పవిత్ర సంకల్పం ఘన విజయాన్నిచ్చింది

మనం మన గురించి మాత్రమే కాకుండా మన చుట్టుపక్కల వారికోసం కూడా కొంచెం ఆలోచిస్తే మన వంతుగా మన స్థాయిలో మనమేం చేయగలమని చూడగలిగితే చేయతగింది, చేయాల్సింది చాలా కనిపిస్తుంది. నావల్ల ఏం అవుతుంది, నేనేం చేయగలను అనుకుంటే ఎవ్వరూ ముందడుగు వేయలేరు. ఒక్కొక్క నీటి బిందువు చేరితేనే అనంత సాగరమైనా నిండుగా కనిపించినట్టు ఒక్కరిగా మనం చేసే సామాజిక సేవ అంతో ఇంతో అయినా దాని ప్రభావం ఎక్కువే.

 

అమ్మ మనసుకి బిడ్డ కష్టం, ఇబ్బంది చెప్పకుండానే తెలుస్తాయి అంటారు. అదే అమ్మ మనసు ఇంకాస్త లోతుగా ఆలోచిస్తే సమాజంలోని ఎందరో బిడ్డల కష్టాలు, కన్నీళ్ళు కనిపిస్తాయి. బిడ్డ కష్టం చూసిన ఏ తల్లి మనసూ స్పందించకుండా వుండదు. ఆ కష్టం తీరే మార్గాన్ని అన్వేషిస్తుంది. సాయాన్ని అర్ధించే ప్రతి ఒక్కరూ బిడ్డలే. వాటిని తీర్చే ప్రయత్నం చేసే ప్రతి వ్యక్తీ అమ్మే. ఇలా ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు... 80 మందికి పైగా బిడ్డలని అక్కున చేర్చుకుని, వారికి ఓ దారి చూపించింది పవిత్ర. బెంగుళూరుకి చెందిన ఈమె చేసే సామాజిక సేవ అనన్య సామాన్యం.

పవిత్ర... బెంగళూరుకు చెందిన బిపీఓ సంస్థ వింధ్య ఇ ఇన్ఫోమీడియా ఎండీ. ఎంతో ఉన్నత విద్యావంతులై, ఎంతో నైపుణ్యం కలిగి వుండీ తగిన అవకాశం రాక బాధపడే ‘ఫిజికల్లీ ఛాలెంజ్‌డ్’ వ్యక్తులని వివిధ సందర్భాలలో దగ్గరగా చూసిన పవిత్ర తను వ్యాపారరంగంలోకి రాగానే మొట్టమొదట ఆలోచించింది వారికోసమే. తన వ్యాపారంలో వారిని చేర్చుకోవడం ఎలా అని ఆలోచించింది. ఫలితంగా తన సంస్థలో వివిధ స్థాయిల్లో వైకల్యం ఉన్నవారికే ఉద్యోగాలు ఇచ్చింది. నిరుద్యోగులు అయి వుండీ, తగిన విద్యార్హతలు వుంటేచాలు ఇంటర్వ్యూకి పిలుస్తారు. అంకితభావం, కష్టపడేతత్వం ఉన్నాయనిపిస్తే చాలు ఉద్యోగం ఇస్తారు. మరి నైపుణ్యం అక్కర్లేదా అంటే పవిత్ర ఇచ్చే వివరణలేంటో తెలుసా? ‘‘డేటా ప్రాసెసింగ్, స్కానింగ్, ఇండెక్సింగ్, వెబ్ రీసెర్చ్ వంటి రంగాల్లో మేం సేవలందిస్తున్నాం. వీటికి అద్భుతమైన నైపుణ్యాలు అవసరం లేదు. ఎంపిక చేసుకున్న ఉద్యోగులకు కంప్యూటర్ స్కిల్, టైపింగ్, వ్యవహారశైలి, ఆంగ్లం వంటి వాటిలో మూడు నెలలు శిక్షణ ఇస్తాం. ఆ తర్వాత విధులు అప్పగిస్తాం’’.

అన్నిటినీ డబ్బుతో కొలుస్తూ, కాలాన్ని డబ్బుతో తూచే వ్యాపారరంగంలో సేవని ఎంత చక్కగా మిళితం చేసిందో చూడండి పవిత్ర. కొద్దిపాటి సహనంతో వారికి శిక్షణ ఇవ్వగలిగితే చాలు.. సాధారణ వ్యక్తులకి ఏమాత్రం తీసిపోకుండా తమ ప్రతిభాసామర్థ్యాలతో అద్భుతాలు చేయగలమని నిరూపించారు ఆ సంస్థ ఉద్యోగులు. ప్రస్తుతం ఆ సంస్థలో 96 మంది ఉద్యోగులు పనిచేస్తుంటే, అందులో 81 మంది వైకల్యం ఉన్నవారే. సంస్థ ప్రారంభం వీరితోనే జరిగింది. మొదట్లో వేలల్లో ఉన్న లాభం ఆ తర్వాత లక్షలు దాటిపోయిందట. అదంతా కేవలం మా సంస్థ ఉద్యోగుల సామర్థ్యం వల్లేనంటుంది పవిత్ర. మామూలు వ్యక్తులకి మా ఉద్యోగులు ఎంతమాత్రం తీసిపోరు. నిజం చెప్పాలంటే క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడంలో వీరే ముందుంటారు అని చెప్తారు.

వినలేని, చూపులేని ఇతరత్రా శారీరక వైకల్యమున్న ఉద్యోగులు పనిలో చూపించే శ్రద్ధకు తగిన ప్రతిఫలాలే పొందుతున్నారు. బిపిఓ సంస్థలో ఉన్న వేతనాలకు దీటుగా వేలల్లో జీతాలు అందుకుంటున్నారు. అంతేకాదు, వారందరికీ భోజనం, గృహవసతి సౌకర్యాలతోపాటు నెలకోసారి వారి ఇబ్బందుల పరిశీలనకు ప్రత్యేక సమావేశం కూడా వుంటుంది. ప్రతీ మూడు నెలలకు మెడికల్ చెకప్ వంటివీ వుంటాయి. ఇవన్నీ వారిలో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తున్నాయి. వారి లోపాన్ని మరచిపోయేలా చేస్తున్నాయి.  నిజానికి సాయం చేయడం అంటే వారికి వారిగా నిలుచునేలా చేయడం. ఆత్మవిశ్వాసంతో గర్వంగా తలెత్తుకునేలా చేయడం.

ఎవరైనా, ఎవరికైనా ఒక్కరోజు ఆకలి తీర్చడం కంటే, వారికి వారుగా ఆకలి తీర్చుకునే మార్గాన్ని చూపిస్తే అది వారిని ఆత్మవిశ్వాసంతో తలెత్తుకు తిరిగేలా చేస్తుంది. పవిత్ర చేస్తున్న పని ఇదే. ‘‘అంగవైకల్యమున్నవారిని చూసి జాలిపడటం, సానుభూతి చూపించడం కాదు. వారికి చిన్న చేతి ఊతమిచ్చి వారి సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం ఇవ్వాలి. నిండైన వ్యక్తిత్వంతో ముందుకు నడిచేలా చేయాలి. అది మనందరి బాధ్యత కూడా’’ అనే పవిత్ర తన సంస్థ ఉద్యోగులలో ఒకరిగా కలసిపోతూ, వారి కష్టసుఖాలని తనవిగా భావించి, పరిష్కరించి కలసికట్టుగా విజయాలను సొంతం చేసుకుంటున్నారు. అలు వ్యాపార రంగంలోను, ఇటు సామాజికపరంగానూ విజేతగా నిలిచారు. ఇలా ప్రతి ఒక్కరూ పవిత్రలా ఆలోచిస్తే ఎందరివో కన్నీళ్ళు తుడవచ్చు. మరెందరీ జీవితాల్లోనో వెలుగును నింపవచ్చు.

-రమ