టీఆర్ఎస్ ని టెన్షన్ పెట్టిస్తున్న విపక్షాల ఐక్యత

తెలంగాణ అధికార పార్టీ ఇప్పుడు ఒక విషయానికి తెగ టెన్షన్ పడుతుందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. నిన్న మొన్నటి వరకూ అన్ని పార్టీలకు టెన్షన్ పుట్టించిన టీఆర్ఎస్ ఇప్పుడు అంతలా టెన్షన్ పడటానికి కారణం ప్రతిపక్షాలన్నీ ఏకమవ్వడమే కారణమని అంటున్నారు. ఇప్పటివరకూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరించిన విపక్షాలు రైతు సమస్యలపై పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి టీఆర్ఎస్ పార్టీపై పోరాటానికి సిద్ధమయ్యాయి. ఇప్పటికే అసెంబ్లీలో రైతు సమస్యలపై అధికార ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. ప్రతిపక్షాలన్నీ ఇలా  తమపై దాడి చేస్తాయని అసలు ఏ మాత్రం ఊహించని టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఈ విషయంలో ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. దీనికి అసెంబ్లీలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలే నిజమనిపించేలా ఉన్నాయి. రైతు ఆత్మహత్యలపై సిద్దాంతాలన్నీ పక్కనపెట్టి మరీ ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయని.. ఇది నిజంగా సిగ్గులేనితనం అంటూ గట్టిగానే కామెంట్ చేశారు. అయితే కేటీఆర్ కామెంట్ చేసినా కూడా అది ఒకింత భయంతో చేసిన కామెంట్స్ అనే అందరూ అనుకుంటున్నారు. అంతేకాదు ప్రతిపక్షాలన్నీ ఇలాగే కలికట్టుగా ఉండి తమపై పోరాటం చేస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆలోచించి ముందు వారిలో విబేధాలు రావడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారంట. మొత్తానికి తమకు ఎదురులేదనుకునే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈరకంగా విపక్షాలన్నీ కలిసి చెమటలు పట్టిస్తున్నాయి. మరి ఎంతకాలం కలిసికట్టుగా ఉంటారో చూద్దాం.