చిన్నారెడ్డిని చితగ్గొట్టారా? సో వాట్?

 

తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి మీద కొంతమంది టీఆర్ఎస్ నాయకులు దాడి చేసి వాతలు పడేలా కొట్టారు. రాజకీయాలు గౌరవంగా మాట్లాడుకునే స్థాయి నుంచి, పచ్చిబూతులు తిట్టుకునే స్థాయికి ఎదిగి, ఇప్పుడు కొట్టుకునే స్థాయికి ఒదిగిన పరిస్థితుల్లో ఒక పార్టీకి చెందిన ఎమ్మెల్యేని మరో పార్టీకి చెందిన కార్యకర్తలు చితగ్గొట్టడం అనేది ప్రజలకు పెద్దగా షాక్ కలిగించే అంశంకాదు. అయితే ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్‌గా తీసుకున్నట్టు పైకి కనిపిస్తోంది. లోపల మాత్రం నానా యాగీ చేయడానికి తమకో అవకాశం దొరికిందని సంతోషిస్తోంది. ధర్నాలు, నిరసనలు, దిష్టిబొమ్మల దహనాల్లాంటి కార్యక్రమాలతో ప్రస్తుతం బిజీగా వుంది. చిన్నారెడ్డిని టీఆర్ఎస్ కార్యకర్తలు కొట్టడం నేరం, ఘోరం, అన్యాయం, అక్రమం అని కాంగ్రెస్ పార్టీ ఆక్రోశిస్తోంది. అయితే తెలంగాణ ఉద్యమం సమయంలో ఉద్యమకారులో, టీఆర్ఎస్ నాయకులో ఎవరైతేనేమి ఎంతోమందిని కొట్టారు. అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణను కొట్టారు. టీఆర్ఎస్ పార్టీకి చెందని నాయకులు ఎంతోమందిని ఎన్నోరకాలుగా ఉద్యమం ముసుగులో చావబాదారు. అప్పుడెప్పుడూ కాంగ్రెస్ నాయకులు ఆ ఘటనలను ఖండించిన దాఖలాలు లేవు. కాంగ్రెస్ ఎంపీనే ముఖ్యమంత్రి హెలికాప్టర్ని కూల్చేస్తానంటే ఆ పార్టీ లైట్‌గా తీసుకుంది. ఆ సమయంలో అంత కూల్‌గా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చిన్నారెడ్డిని టీఆర్ఎస్ కార్యకర్తలు చితగ్గొట్టడం చూసి చాలా ఫీలైపోతోంది. కాంగ్రెస్ పార్టీ ఫీలవుతోందిగానీ, తెలంగాణలో ఇలాంటి ఘటనలను చూసీచూసీ విసిగిపోయి వున్న జనం మాత్రం సో వాట్? అంటున్నారు.. ఆ విషయం కాంగ్రెస్ పార్టీ తెలుసుకుంటే మంచిది.