అమూల్ బేబీ యాడ్ లో ఖైదీ జగన్
posted on Jun 20, 2012 5:21PM
కొద్ది నెలల క్రితం భారతీయ జనతాపార్టీకి చెందిన ఒక రాజకీయనాయకుడు రాహుల్ గాంధీని అమూల్ బేబితో పోల్చడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు బి.జె.పి.నాయకుడిపై మూకుమ్మడిగా దాడి చేసినంత పని చేసారు. రాహుల్ గాంధీ లాంటి పరిణితి చెందిన యువ రాజకీయ నాయకుడిని అమూల్ బేబితో పోల్చడం ఆ నాయకుడి అజ్ఞానానికి నిదర్శనమంటూ దుమ్మెత్తి పోశారు. అమూల్ బేబి మరోసారి వివాదాన్ని సృష్టించింది. ఈసారి జగన్ ను అమూల్ బేబిగా చిత్రీకరిస్తూ, ఆ బేబి జైల్లో ఉన్నట్లుగా ఒక ప్రకటన తయారు చేసి ఇంటర్ నెట్ లో పెట్టారు. ఈ విషయాన్ని గమనించిన నెటిజన్స్ లో కొందరు వైయస్సార్ కాంగ్రెస్ నాయకులకు తెలియజేశారు. దీంతో ఆపార్టీకి చెందిన న్యాయవాదుల విభాగం రంగంలోకి దిగి ఈ ప్రకటన ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. తర్వాత అమూల్ యాజమాన్యంతో మాట్లాడి ఈ ప్రకటన విషయాన్ని వారి దృష్టికి తెచ్చారు. ఈ ప్రకటన ఇంటర్ నెట్ లో ఉంటే జగన్ తో పాటు రెడ్డి కులస్తుల పరువుకు భంగం కలుగుతుందని వారు హెచ్చరించారు. ఖైదీ దుస్తుల్లో ఉన్న జగన్ గోడ మీద లెక్కలు వేస్తున్నట్లు ఈ ప్రకటనలో చూపించారు. పైన రెడ్డి సిద్ధంగా వుండు ... ఆస్తులుదోచుకో ... అని ప్రకటన పైభాగాన, ఇంకా ఎంత తింటావు అని కింది భాగాన క్యాప్షన్ ఉంది. ఈ ప్రకటన ఇంకా ఇంటర్ నెట్ లో దర్శనమిస్తూవుంది.