‘స్త్రీ’ శక్తికి ప్రతీక ఆమె



ఓ సినిమాలోని ‘ఎవరో ఒకరు.. ఎపుడో అపుడు.. నడవరా ముందుగా అటో ఇటో ఎటోవైపు’ అంటూ సాగిన పాట వింటుంటే ఒక్క అడుగుకి అంత శక్తి వుంటుందా? ఒక్కరివల్ల మార్పు సాధ్యమా? అనిపించేది. సందేహంగా వుండేది. అయితే ‘స్త్రీ’ స్వచ్ఛంద సంస్థ గురించి విన్నాక నాకు ఈ పాటే గుర్తుకొచ్చింది. నిజమే... ఎవరో ఒకరు ముందడుగు వేయాలి.  ఆ అడుగుని మరో అడుగు అనుసరిస్తుంది. కొన్నాళ్ళకి అవి పదులై, వందలై, వేలల్లోకి మారతాయి. ఆ వేల అడుగులు ఎన్నో లక్షల పాదాలకి దారి చూపిస్తాయి. రహదారిని నిర్మిస్తాయి. జీవితంలో అత్యంత విషాదాన్ని చవిచూసిన మహిళలలో జీవితం పట్ల ఆశ కలిగించడం అంటే  మాటలా చెప్పండి! జీవితంపై ఆశనే కాదు.. ఆ జీవితాన్ని తమకు నచ్చినట్టుగా మలచుకునే ఆత్మస్థైర్యాన్ని వారిలో నింపటమంటే సామాన్యంగా జరిగే విషయమా? కానీ ‘స్త్రీ’ స్వచ్ఛంద సంస్థ వీటిని చేసి చూపించింది.

ఆర్థిక పరిస్థితులు, నమ్మకద్రోహం, అయినవారి ధనాశ... ఇలా కారణం ఏదైతేనేం ఏటా ఎందరో అమ్మాయిలు ముంబై, పూణె వంటి ప్రాంతాలకు చేరుతున్నారు. అక్కడి బజార్లలో అంగడి వస్తువులుగా మారుతున్నారు. ఒకసారి అక్కడకి చేరితే తప్పించుకోవడమన్నది కల్ల. బతుకుతూనే చావటమంటే ఏంటో రుచిచూపించే ప్రాంతాలవి. అలాంటి చోటు నుంచి ఎలాగో ఒకలా తప్పించుకోవటమన్నది జరిగితే? సమస్య అక్కడితో తీరిపోతుందా? లేదు... అసలు సమస్య అక్కడే మొదలవుతుంది. కష్టాలు వెంటాడటం అంటారే... దాన్ని నిజంగా చూస్తారు వాళ్ళు. అలా కష్టాల మధ్య కన్నీళ్ళు కార్చే అతివలకి నేనున్నానంటూ ధైర్యమందిస్తుంది ఈ ‘స్త్రీ’  స్వచ్ఛంద సంస్థ. ఎందరో అమ్మాయిల జీవితాల్లో మార్పు తెచ్చిన సంస్థ అది.

‘స్త్రీ’ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు ‘హేమా బేడీ’ స్వస్థలం పంజాబ్. అక్కడి నుంచి వచ్చిన ఈమె అనంతపురంలో ఈ సంస్థను ప్రారంభించారు. కుటుంబంతో బెంగుళూరులో వుండగా, ఆమె తమ్ముడు అనంతపురం జిల్లా పెనుకొండలో ‘యంగ్ ఇండియా’ ప్రాజెక్ట్ చేసేవాడు. దానికి జెండర్ కో-ఆర్డినేటర్‌గా ‘హేమా బేడీ’ని వుంచాడు. అప్పుడు మొదటిసారిగా ఈ పంజాబీ మహిళ అనంతపురంలో అడుగుపెట్టారు. ఆ ప్రాజెక్టు నిమిత్తం అక్కడున్న మూడు నెలల్లో మహిళల అక్రమ తరలింపుపై అధ్యయనం చేశారు ఈమె. వారి జీవితాలు, అందులోని సాధక బాధకాలు, ఒకసారి ఆ కూపంలోంచి బయటపడ్డాక వారుపడే ఇబ్బందులు అన్నిటిపై ఆ అధ్యయనం సాగింది. అందులోని నిజానిజాలు, చేదు కథలు ఆమెని కలచివేశాయి. వారికోసం ఏదైనా చేయాలని తపించిపోయారు. ఆ తపనలోంచి పుట్టిందే ‘స్త్రీ’ స్వచ్ఛంద సంస్థ.

ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలలోని మహిళలే ఎక్కువగా ఈ ఆటలో పావులుగా మారుతున్నారని గ్రహించారు హేమా బేడీ.  అందుకే మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశాలు కల్పించారు. అలాగే ముంబై వంటి ప్రాంతాల నుంచి తప్పించుకుని వచ్చే మహిళల జీవితం సాఫీగా సాగాలంటే వారు ముందు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. అందుకే అటువంటి మహిళలందరికీ ఎన్నో చేతివృత్తులు, ఉపాధి వృత్తులలో శిక్షణ ఇప్పిస్తుంది ఈ సంస్థ. అంతేకాదు వారికి అక్షరాలు నేర్పిస్తుంది. పరీక్షలకి పంపుతుంది. స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ వంటి వాటిల్లో కూడా శిక్షణ ఇప్పిస్తుంది ఈ స్త్రీ  స్వచ్ఛంద సంస్థ. చట్టంపట్ల కూడా కొంత అవగాహన కలిగేలా చూస్తారు వీరు. అన్నిటికంటే ముఖ్యంగా ఆడవారికి ఆత్మరక్షణ విద్యల్లో తర్ఫీదుని ఇప్పిస్తారు. అంటే కరాటే వంటివి ఈ సంస్థలోని అమ్మాయిలకు కొట్టినపిండి అని చెప్పవచ్చు.

ఆత్మవిశ్వాసమే లేని అమ్మాయిలకి ఆత్మరక్షణ విద్యలో ఇచ్చే ట్రైనింగ్ వారిని నిస్సహాయులమనే భావన నుంచి పైకి తీసుకొస్తుంది. ఉపాధి మార్గాలు వారిలో ధైర్యాన్ని నింపి తమ కాళ్ళపై తాము నిలబడేలా చేస్తాయి. గాడితప్పిన జీవితంలో అన్నీ కోల్పోయిన అమ్మాయిలకి ఇంతకంటేచేయతగ్గ సాయం ఇంకేముంటుంది చెప్పండి. దశాబ్దానికి పైగా ఈ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న కృషికి ఫలితంగా ఎందరో మహిళలు తమ కాళ్ళపై తాము నిలబడి, సమాజాన్ని ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. సమస్య వచ్చాక కాదు, రాకుండానే చూడాలని సంకల్పించి ఆ దిశగా కూడా పనిచేస్తోంది ఈ సంస్థ. గ్రామీణ ప్రాంతాల్లో యాంటీ ట్రాఫికింగ్ సభ్యులను ఏర్పాటు చేసింది. మహిళలు మోసపోకుండా చూడటమే వారి పని. ఇలా ఎందరో మహిళలు ఆత్మవిశ్వాసంతో, భవిష్యత్తుపై మమకారంతో ధైర్యంగా ముందుకు నడిచేలా చేస్తున్న ఈ సంస్థ అధ్యక్షురాలు హేమా బేడీని అభినందించి తీరాలి.

-రమ