పర్యావరణం కాపాడాలా? పిల్లల్ని బయట ఆడుకోనివ్వండి...

 


పర్యావరణం నాశనం అయిపోతోంది! చెట్లని అనవసరంగా నరికేస్తున్నాము! మనిషి ప్రకృతిని కాపాడుకోలేక పోతున్నాడు! ఇలాంటి మాటలని మనం ప్రతి రోజూ వింటూనే ఉన్నాము. కానీ దీనికి విరుగుడు ఏమిన్న ప్రశ్నకు మాత్రం స్పష్టమైన జవాబులు లభించడం లేదు. జనంలో చిత్తశుద్ధి లేకపోతే ఎవరు ఎంత మోగినా కూడా ప్రయోజనం ఉండదు కదా! కానీ ఇందుకో ఉపాయం ఉందంటున్నారు కెనడా శాస్త్రవేత్తలు.

 

కెనడాలోని Okanagan విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు పర్యావరణానికీ, బాల్యానికీ మధ్య సంబంధం ఉందేమో అని కనుగొనే ప్రయత్నం చేశారు. దీని కోసం వారు 18 నుంచి 25 ఏళ్ల వయసున్న యూనివర్సిటీ విద్యార్థులని కొన్ని ప్రశ్నలు అడిగారు. ఇందులో చిన్నప్పుడు ఆరుబయట ఆడుకున్నవారిలో 87 శాతం తాము ఇప్పటికీ ప్రకృతిని ప్రేమిస్తున్నమని చెప్పుకొచ్చారు. ఇక వీరిలో ఒక 84 శాతం మంది తాము ప్రకృతిని రక్షించుకునేందుకే ప్రయత్నిస్తామని వెల్లడించారు. అనవసరంగా చెట్లని కొట్టేయక పోవడం, చిన్న చిన్న దూరాలకి వాహనాలను వాడకపోవడం, రీసైకిల్డ్‌ వస్తువులను వాడటం, విద్యుత్తును వృధా చేయకపోవడం వంటి చర్యల ద్వారా తాము ఎప్పుడూ ప్రకృతికి చేటు చేయకుండా జీవించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.

 

ఇంతకుముందు పిల్లలు ఆరుబయట ఆడుకునేందుకు పెద్దలు అంగీకరించేవారు. బడిలో కూడా విశాలమైన ఆటస్థలాలు ఉండేవి. పైగా స్కౌటింగ్‌, ఎన్‌సీసీ, సమ్మర్‌ క్యాంప్స్‌ వంటి కార్యక్రమాల ద్వారా పిల్లలను బయట తిప్పేవారు. కానీ ఇప్పటి ఆటలు, చదువు అన్నీ ఇంటికే పరిమితం అయిపోతున్నాయి. ఇవి పిల్లల మానసిక, శారీరిక వికాసాన్ని దెబ్బతీస్తాయని ఇంతకుముందే అనేక పరిశోధనలు వెల్లడించాయి. పర్యావరణం పట్ల కూడా వారికి ప్రేమ లేకుండా పోతుందని తాజా పరిశోధన తేల్చి చెబుతోంది. కాబట్టి... పిల్లలని కనుక ఆరుబయట ఆడుకోనిస్తే వారిలో పర్యావరణం పట్ల సృహ ఏర్పడుతుందనీ, అది వారి ఆలోచనా విధానం మీద ప్రభావం చూపుతుందనీ చెబుతున్నారు.

 

- నిర్జర.