ మూవీ థియేటర్ ఐస్ క్రీమ్ పార్లర్, స్విమ్మింగ్ ఫూల్, జిమ్ ,స్పా లాంటివి ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. ఇంటి ఖరీదు రెండు బిలియన్ డాలర్లు. ప్రపంచంలోనే అతి ఖరీదైన గృహాల్లో రెండోవ స్థానం సాధించిన ఈ ఇల్లు భారతదేశంలో అతి ఖరీదైన మొదటి గృహం. జెకె హౌస్,  గౌతమ్ సింఘానియా ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇంటి టైటిల్‌ను అంటిలియా  సొంతం చేసుకుంది.  ఇప్పుడు భారతదేశానికి చెందిన మరో బిలియనీర్ కుటుంబం సింఘానియా  నివాసగృహం వెలుగులోకి వచ్చింది.   j.k కంపెనీ అధినేత విలాసవంతమైన, ఆధునిక హంగులు ఉన్న ఇంటిని నిర్మించుకున్నారు.  భారతీయ వ్యాపార సంస్థలలో అతి పెద్దదైన  jk పరిశ్రమల పేరుతో నిర్మించిన ఈ ఇల్లు అంటీలియా తర్వాత అత్యంత ఖరీదైన గృహంగా రికార్డు సొంతం చేసుకుంది.   16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటిలో ఐదు ఫ్లోర్ల వరకు కార్ల పార్కింగ్ కోసమే వినియోగిస్తున్నారు.  పట్టణంలో ఉన్న ఉత్తమ కార్లను పార్క్ చేయడానికి మాత్రమే ఐదు ఫ్లోర్ల స్థలం ఉపయోగిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు.. ఈ ఇల్లు, ఇంటిలోని వారు ఎంత రిచో.. మిగతా అంతస్తుల్లో  స్పా, స్విమింగ్ ఫూల్, జిమ్ వంటి వసతులతో పాటు  ఎంటర్ టైన్ మెంట్ కోసం ప్రత్యేక స్థలం ఉంది. అంతేకాదు సొంత హెలిప్యాడ్ కూడా ఉన్నాయి. జెకే సంస్థకు గౌతమ్ సింఘానియా, చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్.  ఈ సంస్థ  రేమండ్ గ్రూప్ గా ప్రసిద్ధి చెందింది. ఆయనకు  ఫాస్ట్ కార్లు,  ఆధునిక పడవలు,  లగ్జరీ రివేట్ జెట్‌లపై అమితమైన ఆసక్తి.  ఆధునిక సదుపాయాలతో కూడిన ఈ ఖరీదైన భవనం విలువ  సుమారు 6000 కోట్ల రూపాయలు ఈ ఖరీదైన గృహం  అంటిలియా తరువాత భారతదేశంలో రెండవ ఎత్తైన ప్రైవేట్ భవనం. అడోబ్, అనిల్ అంబానీ ముంబైలోని పాలి హిల్ ప్రాంతంలో ఉన్న అనిల్ అంబానీ ఇల్లు భారతదేశంలో అత్యంత ఖరీదైన  గృహాలలో ఒకటిగా  చెప్పవచ్చు. ఈ  ఎత్తైన భవనం ఫాన్సీ హెలిప్యాడ్ వంటి అత్యంత ఆధునిక సదుపాయాలతో నిర్మించారు.  ఈ భవనం 16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ,  దాదాపు 70 మీటర్ల ఎత్తులో ఉంది.  ఈ విలాసవంతమైన ఇంటి విలువ సుమారు 5000 కోట్ల రూపాయలకు పైగా ఉంది.  అయితే ఈ విలాసవంతమైన భవనంలో నివసించే అనిల్ అంబానీ  జీవనశైలి మాత్రం చాలా సింపుల్ గా ఉంటుంది.  మన్నాట్, షారుఖ్ ఖాన్ ముంబయిలో ఉన్న మరో ఖరీదైన భవనం మన్నాట్. ఈ భవనం వార్తల్లోకి రావడానికి కారణం ఈ ఇంటి యజమాని ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కావడం.  ఈ భవనం పై నుంచి  అరేబియా సముద్రం అందాలను వీక్షించే సదుపాయం ఉంది.  ఇది ముంబైలోని బాంద్రాలోని బ్యాండ్‌స్టాండ్ వద్ద ఉంది.  గ్రామీణ ప్రాంతంలోని ఇంటి సగటు పరిమాణం 497 చదరపు అడుగులు, ఇది వ్యక్తికి 103 చదరపు అడుగులు. అయితే మన్నాట్ లో మాత్రం సుమారు 225 మంది  నివసించవచ్చు. షారూఖ్ డ్రీమ్ హోమ్ అయిన ఈ భవనం ప్రపంచంలోని ఖరీదైన  గృహాల జాబితాలో 10 వ స్థానంలో ఉంది.  13.32 కోట్లతో షారూఖ్ ఈ ఇంటిని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు దాని  విలువ 200 కోట్ల రూపాయలు.  స్కై హౌస్, విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా   పెంట్ హౌస్ ఖరీదైన గృహాల జాబితాలో చోటు సాధించింది.  40,000 చదరపు అడుగుల స్థలంలో తన డ్రీమ్ హౌస్ ను  విజయ్ మాల్యా  నిర్మించుకున్నారు.  35 అంతస్తుల ఎత్తైన భవనంపై నిర్మించిన పెంట్ హౌస్ ఇది.   బెంగళూరు సిటీ నడిబొడ్డున ఉన్న ఈ భవనాన్ని కింగ్‌ఫిషర్ టవర్స్ -  నివాసం అంటారు. ఎత్తైన టవర్ల పైభాగంలో  నిర్మించిన ఆకాశ హర్మ్యం ఇది. దీన్ని  మాల్యా  వైట్ హౌస్, స్కై హౌస్ గా కూడా పిలుస్తారు.  ఎత్తైన టవర్ల పై స్విమింగ్ ఫూల్,  వైన్ సెల్లార్,  సెలూన్ , స్పా, జిమ్ తో పాటు అనేక ఇతర విలాసవంతమైన  సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. హెలిప్యాడ్ కూడా తప్పనిసరిగా ఉంటుంది. వాస్తవానికి పెంట్ హౌస్ లా కనిపించినప్పటికీ ఇది  ఒక పెంట్ హౌస్ కాదు, ఇది విల్లా కన్నా ఎక్కువ.  స్కై హౌస్ విలువ గతంలో   135 కోట్ల రూపాయలు. ఇప్పుడు విలువ 150 కోట్ల రూపాయలు.

తేనెటీగలూ నేర్పుతాయి తియ్యటి పాఠాలు

తేనెటీగలు అనగానే శ్రమ గుర్తుకువస్తుంది. చిటికెడు తేనె కోసం వందలాది తేనెటీగలు పడే కష్టం గుర్తుకువస్తుంది. కానీ తేనెటీగలు అంతకు మించిన పాఠాలెన్నింటినో నేర్పుతాయంటున్నారు. జీవితానికి ఉపయోగపడే సూచనలు ఎన్నింటినో ఇస్తాయని చెబుతున్నారు. వాటిలో కొన్ని...   కలిసికట్టుగా శ్రమ విభజన గురించి చెప్పుకోవాలంటే తేనెటీగల గురించే చెప్పుకోవాలి. తేనెపట్టుని నిర్మించడం దగ్గర నుంచీ, అందులో భద్రపరచిన తేనెని రక్షించుకోవడం వరకూ... ప్రతీ తేనెటీగా తనదైన బాధ్యతను నిర్వర్తిస్తుంది. ఇది ఎక్కువ పని, ఇది తక్కువ పని అని తేనెటీగలు చూసుకోవు. తాము ఉన్న జట్టుకి మేలు జరగడమే వాటి ఆశయంగా ఉంటుంది.   పరిస్థితులకు అనుకూలంగా తేనెటీగల పని తేనెని సేకరించి భద్రపరచుకోవడమే కావచ్చు. అలాగని అవి కేవలం దట్టమైన అడవులలో మాత్రమే నివాసాన్ని ఏర్పరుచుకోవు. ఫలానా పూల దగ్గర తేనె ఎక్కువగా దొరుకుతుంది కదా అని అక్కడే తచ్చాడవు. ఏదో ఒక చోట తేనెపట్టుని ఏర్పరుచుకోవడం. అందులోకి తేనెని నింపేందుకు దూరదూరాల వరకూ తిరిగిరావడం... ఇదే వాటి పనిగా ఉంటుంది!   ప్రకృతికి సాయం తేనెటీగలు తేనెని తీసుకోవడమే కాదు... అవి వాలిన పువ్వుల మీద ఉన్న పుప్పొడిని మరో మొక్క దగ్గరకు చేరవేస్తాయి. అలా పరాగసంపర్కానికి (pollination) దోహదపడతాయి. మనం తినే ఆహారంలో దాదాపు మూడో వంతు ఇలా pollination వల్లనే ఉత్పత్తి జరుగుతుందన్న విషయం మీకు తెలుసా! అలా తను ప్రకృతి మీద ఆధారపడుతూ, తిరిగి ఆ ప్రకృతికి ఎంతో కొంత ఉపకారం చేస్తూ జీవించేస్తుంటాయి తేనెటీగలు.   జ్ఞానాన్ని సంపాదించడం తేనెటీగలు తేనె కోసం ఎంత దూరమైనా ప్రయాణిస్తాయి. ఓ రెండు చుక్కల కోసం ఎన్ని పూలనైనా చేరుకుంటాయి. జ్ఞానం కోసం తపించే వ్యక్తి కూడా జ్ఞానం ఉంటే అక్కడికి చేరుకోవాలని పెద్దలు సూచిస్తూ ఉంటారు. అలా కాకుండా అహంకారంతో మంకుపట్టు పట్టి నాలుగు గోడల మధ్యే ఉండిపోతే జీవితం నూతిలో కప్పలాగా నిరర్థకమైపోతుంది.   ఆత్మరక్షణకు సాటిలేదు తేనెటీగలు వాటంతట అవి ఎవరి జోలికి వెళ్లి దాడి చేయవు. కానీ తేనెపట్టుని కదిపితే మాత్రం వాటిని ఎదుర్కోవడం మానవుడి తరం కూడా కాదు. మరీ తేనెటీగలలాగా వేటాడి వెంటాడి దాడి చేయనవసరం లేదు కానీ, అనవసరంగా తమ జోలికి రావద్దన్న హెచ్చరికను మాత్రం శత్రువులకు అందించాల్సి ఉంటుంది. - నిర్జర.  

నిద్ర చాలకపోవటం వలన కోపం ఎక్కువగా వస్తుందా?

నిద్రే కదా ఏముందిలే అనుకుంటే పొరపాటే. చక్కటి ఆరోగ్యానికి ఆహారం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యమట. నిద్రకు కోపానికి దగ్గరి సంబంధం ఉందట.. అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.  https://www.youtube.com/watch?v=aBxjhGIQdP4  

మకో రోబోటిక్‌తో కీళ్ళమార్పిడి!

మకో రోబోటిక్ ఆర్మడ్ అసిస్టెడ్ సర్జరీతో కీళ్ళమార్పిడి సులభంగా లుధియానా వైద్యుల అవిష్క రణ. కీళ్ళమార్పిడి మకో రోబోటిక్ ఆర్మ్ అసిస్టేడ్ టెక్నాలజీతో సర్జరీ పద్దతిని లుధియానాలోని హ్యుజన్ ఆసుపత్రి అదునతన విధానాన్ని కనుకున్నది . రోబోట్ ఆర్మ్ ఆసిస్టేడ్ విధానంలో సర్జన్లు లేకుండానే  కీళ్ళమార్పిడి శాస్త్ర చికిత్స చేయవచ్చని ఈ విధానంలో ఊహించినదానికన్నా ఎక్కువ సమయంలోనే సమర్దవంతంగా సర్జరీలు నిర్వహించినట్లు లుదియానకు చెందిన వైద్యులు విజయం సాధించారు. మాకో రోబోటిక్ ఆర్మ్ ఆసిస్ స్టెద్ విధానంతో లుధియానా ఆసుపత్రి వైద్యరంగంలో  మైలురాయిని అధిగమించినట్లయ్యింది. కీళ్ళమార్పిడి పద్దతిలో అదునాతాన సాంకేతికతను వినియోగించిన  ఉత్తరాదిలో మొట్టమొదటి ఆసుపత్రిగా పేరుగాంచింది. మాకో రోబో టిక్ ఆర్మ్ అసిస్టేడ్  విధానాన్ని ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎఫ్ డి ఎ  సైతం అనుమతించింది. స్ట్రైకర్ ఇండియా హ్యుంజన్ ఆసుపత్రి సంయుక్తంగా విడుదల చేసిన ఒక పత్రిక ప్రకటనలో ఈ విషయం వెల్లడించారు. శాస్త్రీయ సంప్రదాయ సర్జరీలకన్న భిన్నంగా ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.  కీళ్ళ నొప్పులు , కీలు అరిగిపోయిన వారికీ చేసే కీళ్ళ మార్పిడికి మాకో రోబో ఆర్మ్ ఆసిస్టెడ్ సర్జరీ ఒకరకమని స్ట్రైకర్ ఇండియా వైస్ ప్రెసిడెంట్  మీనాక్షి  నేవతియా అన్నారు. భవిష్యత్తులో హ్యుజన్ ఆసుపత్రితో కలిసి మరిన్నికొత్త పద్దతులు అమలు చేస్తామని ఆమె చెప్పారు. రోగులకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తామని మీనాక్షి పేర్కొన్నారు. రోగుల అవసరాలను తీర్చగలిగినందుకు ఆనందంగా ఉందని ఆమె హార్షం వ్యక్తం చేసారు. లుదియానాకు చెందిన హ్యుజన్ ఆసుపత్రి డైరెక్టర్ నీరీప్లేస్మేంట్ సర్జన్ డాక్టర్ బి ఎస్  హ్యుజన్  మాట్లాడుతూ సంప్రదాయ శస్త్ర చికిత్స లకు ఒక సవాల్ వంటిదని ఆయన అన్నారు. ఇందులో సర్జన్ ప్రతిభ ఆధారపది ఉంటుందని అన్నారు. పాత పద్దతిలో బోన్స్  ను ప్రతిసారీ కోయాల్సి వచ్చేదని కొత్తగా వచ్చిన రోబోటిక్ సర్జరీ ప్రోత్సాహాన్ని ఇచ్చిందని అన్నారు. ఎనిమిది మంది పైజరిపిన శస్త్ర చికిత్స  మంచి ఫలితాలు ఇచ్చిందని అన్నారు. సర్జరీకి ముందుగానే ఆ పేషంట్ల గురించి అవగాహన ఉండడం వల్ల  తక్కువ కోతలు ఉండవచ్చని సాఫ్ట్ టి ష్యు డేమేజ్ కాకుండా నివారించవచ్చని ఎముకను కాపాడవచ్చని హ్యుజన్ వివరించారు. హ్యుజన్ ఆసుపత్రి ఆర్తో కన్సల్టెంట్  జైవీర్ హ్యుజాన్ మాట్లాడుతూ అధునాతన రోబోటిక్ ఆర్మ్ అసిస్టెడ్  టెక్నాలజీతో రోగుల జీవన ప్రమాణాలు పెంచవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ పద్దతిలో రోగులకు మరిన్ని లాభాలున్నాయని అన్నారు. అంతార్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ విధానం అమలు చేస్తామని జైవీర్ తెలిపారు. ఒక్కోక్కరిలో బోన్స్ అనాటమీ వేరువేరుగా ఉంటుందని కీళ్ళ మార్పిడి లేదా హిప్ సర్జరీ చేయడంలో మాకో రోబోటిక్ సర్జరీలో త్రీ డి మోడల్ గుర్తించేందుకు సి డి స్కాన్ ఆధారంగా వర్చువల్ సర్గికల్ ప్రొసీజర్ అమలుచేస్తామని జైవీర్ తెలిపారు. ఇందుకోసం 1౦౦౦ మాకో సిస్టంలో 35,౦౦౦ పద్దతులు ఇప్పటిక్ పరిశీలించమని   మాకో రోబోటిక్ ఆర్మ్ ఆసిస్టెడ్ సాంకేతికత క్లినికల్ గా నిరూపించామన్నారు.

హైపర్ టెన్షన్ ను మ్యానేజ్ చేసే క్యారెట్..!

  కూరగాయలలో అందరూ ఇష్టపడి అన్నిటిలోనూ వాడుకునే తియ్యటి క్యారెట్ లో ఉన్నన్ని గుణాలు మరే కూరగాయలలోను కనిపించవు అంటే అతిశయోక్తి కాదు. మన దైనందిన ఆహారపు అలవాట్లలలో క్యారెట్ ను బాగా ఉపయోగించుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. క్యారెట్ వాడకం  ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తుందని ఇందులోని అధిక క్యాలరీలు పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎదిగేలా చేయడమే కాక మేధో వికాసానికి ఎంతో ఉపయోగ పడుతుందని  వైద్యులు చెబుతారు. ఈ క్యారెట్‌లోనున్న గుణాలు మరెందులోను ఉండవంటున్నారు వైద్యులు.   సాధారణంగా క్యారెట్‌తో చేసిన వంటకాలను తినేందుకు ఎక్కువ శాతంమంది ఇష్టపడరు. మరి కొంతమంది క్యారెట్‌ను పచ్చి గా తినేందుకు ఇష్టపడతారే కానీ, వండితే మాత్రం ఇష్టపడరు. క్యారెట్లు ఆరోగ్యపరంగా ఎంతో మేలును కల్గిస్తాయనీ, ఇందులోని అధిక క్యాలరీలు పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎదిగేలా చేయడమే కాక మేధో వికాసానికి ఎంతో తోడ్పడతాయని వైద్యులు చెబుతున్నారు. వండితే తినేందుకు ఇష్టపడని ఈ క్యారెట్లను సలాడ్ల రూపంలోనూ, జ్యూస్‌ల రూపంలోనూ తీసుకోవచ్చుననీ, ఇలా తీసుకున్నట్లయితే మంచి పోషకవిలువలు, ఆరోగ్యం లభిస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు.   క్యారెట్ వినియోగం వల్ల హైపర్ టెన్షన్ ను మ్యానేజ్ చేయవచ్చు. క్యారెట్స్ లో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఇది ఎముకల ఆరోగ్యానికి బాగా సహాయపడుతుంది. అదే కాకుండా ఇన్సులిన్ రెసిస్టెన్స్ కు సహాయపడుతూ బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ ను మెయింటైన్ చేయడానికి క్యారెట్ సహాయపడుతుంది. మన శరీరంలోని రోగ నిరోధక శక్తిని కాపాడటంలో ప్రముఖ పాత్ర వహించే ఈ క్యారెట్ ను ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే మనం మన అనారోగ్య సమస్యల నుండి అంత త్వరగా బయట పడవచ్చు..

సమతౌల్యమైన ఆహారం తీసుకుంటేనే ఆరోగ్యం

శాఖాహరం తీసుకుంటేనే మనిషి కొన్నాళ్ళు అయినా భూమిపై మనుగడ అని ప్రముఖ శాస్త్రజ్ఞుడు ఆల్ల్బెర్ట్ ఐన్స్టైన్ అన్నారు. అలా ఉండాలంటే మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలో చూద్దాం. సహజంగా కాయగూరలు, పళ్ళు, చిక్కుళ్ళు, బంగాళా దుంపలు, తృణ ధాన్యాలు, చిరు ధాన్యాలు, మూలికలు మసాలాలు, నెయ్యి, మజ్జిగ, రిఫైండ్ చేయని నూనెలు తీసుకోవాలి.                             కూరాగాయాలలో:  తాజా కూరగాయాలు, ఆకూ కూరలు, తదితరాలు.  పళ్ళలో:  నారింజ,అనాస పండు, ద్రాక్ష పళ్ళు, డేట్స్, అత్తి పండ్లు, పుచ్చ కాయ.  చిక్కుళ్ళు:  బీన్స్, పచ్చి బటానీ, కాయ ధాన్యాలు, పప్పు ధాన్యాలు, కోడి గుడ్లు తదితరాలు. దుంపలు: బీట్ రూట్, క్యారెట్, బంగాళదుంపలు, కలోకాసియా తదితరాలు. తృణ ధాన్యాలు: మిల్లెట్స్, ఫొక్ష్ టైల్ మిల్లెట్, ఫింగర్ మిల్లెట్, బర్న్ యార్డ్ మిల్లెట్, రెడ్ రైస్, బ్రౌన్ రైస్ తదితర ధాన్యాలు. పాల పదార్ధాలు: నెయ్యి, ఆవు పాలు, పెరుగు, మజ్జిగ.   మూలికలు, సుగంధ ద్రవ్యాలు: తులసి, పుదీనా, పసుపు, జీల కర్ర, జాజి కాయ, జాపత్రి, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, వెల్లుల్లి తదితరాలు. కొవ్వు పదార్ధాలు: రీఫైండ్ చెయ్యని నూనెలు, నువ్వుల నూనె, పొద్దు తిరుగుడు పువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఆవ నూనె తదితరాలు.  మన రోటీన్ జీవితంలో సరైన సమయంలో సమతౌల్యమైన ఆహారం తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారు. 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.