వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో పీజెఆర్ కుమార్తె?
posted on Jun 21, 2012 9:15AM
దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి, కాంగ్రెస్ నేత పి.జనార్థనరెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. వై.ఎస్. లానే పి.జనార్థనరెడ్డి కూడా పార్టీలోని క్యాడర్ ను ఆకట్టుకుని ముక్కుసూటి వ్యవహారాలూ నడిపేవారు. తప్పు తన పార్టీ వారు చేసినా వదలని మనస్తత్వంతో జాతీయస్థాయి గుర్తింపునందుకున్న పి.జనార్థనరెడ్డి మరణించాక ఆయన తనయుడు విష్ణు కాంగ్రెస్ పార్టీ తరపున శాసన సభ్యుడిగా ఎంపికయ్యారు. అయితే విష్ణు సోదరి మాత్రం వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. జగన్ ఆహ్వానం మేరకు ఆ పార్టీలోకి ఆమె రాబోతున్నట్లు తెలిసింది. ములాఖాత్ ద్వారా జగన్ ఆమె చెంచల్ గూడ జైలులో కలిశారు. అనంతరం తాను జగన్ పార్టీలో చేరే విషయమై త్వరలో నిర్ణయం తీసుకుంటానని ఆమె తెలిపారు. అయితే ఆమె జగన్ తో తాను పార్టీలో చేరతానన్నట్లు సమాచారం. దీంతో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ విజయం వల్ల కొత్త చేరికలు ప్రారంభమయ్యాయని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. పిజెఆర్ కుమార్తె రాకను కూడా వలసలకు ఒక సంకేతంలా భావిస్తున్నారు.