జగన్ కోలుకుంటున్నారు.. ఇంకా 24 గంటలు ఉంచాలి.. జీజీహెచ్
posted on Oct 13, 2015 3:21PM

వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ గుంటూరులో తలపెట్టిన నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈ రోజు ఉదయం ఆయనను కలిసిన పోలీసులు ఆయనతో మాట్లాడి అనంతరం అంబులెన్స్ల్ లో ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించి దీక్షను భగ్నం చేశారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనను చేర్పించి వైద్యం అందిస్తున్నారు. ఈ మేరకు జగన్ ఇంకా 24 గంటలు తమ పర్యవేక్షణలోనే ఉండాలని.. ఫ్లూయిడ్స్ అందిస్తున్నాం.. ఇప్పుడిప్పుడే ఆరోగ్యం కుదుట పడుతుంది.. బిపి 130/80, యూరిక్ యాసిడ్ 13.2గా ఉందని తెలిపారు. ఇదిలా ఉండగా పోలీసులు జగన్ దీక్షను భగ్నం చేయడంపై పార్టీనేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిని నిరసిస్తూ ఏపీలో అన్ని జిల్లాల్లో వైసిపి నేతలు, కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. ప్రత్యేక హోదా పై ఎలాంటి ప్రకటన చేయకుండా జగన్ దీక్షను భగ్నం చేయడం సరికాదని.. ప్రత్యేక హోదా పైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కాగా ప్రత్యేక హోదాపై ఎలాంటి భవిష్యత్ కార్యాచరణలు తలపెట్టాలి అనే విషయాన్ని జగన్ కోలుకున్న తరువాత ఆయనను సంప్రదించి ఆతరువాత నిర్ణయం తీసుకోనున్నారు.