పుస్తక ప్ర‘పంచ’ సూత్రాలు

 

ఒకప్పుడు కాలక్షేపానికి పుస్తకం మాత్రమే ఉండేది. అందుకే ఇంట్లో చిన్న నుంచి పెద్దదాకా చదివే పుస్తకాలు మాత్రమే ఉండేవి. పిల్లల పత్రికలు, వార పత్రికలు, మాస పత్రికలు ఎన్నో పుస్తకాలు కాలక్షేపాన్ని, వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించేవి.

మారిన కాలంలో పుస్తకం మరుగున పడిపోతోంది. ఇప్పటికీ పుస్తక ప్రేమికులు చాలా మందే ఉన్నా చదివే అలవాటు క్రమంగా తగ్గుతూ వస్తుందన్నది నిజం. కాలక్షేపాన్ని వినోదాన్ని అందించే సాధనాలు ఎన్నో అందుబాటులో ఉండేసరికి పుస్తాకాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. కాని పుస్తకం చదివే అలవాటు ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది గుర్తించండి అంటున్నారు నిపుణులు.

1. పుస్తకం చదివే అలవాటు ఏకాగ్రతను పెంచుతుంది. రోజుకో అరగంట చదివినా చాలు. ఆసమయంలో మనసు, మెదడు అనుసంధానం జరిగి అదో మెడిటేషన్ లా మారుతుంది.

 

 

2. మతిమరుపు ఇబ్బంది పెడుతుంటే పుస్తకం చదవడం మొదలుపెట్టండి చాలు. మెదడులోని న్యూరాన్లు యాక్టివ్ గా మారుతాయి. చూడటం, చదవడం, గ్రహించడం దానిని స్టోర్ చేసుకోవడం ఇలా అన్నీ ఒక్కసారే జరిగే ప్రక్రియ మెదడుకి ఒక ఛాలెంజ్ లాంటిదే. ఆ ఛాలెంజ్ న్యూరాన్లను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

3. రష్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్ రీసెర్చ్ వయసు ప్రభావం మెదడు మీద లేకుండా చేసే శక్తి పుస్తక పఠనానికి మాత్రమే ఉందని చెప్పింది. బాగా చదివే అలవాటు ఉన్నవారి మెదడు వయసు, వారి శారీరక వయసు కంటే తక్కువగా ఉండటం గుర్తించారు.

 

 

4. మానసిక ధృడత్వం, సమస్యలను ఎదుర్కొనే ధైర్యం ఎమోషనల్ ఇంటెలిజన్స్ ఇలా ఎన్నో జీవన నైపుణ్యాలు ఒక్క పుస్తక పఠనం వల్ల మాత్రమే సాధ్యమవుతుందని గట్టిగా చెపుతున్నారు నిపుణులు.

5. ఒక్క పుస్తకం చేతిలో ఉంటే చాలు ఎందరో మనతో ఉన్నట్టే. మానసిక ప్రశాంతత, ఉత్సాహం అన్నీ లభిస్తాయి. ఒత్తిడికి సులువైన విరుగుడు పుస్తకం. కాబట్టి చదవడం మొదలుపెట్టగానే శరీరం, మనసు రెండూ రిలాక్స్ అవటం మొదలవుతుంది.

 

 

ఇక భాషాజ్ఞానం పెరగడం వంటి లాభాలు, అందరికీ అన్ని విధాలుగా ఎంతో ప్రయోజనం ఈ పుస్తకం పఠనం వల్ల అని తెలిసాక దానితో స్నేహం చేయకుండా ఉండగలమా? ఒకవేళ ఈ మధ్యకాలంలో దానిని పలకరించకపోతే ఒక్కసారి దగ్గర చేయాలనే ఈరోజుని 'పుస్తక దినోత్సవం'గా ప్రపంచవ్యాప్తంగా పాఠిస్తున్నారు. పుస్తకంతో మన అందరి అనుబంధం నూరేళ్లు వర్ధిల్లాలని కోరుకుందాం.

-రమ