కోపం... ఎందుకు, ఏమిటి, ఎలా?

 

తన కోపమే తన శత్రువు అంటారు. నిజమే. కోపంలో తప్పొప్పులు గుర్తుకు రావు. చిన్నా, పెద్దా చూడం. ఫలితం ఏంటన్నది ఆలోచించం. ఒక్క మాటలో చెప్పాలంటే కోపం విచక్షణని దూరం చేస్తుంది. కోపం వల్ల నష్టాలు అంటూ ఎంత చెప్పుకున్నా కోపం రాకుండా మాత్రం వుండదు. కోపం ఎప్పుడొస్తుంది, ఎందుకు వస్తుంది, ఎవరిమీద వస్తుంది అంటూ విశ్లేషణలు మొదలుపెట్టామంటే సమాధానాలు మాత్రం కచ్చితంగా ఒక్కలా మాత్రం వుండవు. ఉదాహరణకి మనకి ఎంతో కోపం తెప్పించిన సంఘటన వేరేవాళ్ళకి చాలా సాధారణమైన విషయంగా కనిపించవచ్చు. అలాగే వేరేవాళ్ళు ఆవేశంతో ఊగిపోయే విషయం మనకి అతి సామాన్యమైనదిగా అనిపించవచ్చు. అంతేకాదు, ఒకసారి మనకి ఎంతో కోపం తెప్పించిన విషయం మరోసారి మామూలు విషయంగా తోచవచ్చు. తేడా సంఘటనలోగానీ, ఆ పరిస్థితుల్లోగానీ, వ్యక్తుల్లోకానీ వుండదు. తేడా అంటూ వుంటే అది మనలోనే వుంటుంది. మన మానసిక స్థితిపై ఆధారపడే మనలో భావావేశాలు కలుగుతాయని మనందరికీ తెలిసిందే. కోపం గురించి ఇంత చెప్పుకున్నాం సరే. మరి ఆ కోపాన్ని వదలగలమా? పూర్తిగా అయితే సాధ్యం కాదు. మరి మార్గం ఏమిటి? మంచిదంటూ మచ్చిక చేసుకోవటమే! అది ఎలా?

 

కోపం నిజంగా మంచిది కాదంటారా? ఒకోసారి కోపం రావటం వల్ల మంచే జరిగింది అనుకుంటూ వుంటాం. కోపంలో పౌరుషంతో, పట్టుదలతో కష్టపడి మంచి ఫలితాలు సాధించవచ్చు అని వింటుంటాం. అదెలా? ఎలా అంటే కోపం అనేది నెగిటివ్ ఎమోషనే అయినా దానిని పాజిటివ్‌గా మార్చుకున్నప్పుడు కూడా మంచే చేస్తుంది. సరైన రీతిలో ఉపయోగించుకుంటే నిరంతరం ప్రేరణగా మారుతుంది. మనలోని మనకి తెలీని శక్తిని వెలికి తీస్తుంది. కోసం ఒకోసారి మనకి ఎక్కడలేని ధైర్యాన్ని కూడా ఇస్తుంది. నిజానికి కోపం కూడా అన్ని భావాలలాగే మనకు అత్యవసరమైన ఓ భావం. అయితే అది మంచిదా కాదా అన్నది దానిని మనం ఉపయోగించుకనే విధానంపై ఆధారపడి వుంటుంది.


మనిషిలోని భావోద్వేగాలన్నిటిలోకి కోపం కీలకమైనది. కోపం వస్తే ఊగిపోవటం, ఎదుటివారిని తిట్టడం, శిక్షించడం వరకే మనకి తెలుసు. కానీ, కోపంతో తమకు తాము హాని చేసుకోవడం, అందరికీ దూరంగా వుండటం జరుగుతూ వుంటుంది. కొంతమంది ఒంటరిగా,  మూడీగా వుంటారు. ఎవరినీ ఏమీ అనరు. కానీ ఎవ్వరితోనూ మాట్లాడరు. కారణం బాధ అయి వుండొచ్చు అనుకుంటాం చాలాసార్లు. కానీ, ఒకోసారి తనమీద, పరిస్థితుల మీద, తన చుట్టూ వున్నవారిపైన కోపం, ఏమీ చేయలని అసహాయత మీద కోపం కొందరిని మౌనంగా మారుస్తుంది అంటున్నారు నిపుణులు. అంతెందుకు.. పిల్లలు కోపంతో మూతి ముడిచి దూరంగా కూర్చోవటం అమ్మలకి అనుభవమేగా. కోపాన్ని వ్యక్తీకరించేందుకు విధానం ఒక్కలా వుండదు. పరిస్థితులను బట్టి, వ్యక్తులను బట్టి మారుతూ వుంటుంది. కోపాన్ని జయించలేకపోయినా అదుపులో పెట్టుకోవడం సులువే.


కోపం ఎందుకు, ఎవరిమీద వచ్చిందో అన్న విషయం ఒకోసారి మనకి గుర్తు వుండదు. కానీ, ఆ కోపాన్ని ఎవరో ఒకరిపై మనకి తెలియకుండానే చూపిస్తాం. నాకు కోపం రాలేదు అనుకుంటాం కానీ, ఆ భావావేశం మన ప్రవర్తనపై ప్రభావం చూపిస్తుందని గుర్తించం. ఉదాహరణకి చూడండి..  ఏ పనమ్మాయో రాలేదు. చేతినిండా పని. చిరాకుగా వుంటుంది. సరే చేసేది ఏముందని పనిలో పడతాం. అప్పుడు కోపం ఏం లేదు. కానీ, చిన్నవాడు పొరపాటున ఓ గ్లాసుడు నీళ్ళు హాలులో ఒంపగానే కయ్యిమని అరుస్తాం. చిన్నవాడికి ఏం అర్థంకాదు. గ్లాసుడు నీళ్ళకి అమ్మ ఎందుకు అంత అరిచిందని. మనకీ అర్థంకాదు ఎందుకంత కోపం వచ్చిందో. నిజానికి కారణం పనమ్మాయి రాని చిరాకు ఎక్కడో మనలో మనల్ని తొలిచేస్తూ కోపం ఈ విధంగా బయటపడింది అంతే. ఇది చిన్న ఉదాహరణే. సాధారణంగా జరిగేదే. కానీ, చాలాసార్లు మనం వ్యక్తంచేసే కోపానికి మూలం అప్పటి సంఘటనో, వ్యక్తో కాదంటే నమ్మగలరా! కానీ, నిజంగా నిజం అదేనట. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోగలిగితే, ఎప్పటికప్పుడు మన కోపాన్ని చెక్ చేసుకుంటూ వుండొచ్చు.


ఈమధ్య ఓ యూనివర్సిటీవారు నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలిన విషయం ఏమిటో తెలుసా? ఓ సగటు వ్యక్తి జీవితకాలంలో నిద్రకి కావలసిన సమయాన్ని తీసేస్తే మిగిలిన కాలంలో సగం కాలం కోపంతో గడుపుతాడట. ఆశ్చర్యంగా అనిపించినా నిజం అదే. ప్రతీ చిన్న విషయానికి కోపం తెచ్చుకోవడం ఈమధ్యకాలంలో సాధారణంగా మారిందని, ఆ ప్రభావం  ఆరోగ్యంపై, రిలేషన్స్‌పై ముఖ్యంగా పిల్లల వ్యక్తిత్వంపై చాలా ఉంటోందని చెబుతున్నారు ఆ అధ్యయనకర్తలు. ఆ కోపానికి కారణాలు వెతకడం మొదలుపెట్టగలిగితే లేదా ఆ కోపాన్ని నిర్మాణాత్మకంగా మార్చుకోవడం అలవాటు చేసుకోగలిగితే ఎన్నో సమస్యలకి దూరంగా వుండొచ్చు.

-రమ