రాజకీయాల్లోకి వెళ్లడం తప్పే: దాసరి

 

తెలుగు సినీ రంగంలో విశేష గౌరవ మర్యాదలు అందుకొనే సీనియర్ దర్శకుడు దాసరి నారాయణ రావుకి బొగ్గు మసి అంటుకోవడం చాలా బాధ కలిగిస్తోంది. ఆయన బొగ్గుశాఖ మంత్రిగా పనిచేసినప్పుడు బొగ్గు గనుల కేటాయింపులలో అక్రమాలకూ పాల్పడ్డారని ఆయనకు చెందిన సౌభాగ్య మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు పరోక్షంగా లబ్ది కలిగిందని ఆరోపిస్తూ సీబీఐ మరో 14మందితో బాటు అయనపై కూడా చార్జ్ షీట్ దాఖలు చేయడమే కాక సీబీఐ కోర్టులో విచారణకు హాజరు కమ్మని నోటీసులు కూడా జారీ చేసింది. తెలుగు సినీ పరిశ్రమలో నేరుగా ఆయన ఎదుట ఎవరూ అ ప్రస్తావన తేకపోయినా వెనుక గుసగుసలు ఆడుకోవడం, అవి ఆనోటా ఈనోటా ప్రాకి చివరికి ఆయన చెవిలో పడటం అందుకు ఆయన నోచ్చుకోవడం అన్నీ సహజమే. అందుకే ఇప్పుడు ఆయనే స్వయంగా తనపై మోపబడిన ఆరోపణల గురించి స్వయంగా చెప్పుకొని తనను ఈ కేసులో అన్యాయంగా ఇరికించారని, తను నిర్దోషినని చెప్పుకోవలసి వస్తోంది. ప్రత్యేకించి తన పుట్టిన రోజునాడు అటువంటి విషయాల గురించి మాట్లాడవలసి రావడం చాలా కష్టమే.

 

నిన్న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఆయన 71వ పుట్టిన రోజు కార్యక్రమ వేడుకలు జరిగాయి. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తను రాజకీయాలలో ప్రవేశించడమే ఒక పెద్ద పొరపాటని అన్నారు. “గత ఐదు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో ఉన్నప్పుడు ఎటువంటి మచ్చాలేకుండా బ్రతికాను కానీ రాజకీయాలలో ఉన్న కొద్దిపాటి సమయంలోనే మచ్చ పడింది. అయితే వేరొకరిని కాపాడేందుకే ఈ ఊభిలో నన్ను ఇరికించారు. కోర్టులో నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకొని నా మీద పడిన ఆ మచ్చను తొలగించుకొని మీ ముందుకు వస్తాను,” అని ఆయన అన్నారు.