రాశిఫలాలే కాదు...

 

 

ఆదాయం - 2 వ్యయం - 8

రాజపూజ్యం - 1 అవమానం - 7

రాశిఫలాలు ఇలా సాగాయనుకోండి. చదవడానికి ఎవరికి మాత్రం సంతోషంగా ఉంటుంది? ఇక ఈ ఏడు నా జీవితం ఇంతే అనుకుని డీలాపడిపోవాలా! అడుగడుగునా వ్యయం, అనుదినం అవమానం తప్పవనుకుని రాజీకి సిద్ధపడిపోవాలా! గ్రహాలు మన జీవితాలని ప్రభావితం చేయవు అనుకుంటే అది వేరే విషయం. కానీ రాశిఫలాలను ఎంతో కొంత నమ్మేవారి పరిస్థితి ఏంటి. చావు, పుట్టుక లాంటి విషయాలు మనచేతిలో ఎలాగూ ఉండవు. కానీ ఈ మధ్యలో మనం తీసుకునే నిర్ణయాలు తప్పకుండా మన జీవితాలను ప్రభావితం చేస్తాయి. గ్రహాలు అనుకూలంగా లేవు కదా అని శ్రమించడం మానేస్తే, పరాజయాలే మిగులుతాయి. ఏమో 50 శాతం కృషి చేసిన చోట 90 శాతం శ్రమించి ఉంటే, ఫలితం వేరేలా ఉండవచ్చు! ఒకవేళ ఫలితం దక్కకపోయినా అనుభవం మాత్రం జీవితంలో ఎప్పటికీ వృథా పోదు కదా! లక్ష్యాన్ని చేరుకోవడంలో ఎంత తృప్తి ఉంటుందో, దానిని ఛేదించడంలోనూ అంతే తృప్తి ఉంటుందని, ఇప్పటి వ్యక్తిత్వ వికాస నిపుణులే చెబుతున్నారు. కాబట్టి, గ్రహాలు ఏం చెబుతున్నాయో తర్వాతి విషయం. మనం చేయాల్సిన పనిలో మాత్రం లోటు రాకుండా చూసుకుందాం. అందుకే భారతీయ తత్వం మాటిమాటికీ ‘కర్తవ్యాన్ని పాటించు, ఫలితాన్ని ఆశించకు’ అని చెబుతూనే ఉంటుంది.

 

ఒకే సమయానికి పుట్టిన ఇద్దరు వ్యక్తులను తీసుకుంటే, వారి జాతకాల ప్రకారం ఇద్దరి జీవితాలూ ఒకేలా ఉండాలి కదా! అలా కాకుండా ఉండటానికి ఆస్తికులు వేర్వేరు కారణాలు చెబుతారు. పూర్వజన్మ సుకృతమనో, యోగమనో, కుటుంబ జాతక బలమనో అంటారు. ఈ కారణాలకి మనం కృషి అన్న మాటని కూడా చేర్చేస్తే సరి. అసలు మనిషి బుద్ధి జీవి కాబట్టే కదా, ఈ విషయాలన్నింటి గురించీ తెగ ఆలోచిస్తోంది. కాబట్టి ఆ ఆలోచన ఏదో కాస్తా సానుకూలంగా సాగిస్తే పోలా! ఆదాయం 2, వ్యయం 8 అని ఉంటే... ఏమో ఏ బ్యాంకు రుణమన్నా తీసుకుని చక్కగా ఇల్లు కొనుక్కుంటామేమో! రాజపూజ్యం 1, అవమానం 7 అని ఉంటే పెద్దవాళ్లెవరో మనల్ని ముక్కుచీవాట్లు పెట్టి మంచిదారిలో నడిపిస్తారేమో! ఏట్నాటి శని నడుస్తోందంటే, జీవితంలో మంచి అనుభవాలను నేర్పుతుందేమో!

 

అయినా మన మీద మనకి నమ్మకం ఉన్నప్పుడు, దైవం మీద భారం వేసినప్పుడు గ్రహాల గురించిన భయం ఎందుకు? నిరంతరం సుఖాలలో తేలిపోవాలనీ, చుట్టూ బాజాభజంత్రీలు మోగాలనీ, పట్టుపరుపుల మీదే ప్రయాణాలు సాగాలని అనుకోవడం అత్యాశ కాదా! అలాంటి జీవితం ఎంత నిస్సారంగా ఉంటుందో. కష్టపడినప్పుడే సుఖం విలువ తెలిసేది. కష్టసుఖాలు సరిసమానంగా ఉంటేనే జీవితం నిండేది. ఆ విషయాన్ని గ్రహించినప్పుడు, కష్టసుఖాలకు అతీతమైన స్థితిని పొందినప్పుడు... జీవితంలో ప్రతి రోజూ ఉగాదే! అప్పుడు ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం, శని, గురుడు... లాంటి విషయాలన్నింటినీ మించి మానవత్వం,విచక్షణ, శ్రమ, లక్ష్యం మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయి.

- నిర్జర.