కేసీఆర్ మొక్కు చెల్లించారు! డబ్బులెవరు చెల్లించారు?

 


భయం వల్లో, భక్తి వల్లో, భయంతో కలిగిన భక్తి వల్లో తెలియదుగాని... తెలుగు మీడియా కేసీఆర్ వెంకన్న కానుకల గురించి మాట్లాడాల్సినంత మాట్లాడటం లేదు. ఒకటి రెండు కాదు ఏకంగా 5కోట్ల విలువైన ఆభరణాలు తెలంగాణ ముఖ్యమంత్రి తిరుమలేశుడికి సమర్పించారు. ఇలా సమర్పించటం తప్పు కాదు. అదీ తెలంగాణ రాష్ట్ర సాధన అనే సమున్నతమైన కోరిక తీరినందకు సమర్పించటం మరింత సంతోషకరం! కాని, బంగారం, వజ్రాలు, ఆభరణాల తయారీ ... వీటన్నిటికీ డబ్బులు ఎక్కడ్నుంచి వచ్చాయి? అసలు ఈ ప్రశ్న వేసే ధైర్యం కూడా తెలుగు మీడియాలో ఎవ్వరూ చేయలేదు. ఇంగ్లీష్ లో మాత్రం కొన్ని వెబ్ సైట్స్ కేసీఆర్ కానుకల సమర్పణ గురించి నర్మగర్భంగా విమర్శలు చేశాయి. ప్రజా ధనంతో ముఖ్యమంత్రి మొక్కులు చెల్లించుకోవచ్చా... అన్నాయి!

 

అసలు విషయం ఏంటంటే, 5 కోట్లు విలువైన స్వామి వారి కానుకలు తెలంగాణ ఎండౌమెంట్స్ డిపార్ట్ మెంట్ వారి సొమ్ముతో చేయించారని చెబుతున్నారు. అదే నిజమైతే వివిధ ఆలయాల్లో వసూలైన ఆ సొమ్ము వాడాల్సింది తెలంగాణ ఆలయాలకి. మరీ ముఖ్యంగా, ధూప, దీప, నైవేద్యాలు కూడా లేని గుళ్లకి ఖర్చు చేయాలి. కాని, ముఖ్యమంత్రి పక్క రాష్ట్రంలోని తిరుమల వంటి మహా సంపన్నమైన క్షేత్రంలో కానుకలు సమర్పించటం తప్పంటున్నారు కొందరు. అంతే కాక సెక్యులర్ దేశం అని చెప్పుకునే మన వ్యవస్థలో అసలు స్వయంగా సీఎం ప్రజా ధనంతో మొక్కులు చెల్లించటం ఏంటని కూడా అంటున్నారు!
కేసీఆర్ కోనేటిరాయుడికి కోట్ల రూపాయల విలువైన కానుకలు సమర్పించటం తప్పా ఒప్పా పక్కన పెడితే ... ఆయన చేసిన నిర్ణయం ప్రజల్లో మాత్రం పెద్దగా వ్యతిరేకత పుట్టించలేదు.

 

అది జరగనంత వరకూ రాజకీయ నాయకులకి వచ్చిన నష్టమేం లేదు. కాని ఇప్పటికైనా తక్షణం రావాల్సిన మార్పు ఏంటంటే... వేలాది ఆలయాలు కనీస ఆలనా, పాలనా లేకుండా వుండిపోతున్నాయి. దేవాలయాల ఉద్యోగులు పూట గడవటం కష్టంగా జీవితాలు నెట్టుకొస్తున్నారు. పురాతన ,చారిత్రక ఆలయ సంపద శిథిలం అయిపోతోంది. ఇవన్నీ పక్కన పెట్టి ఎండౌమెంట్ సొమ్ము వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్ఛానుసారం ఖర్చు చేస్తున్నాయి. వీఐపీల స్వాగత, సత్కారాలు మొదలు హజ్ సబ్సిడీ వరకూ ఎన్నో విధాలుగా దేవాదాయ శాఖ ఆదాయం వృథా అవుతోంది. అటు వక్ఫ్ బోర్డ్ ఆస్తులు, ఆదాయాలు కూడా చాలా చోట్ల అక్రమ మార్గాల్లో జేబుల్లోకి వెళ్లిపోతున్నాయి. మత సంస్థలపై సెక్యులర్ ప్రభుత్వాల పెత్తనం ఎంత తగ్గితే అంత మేలు...