సంసారం... ప్రేమ సుధాపూరం... నవజీవన సారం



సమసోఖ్ఖ దుఖ్ఖ పరివడ్ఢిఆణం కాలేన రూఢ పెమ్మాణం 
మిహుణాణం మర ఇ  జం తం జిగయి యీరం ము అం హోయి.  (గాధా-1-42)

గాధాసప్తశతిలోని యీ గాధ, భార్యాభర్తల గాఢమైన ప్రేమకు అద్దం పడుతున్నది. 'సుఖదుఖాలను సమానంగా పంచుకుంటూ జీవించిన దంపతులలో, ముందెవరు మరణించినా, వారే జీవించి ఉన్నవారితో సమానం. మిలిగినవారు బ్రతికిఉన్నా, జీవన్మృతులే' అంటున్న పై గాధ, దాంపత్య జీవిత సార్థక్యతను స్పస్టంగా వివరిస్తున్నది. దాదాపు యేడు వందల సంవత్సరాల క్రితం రచనైనా, అప్పటి గృహస్థ జీవనంలోని విలువలను ఇప్పటి జంటలకు బోధిస్తున్నట్టూ, ఇలాగే మీరూ ఉండాలి సుమా' అని హెచ్చరిస్తున్నట్టూ ఉంది కదూ! 
           

గాధాసప్తశతిలోని మరో పామరుడైన   రైతు,  తన భార్య గతించటాన్ని తట్టుకోలేక, ఆ శూన్యమైన ఇంటికి వెళ్ళేందుకూ ఇస్థపడక,పనేమీ లేకున్నా, పొలంలోనే కాలం గడుపుతున్నాడట! (గాధా-2-69) తనలో ఇంకా సజీవంగానే ఉన్న భార్య జ్ఞాపకాలను చెరిపివేయటం  సుతరామూ ఇష్టం లేదు పాపం ఆ అమాయకునికి!!

ఈ నాటి దాంపత్య జీవితం,ఇటువంటి గాఢానుభూతులకు తావిచ్చేలా  లేదేమోననిపిస్తుంది. కారణం- ఆర్థిక పరమైన పరస్పరాధారాలుగానే  ఉంటున్న జీవితాలు మనవి. డబ్బుతో వచ్చే సౌఖ్యాలు తప్పనిసరి బంధాలను ప్రోత్సహిస్తున్నాయేమోననిపిస్తుంది కూడా! 

యేది యేమైనా, ప్రేమ వివాహాలలోనూ, పెద్దలు కూర్చి చేసిన పెళ్ళిళ్ళలోనూ, 'ఇగో' అన్న గుణాన్ని అదుపులో ఉంచుకోకపోతే అన్నీ అనర్థాలే నన్నదీ నగ్న సత్యం. ఎంతగానో ప్రేమించుకుని, ఎన్నెన్నో త్యాగాలు చేసి మరీ పెళ్ళాడిన జంటలు కూడా యీ సమస్యతోనే విడిపోవటం నేను చూసిన సత్యం. ఇరువురి గుణాలూ, అలవాట్లూ అన్నీ అర్థమయ్యాకే పెళ్ళిళ్ళు చేసుకున్నా, కొద్ది రోజుల్లోనే  వీళ్ళెందుకు విడిపోతున్నారో అర్థం కాదు. అంటే, పెళ్ళికిముందు, వీరిద్దరిలోనూ ఉన్నది  కేవలం  ఆకర్షణేనా అని అనుమానమూ వస్తుంది కదా! 

అంతేకాక, చాలావరకూ ప్రేమ జంటలకు   తల్లిదంద్రుల సమ్మతి దొరకకపోవటం వల్ల, ఇరువురి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు, సర్ది చెప్పే పెద్దవారూ  ఉండరు. ఇకపోతే, పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళలో, భార్యాభర్తల మధ్య  అనుబంధం యేర్పడేందుకూ  కొంత కాలం పడుతుంది. ఐనా, ఇదివరకటి బాల్య వివాహాలు వితంతు సమస్యకు కారణమైనా, భార్యాభర్తల మధ్య,కుటుంబ సభ్యుల మధ్య కూడా, సుదీర్ఘ అనుబంధానికి అనుకూలంగా ఉండేవి. కాలం మారి, వివాహాలకూ అర్హమైన వయస్సును నిర్ణయించటం వల్ల, ముక్కుపచ్చలారక ముందే తల్లి కావటం, ప్రసవ సమస్యలకు గురి కావటం, లేత వయసులోనే తనువు వీడటం   లేదా కాళ్ళ పారాణికీ, పసుపు కుంకుమలకూ దూరం కావటమన్న సమస్యలు శాశ్వతంగానే పరిష్కరింప బడినాయి  కూడా! 

ఇది మంచి పరిణామమే. ఈనాడు, ఆడ, మగ పిల్లలిద్దరూ సమానంగా చదువుకుని, ఉద్యోగాలు చేసుకుంటున్న వయసులో తమ కాళ్ళపై తాము నిలబడిన తరువాతే వైవాహిక జీవితంలోకి అడుగు పెడుతున్నారు.అంతేకానీ, వివాహబంధం కలకలం ఒక తీయని అనుబంధంగా వర్ధిల్లేందుకు అవసరమైన ఆలోచనాధోరణిని అలవరచుకోవటంలో కాస్త అలసత్వం వహిస్తున్నారేమోననిపిస్తుంది. 

జీవితంలో భార్యాభర్తల మధ్య చిలిపి తగాదాలూ, అనునయించుకోవటాలూ, రాజీపడి, తిరిగి జీవనరాగాలు ఆలపించటమూ ఉన్నట్టే,అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు, పట్టు విడుపులూ, ఒకరి అభిప్రాయాలను మరొకరు కుటుంబ నేపధ్యంలో గౌరవించుకోవటమూ కూడ అలవరచుకుంటే, యీ 'ఎడమొగం-పెడమొగం’ కాపురాలకొక పరిష్కారం  దొరుకుతుంది.

ఎవరికి వారే యమున తీరే అనుకుంటూ, తాను పట్టిన కుందేటికి   మూడే కాళ్ళూ అని పట్టుదలలతో ప్రవర్తించేవారికి విడాకులూ వరాలుగా అనిపించినా, జీవిత చరమాంకంలోగానీ  మనం కోల్పోయినదేమిటో అర్థం కాదు.అలాంటి విడాకుల జీవితాలూ, విశృంఖల జీవితాలూ, స్వేచ్చాశృంగారంతోనే తాత్కాలిక ఆనందం పొందుతూ, 'వివాహానికి అర్థం ఇదేకదా' అని వాదించే  విపరీత  ధోరణులు పాశ్చాత్య జీవిత ప్రభావాలే! ఇలాంటి ఆలోచనలనుండి, బయటపడాలనీ, మన భారతీయ కౌటుంబిక జీవనాన్నే ప్రమాణంగా స్వీకరించాలనీ, పశ్చిమ దేశాలు సైతం తహతహలాడుతున్న నేపధ్యంలో యీ 'యిగో 'అన్న అంశాన్ని గురించి దంపతులు పునరాలోచించవలసి ఉంది. 

పెళ్ళి అన్నది, ధర్మార్థకామమోక్షాలకు ఆలవాలంగా, గృహస్తాస్రమం,  సమాజానికి ఒక నిజమైన అండగా అభివర్ణించిన మన శాస్త్రాలలోని అంతరార్థం అర్థం చేసుకుంటే,  ఒంటరి జీవితం ఒక దిద్దుకోలేని తప్పుకు అద్దం లా నిలిచి పోతుంది. అంతే!!  

అలాకాక, ఒకరికోసం మరొకరు అప్పుడప్పుడూ తగ్గుతూ, ఒకరి మనోభావాలను మరొకరు గౌరవించుకుంటూ మనగలిగితే, వైవాహిక జీవితంలోని అసలు ఆనందం అనుభవీభూతమవుతుంది. తల్లిదండ్రులిరువురి  ప్రేమనూ సమానంగా పొంది, పెరిగిన పిల్లల్లను సమజానికి అందించటం ద్వారా,బాధ్యతాయుతమైన పౌరులను సమాజానికి మన కానుకగా అందించిన  తృప్తి దక్కుతుంది దంపతులకు.సమాజంలో నేడు జరుగుతున్న అనేక నేరాలకు, వారి వారి కుటుంబ నేపధ్యమే కారణమంటున్నాయి మనస్తత్వ శాస్త్రాలు. ఈ నేపధ్యంలో ఆలోచించినా, భార్యాభర్తల మధ్య అవగాహన,సర్దుకుపోయే మనస్తత్వం అవసరమేననిపిస్తుంది కూడా. అలా సుఖంగా సంసారాలు చేసుకుని, తమ వారసత్వం యెదుగుదలను కళ్ళారా ఆనందంగా చూసుకునే ఆనందంలోని ప్రతి క్షణమూ కవితాత్మకం కాదామరి?

-పుట్టపర్తి నాగపద్మిని