విరాట్ కోహ్లీ.. ఇదేం ఆట?.. బ్యాటింగ్‌లో నీకంటే షమీ నయం!

ఇండియన్ క్రికెట్‌లోనే కాకుండా వరల్డ్ క్రికెట్‌లోనే నంబర్ వన్ క్రికెటర్‌గా నీరాజనాలు అందుకుంటూ వస్తున్న విరాట్ కోహ్లీ తాజా న్యూజిలాండ్ పర్యటనలో బ్యాట్స్‌మన్‌గా దారుణంగా విఫలమవడం ఇండియన్ క్రికెట్ ప్రేమికుల్నే కాకుండా అతని అభిమానుల్నీ తీవ్రంగా నిరాశపరచింది. టెస్టులు, వన్డేలు, టీ20లు అనే తేడా లేకుండా మూడు ఫార్మట్లలోనూ బ్యాట్స్‌మన్‌గా అతను విఫలమవడం విశ్లేషకుల్ని సైతం ఆశ్చర్యపరచింది. మూడు ఫార్మట్లలో కలిపి 11 ఇనింగ్స్ ఆడిన విరాట్ చేసిన మొత్తం పరుగులు కేవలం 218.  న్యూజిలాండ్ సిరీస్‌కు ముందు టెస్ట్ ప్లేయర్‌గా నంబర్ వన్ పొజిషన్‌లో ఉన్న విరాట్, సిరీస్ ముగిసే సరికి రెండో ర్యాంకుకు దిగజారాడు. విరాట్ పూర్ పర్ఫార్మెన్స్ కారణంగా ఆస్ట్రేలియన్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ మళ్లీ నంబర్ వన్ ర్యాంకును అందుకున్నాడు. టెస్టుల్లో ఓవరాల్‌గా 53.62 యావరేజ్ కలిగిన విరాట్, న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్స్ ఆడి సాధించిన యావరేజ్ ఎంతో తెలుసా? కేవలం 9.5.  ఈ నాలుగు ఇన్నింగ్స్‌లో ఒక్క హాఫ్ సెంచరీ సాధించడం మాట అటుంచి ఏ ఇన్నింగ్స్‌లోనూ కనీసం 20 పరుగులు కూడా చేయలేకపోయాడు. ఈ సిరీస్‌లో అత్యని హయ్యెస్ట్ స్కోర్ 19 రన్స్. ఫస్ట్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో అతను ఈ స్కోర్ చేశాడు. అతను ఈ టెస్ట్ సిరీస్‌లో చేసిన పరుగులు వరుసగా.. 2, 19, 3, 14. మొత్తం రన్స్ 38. అతనికంటే ఎక్కువగా 10వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమి 44 పరుగులు చేయడం గమనార్హం. టెస్టుల్లో 2011లో అరంగేట్రం చేసిన విరాట్ ఇంత ఘోరంగా ఆడటం ఇది రెండోసారి మాత్రమే. ఇదివరకు 2016-17లో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో ఐదు ఇన్నింగ్స్ ఆడిన విరాట్ 9.2 యావరేజ్‌తో 46 పరుగులు చేశాడు. అతని కెరీర్ మొత్తమ్మీద అదే అతని పూరెస్ట్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు న్యూజిలాండ్ సిరీస్‌తో దాని దగ్గరకు వచ్చాడు. ఇక రెండో టెస్ట్ సందర్భంగా మైదానంలో కోహ్లీ ప్రవర్తన అతనికి చెడ్డపేరు తీసుకొచ్చింది.

కెప్టెన్‌గానూ అతను టెస్ట్, వన్డే సిరీస్‌లో విఫలమయ్యాడు. మొదట వన్డే సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయిన అతడు ఇప్పుడు 0-2 తేడాతో టెస్ట్ సిరీస్‌ను న్యూజిలాండ్‌కు సమర్పించుకున్నాడు. గుడ్డిలో మెల్లగా మొదటగా జరిగిన టీ20 సిరీస్‌ను మాత్రం 5-0తో వైట్ వాష్ చేయగలిగాడు. అయితే అందులోనూ బ్యాట్స్‌మన్‌గా అతను వైఫల్యం చెందాడు. అంతర్జాతీయంగా 82 టీ20 మ్యాచ్‌లు ఆడిన విరాట్ యావరేజ్ 50.80. కానీ ఈ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన అతని సగటు 26.25 మాత్రమే. అతడి హయ్యెస్ట్ స్కోర్ 45. మిగతా మూడు మ్యాచ్‌లలో వరుసగా 11, 38, 11 స్కోర్లు చేశాడు. రోహిత్ శర్మ, కె.ఎల్. రాహుల్ పరుగుల వర్షం కురిపించడం వల్లే టీ20ల్లో భారత జట్టు విజేతగా నిలవగలిగింది. గాయం కారణంగా వన్డే, టెస్ట్ సిరీస్‌లలో రోహిత్ లేని లోటు సుస్పష్టంగా కనిపించింది. ఫాంలో ఉన్న కె.ఎల్. రాహుల్‌ను టెస్టుల్లోకి తీసుకోకుండా విరాట్ తీవ్ర తప్పిదం చేశాడని విశ్లేషకులంతా ముక్త కంఠంతో విమర్శిస్తున్నారు.

ఇక మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో విరాట్ యావరేజ్ 25 మాత్రమే. టూర్ మొత్తం మీద అతడు హాఫ్ సెంచరీ చేసింది ఈ వన్డే సిరీస్‌లోనే. అది మొదటి వన్డేలో 51 పరుగులు చేశాడు. మూడు రకాల ఫార్మట్లలో ఒక ఇన్నింగ్స్‌లో అతడి హయ్యెస్ట్ స్కోర్ ఇది. ఆ తర్వాత రెండు వన్డేల్లో అతడు చేసిన రన్స్ వరుసగా 15, 9. ఇప్పటివరకూ 248 అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు ఆడిన విరాట్ టోటల్ యావరేజ్ 59.33 కావడం గమనార్హం. ఈ గణాంకాలే న్యూజిలాండ్ టూర్‌లో అతడు ఏ స్థాయిలో వైఫల్యం చెందాడో తెలియజేస్తున్నాయి.

బౌలర్ నుంచి వచ్చే బంతిని అతని కన్ను నిశితంగా గమనిస్తుందనీ, దాని గమనాన్ని కచ్చితంగా అంచనా వేసి, చాలా వేగంగా స్పందించి షాట్ కొడతాడనీ కోహ్లీని విశ్లేషకులతో పాటు సీనియర్ క్రికెటర్లు కూడా ప్రశంసిస్తూ ఉంటారు. ఫ్యాన్స్ అయితే అతని చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉందని, అందుకే అలవోకగా ఫోర్లు కొడతాడని అంటుంటారు. ఫ్రంట్ ఫుట్ ఆడటంలో విరాట్‌ని మించిన వాడు లేడని కూడా వాళ్లు కితాబునిస్తుంటారు. అంటే అనేకమంది ఇతర బ్యాట్స్‌మెన్ కంటే అతడు ఎక్కువగా కవర్ డ్రైవ్స్ ఆడతాడు. చాలామంది స్క్వేర్ కట్ కొట్టే బంతుల్ని అతడు కవర్ డ్రైవ్ కొడతాడు. అంతేకాదు, చాలామంది దూరంగా పోతుందని వదిలేసే బంతుల్ని కూడా విరాట్ కవర్ డ్రైవ్స్ ఆడతాడు. అంత లాఘవంగా ఆ షాట్లను ఆడతాడని అతను పేరుపొందాడు.

అలాంటివాడు రెండో టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌లోనూ అతడు ఎల్బీడబ్ల్యూ అయిన తీరు నిర్ఘాంతపరచింది. అయితే తన బ్యాటింగ్‌లో ఎలాంటి లోపమూ లేదని అతను ఘంటాపథంగా చెబుతున్నాడు. వెల్లింగ్టన్‌లో జరిగిన మొదటి టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌లోనూ క్యాచ్ అవుట్ అయ్యాక, న్యూజిలాండ్ టూర్‌లో తన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ గురించి అడిగినప్పుడు "నా బ్యాటింగ్ బాగానే ఉంది" అని జవాబిచ్చాడు విరాట్. కొన్నేసి సార్లు స్కోర్లు బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రతిబింబించవనీ, బంతిని సరిగా ఎగ్జిక్యూట్ చెయ్యకపోవడం వల్ల అవుటవ్వాల్సి వస్తుందనీ అతను చెప్పాడు. జట్టు గెలిస్తే.. 40 పరుగులు చేసినా గొప్పగానే ఉంటుందనీ, జట్టు ఓడితే.. సెంచరీ చేసినా వేస్టయిపోతుందనీ అతను వాదించాడు. కానీ న్యూజిలాండ్ సిరీస్‌లో విరాట్ బాడీ లాంగ్వేజ్‌లోనే తేడా కనిపించిందనీ, బ్యాటింగ్ చేసేటప్పుడు మునుపటి ఈజ్ అతనిలో లోపించిందనీ క్రికెట్ అనలిస్టులు చెప్తున్న మాట. తదుపరి సిరీస్‌కైనా మనం మునుపటి గ్రేట్ బ్యాటింగ్ పర్ఫార్మర్‌ను విరాట్‌లో చూడగలమా? వెయిట్ చేద్దాం.