' యోగా ' భ్యాసం

Publish Date:May 14, 2016

 

కేవలం ఆసనాలు వేసుకుని, మళ్లీ తీయలేనంత కష్టంగా చేసేవి మాత్రమే కాదు. మన రోజూవారీ జీవితంలోని అంశాలు కూడా యోగా గా అభివృద్ధి చెందుతున్నాయి. మోడ్రన్ లైఫ్ స్టైల్ కు అనుగుణంగా తనను తాను మార్చుకుంటూ, యోగా కూడా సరికొత్తగా ఆవిష్కృతమవుతోంది. మరి మనం చాలా సులభంగా చేయగలిగినవీ, మానసిక ప్రశాంతతను తెచ్చే కొన్ని యోగాలను చూద్దామా..

 
లాఫింగ్‌ యోగ

 

లాఫింగ్ యోగ..ఆ పేరులోనే అది ఏ తరహా యోగమో రాసింది. అవును..ఇది హాస్య యోగం. ఎవరైనా జోకేసినప్పుడు మనకు నవ్వు వస్తే నవ్వుతాం. ఆ నవ్విన కాసేపు మనసు ఒత్తిళ్లన్నింటినీ మర్చిపోయి, ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంటుంది. నగరాల్లో చాలా పార్కుల్లో ఈ లాఫింగ్ క్లబ్బులున్నాయి. అందరూ ఒకచోట చేరి, నవ్వు వచ్చినా, రాకపోయినా హాయిగా మనస్ఫూర్తిగా నవ్వేస్తారు. వాళ్ల నవ్వు చూసేవారికి కూడా నవ్వుతెప్పిస్తుంది. అంతా మంచి వాతావరణం నెలకొంటుంది. డైలీ ఇలా తెచ్చిపెట్టుకుని నవ్వినా ఎన్నో ఉపయోగాలుంటాయి. అన్నింటికంటే ముఖ్యంగా, రోజు అద్భుతంగా నవ్వుతూ, మంచి మూడ్ లో మొదలెట్టినట్టే.. లాఫింగ్ యోగా..మీరు ఓ ట్రయిల్ వేయండి మరి.

 
హీట్‌ యోగ


ఫారిన్ కంట్రీస్ లో, సెపరేట్ గా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఈ యోగాను చేస్తుంటారు. ఎంతో మంది హాలీవుడ్ సెలబ్రిటీలు ఈ యోగాను ఫాలో అవుతున్నారు. అంత హీట్ లో 90 నిముషాల పాటు రకరకాల వ్యాయామాలు చేయిస్తారు. దాదాపు 26 యోగాసనాలను వేయిస్తారు. హీట్ యోగాను బెంగాల్ కు చెందిన బిక్రమ్ అనే ఆయన కనిపెట్టాడు. మన దేశంలో ఇది పెద్ద అవసరం ఉండకపోవచ్చు లెండి. ఈ వేసవి వేడికి మనం ఎలాగూ సూపర్ హీట్ యోగాలోనే ఉంటున్నాం రోజంతా..


మాతృయోగ


తల్లి కాబోయే వారికి ఉండే మొదటి భయం, ప్రసవం. ఎలా జరుగుతుందో, ఎలా గడుస్తుందో అనే భయం గర్భం దాల్చిన ప్రతీ మాతృమూర్తిలోనూ ఎప్పుడో ఒకప్పుడు వస్తుంటుంది. ఆ భయం లేకుండా, గర్భంతో ఉన్న నెలలన్నీ యోగా, వ్యాయామం చేస్తూ ఉంటే, ప్రసవం చాలా తేలికవుతుంది. ఆ తర్వాత కూడా, తేలికగా రికవర్ అవడానికి ఉపయోగపడుతుంది మాతృయోగ.

 

కపుల్ యోగ


ఇది భార్యా భర్తలకు బాగా ఉపయోగపడుతుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య అనుబంధాన్ని మరింత బలపరిచేలా ఈ కపుల్ యోగా ఉంటుంది. అమెరికా కు చెందిన ఒక జంట దీన్ని రూపొందించారు. అలా ఇది కేవలం ఆడ మగ లేదా, భార్యా భర్తలే చేయాలని లేదు. సోదరులు, స్నేహితులు, తల్లీ బిడ్డలు కూడా నిస్సందేహంగా ఈ యోగాను ప్రాక్టీస్ చేయచ్చు. చేసే వాళ్లిద్దరి మధ్య, మంచి సమన్వయాన్ని, బలమైన బంధాన్ని పెంపొందిస్తుందీ యోగ.

 

పవర్‌యోగ


ఎక్సర్ సైజ్ నే యోగా గా మార్చి పాశ్చాత్యులు ఫాలో అవుతున్న పద్ధతి పవర్ యోగ. ఇది బయటి దేశాల్లో చాలా ప్రాచుర్యం పొందింది. 1980లో మొదలైన ఈ యోగా, దశాబ్దాలుగా ఫాలోయింగ్ పెంచుకుంటూ పెరిగిపోతుంది. మన దేశంలో కూడా పవర్ యోగా ప్రాక్టీస్ చేసేవాళ్ల సంఖ్య తక్కువేమీ కాదు. 

 

కేవలం ఇవి మాత్రమే కాదు. యోగాను అనేక రకాలుగా చేసేసి, రకరకాల దేశాలు విచిత్రమైన యోగాభ్యాసాలు చేస్తున్నాయి. నగ్నంగా చేసేది న్యూడ్ యోగా, కుక్కలతో కలిసి చేసిది డోగా, క్లబ్బుల్లో రేప్ యోగా లాంటి ఎన్నో విచిత్రమైన యోగాలను ఫారిన్ కంట్రీస్ డెవలప్ చేస్తున్నాయి. ఎన్ని యోగాలొచ్చినా అన్నీ మనిషి ఆరోగ్యానికే కదా..ఇంకెందుకాలస్యం...మీరు కూడా ఈరోజు నుంచే ఏదొక యోగసాధనను మొదలెట్టండి మరి..

By
en-us Life Style News -