ఒకవైపు వడదెబ్బ.. మరోవైపు కోర్టు దెబ్బ..
posted on Jun 2, 2015 10:45PM

తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన మంగళవారం నాడు అచ్చివచ్చినట్టు కనిపించడం లేదు. తెలంగాణ ఆవిర్భవించినందువల్లే తనకు శాసనసభ స్పీకర్ అయ్యే అవకాశం లభించిందన్న ఆనందంలో ఆయన వుండగానే ఆయనకు వరుసగా రెండు దెబ్బలు తగిలాయి. వాటిలో ఒకటి వడదెబ్బ, రెండోది హైకోర్టు దెబ్బ. వడ దెబ్బకు గురైన ఆయన నిమ్స్‌లో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. బుధవారం నాటికి ఆయన పూర్తి ఆరోగ్యం పొందే అవకాశం వుంది. మరి కోర్టు కొట్టిన దెబ్బ నుంచి ఆయన ఎలా కోలుకుంటారో చూడాలి.
తెలుగుదేశం, కాంగ్రెస్, వైసీపీల నుంచి పలువురు శాసనసభ్యులు తమ పార్టీని ఫిరాయించి టీఆర్ఎస్‌లో చేరారు. చట్టప్రకారం వారి మీద అనర్హత వేటు విధించాలి. ఈ విషయంలో శాసనసభ స్పీకర్ ఎలాంటి స్పందన తెలియజేయడం లేదు. ఈ విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ అంశంలో హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. పార్టీ ఫిరాయించిన వారి విషయంలో ఇంతవరకు స్పీకర్ ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ప్రశ్నించింది. ఈ విషయంలో అడ్వకేట్ జనరల్‌ని నిలదీసింది. స్పీకర్‌కి వారం రోజుల గడువు ఇస్తున్నామని, పార్టీ ఫిరాయింపుల మీద ఎప్పటిలోగా నిర్ణయం తీసుకుంటారో ఆయన చెప్పాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. స్పీకర్ నిర్ణయం తీసుకోకుంటే కోర్టు నిర్ణయం తీసుకుంటుందని కూడా ధర్మాసనం వ్యాఖ్యానించింది. మరి ఇప్పుడు మధుసూదనాచారి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.