మూడేళ్ల ఉత్కంఠకు తెర,"నీట్" పై సుప్రీం సంచలన తీర్పు

జాతీయ స్థాయి అర్హత ప్రవేశ పరీక్ష(నీట్)పై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. దాదాపు మూడేళ్లుగా నడుస్తున్న డ్రామాకు తెరదించింది. దేశవ్యాప్తంగా ఏకీకృత వైద్య విద్య పరీక్షను నిర్వహించాలని ఆదేశించింది. రెండు విడతలుగా ప్రవేశపరీక్షను నిర్వహించాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తమ ఆదేశాలను అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేయాల్సిందేనని వెల్లడించింది. మే 1న నిర్వహించే ఫ్రి మెడికల్ టెస్ట్‌ను ప్రాథమిక పరీక్షగా భావించాలని, జూన్ 24న తుది విడత పరీక్ష నిర్వహించాలని పేర్కొంది. ఆగస్ట్ 17న ఫలితాలు ప్రకటించాలని, సెప్టెంబర్ 30 కల్లా కౌన్సిలింగ్ పూర్తి చేయాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సీబీఎస్‌ఈ షెడ్యూల్ ప్రకారం పరీక్ష నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి నీట్‌లో పొందిన ర్యాంకులే ప్రాతిపదిక కానున్నాయి.

 

వాస్తవానికి మెడిసన్ రాయాలనుకునే వారు ఎంసెట్‌తో పాటు పది దాకా జాతీయ స్థాయి టెస్టులు రాసేవారు. వీటి కోసం విద్యార్థులు రకరకాల మెటీరియల్స్‌పై దృష్టిసారించాలి. ఎప్పుడో ఏప్రిల్‌లో మొదలయ్యే..ఈ మెడికల్ ఎంట్రన్స్‌లు మే చివరి వరకు కొనసాగేవి. నీట్ అమల్లోకి వస్తే ఈ పది టెస్ట్‌లకు బదులు ఒకటే టెస్ట్ విద్యార్థులు రాస్తే సరిపోతుంది. ఈ కేసు పూర్వాపరాలు ఒకసారి చూస్తే జస్టిస్ అల్తమస్ కబీర్ ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేస్తున్న రోజు 2013 జూలై 18న ఉమ్మడి ప్రవేశ పరీక్షకు వ్యతిరేకంగా తీర్పు వెలువడింది. మూడేళ్లనాటి ఈ తీర్పును అనిల్ దవే అధ్యక్షతన గల ముగ్గురు సభ్యుల ధర్మాసనం వెనక్కితీసుకుంటున్నట్టు ఈ నెల 16న ప్రకటించింది. దీనికి మూడు ప్రధాన కారణాలను ఆయన తెలిపారు. జస్టిస్ కబీర్ పదవీ విరమణ రోజున ఆ తీర్పును ప్రకటించడం ఒక కారణమైతే, ఆనాటి ధర్మాసనంలోని ముగ్గురు న్యాయమూర్తుల మధ్య జరగాల్సిన చర్చ జరగలేదు, సుప్రీం గతంలో ఇచ్చిన తీర్పులను పరిగణనలోనికి తీసుకోకుండా తీర్పును ప్రకటించడం మూడవ కారణం. అందువల్ల ఆ తీర్పును ఉపసంహరించినట్టు ప్రకటించి తిరిగి "నీట్" కు ప్రాణం పోసింది. ఇవాళ జరిగిన విచారణలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాల వాదనలను విన్న న్యాయస్థానం "నీట్"కే మొగ్గుచూపింది.