పరకాలపై కన్నేసిన కమలనాధులు
posted on Mar 31, 2012 7:29AM
మహబూబ్ నగర అసెంబ్లీ నియోజకవర్గంలో అనూహ్యంగా విజయం సాధించిన కమలనాధులు పరకాలలో కూడా మరోసారి తమ అదృష్టాన్ని పరిక్షించుకోవాలనుకుంటున్నారు. దీనికై పార్టీ అగ్రనాయకులు ఇప్పటికే ఒక వ్యూహాన్ని రచించినట్లు తెలిసింది. పరకాల నుంచి పోటీ చేయడానికి నలుగురు అభ్యర్థులు ఇప్పటికే ముందుకు వచ్చారు. తెలంగాణా సాధన విషయంలో టి ఆర్ ఎస్ ఇప్పటికే చాలావరకు ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని అయితే వేరే తెలంగాణావాద పార్టీలు రంగంలో లేకపోవడం వల్ల ప్రజలు టి ఆర్ ఎస్ ను ఆదరిస్తున్నారని బిజెపి నాయకులు అంటున్నారు. ఒక్క బిజెపితోనే ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు సాధ్యమని, అందుకే మహబూబ్ నగర్ ప్రజలు తమను నమ్మి తమ పార్టీ అభ్యర్థిని గెలిపించారని వారు అంటున్నారు. పరకాల శాసనసభా స్థానంలో కూడా మంచి అభ్యర్థిని నిలబెడతామని అక్కడ కూడా విజయఢంకా మోగించి తమ సత్తా ఏమిటో చూపిస్తామని కమలనాథులు అంటున్నారు.