తెలుగు తమ్ముళ్లకు కేసీఆర్ గుడ్‌న్యూస్..?

లోక్‌సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ విషయం ముందు తెలిసిందో లేక ఎప్పటి నుంచో ఈ ఆలోచన ఉందో కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికలు 2019లో కాదని..2018 చివరికల్లా వస్తాయి..సిద్ధంగా  ఉండాలంటూ శ్రేణులకు పిలుపునిస్తూ వస్తున్నారు. ఎన్నికలు సరే 2014 నాటి పరిస్థితులు వేరు..నేటి పరిస్థితులు వేరు..రాజధాని కోసం భూసేకరణ, భీమవరం మెగా అక్వా ప్రాజక్ట్, కాల్‌మనీ, భోగాపురం భూములు, కాపు రిజర్వేషన్లు సహా కొన్ని అంశాల్లో టీడీపీ ప్రభుత్వం ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంది.

 

ఇలాంటి పరిస్ధితుల్లో ముందస్తు ఎన్నికలకు వెళితే జనాలు ఆదరిస్తారా..? లేక 2004 నాటి పరిస్ధితి ఎదురవుతుందా అంటూ సగటు కార్యకర్త భయపడ్డాడు. అయితే నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో పచ్చ జెండా రెపరెపలాడటంతో టీడీపీ శ్రేణులు ఫుల్ జోష్‌లో ఉన్నాయి. ఇలాంటి వాతావరణంలోనే ముందస్తు ఎన్నికలకు వెళితే మంచి రిజల్ట్స్ వస్తాయని కార్యకర్తలు భావిస్తున్న వేళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అదిరిపోయే శుభవార్తను చెప్పారు. ఆయన చేయించిన సర్వేలో ఇప్పటికిప్పుడు ఆంధ్రాలో ఎన్నికలు జరిగితే టీడీపీకి 139 సీట్లు వస్తాయని తేలిందట.

 

టీడీపీ-బీజేపీ కలిసి పోటీచేస్తే ఈ సీట్లు వస్తాయని..ఒక వేళ తెలుగుదేశం ఒంటరిగా పోటీ చేస్తే 157 సీట్లు దాకా రావొచ్చంటున్నారట గులాబీ బాస్. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అమలుకావడం, రాజధాని నిర్మాణం, శాంతిభద్రతలు, తాగు, సాగునీటికి ఇబ్బందులు లేకపోవడం తదితర అంశాలు ప్రజలపై ప్రభావం చూపి తెలుగుదేశం పట్ల ఆకర్షితులైనట్లు స్ఫష్టంగా తెలుస్తోంది. అయితే తెలంగాణ ముఖ్యమంత్రికి ఆంధ్రాలో సర్వే చేయించాల్సిన అవసరం ఏమొచ్చిందా అని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. మరోవైపు టీడీపీ అభిమానులు ఈ విషయం తెలిసిన దగ్గరి నుంచి ఆనందంలో మునిగి తేలుతున్నారు.