కొవిడ్ టీకా తీసుకున్న 16 ఏళ్ల బాలుడికి అస్వస్థత! పిల్లలకు డేంజరేనా?
posted on Aug 30, 2021 9:40AM
దేశంలో ప్రస్తుతం కొవిడ్ వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోంది. కొవిడ్ కట్టడికి టీకాలు తీసుకోవడమే ప్రధానమని వైద్య నిపుణులు చెబుతుండటంతో ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. దేశంలో ప్రస్తుతం 18 ఏండ్లు పైబడిన వారికి మాత్రమే కొవిడ్ టీకాలు వేస్తున్నారు. 18 ఏండ్ల లోపు వాళ్లకు టీకా ట్రయల్స్ కొనసాగుతున్నాయి. దేశీయ టీకా సంస్థ కొవాగ్జిన్ కూడా పిల్లల టీకాకు సంబంధించి ట్రయల్స్ కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే మధ్య ప్రదేశ్ లో వెలుగుచూసిన ఘటన ఇప్పుడు ఆందోళన కల్గిస్తోంది.
మధ్యప్రదేశ్ లో కరోనా టీకా తీసుకున్న 16 ఏళ్ల బాలుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని మెరెనా జిల్లాలో చోటుచేసుకుంది. అంబా తాలూకాలోని బాగ్‌కాపూర్‌కు చెందిన కమలేశ్ కుష్వాహా కుమారుడు పిల్లూకు శనివారం ఓ కేంద్రంలో టీకా వేశారు. ఆ వెంటనే బాలుడికి తలతిరుగుతున్నట్టు అనిపించి నోటి నుంచి నురగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన వైద్యులు చికిత్స కోసం అతడిని గ్వాలియర్ తరలించారు. కొవిడ్ టీకా తీసుకున్న వెంటనే బాలుడు అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు వ్యాక్సినేషన్ సెంటర్ వద్ద ఆందోళనకు దిగారు.
మరోవైపు దేశంలో ఇప్పటి వరకు 18 ఏళ్లు నిండిన వారికే టీకాలు వేస్తుండగా, ఆ వయసు లోపు వారికి ఇప్పటి వరకు టీకా అందుబాటులోకి రాలేదు. అయినప్పటికీ బాలుడికి టీకా ఎలా వేశారన్న దానిపై దర్యాప్తు జరుపుతున్నట్టు జిల్లా ముఖ్య వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ ఏడీ శర్మ తెలిపారు. 16 ఏండ్ల బాలుడు కొవిడ్ టీకా తీసుకున్న వెంటనే అస్వస్థతకు గురి కావడంతో.. పిల్లల టీకాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. కొవిడ్ టీకాలు పిల్లలకు సురక్షితమేనా అన్న అనుమానాలు వస్తున్నాయి.