జగన్ పార్టీకే విజయావకాశాలు ఉన్నాయంటున్న లోక్ సత్తా
posted on Mar 31, 2012 7:37AM
భవిష్యత్తులో రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకే విషయావకాశాలు ఉంటాయన్న అభిప్రాయాన్ని లోక్ సత్తా నాయకులు పరోక్షంగా వ్యక్తం చేస్తున్నారు. లోక్ సత్తా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డివివియస్ వర్మ భీమవరంలో విలేఖరులతో మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొని ఉందన్నారు. రాష్ట్రంలో పాలించే స్థాయిని కాంగ్రెస్ పార్టీ కోల్పోయిందని ప్రజలు ఆ పార్టీకి ఓట్లు వేయబోరని ఆయన అంటూ భవిష్యత్తులో తెలుగు దేశంపార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని కూడా ఆయన తేల్చిచెప్పారు. మరి అధికారంలోకి ఎవరు వస్తారని ప్రశ్నించగా ఎవరికీ జనాదరణ ఉంటే వారికే ప్రజలు పట్టం కడతారని పరోక్షంగా జగన్ ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తుందన్నారు. పురపాలక సంఘ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 50 మున్సిపాలిటీల్లో తమ అభ్యర్థులు పోటీచేస్తారని కూడా ఆయన చెప్పారు.