చరిత్ర తిరగరాసిన అమ్మ... ముఫ్పై ఏళ్ల తరువాత

 

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చరిత్రను తిరగరాశాయి. ఇప్పటి వరకూ ఉన్న సంప్రదాయాన్ని ముక్కలు చేస్తూ మరోసారి అమ్మకే పట్టం గట్టారు తమిళవాసులు. ఎన్నికలు ముగిసిన రోజు నుండి ఈసారి డీఎంకే పార్టీనే విజయం సాధిస్తుందని అన్నారు. దానికి తోడు ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా ఈసారి జయలలిత నెగ్గడం కష్టమే.. డీఎంకే పార్టీనే అధికారంలోకి వస్తుంది అని చెప్పగానే ఇక అందరూ డీఎంకేనే విజయం సాధిస్తుంది అనుకున్నారు. మరోవైపు ఓటు వేసిన అనంతరం జయలలిత ఆరోజు నుండి ఇప్పటివరూక ఎవరికి కనిపించకుండా అజ్ఞాతంలో వెళ్లిపోయారు. అంతేకాదు రెండోసారి సీఎం పదవిపై కూడా తమిళనాడులో సంప్రదాయం ఉంది.. ఇక ఈరోజు ఓట్ల లెక్కింపు మొదలైన నేపథ్యంలో కూడా ముందు డీఎంకే ఆధిపత్యం చూసి ఇక ఆపార్టీదే గెలుపు అని అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఏడీఎంకే పార్టీ గెలుపు సాధించింది. 1989 తర్వాత తమిళనాడులో వరుసగా రెండో సారి అధిక్యం సాధించిన పార్టీగా ఏఐఏడీఎంకే చరిత్ర సృష్టించనుంది. ఇప్పటి వరకు జయలలిత ఐదు సార్లు, కరుణానిధి ఐదు సార్లు సీఎం పీఠాన్ని అధిష్టించారు. ప్రస్తుతం ఏఐఏడీఎంకే విజయం సాధిస్తే ఆరోసారి జయలలిత సీఎం పీఠాన్ని అధిష్టించనున్నారు.

 

ఈసందర్భంగా ముఖ్యమంత్రి జయలలిత ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు తనపై నమ్మకం ఉంచి మరోసారి అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు అమ్మ ప్రకటించారు. డీఎంకే పార్టీ అబద్ధపు ప్రచారాలు ఓడిపోయాయన్నారు. డీఎంకే అధినేత కరుణానిధి కుటుంబాన్ని ఉద్దేశించి తమిళనాడు ప్రజలు కుటుంబ రాజకీయాలను తిరస్కరించారని అన్నారు.