పక్కవారి కోసం గొంతు విప్పండి


జీవితం చాలా కఠినంగా మారిపోయింది. కాదనలేం! ఎవడి బతుకు వాడు చూసుకోవడానికే తీరక చాలడం లేదు. తన పొట్ట నింపుకునేందుకే నానాపాట్లూ పడాల్సి వస్తోంది. అందుకనే వేరొకరి గురించి పట్టించుకునేందుకు మనసు రావడం లేదు. సమస్య తనదాకా వస్తే కానీ దానిని నిలువరించే ప్రయత్నం చేయడం లేదు. ఐక్యరాజ్యసమితి కూడా ఈ విషయాన్ని గ్రహించినట్లుంది. అందుకే ఏటా డిసెంబరు 10న జరుపుకొనే ‘మానవహక్కుల దినోత్సవం’లో ఈసారి ఇతరుల హక్కుల కోసం కూడా ఆలోచించమంటూ పిలుపునిస్తోంది.

 

మనిషి మనిషిగా తలెత్తుకుని జీవించగలగడమే మానవహక్కు! రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా ఓ వ్యక్తి ఇతరులతో సమానంగా జీవించే అవకాశమే మానవహక్కు. ఇలాంటి మానవహక్కుల గురించి ప్రజలలో అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్యసమితి 1946లోనే ఒక కమీషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమీషన్‌ 1948లో Universal Declaration of Human Rights అనే పత్రాన్ని రూపొందించింది. బైబిల్‌ తరువాత ప్రపంచంలో అత్యధిక భాషలలోకి అనువదించబడిన పుస్తకం ఇదే! దీని ఆధారంగానే 1950 నుంచి ఏటా డిసెంబరు 10న మానవహక్కుల దినోత్సవాన్ని జరుపుకోవాలని తీర్మానించారు. ఇందులో భాగంగా ప్రతి ఏడూ మానవహక్కులకి సంబంధించి ఏదో ఒక అంశం మీద ప్రచారం కల్పించే ప్రయత్నం చేస్తోంది. అలా ఈ ఏడు ఇతరుల హక్కుల కోసం నిలబడమంటోంది.

 

ఇతరుల హక్కుల కోసం ఇలా గొంతు విప్పవచ్చు...

- వికలాంగులు, వృద్ధులు, రోగులు... వీరికి ఎక్కడికక్కడ ప్రత్యేక సౌకర్యాలను కల్పించే ప్రయత్నం చేస్తుంటుంది ప్రభుత్వం. ఈ సౌకర్యం అందుబాటులో లేకున్నా, లేదా మన కళ్ల ముందే దుర్వినియోగం అవుతున్నా అడ్డుకునే ప్రయత్నం చేయవచ్చు. మన పక్కన ఉన్న అలాంటి నిస్సహాయుల కోసం ఒక మాట వాడటంలో తప్పులేదు.

 

- స్వలింగ సంపర్కులు, ట్రాన్స్‌జండర్‌ వ్యక్తుల పట్ల సమాజపు దృక్పధం చాలా విభిన్నంగా ఉంటుంది. వీరి పట్ల మన వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ... వారు కూడా సమాజంలోనే భాగమని గుర్తించి, తగిన గౌరవం ఇవ్వడం అవసరం.

 

- మన చుట్టూ స్త్రీ పట్ల ఎవరు అసభ్యంగా ప్రవర్తించినా... అది వారి వ్యక్తిగత విషయం అనుకుని నిస్తేజంగా సాగిపోవడం మానవత్వం అనిపించుకోదు.

 

- దళితులు, మైనారటీలు, ఆదిమజాతివారు... ఇలా సమాజంలో అణగారిన వర్గాలకి కూడా ఈ భూమ్మీద మనతోపాటు సమానమైన హక్కులు ఉన్నాయి. మనం వారి అభ్యున్నతి కోసం పోరాడలేకపోయినా, వారి జాతి ఆధారంగా అవమానం జరిగినప్పుడు మాత్రం గొంతు విప్పడం సహేతుకం.

 

- పిల్లల మనసు చాలా సున్నితంగా ఉంటుందనీ, పెద్దలతో ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తామో... అంతకంటే జాగ్రత్తగా పిల్లలతో వ్యవహరించాలన్న విషయాన్ని చాలామంది గ్రహించరు. అందుకే పిల్లలు నిష్కారణంగా ఎవరో ఒకరి దౌర్జన్యానికి తలవంచాల్సి వస్తుంటుంది. మన కళ్ల ముందర ఇలాంటి సంఘటన జరిగితే అడ్డుకుని తీరాల్సిందే!

 

- ఉన్నవాడిని లేనివాడిని వేర్వేరుగా చూస్తుంది సమాజం. దానికి మనమేం చేయలేం. కానీ ఆ పక్షపాతంతో పేదవాడు మనిషే కాదన్నట్లు ఎవరన్నా ప్రవర్తిస్తే వారిని సరిదిద్దాల్సిందే!

 

ఏవో చెప్పుకోవాలి కాబట్టి కొన్ని ఉదాహరణలు చెప్పుకొన్నామే కానీ... ఇతరుల హక్కుల కోసం పోరాడేందుకు చాలా సందర్భాలే కనిపిస్తాయి. పోరాడటం అంటే కేవలం భౌతికమైన అర్థం మాత్రమే రాదు. ఒక మాట అడ్డువేయడం, కళ్ల ముందు జరుగుతున్న పక్షపాతాన్ని పరిష్కరించేందుకు ఒక అడుగు ముందుకి వేయడం, అవతలివారికి నచ్చచెప్పడం, మనలోని ఆలోచనను నలుగురితో పంచుకోవడం, శాంతియుతంగా మన నిరసనని తెలియచేయడం కూడా పోరాటం కిందకే వస్తాయి. అదీఇదీ కాదంటే మన కళ్ల ముందు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి సోషల్‌ మీడియా ఎలాగూ ఉండేనే ఉంది!

 

- నిర్జర.