ఏపీలో ప్రశ్నించడమే పాపమా? చింతమనేని ప్రభాకర్ మరోసారి అరెస్ట్..
posted on Aug 30, 2021 11:07AM
మూడు కేసులు.. ఆరు అరెస్టులు.. ఏపీలో గత రెండేడ్లుగా ఇదే సాగుతుందనే విమర్శలు ఉన్నాయి. జగన్ రెడ్డి పాలనలో ప్రశ్నించడమే పాపం అయిందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రజా సమస్యలను ప్రస్తావించిన వాళ్లపై, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపిన వాళ్లపై కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఆదేశాలతో ప్రతి పక్ష టీడీపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారనే ఆరోపణలు మొదటి నుంచి వస్తున్నాయి. ఇటీవల కాలంలో ఇదీ మరీ ఎక్కవైంది. మాజీ మంత్రులను కూడా వదలడం లేదు. మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, దేవి నేని ఉమ, సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్రను వివిధ కేసుల్లో అరెస్టు చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలను జైలుకు పంపించారు.
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను గతంలో చాలా సార్లు అరెస్ట్ చేశారు పోలీసులు. తాజాగా మరోసారి అదుపులోనికి తీసుకున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, గంజాయి అక్రమ రవాణా జరిగే ప్రాంతాల్లో ప్రభాకర్, ఆయన అనుచరులు అనుమానాస్పదంగా తిరిగారంటూ విశాఖ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కార్యకర్త ఇంట కార్యక్రమానికి హాజరవ్వడానికి వెళ్లిన చింతమనేనిని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, గంజాయి అక్రమ రవాణా జరిగే ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరిగినందుకు అరెస్ట్ చేశారని ఆయన అనుచరులు చెబుతున్నారు. చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు విశాఖ జిల్లా నుంచి దెందులూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సోమవారం కోర్టుకు సెలవు కావడంతో ఏలూరులో మేజిస్ట్రేట్ ఇంటికి తీసుకువెళ్ళి, న్యాయమూర్తి ఎదుట చింతమనేని హాజరుపరిచే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయనపై దెందులూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కావడంతో పోలీసులు ముందుగా ఇక్కడే అరెస్టు చూపించనున్నారు.
చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ ను టీడీపీ తీవ్రంగా ఖండించింది. పోలీసుల తీరుపై తమ్ముళ్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎంతగా దిగజారిపోయిందో చెప్పడానికి చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ ఉదాహరణ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.ఆయనను ఎందుకు అరెస్ట్ చేసారో చెప్పలేని దుస్థితిలో ఉన్నారంటే అధికార పార్టీకి కొంత మంది పోలీసులు ఎంతగా ఊడిగం చేస్తున్నారో అర్ధమవుతుందన్నారు. జగన్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపుకి పోలీసు వ్యవస్థ ఆయుధంగా మారిందని విమర్శించారు. చింతమనేని తక్షణమే విడుదల చెయ్యాలని లోకేష్ డిమాండ్ చేశారు. వైసీపీ కండువా కప్పుకొని అత్యుత్సాహంతో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్న కొంతమంది పోలీసులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని నారా లోకేష్ హెచ్చరించారు.
చింతమనేనిని తక్షణమే విడుదల చేయాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుతున్న వారిని వేధించి అక్రమంగా జైలు పాలుజేయడమే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై నిరసన తెలిపే హక్కు ప్రతిపక్షాలకు లేదా అని ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన తెలిపిన వారిని అరెస్ట్ చేయడం.. ప్రభుత్వం సిగ్గుమాలిన చర్య అని ఆయన విమర్శించారు. పౌరస్వేచ్ఛను ఎంతకాలం తొక్కిపెడతారని నిలదీశారు. విశాఖపట్నంలో వివాహ వేడుకకు వెళ్లిన చింతమనేని ప్రభాకర్‌ను అక్కడికి వెళ్లి మరీ అరెస్ట్ చేయాల్సిన అవసరమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. 13 జిల్లాల్లో జగన్ పాదయాత్రను టీడీపీ ప్రభుత్వం అడ్డుకుని ఉంటే మీ పరిస్థితి ఏంటని చిన రాజప్ప మండిపడ్డారు.