తెలంగాణ కాంగ్రెస్‌లో కులాల కుంపటి... ఓసీ వర్సెస్ బీసీ...
posted on Jul 29, 2017 12:11PM
.jpg)
తెలంగాణ కాంగ్రెస్‌లో కుల రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. గెలిస్తే ఓసీ నాయకుల ప్రతిభ.. ఓడితే BC నేతల బాధ్యతా... అంటూ టీ-కాంగ్రెస్ బీసీ ఫోరం మండిపడుతోంది. పార్టీలో కేవలం ఒక వర్గం వారే పెత్తనం చెలాయిస్తూ ఒంటెత్తు పోకడలు పోతున్నారని బీసీ నేతలు ఫైరవుతున్నారు. 2014 ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడిగా బీసీ ఉన్నందువల్లే పార్టీ ఓడిపోయిందని దుష్ర్పచారం చేస్తున్నారని, ఇలాంటి ప్రచారం వల్ల బీసీలు పార్టీకి దూరమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కొందరు ఓసీ నేతలు.... బలహీన వర్గాల ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తున్నారని, వాళ్లు తమ వైఖరి మార్చుకోకపోతే... హైకమాండ్ కి ఫిర్యాదు చేస్తామని టీ-కాంగ్రెస్ బీసీ ఫోరం అల్టిమేటం ఇచ్చింది.
కాంగ్రెస్ పార్టీకి మొదట్నుంచీ వెన్నుదన్నుగా నిలిచిన వర్గాలను గుర్తించి జనాభా దామాషా ప్రకారం బీసీలకు 50 శాతం సీట్లివ్వడమే కాకుండా... వారి గెలుపు కోసం పార్టీ కృషి చేయాలని అంటున్నారు. రాష్ట్ర జనాభాలో 50 శాతమున్న బీసీలకు పార్టీలో తగిన ప్రాతినిధ్యం ఇస్తేనే ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని టీ-కాంగ్రెస్ బీసీ ఫోరం అంటోంది. బీసీలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందనే భరోసా కల్పిస్తేనే... 2019లో అధికారంలోకి వస్తామని, ఈ అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకుకెళ్లాలని టీ-కాంగ్రెస్ బీసీ ఫోరం ఉత్తమ్‌కు సూచించింది.
టీపీసీసీతోపాటు ఏఐసీసీ పదవులు కూడా బీసీలకు వచ్చేవిధంగా చూడాలని టీ-కాంగ్రెస్ బీసీ ఫోరం డిమాండ్ చేస్తోంది. ఓవరాల్‌గా పార్టీలో బీసీలకు ప్రాధాన్యత పెంచాలని... అదే సమయంలో బలహీనవర్గాలకు పార్టీ అండగా ఉంటుందనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాలని కోరుతున్నారు. లేదంటే వచ్చే ఎన్నికల్లోనూ పార్టీకి ఎదురుదెబ్బ తప్పదని హెచ్చరిస్తున్నారు. మరి బీసీ నేతల డిమాండ్లపై హైకమాండ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.